.jpg)
ఇక చూడలేక అరుణా సాయపడింది. సేతుపతి గారూ సాయపడ్డారు. ఇవ్వడానికి డబ్బులు లేక కాదు. ఆ పరిస్థితుల్లో అరుణ గానీ.....సేతుపతి గానీ పర్సులు తెరిస్తే ఇంకేమైనా ఉందా? అనుభవజ్ఞులు కాబట్టి, అంతటి బాధ అందరూ పంచుకున్నారు.
"తమరు కూడా దయచేయరాదూ దర్శనానికి?"
"నేను రాలేను బాబూ! రెండు మూడేళ్ళు గా కాళ్ళూ కూడా ఆడడం లేదు. అమ్మాయి లిద్దరూ మోసుకుని వచ్చి ఇక్కడ వదిలేస్తారు........"
"నాన్నా, నేను వినలేను! ఇక చెప్పవద్దండీ! ఇంతవరకూ విన్నది చాలు! కళ్ళారా చూచినది చాలు! నా అంతటి నీచురాలు.........కృతఘ్నరాలు ఈ ప్రపంచంలో ఉండదు. నేను చేసిన పాపం ఇంతా అంతా కాదు!......."
"తప్పమ్మా, తప్పు తల్లీ. తప్పు అరుణా! ఊరుకో! నొసట వ్రాసిన వ్రాత నీవు ప్రయత్నించినా మార్చగలవా అమ్మా? అయ్యా! ఈ పూట ఈ పేదవాని ఇంట ఆతిధ్యం స్వీకరించండి!"
"ఎవరు పేద....ఎవరు ధనికుడు....శంకర నారాయణ గారూ? అందులోనూ ఇక్కడ!"
"మంచి మాటన్నారు! వెళ్లి రండి బాబూ. తమ కోసం నేనిక్కడే కాచుకుని ఉంటాను. అమ్మా, తమరు సేతుపతి గారి ధర్మపత్ని అనుకుంటాను. నమస్కారం. మా అరుణను ఇంతదాన్ని చేసిన ఇల్లాలివి నీవు! సాక్షాత్తూ లక్ష్మీ దేవి వంటి దానివి. ఈ పూట ఈ పెదవాని ఇంట అడుగు పెట్టి దాన్ని పావనం చెయ్యి తల్లీ!"
"అలాగే నండి. అందరం వస్తాం. మరి సెలవా? అమ్మా, ఆరూ! వెళదామా?" అన్నారు సేతుపతి.
"వెళ్లిరాణా నాన్నగారూ?"
"వెళ్లిరా తల్లీ!"
అందరూ బయలుదేరారు. కొంతదూరం వెళ్ళాక, అరుణ ఏడుస్తూనే "మామయ్యగారూ నన్ను క్షమించండి!" అంది.
"ఇన్నేళ్ళుగా నీవు నన్నర్ధం చేసుకో గలిగింది ఈ మాత్రమేనా తల్లీ? ఎంతటి విద్యావంతుడాయన! ఎంతటి స్థితి మంతుడు? ఏదీ? అంతా లీల! మాయ! మరేం పరవాలేదమ్మా. నాన్నగారిని ,మన వెంట తీసుకు వెళ్ళిపోదాం. కల్యానోత్సవం ముగిశాక , అన్ని విషయాలూ మాట్లాడుకుందాం. ఏ సుముహుర్తాన బయలుదేరామో? ఇంతటి బ్రహ్మాండాన్ని ఇక్కడ పొంద గలిగాం!" అన్నాడు సేతుపతి!
అప్పుడు తుడుచుకుంది అరుణ, తన కన్నీటి ధారలను!
39
ఆ స్థితిలోని అరుణ, అంతరాత్మ ను ఏ దేవుని పైనైనా ఎలా లగ్నం చేయగలుగుతుంది? కళ్ళు మాత్రం జరుగుతున్న కళ్యాణోత్సవం మీద ఉంచి, ఎలాగో ఆ శుభకార్యం అయిపోయేదాకా మంటపం లో కూర్చో గలిగింది. తీర్ధలూ, శతకోపాలూ , ప్రసాదాలూ, అయిపోగానే "రండి మామయ్యగారూ మన కోసం వాళ్ళంతా కాచుకుని ఉంటారు!" అంది అరుణ.
"పదమ్మా, పద! పాపం, ఇప్పటికే చాలా పొద్దు పోయింది. చండి త్వరగా నడు!"
వీళ్ళను చూడగానే "అరుణక్కయ్యా!" అంటూ , ఓ ఇరవై గజాలు పరిగెడుతూ వచ్చి, సరస్వతి అరుణ కౌగిలిలో వాలిపోయింది.
"సరస్వతీ, చెల్లాయీ, నా బంగారు చెల్లాయీ, అమ్మ బాగుందా?"
"ఓ, అమ్మ కూడా వస్తానంది. తీరా చేసిన వంట కోతులు కాజేస్తాయని భయపడి, ఇంటి దగ్గిరే ఉండిపోయింది!"
"నీవేం చదువు కున్నావమ్మా సరూ?"
"థర్డు ఫారమే. అక్కయ్యా అంతే! ఆ తరవాత ఒక చదవనవసరం లేదన్నారు నాన్నగారు."
"సరిలే! నాన్నగారికి నచ్చజెప్పి నేను మిమ్మల్నందరినీ మద్రాసులో మహిళా సభలో చేర్పించి ఇంకా చదివిస్తాలే!"
"మనమంతా మద్రాసు వెళతామా అక్కా?"
"వెళ్లక? ఇంకా మిమ్మల్ని ఇలా ఉండనివ్వడమే?"
ఈలోగానే అందరూ శంకర నారాయణగారిని సమీపించారు.
"కళ్యాణోత్సవం బాగా జరిగిందాండీ సేతుపతి గారూ?"
"భగవదనుగ్రహం వల్ల."
"ఇక బయలుదేరదామా అమ్మా?"
"పదండి నాన్నగారూ."
సరస్వతీ, సీతామాహలక్ష్మీ ఆయనకి సాయం చేయ్యబోయారు.
"సరూ, నీవూరుకో. చిన్నదానివి , నీకెందుకూ? నేనున్నాగా?" అంటూ , అరుణ శంకర నారాయణ గారి ఒక చేతిని తన భుజాన వేసుకుంది. సీత భుజం మీద మరొ చెయ్యి వేసి భారాన్నంతటినీ వారి మీద మోపి ఏదో నడక సాగిస్తున్నట్టు, శంకర నారాయణ కుంటుతున్నాడు. సేతుపతి గారి గుండె కరిగి పోయింది. అరుణ కళ్ళు ఏకధారగా కన్నీరు కారుస్తూనే ఉన్నాయి!
"ఏమిటీ దురవస్థ? అందులోనూ ఇంతటి పున్యాత్ముడికి?" అనుకుని, అరుణ సతమతమయింది. కటకటలాడి పోయింది.
అందరూ సేతుపతి గారి కారులో వెళ్లి ఇల్లు చేరుకున్నారు.
"అమ్మా!"
"అరుణా! నా తల్లీ! ఈనాటికీ మా మీద దయ కలిగిందా? ఇన్నేళ్ళ క మమ్మల్ని మన్నించావా తల్లీ?"
"అమ్మా, మీరిలా అనకూడదు. మన్నించ వలిసింది మీరు!" అంటూ అరుణ ఆమె పాదాలకు మొక్కింది. స్మృతి ఫదంలో గతమంతా ఒక్కసారి దొర్లుకు రావడం వల్ల, కనక దుర్గ అరుణను లేవనెత్తి కౌగలించుకుని, గోడు గోడుమని ఏడుస్తుంది.
"దుర్గా , చుట్టాలు దూరదూరం గానే ఉండి పోయారు. ఇక చాలించు. రండి సేతుపతి గారూ. రా తల్లీ. ఈమె నా భార్య, కనకదుర్గ. వీరు సేతుపతి గారని, మన అరుణను పెంచి పెద్ద చేసిన పుణ్యాత్ములు. వీరు వారి సహధర్మ చారిణి చాముండేశ్వరీ దేవి గారు!" కనకదుర్గ ఇద్దరికీ చేతులు జోడించి మొక్కింది!
తమకున్నంత లో అతిధులకు ఏ లోటూ రానివ్వలేదు ఆ ఇల్లాలు. భోజనాలయ్యాక, ఏదో పని ఉన్నట్టు సేతుపతి అరుణను పక్కకి పిలిచాడు.
"ఏమండీ మామయ్య గారూ?"
"నేను మరీ పరాయి వాణ్ణి తల్లీ ఇక్కడ! వారిని మన ఇంటికి రమ్మని నేనాహ్వానిస్తే బాగుంటుందో.........బాగుండదో మరి?"
"నేను మాట్లాడతాను లెండి మామయ్య గారూ! ఒక్క సుబ్బన్న ను మాత్రం ఇక్కడ ఉండనివ్వండి. నాన్నగారు ణా మాట కాదనలేరు. కారు అవసరమైనప్పుడు కబురు చేస్తాను."
"అలాగేనమ్మా."
సేతుపతి గారూ, చాముండేశ్వరి సెలవు తీసుకున్నారు.
"తమరు మా ఆతిధ్యాన్ని స్వీకరించినందుకు చాలా కృతజ్ఞుణ్ణి . వెళ్ళే లోగా మళ్లీ మరొకసారి మా ఇల్లు పావనం చెయ్యండి!"
"తప్పకుండా . వస్తానండి. వస్తానమ్మా. అమ్మా , ఆరూ , నీ నిక్కడే ఉండిపో!"
"అలాగేనండి. మామయ్యగారూ!"
* * * *
వారలా వెళ్ళారో లేదో....కనకదుర్గా, సీతా, అందరూ అరుణను చుట్టూ ముట్టారు.
"మా అమ్మ మా తల్లి! ఎంత చక్కదనాల కుప్పవయ్యావే? మేమంతా నిన్ను తలవని రోజు లేదు! మళ్ళీ నీవు మా కగపడితే చాలునని వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని రోజు లేదు" అంటూ మొర బెట్టుకుంది దుర్గ.
సీతామహాలక్ష్మీ, సరస్వతి .....అరుణ వేసుకున్న రెండు జడలనూ, ఆమె ఒంటి మీది నగలనూ , కట్టుకున్న బెనారస్ జరీ చీర నాణ్యాన్నీ, పెట్టుకున్న తిలకం తీరునూ.....చూస్తూ , ఉవ్విళ్ళూరి పోతున్నారు. అరుణకు ఆ మాత్రం తెలియదూ? సుబ్బన్న ను పిలిచింది.
"ఏమండీ అమ్మాయిగారూ?"
"లాడ్జి కి వెళ్లి, నా సూట్ కేస్ తీసుకురా సుబ్బన్నా."
"అట్టగేనండి." సుబ్బన్న వెళ్ళిపోయాడు."
అరుణ , శంకర నారాయణ గారి దగ్గిరికి వెళ్ళింది. అయన గారి పాదాల వద్ద కూర్చుని కాళ్ళు తన ఒడిలో ఉంచుకొని నెమ్మదిగా ఒత్తడం మొదలెట్టింది.
"ఎందుకు తల్లీ ...నీకీ శ్రమ?"
"శ్రమా? మీకేం తెలుసండీ నాన్నగారూ? ఈ సుదినం కోసం ఎన్నేళ్ళుగా నేనేదురు చూస్తున్నానంటారు? అయినా....మీరు నన్ను చాలా మోసం చేశారండీ నాన్నగారూ!"
"నేనా తల్లీ?"
"మరెవరు? చౌదరి గారి తోటి చెప్పి అంతంత లేసి అబద్దాల్ని ఎందుకు వ్రాయించారు? మీరెక్కడ ఉన్నదీ దాచి, మీరేదో ఉద్యోగం చేస్తున్నట్లు, వ్రాయించారు. ఎంత సంబర పడ్డామా ఆనాడు! కానీ....నా కర్మ కాలి, మీరు చేసే ఉద్యోగం ఇదని ఆనాడే నాకు తెలియలేదు!...." అంటుండగానే అరుణ గొంతు బొంగురుపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. రెండు వెచ్చటి కన్నీటి చుక్కలు శంకర నారాయణ గారి పాదాల మీద పడ్డాయి.
"తల్లీ......ఆరూ.......అలా బాధపడద్దమ్మా! ఆనాడు నేనాపని చేశాను కాబట్టే.......ఈనాడు ఇలా నీలో లక్ష్మీ సరస్వతుల నిద్దరినీ చూడ గలుగుతున్నాను. నాకు మహాదానందంగా ఉంది తల్లీ. ఇదుగో ....ఏమే .....దుర్గా మన అరుణ బి.కాం. పసాయిందే . బి.టి. కూడా పాసయింది!"
"ఆనాడే మనమందరమూ కలుసుకుని ఉంటె, చెల్లాయిలు కూడా ఈపాటికి డిగ్రీలు పుచ్చుకుని ఉండేవారు నాన్నగారూ. సేతుపతి గారు ఎంతగా ప్రయత్నించారానుకున్నారు మీ జాడ తెలుసుకోడానికి? మీరు అగపడితే చాలు, తీసుకు వెళ్లి, తగిన వైద్యం చేయించి, వారి లీగల్ అడ్వయిజర్ గా ఉంచుకుందామనుకున్నారు."
"అయన సహృదయుడు తల్లీ. అందుకనే, ఆర్తులను ఆదరించాలన్న ఆశయం ఆయనలో అంతగా ఉంది! ఇక ఈ జీవితంలో నాకే కోరికా లేదమ్మా. మీ ముగ్గురూ పెళ్ళిళ్ళు చేసేసుకుని, పసుపు కుంకుమలతో ఎవరెవరి ఇంట వారు పచ్చగా ఉంటె చూచి, నిర్విచారంగా కన్ను మూస్తా."
"అబ్బబ్బ! అవెం మాటలండీ నాన్నగారూ? రాకరాక వచ్చినందుకు ఈ విధంగానా మీరు నన్ను ఊరడించేది? మీకెందుకు ? మీ బాధ్యత ఈనాటితో తీరిపోయింది. పెద్ద బిడ్డను నేను! అన్నిటినీ నేను చక్కదిద్దుకుంటాను. మీరు మాత్రం ఇక ఒక్కరోజు ఈ కొండ మీద ఉండానికి వీల్లేదు. మాతో పాటు మద్రాసు వచ్చెయ్యండి!"
"పిచ్చి తల్లీ...." అని, నవ్వి ఊరుకున్నారు శంకర నారాయణ గారు.
"సరే, అయితే? మీమూలంగా నేను సేతుపతి గారి మనసును నొప్పించి, మీతో పాటు నేనూ ఇక్కడే ఉండి పోవాలన్నది మీ కోరికయితే అలానే కానివ్వండి."
"అరుణా!తప్పమ్మా , నీకేం ఖర్మ?"
"మీకేనా ఆ కర్మ? అమ్మా, మీరు అన్నీ సర్దుకోండి. ఈ ఇంటికి అద్దె ఏదయినా బాకీ ఉంటె ఇంటి యజమానిని పిలిపించి ఇచ్చెయ్యండి. నాలుగు గంటలకు ప్రయాణం!"
"అరుణా, ఆ నిశ్చయానికి నీవు రావద్దు తల్లీ!" బ్రతిమాలాడు శంకర నారాయణ.
"అయితే....నన్నూ మీతో పాటే ఉండనివ్వండి. భజగోవిందం గీతాన్ని సీత కంటే నేను బాగా పాడగలను!"
"తప్పు తల్లీ అరుణా."
"నాన్నగారూ, మీరు విశ్రాంతి తీసుకోండి. మీరందరూ నాతొ పాటు రావడమో....నేను మీతో పాటు ఇక్కడే ఉండి పోవడమో ....ఆ రెంటి లో ఏదో ఒకటి జరగాలి. జరుగుతుంది."
"అరుణా, కాస్త నిదానంగా అలోచించు తల్లీ. మమ్మల్ని అందరినీ తీసుకు వెళ్లి, ఆ పున్యాత్ముడి ఇంట పడేవేయ్యడం నీకు ధర్మంగా ఉందా? పోనీ...అలా అగపడుతుందా?"
"ఒకరి పంచన మీరెందుకు పడి ఉండాలి నాన్నగారూ? సేతుపతి గారు పరాయి వారని నేననడం లేదు. ఆయన మరీ మరీ బ్రతిమాలి వెళ్ళారు. మాతో పాటు రండి. ఓ పది రోజుల పాటు వారి ఆతిధ్యాన్ని స్వీకరించండి. తరవాత మామయ్య గారికి నచ్చ చెప్పి, మద్రాసు లోనో....మన ఊళ్ళో నో నేను ఉద్యోగం చూసుకుంటాను."
"ఎందుకో గానీ తల్లీ...నాకు భయమేస్తుంది. ఆలోచించు , నీవే ఆలోచించు. ఆలోచించే ఓపికా నాలో లేదిప్పుడు. మానసికంగా ఏమాత్రం బాధపడ్డా, ఈ మధ్య ఫిట్స్ వస్తున్నాయి! ఒక్కోసారి రెండు మూడు రోజులు నోటంట మాట కూడా రాదు!"
"అందుకనే మీరు మానసికంగా ఏమీ బాధపదక్కర్లేదు. విశ్రాంతి తీసుకోండి. అసలు మీరింక మాట్లాడనే వద్దండి!" -- అని, అయన గారి పాదాలను ఒత్తుతూ అరుణ అలానే కూర్చుండి పోయింది. శంకర నారాయణ గారు కళ్ళు మూసి ఉంచినా కూడా...కన్నీరు బైటికి రావడానికి మార్గం చూసుకుంది. లోలోన అలానే తపన పడిపోతూ శంకర నారాయణ కునుకు తీశారు.
మళ్ళీ అయన నిద్ర లేచేలోగానే......అరుణ అన్ని సన్నాహాలు పూర్తి చేసింది. ఇవ్వవలసిన అద్దె ఇచ్చేసింది. తీర్చవలసిన బాకీలు తీర్చి వేసింది. చెల్లెళ్ళ కు తన కోకలు కట్ట బెట్టింది. తన నగలన్నీ పంచి, ఆ ఇద్దరినీ అలంకరించింది. అంతటినీ చూస్తూ కనక దుర్గ కళ్ళ నీరు నింపుకుని సతమత మై పోతుంది. ఇక ఆగలేక "నా తల్లీ , అరుణా, నేను నీకు తీరని ద్రోహం చేశానే!" అంటూ అరుణను కౌగలించుకుని బావురుమంది.
"శ్ష్ శ్....నాన్నగారూ నిద్ర లేస్తారమ్మా! ఏ తల్లి అయినా తన బిడ్డకు ద్రోహం తలపెడుతుందా అమ్మా? అదే దీవెన అయింది! లేకపోతె ఈనాడు నేనీస్థితిలో ఉండేదాన్నా?"
"ఏమో తల్లీ! అందరికీ ఆ భగవంతుడే దిక్కు! పిల్లలిద్దరూ ఎదిగి కూర్చున్నారు. అదొకటి మండుతున్న కుంపటి లా మా గుండెల్లో ఉండిపోయింది. ఏం చేస్తాం? ఈ పరిస్థితుల్లో ఎక్కడి కని వెళ్లి మంచి సంబంధాలు తెచ్చుకుంటాం?"
"నీకేమైనా పిచ్చా అమ్మా? రాత్నాల్లాటి పిల్లలు. సీతకూ, సరస్వతి కీ తగిన వరులే దొరక్క పోతారా? మీకేండుకూ ? ముందు మనం మద్రాసు చెరుకుందాం. ఆ తరవాత, అన్నీ వాటంతట అవే చక్క బడతాయి."
మరేమీ మాట్లాడలేక కనకదుర్గ కన్నీరు తుడుచుకుంది. ఆ తరవాత అరుణ అబీష్టం ప్రకారం అందరూ మద్రాసుకు బయలుదేరారు.
