Previous Page Next Page 
బ్రతుకు బొంగరం పేజి 27


    వెనక్కి తిరిగి అతని దగ్గిరికి నడిచాడు.
    "నేను హంతకుణ్ణి అని తెలిసి కూడా మీరు నన్ను చూడడానికి వచ్చారు. సురేంద్ర మీద మీకున్న అభిమానము, వెనకటి ప్రేమ ఇంకా అలాగే ఉన్నాయా? నన్ను చూస్తె మీకుసిగ్గుగా, అసహ్యంగా లేడూ?" అతను మొదటిసారి రాజగోపాలం ముందు ఏడవసాగాడు. గుండెలు చీల్చుకొని వస్తున్నది ఆ ఏడుపు.
    "సురేంద్రా, ఎందుకిలా చేశావు? మమ్మల్ని ఇలా ఎందుకు ఎడిపిస్తున్నావు?" అతణ్ణి గుండెల కానించుకొని రాజగోపాలం మధన పడసాగాడు.
    "మీరు నన్ను చూడవద్దు. మిమ్మల్ని చూసినప్పుడల్లా వెనకటి రోజులు జ్ఞాపకం వచ్చి, నేను చేసిన ఘోర తప్పిదాన్ని నిష్కృతి లేనట్లు అనిపిస్తున్నది. ఈ హంతకుణ్ణి చూడద్దు. రాజగోపాలం గారూ. వెళ్ళిపొండి." భయంకరంగా హృదయం ద్రవించేలా ఏడుస్తున్న సురేంద్ర.
    "సురేంద్రా, క్షణకాలం నీవు వివేకాన్ని కోల్పోయావు. చేయబోయే పని యొక్క మంచి చెడ్డలు ఆలోచించ లేకపోయావు. అంతమాత్రం చేత నీవు మంచివాడవు కావని ఎవరంటారు? ఎవరన్నాసరే నేను మాత్రం ఆనను. నీవెప్పుడూ నా దృష్టి లో కపటం లేని సురేంద్రవే."
    "రాజగోపాలం గారూ , ఆ మాటలు చాలు. నేను బ్రతికి ఉండే ఈ కొద్ది రోజులు వాటినే మననం చేసుకుంటూ శాంతితో ఉండడానికి ప్రయత్నిస్తాను." అంత దుఃఖం లోను సురేంద్ర కళ్ళు తృప్తితో మెరిశాయి.
    బరువుగా బయటికి కదిలాడు రాజగోపాలం.
    ఆవరణ లో పచార్లు చేస్తున్నాడు రవిచంద్ర.
    "సురేంద్ర ను కలుస్తారా?' అడిగాడు రాజగోపాలం.
    "నేను కలవలేను. వాణ్ణి ఆ స్థితిలో నేను చూడలేను. చూసినా భరించలేను. నా గుండె బద్దలవుతుంది, రాజగోపాలం గారూ. పదండి , వెళ్దాం." గబగబా కారు దగ్గిరికి వెళుతూ అన్నాడు రాజగోపాలం నెమ్మదిగా అతని వెంబడే నడిచి కారులో కూర్చున్నాడు.
    విషాదంతో బరువెక్కిన హృదయంలా కారు కదిలింది.

                         *    *    *    *
    సురేఖ హత్య పేపర్ల వాళ్లను బాగా ఆకర్షించింది.
    రకరకాల కధానికలు వాళ్ళ అద్భుత ఊహాగానాలతో ప్రచారంలోకి తీసుకు వచ్చారు. సురేంద్ర సినిమా నటుడుగా ఇదివరకే జనానికి పరిచయం అయి ఉండడం వాళ్ళకు ప్రచారానికి మరింత సుళువయింది. ఒక ఐ.యస్ ఆఫీసరు చంపినవారికి, చంపబడ్డ వారికి స్నేహితుడుగా ఉండడం, సురేంద్ర ను రవిచంద్రే అరెస్టు చేయించడం వాళ్ళ పత్రికల్లోని విశేషానికి మరింత వన్నె తెచ్చాయి.
    సురేఖ హత్య కేసు సెషన్సు కు కమిట్ చేశారు. ఆరోజున కోర్టు జనంతో క్రిక్కిరిసి పోయింది. రవిచంద్ర రాజగోపాలం , ప్రియం వదలతో కలిసి వచ్చినప్పుడు, రవిచంద్ర ను చూడటానికి జనం ఎగబడ్డారు. సిగ్గుతో రవిచంద్ర తల వంచుకొని రాజగోపాలం, ప్రియం వదలతో ముందు సీట్లో కూర్చున్నాడు.
    సురేంద్ర తరపున వాదించటానికి ఒక ఎడ్వాకేటును నియమించడానికి రాజగోపాలం ప్రయత్నం చేశాడు కాని, సురేంద్ర ఒప్పుకోలేదు.
    సురేంద్ర ను కోర్టులోకి పోలీసులు తీసుకువచ్చినప్పుడు జనంలో కలకలం వచ్చింది. సురేంద్ర పూర్తిగా కుంగిపోయి ఉన్నాడు. వంచిన తల ఎత్తకుండా బోనులోకి నడిచాడు. రవిచంద్ర కు అతణ్ణి చూడటానికే ధైర్యం చాలలేదు. రాజగోపాలం మనస్సులో ఎంత కల్లోలం ఉన్నప్పటికీ బయటకు మాత్రం చాలా నిబ్బరంగా ఉన్నట్లు కనబడ్డాడు. ప్రియకు మాత్రం సురేంద్రను చూసినప్పుడల్లా కంటి వెంబడి నీళ్ళు వస్తున్నాయి.
    మొదట ప్రాసిక్యూషను వారి కధనం మొదలయింది. సురేఖ అంటే ఏ విధంగా ప్రేమను ముద్దాయి పెంచుకున్నది, ఇద్దరు కలిసి నాటకాల్లో నటించిన సంగతి , తరవాత సురేఖ సురెంద్ర ను తిరస్కరించిన సంగతి, సురేంద్ర హృదయం జ్వలించి ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా గొంతు పిసికి చంపడం, అప్పుడు సురేఖ ప్రియుడు మొహిరిల్ ఉండడం, అటు తరవాత సురేంద్ర వచ్చి స్నేహితుడయిన రవిచంద్ర , ఐ.ఎ.యస్. దగ్గిర ఒప్పుకోవడం, పోలీసు వారు అతణ్ణి కస్టడీ లోకి తీసుకోవడం, పోలీసు వారి దగ్గిర ముద్దాయి నేరం చేసిన విషయం ఒప్పుకోవడం అన్ని విషయాలు ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరించి ముద్దాయిని తగు విధంగా శిక్షించవలిసిందిగా కోర్టు వారిని ప్రార్ధించి కూర్చున్నాడు.
    సురేంద్రను జడ్జి ప్రశ్నించసాగాడు.
    "మీ పేరు?"
    "సురేంద్ర."
    "నివాసం?"
    "ఈ పట్టణం లోనే."    
    "వృత్తి?"
    "నాటకాల్లో నటించడం."
    "ప్రాసిక్యూషన్ వారు మీరు సురేఖ అనే అమ్మాయిని హత్య చేసినట్లుగా మీమీద అభియోగం మోపారు. అది నిజమేనా?"
    "నిజమే!" ఆ జవాబుతో జనం కోర్టులో ఇక జరగవలిసిందేమీ లేదన్నట్లుగా నిస్పృహ చెందారు.
    రవిచంద్ర కుంగిపోసాగాడు.
    తరవాత ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను నామమాత్రంగా ప్రవేశ పెట్టింది.
    మొహీరీల్ సురేఖ దగ్గిర ఉన్నప్పుడు సురేంద్ర తాగి ఆవేశంతో వచ్చాడనీ, ఏవో మాటలు అంటూ బలవంతాన గొంతు పిసికి చంపాడనీ , అప్పటి కప్పుడే ఆమె ప్రాణం పోయిందనీ చెప్పాడు.
    తరవాత రవిచంద్ర ను పిలిచారు.
    "మీ పేరు?"
    "రవిచంద్ర."
    "మీ ఉద్యోగం?"
    "అసిస్టెంట్ కలెక్టరు."
    "సురెంద్రతో మీ కేలా పరిచయం?"
    "చిన్నప్పటి స్నేహితుడు."
    "ఎక్కడ?"
    రవిచంద్ర వివరాలు చెప్పాడు.
    "సురేంద్ర మీతో ఏం చెప్పారు?"
    రవిచంద్ర ఆ రాత్రి జరిగిన సంగతి చెప్పాడు.
    జడ్జిమెంటు రెండో రోజుకు వాయిదా వేసిన తరవాత జనం లేచారు. వారికీ కేసు చాలా చప్పగా ఉన్నట్ల నిపించింది. హంతకుడే తను హత్య చేశానని ఒప్పేసుకున్న తరవాత ఇంక అందులో పస ఏముంటుంది.

                          *    *    *    *
    సురేంద్ర కు సురేఖ ను హత్య చేసిన నేరానికి కోర్టు వారు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.
    రవిచంద్ర ఆరోజు ఆఫీసుకు వెళ్ళలేదు. అతని బంగళా లో ఎక్కడ కూర్చున్నా సురెంద్రే కనపడసాగాడు. ఏ పుస్తకం తీసుకున్నా సురెంద్రే కళ్ళల్లో మెదలసాగాడు. తీరిగ్గా కూర్చుని హృదయం నిండా పేరుకొని పోయిన విచారాన్ని బయటకు నేట్టేసేందుకు గట్టిగా ఏడుద్దామని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కాని అతని కది సాధ్యపడలేదు.
    నాగపూర్ వచ్చింది తను సురేంద్ర ను జైలు కు పంపించడానికా? తనను ఐ.ఎ.యస్ ఆఫీసరు అవమని సురేంద్ర ప్రోత్సహించింది ఇందుకోసమా?
    ఒంటరిగా ఉన్నప్పుడు పదేపదే ఆ రాత్రే జ్ఞాపకం రాసాగింది. సురేంద్ర వచ్చి తనను రక్షించమని కోరాడు. తనకున్న అధికారం తోటి ఆమాత్రం చేయలేక పోయేవాడా?    
    సురేంద్ర నిజంగా హత్య చేశాడు. అయినప్పటికీ ఈ కేసు నుంచి తను రక్షించ లేకపోయే వాడా?
    అలా ఎందుకు చేయలేక పోయాడు?
    సురేఖ మీద తనకున్న ప్రేమ అడ్డం వచ్చిందా?
    చీకట్లు అలుముకున్నాయి. రవిచంద్ర కారు నెమ్మదిగా సెంట్రల్ జైలు దగ్గిరికి వచ్చి ఆగింది.
    ఎవరో రవిచంద్ర ను సురేంద్ర నుంచిన కటకటాల గది దగ్గిరికి తీసుకు వెళ్ళారు.
    గుడ్డి దీపం వెలుగుతున్నది బయట. అంధకారానికి ప్రతినిధిలా సురేంద్ర చాయ మాత్రం లోపల కనబడుతున్నది.
    హృదయంలో పెరుకోనిపోయిన అందకారంతో రవిచంద్ర నెమ్మదిగా కటకటాల దగ్గిరకి నడిచాడు.
    జైలు కటకటాలలో సురేంద్ర....స్వేచ్చ లేని అతను....నేరం చేసి శిక్ష అనుభవిస్తున్న అతను!
    నేరం చేసి కూడా శిక్ష అనుభవించని తను!
    ఉబికివస్తున్న దుఃఖం తో అతను కటకటాలు పట్టుకొని నిల్చున్నాడు. పశ్చాత్తాపం అనే జైలులో రవిచంద్ర, నిజమైన జైలు లో సురేంద్ర!
    అడుగుల చప్పుడు విని సురేంద్ర వెనక్కి తిరిగి చూశాడు. రవిచంద్ర......తల వంచుకొని నిల్చున్న రవిచంద్ర కనపడ్డాడు.
    నెమ్మదిగా అతను లేచి కటకటాల దగ్గిరికి వచ్చాడు.
    జైలు దుస్తుల్లో సురేంద్ర ఉన్నాడు. గడ్డం పెరిగి ఉంది. విషాదం ముఖంలో పేరుకొని, చైతన్యాన్ని ఆ రూపం నించి పూర్తిగా చెరిపి వేసింది.
    "రవీ!" అని ఆప్యాయంగా అతని చేతులను స్పృశించాడు కటకటాల మధ్య నుంచి.
    అతని చేతుల మీద టపటప కన్నీటి చుక్కలు పడసాగాయి. రవిచంద్ర కళ్ళలో నించి.
    "రవీ, ఏడుస్తున్నావా? ఛ...ఛ....ఎందుకు? చిన్నపిల్లవాడిని సముదాయించే ధోరణి లో మాట్లాడాడు.
    "సూరీ, నీ మంచితనం నేను భరించలేను. నన్ను కూడా చంపేసేయ్. నేను ద్రోహిని....పాపిని....సూరీ.....' భోరున ఏడుస్తూ కటకటాల కు తల కేసి కొట్టుకోసాగాడు.
    బలవంతాన సురేంద్ర అతన్ని అపు చేసి , "నిన్ను కూడా చంపేసి నన్ను పుణ్యం కట్టుకోమన్నావా?" అని పేలవంగా నవ్వుతూ అన్నాడు.
    "సూరీ, నన్నొదిలి ఎక్కడికీ వెళ్ళనన్నావు . ఏమిటిది? నీవు నన్ను మోసం చేశావు. ఒంటరితనంతో నేను పిచ్చివాణ్ణి కావాలని నీవు ఈ విధంగా అనుకొనే చేశావా?' రవి పిచ్చిగా ఆవేశం లో ఏది వస్తే అది అనసాగాడు.
    క్షణకాలం సురేంద్ర ఏమీ మాట్లాడలేదు. ఆ కొద్ది రోజుల్లోనే పూర్తిగా మారిపోయాడు. వెనకటి బోళా తనం ఏమాత్రం కనపడటం లేదు. జీవితం అనే పాఠాన్ని క్షుణ్ణంగా అర్ధం చేసుకున్న విద్యార్ధి లా తత్త్వ రహస్యాలను మదించి తెలుసుకున్న వేదాంతి లా, సృష్టి లోని అన్ని విషయాలనూ పుక్కిట పట్టి ఉంచిన సర్వజ్ఞుడులా ఉన్నాడు సురేంద్ర ఇప్పుడు.
    "సూరీ, నన్ను నీ క్షమతో మరింత బాధించకు. ఈ ద్రోహిని, స్నేహం విలవ తెలుసుకోనటువంటి విశ్వాస ఘాటకుడ్ని ఎందుకు చూడాలని కోరుకున్నావు?" వెక్కి వెక్కి వస్తున్నాయి అతని మాటలు.
    "రవీ, ఏమిటిది? నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించావు.  అందులో తప్పేముంది? నీవు ఆ విధంగా చేయకుండా నీ అధికారంతో నన్ను కాపాడి నట్లయితే, నాకు మనశ్శాంతి లేకుండా ఉండేది. పదేపదే నేను చేసిన తప్పు నన్ను వేదిస్తుండేది. ఇప్పుడు తప్పుకు శిక్ష లభించటం తో ప్రశాంతత ఉంది. జీవిత సత్యం ఏదో తెలుసుకున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. అందుకు నేను నీకు కృతజ్ఞుడుగా ఉండాలి,. నిజం, రవీ" గంబీరంగా ఆ జైలు గోడల్లో ధ్వనిస్తున్న సురేంద్ర మాటలు.
    మనిషి మంచితనం ఇలాంటిది అని తెలుసుకున్న తరవాత భరించలేని అతను!
    కాస్సేపు అలాగే ఇద్దరూ ఉన్నారు.
    "ఇక వెళ్ళు , రవీ, ఎందుకనో నిన్ను చూడాలని పించింది. నాకు నీవు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరున్నారు?" సురేంద్ర కు కంఠం గద్గదమైంది.
    రవిచంద్ర చేతులను ఆప్యాయంగా తీసుకొని ముఖానికి రాసుకుంటూ అన్నాడు.
    రవి కళ్ళు వర్షిస్తున్నాయి. గుండెల్లో పేరుకొని పోయిన బాధ కన్నీటి రూపంలో ధారాపాతంగా ప్రవహించసాగింది.
    అతను సురేంద్ర ను చూడలేక వెనక్కి తిరిగాడు.
    "రాజగోపాలం గారిని, ప్రియంవదను అడిగినట్లు చెబుతావు కదూ? రవీ, నన్ను మరిచిపోవు గదూ? ఈ సురేంద్ర ను, ఈ హంతకుణ్ణి మరిచిపోవు గదూ. రవీ....రవీ ."
    రవి ఒక్క పరుగులో వచ్చి కారులో పడ్డాడు. ఇంకొక క్షణం అక్కడ ఉంటె అతనికి స్పృహ తప్పి పడిపోయేటట్లుగా అనిపించింది.
    బర్రున కారు కదిలినప్పుడు తన గుండెను కారు చక్రాల కింద ఉంచి ఎవరో చిత్రహింస చేసినట్లని పించింది. "సూరీ........సూరీ అనుకున్నాడు జైలు దూరమవుతుంటే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS