
ఆ రోజు కూడా మెయిలు రెండు గంటలు లేటు. లోకల్ పేపర్లు మాత్రం చేతిలోకి వచ్చేయి. పేపర్లు కట్టను సరిచేసి, సైకిలుకి కట్టుకొంటున్న ప్రకాశం చేతులు హటాత్తుగా ఆగిపోయేయి. పేపరు మొదటి పేజీలో ఓ మూలగా ఉన్న వార్త అతని కళ్ళబడింది.
పరీక్ష పోయిన విద్యార్ది ఆత్మహత్య . ట్రంకు రోడ్డు మీది లారీ కింద పడి చనిపోయిన వైనం..... ప్రకాశం గబగబ పక్క కొట్టు దగ్గరికి పరుగు పెట్టేడు. దీపం వెలుతురూ లో వివరాలు చదివేడు. తెల్లషర్టు, తెల్లఫాంటూ . కాళ్ళకు రబ్బరు చెప్పులు, ఉంగరాల జుట్టు. తెల్లని శరీర వర్ణం. జేబులో 'ఎస్' అన్న ఇంగ్లీషు అక్షరం కుట్టిన తెల్ల రుమాలు....
ప్రకాశం ఇంక చదవలేకపోయాడు. ఆ రుమాలు అతనికి బాగా గుర్తే. ముందు సంవత్సరం సాంబు పుట్టిన రోజున తను ఆ రుమాలు ప్రజంటు చేసేడు. అప్పన్న కూతురు చేత 'ఎస్' అన్న అక్షరం తనే వ్రాసి కుట్టించేడు. అప్పుడు ఆ పిల్ల గులాబి రంగు దారంతో ఏవో పువ్వులు కుడుతున్నది. ఆ దారం తోనే ఆ అక్షరం కుట్టింది. "ఇంకో రంగు దారంతో కుడితే ఇంతకన్నా బాగుండేది" అన్నది.
"ఫరవాలేదులే. మా అన్నయ్య బుగ్గల రంగు అదే" అన్నాడు తను నవ్వుతూ.
"సాంబూ....సాంబూ! ఏం పని చేసేవురా?' అనుకొన్నాడు జుట్టు పీక్కొంటూ ప్రకాశం.
తన సైకిలు మీద ఉన్న పేపర్ల కట్టను తీసి చేత్తో పట్టుకొన్నాడు.
"ఇంకా ఏంటయ్యా , పంతులూ, అలోసన! ఈ ఏలకి రెండు తూర్లూ తిరగాలిసిందే. ఆ మైలు పేపర్లు ఇంక ఈటితో కలియవు" అన్నాడు రాములు.
"చూడు, రాములూ! ఈరోజు నాకొక్క ఉపకారం చేసి పెట్టాలి. నీ పేపర్లతో పాటు పాటుగా నావి కూడా పంచి పెట్టాలి. ఇంకో రోజు నీవి నేను పంచుతాను." అన్నాడు ప్రకాశం.
ఏనాడూ ప్రకాశం ఎవరికి తన పని అప్పగించినవాడు కాడు. పంతులి కేమవసరం వచ్చిందో? పంచుకు పోదాం-- అనుకొన్నాడు రాములు.
"ఇలాతే , పంతులూ!" అన్నాడు.
ప్రకాశం ఒక పేపరు తీసుకొని మిగిలినవి రాములు చేతిలో పెట్టేడు. ఆ సైకిలు మీదే ఇంటికి బయలుదేరాడు. అప్పటికి తెలతెలవారుతున్నది. రోజూ ఆ పాటికి తను ఇంటి ముందు ముత్యాల ముగ్గులు మెరుస్తుండేవి. ఆరోజున గుమ్మాన నీళ్ళయినా చల్లబడి లేవు. రాత్రి తాము నడిచిన కాళ్ళ బురద అలాగే గుమ్మం నిండా ఎండి ఉంది.
సూర్యారావు ఇంట్లో లేడు మిగిలినవాళ్ళంతా ప్రకాశం వెళ్ళే ముందు ఎలా కూర్చున్నారో అలాగే ఉన్నారు. ప్రకాశం ఎవరికీ ఏమీ చెప్పలేక పోయేడు. నలుగురి మధ్య ఆ పేపరు పడేసి గదిలోకి వెళ్ళిపోయాడు.
జానకి త్రుళ్ళి పడి పేపరు చేతిలోకి తీసుకొంది. కనకం కళ్ళింత చేసుకొని జానకి ముఖంలో ని మార్పుల్ని చూస్తున్నది.
"ఎమిటక్కా! ఏమైంది?" శాంత గాభరాగా దగ్గరికి వచ్చింది.
జానకి దుఃఖం ఆపుకోలేక, "సాంబూ" అంటూ బావురుమంది.
"ఇది అబద్దం అక్కా! ఇంకెవరి గురించో అయి వుంటుంది!"
సూర్యారావు తిరిగి వచ్చేడు.
"అన్నయ్యా , ఈ పేపరు చూసేవా?"
"ఇది అబద్దం కదూ, అన్నయ్యా!' శాంత జాలిగా ప్రశ్నించింది.
"అది అబద్దం కావాలనే కోరుకొన్నానమ్మా. కాని భగవంతుడు నా కోర్కె ని మన్నించ లేదు. నేను పాపాత్ముడ్ని. నేను ఆశించనివి అణగతోక్కెడు. నేను కలనైనా ఊహించనివి నా నెత్తిని రుద్దేడు. నేను దురదృష్టవంతుణ్ణి , శాంతా! నిర్భాగ్యుణ్ణి" అన్నాడు సూర్యారావు కళ్ళ నీళ్ళు కారుస్తూ బొంగురు పోయిన గొంతుకతో.
సుందరమ్మ గుండెలు బాదుకుంటూ నేలమీద పడి దొర్లుతుంది. "నా కొడుకా, ఏం పని చేసేవురా? నా కడుపులో చిచ్చు పెట్టి ఎక్కడికి వెళ్ళి పోయేవురా!" అని ఏడుస్తున్నది. ఆమె ఏడుపు ఇల్లంతా నిండిపోతున్నది; వీధి అంతా వ్యాపిస్తున్నది.
"నిర్భాగ్యం నాదన్నయ్యా . సాంబు పరీక్ష పాసైతే పెద్ద చదువులు చదివి , బోలెడు సొమ్ము గడిస్తాడనుకొన్నాను. నా ముద్దు ముచ్చట్లు తీరుస్తాడని ఎంతో ఆశ పడ్డాను. అయినింటి కోడలుగా వెళ్ళి సుఖ సంతోషాలతో జీవితం గడిపి వేస్తానని ఎన్నో కలలు కన్నాను. నా కలలన్నీ కల్లలుగా జేసి అన్నయ్య వెళ్ళిపోయాడు. నీకిన్ని నగలు చేయిస్తానమ్మా, అన్ని చీరలు కొంటానమ్మా, శాంతా, అనేవాడు. ఇంక నన్ను చూసేవాళ్ళు ఎవరు? నాకు చేసేవాళ్ళు ఎవరు? ఆ దేవుడికి కూడా నా మీద కోపమే; అందుకే సాంబన్నయ్యని తీసుకుపోయేడు. అంతకన్న నన్ను తీసుకుపోయినా బాగుండి పోయేది" అన్నది శాంత ఏడుస్తూ.
"ఛీ! ఏం మనుష్యులర్రా! ఎంతసేపూ మాకు అవి జరుగలేదు; ఇవి తీరలేదు. మాకు దేముదన్యాయం చేసేడనే బాదే కాని, రెండు పదులు దాటీ దాటనీ వయస్సులో మీకోసం నోట మన్ను కొట్టుకొనిపోయిన వాడి గురించి మీకేం బాధ లేదా?" అన్నాడు ప్రకాశం పరుషంగా.
"చూసేవా , జానకీ వీడి మాటలు! నాకు సాంబంటే అభిమానం లేదూ? నేను వాడి కోసం బాధ పడడం లేదూ? నిన్న రాత్రి ఈ మాట విన్నప్పటి నుంచి ఎంతగా కుమిలి పోతున్నానో ఆ భగవంతుడికి తెలుసు. అన్నకి వేరిచి తమ్ముడు ఆత్మహత్య చేసుకొన్నాడని రేపు లోకం అంతా కూస్తే నేనెలా భరించగలను , జానకీ! నేనెలా తిరగ్గలను? పువ్వులా పెంచుకొన్న సాంబు ఎందుకింత పని చేసేడు? నేనేం తప్పు చేసెను, భగవంతుడా! నా కెందుకింత శిక్ష?' సూర్యారావు తమ్ముణ్ణి తలుచుకు, తలుచుకు ఏడ్చేడు.
అన్నయ్య దుఃఖం సాంబు పోయినందుకా? తనను లోకులు నిందిస్తారనా? అనిపించింది జానకికి. కాని, ఆ పరిస్థితుల్లో ఏ మాటా అనే సమయం కాదు. ఎవరి మనః ప్రవృత్తిని బట్టి వారి ఆలోచనలు సాగుతున్నా తోడబుట్టినవాణ్ణి కోల్పోయామన్న దుఃఖం అందరికీ సమానమే-- అనుకొంది.
ఆత్మీయుల్ని కోల్పోయినప్పటి బాధ అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. కొందరు బావురు మని పైకేడుస్తారు. కొందరు లోలోపల కుమిలి బాధ పడతారు. మరికొందరు దుఃఖం వార్త వినగానే నోట మాట రాక కొయ్యబారిపోతారు. బాధ పైకి ఉబికే తీరుల్లోనే ఈ బేధాలు కాని బాధ అందరికీ ఒక్కలాగే ఉంటుంది.
* * * *
సాంబ దేహాన్ని పంచభూతాల పాలు చేసి మూడు నెలలైంది. అంతవరకు కలసి కట్టుగా ఉన్న కుటుంబం పగుళ్ళు ఇచ్చి బీటలు వారినట్లు తయారయింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోనక్కర లేకుండానే ఇంట్లో పనులు జరుగుతుండేవి. చీకటితో బయటికి పోయిన ప్రకాశం ఏ పన్నెండు గంటలకో ఇంటికి వచ్చి ఇంత అన్నం తిని, తిరిగి పోతుండేవాడు. పని ఉన్నా, లేకపోయినా జానకి చాలాకాలం బాలవిహార్ లోనే గడిపివేసేది. ఎవరు వస్తున్నా పోతున్నా సుందరమ్మ పట్టించుకోనేది కాదు. సాంబశివం పోయేక పిల్లల మీది మమత తగ్గించుకొని ,జీవితం మీద విరక్తి పెంచుకొన్నది. ఎవరంతటి వాళ్ళు వాళ్ళు అయేరు. ఇంకా నే చూసేదేమిటి? చేసేదేమిటి? అనుకొనేది. చెయ్యాలనిపించినప్పుడు కనకానికి ఇంటి పనిలో కాస్త సాయపడుతుంది. లేనప్పుడు ఏదో మూల కళ్ళు మూసుకుని కూర్చునేది. ఏమి అనుకుంటుండేదో , ఏమి ఆలోచిస్తుండేదో ఆమెకే తెలియాలి.
శాంత బి.ఎస్.సి సెకండ్ ఇయర్ లోకి వచ్చింది. సాంబు పోయిన దగ్గరి నుండి శాంత చాలా మారిపోయింది. ఇంట్లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. అదివరలోలాగ అది కావాలి, ఇది కావాలి అని అన్నల్ని అడగదు. ఇంట్లో ఉన్నా ఒంటరిగా యేవో పుస్తకాలు పట్టుకు కూర్చుంటుంది. రోజులో చాలా భాగం బయటనే గడుపుతుంది. ఒకటి రెండు సార్లు జానకి ఇంటికి వచ్చేసరికి కూడా శాంత రాలేదు.
"ఇంత పొద్దుపోయేవరకు కాలేజీలో క్లాసులు ఉంటాయా, శాంతా!' అన్నది జానకి.
"లైబ్రరీ లో ఏదో పనుండి ఉండిపోయేను." చాలాసార్లు శాంత అదే జవాబు చెప్పింది.
"రోజూ లైబ్రరీ లో అంత పనేముంటుంది? దాని క్కూడా మూసింది కో సమయం అంటూ ఉండదా?" జానకి నిలదీసింది.
"ఏం పనుంటుందో నువ్వు కాలేజీలో చదువుకొంటె తెలుస్తుంది. బియస్సీ కెన్ని పుస్తకాలు కావాలో ఎప్పుడైనా కనుక్కొన్నావా? కావలసిన వాటిలో పదో వంతైనా నా దగ్గర లేవు. మిగిలిన అన్నిటికి లైబ్రరీ లో పుస్తకాలు తీసుకొని నోట్సు లు రాసుకుంటున్నాను. బుర్ర కాటేక్కేలా అక్కడ పని చేసుకొని నేనొస్తే ఇక్కడ సాధింపులు కూడా." దురుసుగా సమాధానం చెప్పింది శాంత.
ఆనాటి నుండి జానకి శాంత విషయంలో కలుగజేసుకోలేదు. శాంత ఇంకా చిన్న పిల్ల కాదు. దాని బాగోగులు చూసుకొనే వయస్సు వచ్చింది . మంచో చెడో దాని మార్గం దాన్ని నిర్ణయించుకొని-- అనుకొంది.
సాంబు మరణంతో సూర్యారావు తను పూర్తిగా అశక్తుడినై పోయేనని భావించేడు. తనను బాలపరిచే తల్లి మాటా మంతీ లేకుండా ఓ మూల కూర్చుంటున్నది. అండగా నిలుస్తానన్న తమ్ముడు కన్ను మూసేడు. ఇంక మిగిలింది పీకల మీది కత్తుల్లా ఇద్దరు ఆడపిల్లలు, నీతీ జాతీ లక్ష్య పెట్టని తమ్ముడూ.
తన డబ్బు తింటూ తనను బాధ పెట్టేందుకే వీళ్ళంతా. సాధ్యమైనంత తొందరలో వీళ్ళ నందరిని వదుల్చుకోవాలి. తన కుటుంబానికేదైనా అదా చేసుకోవాలి. పెట్టినన్నాళ్ళు తినేందుకే కాని అవసరం అంటే ఒక్క పైసా అయినా వీళ్ళెవరూ ఇయ్యరు-- అనుకొన్నాడు.
మంచో, చెడో శాంతకు ఒక సంబంధం చూసి తొందరలో పెళ్ళి చేసేయాలి. నెలనెలా జీతాలు కడుతూ దాన్ని చదివించే ఓపిక తనకు లేదు. ఎంత చదువు చెప్పించినా అప్ప చేల్లెల్లికి పెళ్లి చెయ్యలేదన్న అపప్రద ఉండిపోతుంది.
ప్రకాశంతో కూడా డబ్బు విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవాలి. వాడికి తోచినప్పుడల్లా పదీ, పరకా ఇస్తున్నట్లు కాక నెలకింత అనే ఏర్పాటు చేసుకోవాలి. తను గడించుకొంటున్న సొమ్ము మదుపు పెట్టుకొని, తన వ్యాపారం పెంచుకొంటుంటే, కూర్చోపెట్టి మేపెందుకు నాకు మాత్రం ఉండద్దూ? వాడి సొమ్ము వాడికి గట్టి అయితే నాదేనా తేరగా వచ్చింది?
