Previous Page Next Page 
వంశాంకురం పేజి 27


    "ఆనంద్ గారు నెల క్రిందటే వచ్చి తన మెమొరాండమ్ అన్నీ తీసుకెళ్ళాడు. మొన్న స్నేహితుడు వ్రాశాడు. అతని వివాహము కూడా అయిందట." అక్కడే నేల కూలబోయి నిలద్రోక్కు కున్నాను.
    "కొంచెము పని ఉంది. అతని అడ్రసు ఇస్తారా?"
    "నా దగ్గర లేదు. కనుక్కుని చెప్తాను." అతను వెళ్ళిపోయాడు. మీకు వివాహమయిందంటే నమ్మలేక పోయాను. కాని అతను అబద్దము దేనికి చెప్తాడు. ఆవేదన, అలసట నన్ను కృంగ దీయసాగినవి. అంబుజము పని చురుకుగా చేయటము లేదని విసుక్కోవటము మొదలు పెట్టింది. ఏం చేయాలో తోచలేదు.
    "నిజంగా నా పిరికితనానికి  నాకే కోపము  కోపము వస్తుంది రేఖా. ఇప్పుడు నిన్ను క్షమార్పణ అడగటము కూడా నటనే అవుతుంది." బాధగా ఆమె వంక చూచి ఒక చేత్తో సజలమైన ఆమె కళ్ళు వత్తాడు.
    "ఆ క్షణము లో నేను పిరికిదాన్నే అయ్యాను. మీ ఊరికి రావాలన్నా డబ్బు కావాలి ఎలా? వచ్చినా లాభమేమి? మరణమే శరణ్యమనిపించింది. బీచ్ కెళ్ళినట్టుగా వెళ్ళి, గుట్టుగా సముద్రుడి లో దాక్కోవాలనుకున్నాను. వెళ్ళి ఒంటరిగా కూర్చుంటే నాన్నగారితో , మీతో వెళ్ళిన ఘటాలు గుర్తుకొచ్చి హృదయాన్ని కలచి వేశాయి. ఏడుస్తూ ఎంతసేపున్నానో తెలియదు. చీకటి పడ్డాక, సముద్రము వైపు అడుగులు వేస్తూ అకస్మాత్తుగా ఆగిపోయాను. ఒక దగ్గిర ఇసుకలో తల్లి పడుకుని ఉంది. రెండు మూడు సంవత్సరాల అమ్మాయి వేరు సేనగాకాయలు వలచి, తల్లి నోట్లో పెడుతుంది. ఆ తల్లి అనుభవించే మధురానుభూతి తలచుకోగానే చావాలనిపించలేదు, నా కడుపులో కదిలే, స్వరూపాన్ని చూచుకోవాలని కాంక్ష పెరిగింది. భారంగా వెను తిరిగినాను." ఆపి దమ్ము తీసుకుందామె.
    " నీ కాంక్ష నా పాలిట వరమయింది రేఖా."
    "చూస్తూ చూస్తూ రోజులు దొర్లి పోతున్నాయి యెనిమిదివ నెల దాటింది. అంబుజము పరోక్షంగా వెళ్ళిపొమ్మని చెప్పింది. యెక్కడికి పోను" వివాహమయితేనేం , నా స్థితి చూచి జాలి పడతారని మీ వద్దకే రావటానికి నిశ్చయించుకున్నాను. ఉన్న కొద్ది పాటి సామాన్లు తీసుకొని నాకు కోరాయి డబ్బు లివ్వమన్నాను. యే కళ నుందో పది రూపాయలు నా చేతిలో పెట్టింది అంబుజము. నా దగ్గరో మూడు రూపాయలున్నాయి. అవి తీసుకుని విజయవాడ బండి ఎక్కాను. రెండు జతల బట్టలు తప్ప మరేం లేవు. బండిలో కూర్చున్న దగ్గర నుండి ఒకటే ఆలోచన. ఎక్కడుండాలి యెవరితో పరిచయం లేదు. ఒకే ఒక ఆశ. ఆరోజు పాట పాడిన కాలేజీ కి వెళ్ళితే యెవరైనా మీ అడ్రసు చెప్తారని. పన్నెండణాల డబ్బులతో విజయవాడ లో అడుగు పెట్టాను. తిన్నగా కాలేజీ కి వెళ్లాను. విద్యార్ధులు లోపలికి పోనివ్వరు. దారి కడ్డంగా నిల్చుని వివరాలడిగి అపహాస్యము చేయుటము మొదలు పెట్టారు. వారి హాస్యము భరించలేక పోయాను. ఎవరయినా లెక్చరరు వస్తారేమో నని ఆశగా యెదురు చూచాను. ఒకరిద్దరు వచ్చారు. మీ పేరు చెప్పి అడిగాను."
    "ఎక్కడో పిచ్చివారిలా వున్నారు. ఆనంద్ అంటే ఎవరమ్మా? యెంతోమంది ఉంటారు. యే రాష్ట్రపతో , మినిష్టరో అయితే చెప్పవచ్చు.' అని వెళ్ళిపోయారు. నిరాశగా వెను తిరిగాను. ఆకలి నకనక లాడసాగింది. వంటరిగా ఎక్కడి కెళ్ళినా వింతగా చూచేవారే. ఇల్లిల్లూ వెతకసాగెను. టీ నీళ్ళు త్రాగి తిరగటము వల్లనేమో సాయంత్రము వరకు నీరసము వచ్చింది. ఓ పంపు వద్ద నీళ్ళు త్రాగుతూ , స్పృహ తప్పి పోయాను. తెలివి వచ్చేసరికి ఇప్పటి వృద్దురాలు సపర్యలు చేస్తుంది. అనాధను ఇంత ఆదరంగా యెందుకు చూస్తుందో అర్ధం కాలేదు. నా విషయము దాచకుండా చెప్పాను."
    "అడ్రసు లేక యెలా వెతుకుతావమ్మా. ఇది పల్లె టూరు కాదే. ఈ మహా పట్టణం లో యెక్కడ గాలిస్తావు? నిండు చూలాలవి కూడాను జాలిగా నా వంక చూచింది.
    "మరి ఏం చేయనమ్మా! నా కెవరూ లేరు." ఏడ్పు దిగమ్రింగుతూ అన్నాను.
    "నేనో మాట చెప్తాను. నిండు చూలాలివి. బయట తిరిగి యెక్కడో పడిపోవడము ఉచితము కాదు. మా ఇంట్లో వుండి అతని జాడ తీద్దువు గాని.' ఆమె మాటలను త్రోసి పుచ్చి బయటికి వెళ్ళే శక్తి లేదు. దొరికిన ఆశ్రయము చాలుననుకున్నాను. ఆమె తల్లిలా ఆదరించింది. వీలున్నప్పుడల్లా ఆమెను తీసుకొని వీధులు తిరుగుతూనే వున్నాను. ఆ తిరగటము దండుగ అయింది. ఒకరోజు తిరుగుతూనే దారిలో కూలబడి పోయాను. ముసలమ్మ ఆస్పత్రి లో చేర్చింది బాబు పుట్టాడు. వాడిని చూచుకొని పడిన శ్రమ బాధ అన్నీ మరిచి పోయాను. నాకు తోడు మరో ప్రాణి, నా రక్తము పంచుకుని పుట్టిన బిడ్డడంటే యెంతో గర్వము కలిగింది. వెంటనే వాడికి కాని ఖర్చు పెట్టి తలకు నూనె కొనే స్థితిలో లేననుకుంటే పుట్టెడు దిగులు వేసింది."
    "నిజంగా నేను దురదృష్టవంతుడను. ఆ సంతోషమును పంచుకోలేక పోయాను." అన్నాడు బాధగా.
    "కళ్ళు మూసుకు పోయో, కడుపు నింపుకోవటానికో , పతితలయిన స్త్రీలు కరుణా హృదయులు. వారంతా చూడటానికి వచ్చారు. ఒకరు దుస్తులు బహుమతి గా ఇస్తే, మరొకరు పౌడరు తెచ్చారు. ఇంకా ప్రపంచములో తోటి మానవుల పట్ల ఆమాత్రము జాలి చూపే వారున్నారను కుంటే, యెంతో ధైర్యము వచ్చింది. వృద్దురాలి వెంట ఇల్లు చేరాను. కన్న తల్లి లాగే, నా ఆరోగ్యము, పసివాడి ఆరోగ్యము కాపాడింది. ఆ ఇంట్లో రాత్రుళ్ళు జరిగే గోల , పురుషులు వచ్చి స్త్రీలను డబ్బుతో స్వాధీన పరుచు కోవట,ము చూస్తె పారిపోదామనిపించేది. ఎక్కడికి పోవాలో తెలియదు. నెలరోజులకు నాకేదైనా పని చూపమని వృద్దురాలిని బ్రతిమాలినాను. నాలాంటి అందమైన స్త్రీలకు పని దొరకదని చెప్పింది. నా తొందర పాటు వల్ల జరిగిన అనర్ధం తెల్సుకున్నాను. ఆమె పాదాలు పట్టుకుని ప్రాధేయ పడ్డాను."
    "వ్యాపారస్తుడు , లక్షాధికారి అయిన ఓ ఇంట్లో వంటపని ఉంది చేస్తావా?' రెండవరోజు వృద్దురాలు అడిగింది."
    "ఫరవాలేదు." అన్నాను. ఇదివరకు చేయలేదా? నా నుదుట అదే వ్రాసి పెట్టి ఉందేమో. వాళ్ళింట్లో పనివారికి గది కూడా ఇస్తామన్నారు.
    "చూడమ్మా , నువ్వు వెళ్ళేది వంటపని కోసము. అక్కడ నీ కుర్రవాడిని చూస్తూ కూర్చుంటే వారూరుకుంటారా? నాకు సందడిగా ఉంటుంది ఉండని" అన్నది వేశ్య. మిగిలిన స్త్రీలకూ కూడా వాడంటే ప్రాణము. అక్కడే వదిలి నా పని చేసుకుని రమ్మనే వారు. మూర్ఖంగా ప్రవర్తించరాదనీ వారి వద్ద బాబును వదిలి పనికి వెళ్ళేదానను. ఆయింటి భార్యాభర్తలు ఒకమ్మాయి మాత్రమే. దంపతులు ఒకరినొకరు అనుమానించు కుంటారు.
    "ఈరోజు క్రొత్త పురుషులేవరయినా మనింటికి వచ్చారా?' బయట నుండి వస్తూనే భర్త ప్రశ్నించే వాడు నెమ్మదిగా.
    "పనిమనిషితో ఏం గుసగుసలు" ఆవిడ అరిచేది.
    "నాకేం కావాలో నువ్వు చూడరాదూ" యాన యేకసెక్కంగా అన్నాడు.
    "మనందానికి అదొక్కటే తక్కువలెండి" అనేది ఆమె. అతను అడిగినదాంట్లో తప్పేం లేదు. అతను బయటకి వెళ్ళగానే ఎవరెవరో పురుషులు వచ్చేవారు. మేడపై పేకాట, నాట్యాలు, పాటలు సాగేవి. నావంతు అడిగినప్పుడు కాఫీ పట్టుకు పోవటమే. "మీ అయ్యగారికి ఇలాంటి విషయాలు చెబితే నీ పని ఊడుతుంది జాగ్రత్త." అని రెండు రూపాయలు నా చేతిలో పెట్టేది.
    "చూడు ఈరోజు ఎవరొస్తారో గమనించు." బయటికి వెళ్తూ భర్త ఓ రూపాయి నా చేతిలో పెట్టేవాడు.
    "బావుంది నాటకము." హైదరాబాద్ రోడ్డు పట్టించాడు ఆనంద్ కారుని.
    "వారి నాటకము లో నేనో పాత్రనైనా నటించ లేకపోయాను. అయన పనులు జాగ్రత్తగా చేస్తే ఆవిడ కస్సు , బస్సు మనేది. ఆవిడ పనులు చేస్తే అయన కొరకొర చూచేవాడు. ఇవేమీ పట్టనట్టు తన చదువులో లీనమయి ఉండేది వారి పాప, నాకు చాలినంత జీతము ఇస్తున్నారు. వ్యక్తిగత జీవితములో నాకేం అనుకుని ఊర్కున్నాను. సంసారాలు చూస్తూ వాటి చాటున ఇలాంటి పనులు చేస్తారని మొదటిసారిగా తెలుసుకున్నాను. నాగోడు తోటి స్త్రీలతో చెప్పుకున్నాను. వారు జాలిగా నావంక చూశారు. "ఈ నికృష్టపు బ్రతుకు మాత్రమూ మాకిష్టమా? బయటి ప్రపంచాన్ని, సంఘాన్ని చూచాము. అక్కడుండేవి ఇంతకంటే నీచమైన సమస్యలని ఈ వృత్తి స్వీకరించాము. మన లాంటి వారము యే జన్మములో చేసుకున్న పాపమో. ఈ జన్మలో అనుభవించాలి." అన్నారు.
    ఆరోజు నేను లేస్తూనే అన్నీ దుశ్శకునాలే చూచాను. బాబుకు వంట్లో బాగుండలేదు. దినమంతా పడిన శ్రమ వాడిని చూడగానే మరిచి పోయేదానను. వాడిని నాకు దూరము చెయ్యకు తల్లీ. అని కనక దుర్గాలయము వైపు వెళ్ళి నమస్కరించాను. త్వరగా "యజమానులేమంటారోనని భయపడుతూ ఇంట్లో అడుగు పెట్టాను. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. డ్రైవరు కనిపించి చెప్పాడు. రాత్రి అమ్మగారి తండ్రికి బాగాలేదని టెలిగ్రాము వస్తే వెళ్లి పోయారని. అయ్యగారికి సెల్ టాక్స్ వారి గొడవ లేవో ఉన్నాయని వెళ్ళలేదని . నిట్టూర్చి త్వరగా పనులు మొదలు పెట్టాను. ఇంటి అతను లేచి నైట్ డ్రస్ తోనే వంట ఇంటిలోకి వచ్చాడు. నేనో మూలకు తప్పుకున్నాను.
    "అంత భయం దేనికి రేఖా ఈ పూట నల్గురు అతిధులు వస్తారు. భోజనము సిద్దము చెయ్యి."  
    "మంచిది . దయచేసి నన్ను రేఖ అని మాత్రమూ పిలవకండి.' బ్రతిమాలుతూ అన్నాను. ఆ ఇంట్లో గోడలు కూడా అమ్మగారి సి.ఐ.డి లు. ఏం చెప్పినా , నాకు లభించిన ఆ మాత్రము ఆశ్రయము కూడా కరువవుతుందని నా భయము. అతను వెకిలిగా నవ్వాడు.
    "అంత అందమైన పేరుండగా మరేమని పిలువాలి?" వంకరగా నవ్వి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నము ముగ్గురు స్త్రీలు, ఓ పురుషుడు వచ్చారు. వారి వేషాలు చూస్తె అసహ్యముగా ఉన్నాయి. వేరే మనుష్యులున్నారనే విచక్షణ మరిచిపోయి, ఒక స్త్రీ మా అయ్యగారి ఒడిలో వాలిపోయింది. భార్యాభర్తలు ఒకరిని ఒకరు అనుమానించుతూనే ఒకరి చాటున ఒకరు నాటకాలు ఆడుతారు. ఇలాంటి దంపత్యాలు కూడా ఉంటాయని మొదటి సారిగా తెలిసి వచ్చింది. వారు నిరజ్జగా కామెంట్స్ వదులుతూ పిచ్చిగా ప్రవర్తిస్తూ సాయంత్రము వరకు ఉండి వెళ్లి పోయారు. వారి చేష్టలు డ్రయివరు కనిపెట్టరాదని కాబోలు మధ్యాహ్నమే వాడికి సెలవు ఇచ్చినాడు. పై పనులు చేసే అబ్బాయి నేనే ఉన్నాము. వాడు అక్కా అని పిలిచేవాడు. "వారంతా బయటికి వెళ్ళారు తలుపులు వేసుకో. నేను పాల కేళ్తున్నాను అక్కా."  వాడు అరిచి వెళ్ళిపోయాడు. నన్ను నేనే బంధించు కున్నాను." నిట్టూర్చింది రేఖ.
    "అతను తిరిగి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడా?" ఆత్రంగా అడిగాడు ఆనంద్.
    "నా జీవితమే నాశనము చేశాడు. అతను వారితో బయటికి వెళ్ళలేదు. మేడ పైనున్నడెమో నాకు తెలియదు. తలుపులు వేసి, బల్ల పై అన్నీ సర్ది పెట్టాను. కుర్రవాడు రాగానే వెళ్లి పోదామని అనుకున్నాను. మధ్యాహ్నము రేడియో లో విన్న పాట గొణుక్కుంటూ హల్లో కిటికీ దగ్గర నిల్చున్నాను. నా చుట్టూ అతని చేతులు ఇనప చట్రము లా బిగుసుకున్నాయి. వదిలించు కోవాలని చేసిన ప్రయత్నమూ వృధా అయింది. శక్తి కొలది ప్రతిఘటించాను. లాభం లేక పోయింది. అతని కామ వాంఛకు బలి అయ్యాను. ఆమె రెండు చేతులతో ముఖము కప్పుకుని బావురుమంది. యేమని ఓదార్చాలో తెలియక కారు స్పీడు తగ్గించి ఒకచోట ఆపి , తను సిగరెట్టూ వెలిగించాడు ఆనంద్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS