Previous Page Next Page 
ఆఖరి మజిలీ పేజి 27

 

    ఇందిర నుదుట పట్టిన చెమటను తన కర్చీఫ్ తో వత్తి ముంగురులు సర్ది "పిచ్చి పిల్లా!" అంటూ నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని బయటకు వచ్చేశాడు శ్రీధర్.

                         *    *    *    *
    "ఇంతసేపా ! బాగ్ కోసం వెళ్ళి ఇంతసేపు చేశావెం" అంటున్న భార్గవి నిర్మల ముఖం చూసి తెల్లబోయింది.    
    ముఖమంతా చెమట పట్టి దాదాపు వణికి పోతున్నది నిర్మల.
    "ఏం లేదు భార్గవీ! ఎంతకీ బాగ్ దొరకలేదు -- అందుకని భయమేసింది" అని కారులో కూర్చుంది.
    కాళీ ఆలయానికి వెళ్ళిందన్న మాటేగాని ఆమె మనసు మనసులో లేదు. గుండెల్లో సన్నగ పోటు రాసాగింది.
    శ్రీధర్ పెళ్ళి ఆగిపోయిన విషయం విన్న నీరజ బాధపడింది. ఆ రాత్రే ఇందిర శ్రీధర్ చెప్పిన విషయాన్ని నీరజకు చెప్పింది. అది విన్న నీరజ తెల్లబోయింది.
    రెండురోజులు ప్రశాంతంగా గడిచిపొయినాయి. నిర్మల ముభావంగా ఉండటానికి కారణం మేమిటో ఎంత ప్రయత్నించినా అర్ధం కాలేదు భార్గవి కి.
    ఆరోజు ఉదయమే స్నేహితుడింట్లో పెళ్ళని భార్గవి ని తీసుకు వెళ్ళాడు శేఖర్. కాన్ఫరెన్స్ లకి వెళ్ళిపోయింది ఇందిర. "శాంతి " ని పక్కలో పడుకోబెట్టుకుని నిద్ర పోతున్నది నీరజ. ముందు హాలులో ఏమి తోచక దిగులుగా ఒంటరిగా కూర్చుంది నిర్మల. పక్క గదిలోంచి "టక్కు టక్కు" మని టైపు మిషను మోత తప్ప ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది నిర్మల కేమీ తోచలేదు. నెమ్మదిగా లేచి ఆ శబ్దం వస్తున్న గదిలోకి వెళ్ళింది.
    టైపు మిషను ముందు అతను దీక్షగా టైపు కొట్టుకుంటూ కూర్చున్నాడు. ఆక్కడే ఉన్న ఓ కుర్చీలో కూర్చుని ముందు బల్ల మీదున్న కాగితాలు అటూ ఇటూ సర్ధసాగింది నిర్మల. కాని అతను ఎదురుగా ఒక మనిషి కూర్చున్నదన్న ధ్యాసే లేకుండా తన పనిలో మునిగిపోయాడు.
    బల్లపల్చగా ఉన్నా తెల్లని అతని ముఖంలో మంచి ఆకర్షణ ఉంది. అతన్నే నిశితంగా చూస్తున్న నిర్మల మనసు చురుగ్గా పనిచేసింది. ఆమె పెదవుల మీద శుష్క హాసం మెరిసింది.
    "మీరు భలే వారండీ? ఎదురుగా మనిషి వచ్చింది కూడా తెలియలేదు" అంది నవ్వుతూ.
    ఉలిక్కిపడి తలెత్తిన శివరాం ఆమె చొరవకు ఆశ్చర్యపోయాడు. చిరునవ్వు నవ్వి మళ్ళీ తనపనిలో మునిగిపోయాడు.
    "మీ పేరు...."
    "శివరామ్ ! శేఖరం గారి సెక్రటరీ ని" అన్నాడు తలెత్తకుండానే.
    "ఆడపిల్లల కుండవలసిన సిగ్గంతా మీకే ఉందే! హాస్యంగా అంది నిర్మల.
    తలెత్తి ఆమె కళ్ళలోకి చూసి టైపు కొట్టడం పూర్తి చేసిన కాగితాలన్నీ బొత్తి పెట్టాడు. పక్కనే ఉన్న తన బాగ్ తీసుకుని బయలుదేరబోయాడు.
    "వెళ్ళిపోతున్నారా?' నిరుత్సాహంగా అంది నిర్మల.
    అవునన్నట్టు తలూపాడతను.
    "శివరామ్ పేరు పెట్టి పిలుస్తున్నందుకు క్షమించండి -- నాకు కలకత్తా గబగబా చూడాలని వుంది. మీరు చూపిస్తారా నాకు....! అమాయకంగా అడుగుతున్న ఆమెను అయోమయంగా చూసి "నేనా....! అన్నాడు.
    "ఏం, తప్పా! ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. భార్గవి కి శేఖర్ గారితో తిరగటానికే టైము చాలటం లేదు. మామయ్యా.....మామయ్య అసలు మామయ్య లాంతో బోర్ మనుషులతో ఎక్కడికి వెళ్ళాలనిపించదు" చెప్పుకుపోతున్న నిర్మలను అలాగే చూస్తూ నిలబడ్డాడు శివరామ్.
    "శివరామ్! పదండి -- ప్లీజ్!" హుషారుగా లేచి నిలబడింది నిర్మల.
    "ఇప్పుడా" అతను ఆశ్చర్యం లో నుంచి తేరుకోనేలేదు.
    "అవును---ఏం ---ఫరవాలేదు" అని వెళ్ళబోయింది.
    "శేఖరం గారు ఇంట్లో లేరు -- ఆఫీసులో పని ఇలాగే వదిలి పెడ్తే ఎలా? ఆయనతో చెప్పకుండా ...." నసుగుతూ అన్నాడు శివరామ్ .
    అసలు శివరామ్ కి నిర్మల తో వెళ్ళటం భయంగా ఉంది. శేఖరం గారు కాని, శ్రీధరం గారు కాని ఏమనుకుంటారు. వాళ్ళతో చెప్పకుండా నిర్మలతో తిరిగితే ఏం బాగుంటుంది? పైగా నిర్మల శ్రీధర్ కి కాబోయే భార్య . కడిగిన ముత్యం లా అమాయకంగా ఉన్న నిర్మల గొప్పింటి ఆడపడుచు. ఆమె ప్రక్కన తను దిష్టి బిమ్మలా ఉంటాడు. పైన తన బట్టలు కూడా బాగాలేవు. ఆమె ప్రక్కన నడవాలంటేనే భయం కుర్చీ కంటుకుని పోయి తలను రెండు చేతుల్లోనూ దూర్చి ఆలోచిస్తూ కూర్చుండి పోయాడు.
    "శివరామ్!' చనువుగా భుజం తడ్తూ పిలిచింది నిర్మల.
    షాక్ కొట్టినట్టు యెగిరి పడ్డాడు శివరామ్ కుర్చీ లోంచి.
    "అదేమిటి! అంత భయపడిపోయారు" పకపకా నవ్వుతూ అంది నిర్మల.
    "నేను....నేను...శేఖరం గారితో చెప్పకుండా
    "అదా మీ భయం! అయన ఏమీ అనరు. నేను హామీ ఇస్తున్నాను. అయినా మీకా భయం ఎందుకు? రండి నాతొ...."
    రాకపోతే చెయ్యి పట్టుకుని లాక్కు బోయేట్టున్నది నిర్మల ధోరణి. ఇంతలో శ్రీధర్ వచ్చాడు.
    "మామయ్యా! నేను శివరామ్ తోడు తీసుకుని ఊరు చూట్టానికి వెళ్తున్నాను. నాకు ఇంట్లో తోచటం లేదు. వెళ్ళనా?" అంది నిర్మల.
    "అవును శివరామ్ నిజమే! మా నిర్మల కి ఇంట్లో ఒక్క నిముషం కూడా కాలు నిలవదు. ఇవిగో తాళం చెవులు. బయట నా కారుంది. అందులో వెళ్ళండి" అన్నాడు.
    "మీరు కూడా వస్తే బాగుంటుంది" నెమ్మదిగా అన్నాడు శివరామ్.
    "నేనా! నాకు ఆఫీసు వర్కుతో శ్రమగా వుంది -- ఫరవాలేదు వెళ్ళండి" అన్నాడు.
    శివరామ్ కి నోట మాట రాలేదు.
    "రండి శివరామ్" అంటూ దారి తీసింది నిర్మల.
    "మీకు డ్రైవింగ్ వచ్చా" కారు దగ్గరకు వచ్చిన తరువాత ఆమెకు అనుమానం వచ్చింది.
    "వచ్చు. శేఖరం గారు నాకన్నీ నేర్పారు" స్టీరింగ్ ముందు కూర్చున్నాడు శివరామ్. దాదాపు అతన్ని అనుకుని కూర్చుంది నిర్మల.
    శివరామ్ కి ఏదో భయం ఆవరించింది. అతని గుండెల్లో ఏదో గుబులు ప్రవేశించింది.
    ఇద్దరూ హుగ్లీ నది "షూట్ పక్కగా కారాపి మెట్లు దిగి నీళ్ళ దగ్గర కొచ్చారు.
    "అటు చూడండి! ఆ బ్రిడ్జి ఇదివరకు స్టీమర్లు వచ్చినప్పుడు పక్కకి తప్పించే వారు. ట్రాఫిక్ అటు ఇటు "జామ్ " అయిపొవటంతో చాలా ఇబ్బందిగా ఉండేది. అందుకని ఈ బ్రిడ్జి కట్టారు. ఈ బ్రిడ్జి మీద నుంచి అరవై వేల కార్లు సుమారుగా పోతాయి..."
    నిర్మల కళ్ళకు హౌరా బ్రిడ్జి కనబడటం లేదు. శివరామ్ మాటలు వినబడటం లేదు.
    దూరంగా ఆకాశంలో క్రుంగి పోతున్న భాను బింబాన్ని చూస్తూ నిలబడింది.
    "ఇక పోదామా!' శివరామ్ మాటల్తో తెప్పరిల్లి కార్లో వచ్చి కూర్చున్నది. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. నిర్మల శరీరం వెచ్చగా తగులుతున్నది శివరామ్ కి. ఇదేదో కొత్త రకం అనుభవంగా అనిపించిందతనికి.
    నిర్మలా ఆలోచనా ప్రవాహం లో మునిగి పోయింది.
    "శివరామ్ ! శివరామ్ ఎవరో ౦ తనెవరో - శివరామ్ తో ఇలా ఒంటరిగా కార్లో తిరుగుతానని తను కలలో కూడా అనుకోలేదు. భగవంతుడి లీలలు చిత్ర విచిత్రమైనవి. ఎవరి కెవరో ఎప్పుడు ఏ విధంగా కలుస్తారో చెప్పలేరు కదా"
    నిర్మల తేరుకుని చూసేసరికి కారు ఆగి ఉంది.
    "అదేం? అపారేం?"
    "అది ఎస్ ప్లనేడ్! అన్ని ట్రాములు ఇక్కడికి వస్తయ్యన్నమాట. ఇది కలకత్తా లో చాలా పెద్ద సెంటరు. మీరు ఆలోచనల్లోంచి బయట పడ్డాకా చూపిద్దామని ఆగాను" చిరునవ్వుతో అన్నాడు శివరామ్.
    నిర్మల కూడా అతని నవ్వుతో జత కలుపుతూ "భలేవారే! ఊ! పదండి పోదాం" అంది.
    ఎస్ ప్లనేడ్ నుంచి సరాసరి ఇంటి వైపు పోనిచ్చాడు కారు.
    ఇంటికి వెళ్ళబోతూ క్షణం ఆగి "మీరుండేది ఎక్కడ?' అనడిగింది నిర్మల.
    "బెలీ గంజి"
    ఏదో తప్పుచేసినవాడిలా తలవొంచుకుని వెళ్ళిపోయాడు శివరామ్ నిర్మల చిన్నగా నవ్వుకుంది. ఆ రాత్రి ఆకలి లేదంటూ ఆమె భోజనం చెయ్యలేదు.
    తెల్లవారిన దగ్గర్నుంచి నిర్మల శివరామ్ కోసం ఎదురు చూడసాగింది. 10 గంటల ప్రాంతంలో శివరామ్ వచ్చాడు.
    "రండి శివరామ్! మీకోసం ఎంత సేపట్నించో ఎదురు చూస్తున్నాను. అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా సరాసరి కార్లో కెళ్ళి కూర్చున్నది.
    "టైపు చెయ్యవలసిన ఉత్తరాలు చాలా ఉన్నాయి. రాజశేఖరం గారు కోప్పడతారు...." అతని వాక్యం పూర్తీ కాకముందే శేఖర్ అక్కడికి వచ్చాడు.
    "వెళ్ళండి శివరామ్! ఈ పది రోజులు మీరు ఆఫీసు పనేమీ చూడనక్కర లేదు" అన్నాడు .
    కారు కదిలి వెళ్ళిపోయిన తర్వాత భార్గవి అంది.
    "అదేమిటి? ఊరు చూపించటానికి ఎవ్వరూ లేరా! పరాయి మగవాడితో అలా పంపటం ఏం మార్యద. మా నిర్మల ధోరణి కూడా నాకేం నచ్చలేదు" నిష్టూరంగా అంటున్న భార్గవిని భుజం చుట్టూ చేయి వేసి "నీకో విషయం చెప్తాను రా!" అని లోపలికి తీసుకెళ్ళాడు శేఖర్.
    శేఖర్ ద్వారా కొత్త విషయాలు విన్న భార్గవి ఆశ్చర్యపోయింది.
    'అందుకని- నిర్మలను అతని కివ్వటమా! అసంభవం" గట్టిగా అంది భార్గవి.
    "భార్గవీ! దాదాపు నాలుగేళ్ల నుంచీ శివరామ్ ని చూస్తున్నాను. డబ్బు లేనంత మాత్రాన అతనికి అర్హతలు లేవా. అతను సహృదయుడు. నా ఊహ నిజమై నిజంగా నిర్మల శివరామ్ ని వివాహమాడటానికి అంగీకరిస్తే అన్ని సమస్యలూ సులభంగా పరిష్కారమవుతాయి. కాని, నిర్మల శివరామ్ తో ఎందుకు చనువుగా ప్రవర్తిస్తుందో అర్ధం కావటం లేదు" అన్నాడు శేఖర్ ఆలోచిస్తూ.

                              *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS