Previous Page Next Page 
పన్నీటి కెరటాలు పేజి 27


    "అలాగే సార్! ఇలాంటి కేసులని పరిశీలించి నేను చూస్తుంటాను. మీరేమో పెద్ద దొంగల కోసం చూస్తుండండి" అన్నాడు అహోబిలం.
    సరేనంటే సరేననుకొని మళ్ళీ ఇరువురూ బయలుదేరారు.
    "ఇలాంటి కేసులు ఈ పూట రెండు మూడు తటస్థపడితే, రెండు కేసులు విషయము ఇన్ స్పెక్టరుకి చెప్పి ఒకటి రెండు కేసులు తను మనసులోనే ఉంచుకోవాలి. రేపెప్పుడో వచ్చి ఇన్ స్పెక్టర్ పేరుచెప్పి వాళ్ళిద్దర్నీ బెదిరించి డబ్బు గుంజుకుని అది పూర్తిగా తన జేబులో వేసుకోవాలి. కష్టపడి కేసులుపట్టి మొత్తం ఇన్ స్పెక్టర్ కి ఇస్తే ఆయన ఇచ్చే పావలా పరకతో తనేమి చెయ్యగలడు. అందుకని కేసులు పట్టినట్టుగా తనో రెండు ఇన్ స్పెక్టర్ కి అప్పచెప్పటం, మరో రెండు తన చేతిలోకి తీసుకోవటం చెయ్యాలి" అనుకున్నాడు అహోబిలం.
    అహోబిలం మనస్సు తెలియని వర్ధనరావు "అమ్మవారి ఆలయ ప్రాముఖ్యం పెరిగిన తరువాత, తనకీ మధ్య కేసులు తక్కువయ్యాయి. దొంగనా కొడుకులు కనపడ్డదేలేదు. దీన్నిబట్టి చూస్తుంటే తను అనుకున్నట్టు ఇది అమ్మవారి మహత్యం కాదు. దొంగనా కొడుకులందరూ చేరి దొంగ వేషాలతో ప్రజలని మోసపుచ్చుతూ కొత్తరకం దొంగతనాలలోకి దిగారు. ఇదోరకం దోపిడీ. ఈ దోపిడీని అరికట్టకపోతే లాభం లేదు. ఏదోచ్చినా మన మంచికే. దొంగవాడి కంట్లో వస్తువులు పడతాయి. పోలీసు వాడి కంటిలో దొంగలు పడతారు" అనుకున్నాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
    ఇరువురూ కలిసి ఇందాకటి చోటికి వెళ్లారు.

                           16

    అయిదు రోజులు పూర్తి అయింది.
    ఈ అయిదు రోజుల్లో ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి అహోబిలానికి వివిధరకాల వేషాల్లో పదిమంది దొంగలు అక్కడే సెటిల్ అయినట్టు తెలిసింది, వాళ్ళందరూ వీళ్ళకి తారసపడ్డారు. వాళ్ళవల్ల వీళ్ళకి ఎంతో కొంత లాభించింది.
    బయట చాలాచోట్ల తిరిగి చూశారు. ఈరోజు కొండమీదకి బయలుదేరారు. గుడిలో కూడా జనం ఏమీ తక్కువ లేరు. "క్యూలో నుంచుని అమ్మవారి దర్శనం తరువాత చేసుకోవచ్చు. గుడిచుట్టూ తిరిగి చూద్దాము అనుకుని గుడి లోపలా బయటా పల్లెటూరి బైతుల్లాగా ప్రతిదీ వింతగా నోరు వెళ్ళబెట్టుకొని చూస్తూ గుడి వెనుక భాగానికి వస్తుండగా చటుక్కున అహోబిలం చెయ్యి పట్టుకొని ఆపాడు వర్ధనరావు.
    "చూడు చూడు" అన్నట్టు కనుసైగ చేశాడు వర్ధనరావు.
    వర్ధనరావు చూపించిన వైపు చూశాడు అహోబిలం.
    గుడి వెనుక వైపు గోడకి చేతులు ఆనించి ఒక వ్యక్తి నుంచుని ఉన్నాడు, అతనికి పాతిక ముప్పయి ఏళ్ళు ఉంటాయి. అతని చర్యలు తమాషాగా ఉన్నాయి. ముందు అతని రెండు చేతులూ గుడి గోడకి ఆనించాడు. ఆ తరువాత వ్రేళ్లు మడచి అక్కడ గట్టి శబ్దం వస్తుందా అన్న తీరులో గోడమీద కొట్టాడు. జేబులో నుండి చిన్న పుస్తకం తీసి ఏదో రాసుకొన్నాడు. గుడి గోడకి చెవి ఆనించి ఏదో వింటున్నట్టు ఒక్క క్షణం ఆగాడు. ఆ తరువాత పుస్తకాన్ని జేబులో పెట్టుకొని ముందుకు సాగాడు.
    వర్ధనరావు అహోబిలం స్థంభం చాటుచేసుకొని నుంచోవడం వల్ల అతని చర్యలని వీళ్ళు కనిపెట్టడం జరిగింది. అతను మాత్రం వీళ్ళని చూడలేదు.
    అతను వయస్సు పాతిక ముప్పై మధ్య ఉంటుంది. బాగా నలిగినా ముదురురంగు పాంటు షర్టూ వేసుకొన్నాడు. ఆ పాంటూ షర్టూ కూడా బుడబుక్కలవాడి వేషంలా చాలా వదులుగా ఉన్నాయి. కొద్దిగా గడ్డం పెరిగి ఉంది, తల కూడా దువ్వుకొన్నట్టు లేదు. క్రాఫ్ చిందరవందరగా ఉంది. ముఖంలో ఉషారు లేదు. కాళ్ళీడ్చుకొంటూ నడుస్తున్నాడు.
    ఇన్ స్పెక్టర్ తో తగ్గు స్వరంతో 'వాడు దొంగేమో సార్' అన్నాడు అహోబిలం.
    'సార్ అని అనవద్దన్నానా!' కోపంగా అన్నాడు వర్ధనరావు.
    'నాకు గుర్తుంది సార్! ఇక్కడ ఎవరూ లేరు కదాని. మిమ్మల్ని గౌరవంగా సార్ అన్నాను. ఎవరూ విననప్పుడు కూడా ఏందిరా రామన్నా అంటే ఏం బావుంటుంది సార్' అన్నాడు అహోబిలం.
    'సరే సరేలే. ముందు విషయం చెప్పు" అన్నాడు వర్ధనరావు.
    "వాడు చాలా పెద్ద దొంగేమోనని నాకు అనుమానంగా ఉంది సార్."
    'దొంగ కాదు' ఖచ్చితంగా అన్నాడు వర్ధనరావు.
    'మరి వాడి చర్యలకి అర్థమేమిటి సార్?' తెల్లబోయి అడిగాడు అహోబిలం.
    "అర్థం చాలా ఉంది. వాడు సామాన్యమైన దొంగ కాదు, చాలా పెద్ద మోసగాడు. ఏదో పెద్ద ప్లాన్ వేసుకొని ఇక్కడికి వచ్చాడు. వాడు నడిచే తీరు, వేసుకున్న వేషమూ ఉత్త మోసగాడని తెలిసిపోతున్నది. పైగా జేబులోంచి ఏదో పుస్తకం తీసి రాసుకున్నాడు కూడానూ. వాడిది చాలా పెద్ద హ్యాండ్. మనం వదలకూడదు క్విక్. మనం వాడివెనుక వెంటనే ఫాలో అవుదాం పద. ముందు వాడి చర్యలని కనిపెట్టి ఆ తరువాత తగు సమయం చూసి పట్టేద్దాం.' ఇన్ స్పెక్టర్ అన్నాడు.
    "చాలా తెలివిగా ఆలోచించారు సార్" అహోబిలం ఇన్ స్పెక్టరు వెనుకనే బయలుదేరాడు.
    అతను గుళ్లోకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు, అతను వెళుతూ వెళుతూ మధ్య మధ్య ఆగి స్థంభాలని పరీక్ష చెయ్యడం, గోడలని పరీక్ష చెయ్యడం, ఏదో ఇలాంటి పనులు చేస్తూ ఇలా చేసినప్పుడల్లా పుస్తకం తీసి రాసుకుంటూ ముందుకి సాగుతున్నాడు. ఆ వెనుకనే వీళ్ళిద్దరూ బయలుదేరారు.
    "ఓర్నాయనో వీడెవడో టెర్రరిస్టులాగా ఉన్నాడు. రాత్రికి రాత్రే గుడిని పేల్చిపారేసేట్టు ఉన్నాడు" ఇన్ స్పెక్టరు అన్నాడు.
    "అయితే రాత్రిళ్ళు మనం గుడి ఛాయలకి కూడా రావద్దు సార్" అన్నాడు కానిస్టేబుల్.
    'రాత్రిళ్ళు ఉండమన్నా ఉండను, మన పరిశోధన అంతా ఉదయం ఒక గంట, సాయంత్రం రెండున్నర గంటలు అంతవరకే. మనం పెద్ద దొంగలని పట్టబోయి ముందుగ పిల్లదొంగలని పట్టేశాము.వాళ్ళ వల్ల మనకి ఎంతో కొంత లాభమే కనీ నష్టం లేదు. నా తఢాకా దిశదిశల మ్రోగాలంటే ఈ గుడికి సంబంధించిన పెద్ద కేసుల్ని పట్టాలి. మనం బయలుదేరిన టైమ్ బావున్నట్లుంది. వీడెవడో అసలువాడో అసలువాడి తాలూకా మనిషో అయ్యుంటాడు. ప్రస్తుతం మనం ఇతడిని ఫాలో కావడమే అన్నింటికన్నా మంచి పని. అటు చూడు వాడునేలని అడుగులతో కొలుస్తున్నాడు" అన్నాడు ఇన్ స్పెక్టరు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS