Previous Page Next Page 
తుపాన్ పేజి 27

    సర్వీసు చేసాను. బంతి తీర్థమిత్రునికి కనబడలేదు. ''ఫాల్టు'' అనడానికి కూడా వీలులేదు. తీర్థమిత్రుడు తెల్లమొగము వేసినాడు. కోర్టుమార్చినాను. రెక్కలు చాచుకొని విచిత్రగతిలోవచ్చి భూమినివాలే హంసలా నా బంతి హేమకుసుమకు వెళ్ళింది. ఆమె ఆ బంతిని నాకే తిరిగి పంపించింది. ఆమె పంపిన సంగతే  ఎరుగును  గాని తిరిగి  నా వల్ల పంపబడి అతని కుడికాలి జోడుయొక్క ముందుభాగాన్ని ముక్కలు చేసిన తీవ్ర సంఘాతము తీర్థమిత్రునికి తెలియదు.

    ఎవ్వరీతడు! ఈ ఆట యెక్కడిది! అని ఆశ్చర్యపడుతున్నట్లు కల్పమూర్తి తాను ప్రేక్షకుడై  పోయినాడు. వారలకు మళ్ళీ గేము లేకుండా అరగంటలో సెట్టయిపోయినది. తమ్మలమిన ఆశ్చర్య విభ్రమాలలో మినిగిపోతూ చైతన్య రహితుల్లా వచ్చి  కుర్చీమీద చతికిలబడ్డారు, కల్పమూర్తీ తీర్థమిత్రుడూ హేమకుసుమదేవీ. నేను కోర్టులోనే బ్యాటు పుచ్చుకొని  సైంధవ వధనాటి  అర్జునుడులా తల పైకెత్తి  ఆకాశం చూస్తూ త్రివిష్ట పధాన్ని ధ్యానిస్తూ నిలుచుండిపోయినాను.
   
                                           o           o          o    
                   
    అలాంటి టెన్నిస్ ఆట నాది. ఆ ఆటలో  పేరు సంపాదిస్తూ  మా రాజధాని కళాశాలకు ఎన్నో, కప్పులు, వెండిడాళ్ళు  బహుమతులు తెచ్చాను ఆ రోజుల్లో మా హృదయాల్లో ఏమి భావాలు ఉద్భవిస్తాయి? చదువు, పెద్దవాళ్ళని గూర్చి అపవాదులు మాట్లాడుకోవటం, స్నేహితులతో తిరగటం, సినిమాలకు వెళ్ళడం, సాయంకాలం బీచివాహ్యాళీ- ఇవీ మా పనులు. పెద్దకవులూ విమర్శకులూ కాళిదాసుని, షేక్స్  పియిరును చీల్చి చండాడే వాళ్ళం.

    నేను : ఒరే! షేక్స్ పియరు ముందర  కాళిదాసు  దివిటీ ముందర దీపం వంటి వాడురా.

    అచ్యుతరావు : నక్కపుట్టి   నాలుగువారాలు  కాలేదు. తుఫాను  గిపాను  దానికేం తెలుసురా. నువ్వు కాళిదాసును చదివావూ?

    నేను : ఆ! వీరేశలింగంగారి తర్జుమాలు  చదివాగా?

    అచ్యు: ఏడిశావుగా!

    విశ్వ : ఒరే శ్రీనాథం! నీకా అభిప్రాయం ఎలా వచ్చిందో  కాని,షా ముందరా. ఇబ్సెను ముందురా, వీళ్ళిద్దరూ పనికిరారురా.

    ఈలా  వెళ్ళేవి, మా వాదనలు. అంతే! లోతుల్లేవు. పిచ్చిభావాలు, గట్టిగా పట్టవస్తే  ఒక్క విషయం తెలియదు.

                                       10

    ఈ రోజులలో మదరాసు పట్టణము  ఎరుగాని   వాళ్ళెవరున్నారు! ఆంధ్రదేశంలోని రెండు కోట్లన్నర  జనాభాలోను ఏడాదికి  ఏ  ఏభై వేల మందో మదరాసు చూస్తూనే వుంటారు. వ్యాజ్యాలకు  హైకోర్టు  అప్పీలు ఉంటుంది గదా! వైద్యానికి చెన్నపట్నం  పెద్దచెయ్యి. విశాఖపట్నంలో ఒక్క  పాశ్చాత్య   వైద్యవిధానమే వుందిగాని  చెన్నపట్నంలో గొప్ప ఆయుర్వేద వైద్యులూ, మళయాళ వైద్యులూ, యూనానీ వైద్యులూ, దేవీ సిద్దభస్మమూ, ఒకటేమిటీ, అన్ని వైద్యాలూ  అక్కడ వున్నవి. రామేశ్వరాది యాత్రలకు, తిరుపతి యాత్రకు, చెన్నపట్నం  వచ్చి తీరాలి గదా!

    ఈ రోజులలో సినిమాలు  కూడా వచ్చాయి. ముఖ్యపట్న మే  కాకుండా తెలుగు అరవ టాకీలకు హాలీవుడ్ కూడాను చెన్నపట్నం. కంపెనీ మేనేజర్లు, మెంబర్లు, డై రెక్టర్లు, అర్టు  డై  రెక్టర్లు, మ్యూజిక్   డై  రెక్టర్లు, యాక్టర్లు, తారలు, తారలతో, వుండే పక్షీంద్రాది హంగుజనం! వీరేమిటి, వారేమిటి, అదో  మహాప్రపంచం. అదీ కాకుండా రేడియో ఒకటి వచ్చింది. ఇవి ఇల్లా వుంటోంటే  పులిమీద  పుట్ర అన్నట్లు  బై రాగి టిక్కెట్లు వచ్చి పడ్డాయి. జేబులో పదిరూపాయలు వున్నవారు  ఎలాగో చెన్నపట్నం వచ్చి పడాల్సిందే. కిస్టమస్ లో జరిగే కాన్ఫరెన్సులకు  లెఖ్కేమిటి? ఆంధ్రదేశంలో  ఏ కాన్ఫరెన్సు ఎక్కడ నెగ్గకపోయినా చెన్నపట్నంలో నెగ్గి  తీరుతుంది. సంగీతసభలు, ప్రదర్శనాలు, స్వదేశవస్తు ప్రదర్శనాలూ! ఇవన్నీ  యిలా వుంచి సర్వకాల సర్వావస్థలయందు  వర్తకం వుండితీరింది  గదా!

    చదువుల కోసం తక్కువ వస్తున్నారా చెన్నపట్నం! చెన్నపట్నం చదువు చెన్నపట్నం చదువే! మెడికల్ కాలేజీలు, ఇంజనీరిగ్ కాలేజి, లా కాలేజీ లున్నాయి. రాయలసీమవారంతా  చెన్నపట్నం రావలసిందేగదా.

    కాని నేను చదువుకొనే రోజులకున్నూ ఇప్పటికిన్నీ చెన్నపట్నం చాలా మారిపోయింది. 1915లో పిచ్చి పిచ్చి హోటళ్ళు  వుండేవి చెన్నపట్నం  నిండాను. సత్యరాజాచార్యులవారు  దేశయాత్రకు  వెళ్ళినప్పుడు  చూచిన ''దుడ్డు పుచ్చుకుని  భోజనం  వేయబడును '' అనే రకం హోటళ్ళు, ఎండిపోయిన పచ్చిపప్పు, చెండాలపు వాసనకొట్టే నెయ్యి, ఏవో  కూరముక్కలు  నాలుగు ఉడకబెట్టి  ఇంత ఉప్పూ, కారం చల్లిన శాకాలూ, నిన్నటి పప్పు ఇవ్వాళ వేసిన సంబారూ, వీటన్నిటికన్న సిరోమాణిక్యంలా కన్నడ తైరు! అందుకనే, విక్టోరియా  హాష్టల్లో సీట్లకోసం  పొట్టుపొట్టయి పోయే వారట.

    కాఫీ హోటళ్ళు లో  ఇడ్డేన్లమీద నెయ్యి వేసేవారు కాదట. కావలిస్తే పుష్కరం రోజుల్నించి పకోడీలు వేయిస్తున్న నువ్వులనూనె (లేకపోతే ఆముదం అనుకోండి) అలాంటిది ఇడ్దేన్ మీద  వేసుకునేవారు. కాఫీ తప్పకుండా జిడ్డు ఆముదం. ఆ పరమ  దౌర్భాగ్యపు కాఫీని  ఎత్తి తాగాలని  దేబ్బలాడేవారు అయ్యరు. అక్కణ్ణించి  తెలుగు విద్యార్థులు'' గ్రేట్ వార్''డిక్లేరు చేశారట. అన్నంలో వేసిన నెయ్యిని  వాసనచూట్టం, అయ్యర్ పళ్ళు మైలు దూరంలో పడేటట్లు  పెఠేల్మని  కొట్టడం, మంచి నెయ్యి వెయ్యకపోతే  ఇడ్డెన్లు వాడి ముఖాన వేసి రుద్దడం, శుభ్రంగా కడుపునిండేటట్టు  కాఫీ కరచీ త్రాగడం. అయ్యరు ఆ అన్నాడా, ఆ కాఫీకప్పు  అతని నోట్లోవేసి  కడుపు లోపలికి దూర్చడమే.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS