నా స్నేహితుని పేరు విశ్వనాధం. అరిపిరాలవారు. మంచివాడు,నా కతడు అర్జునుడు, నే నాతనికి కృష్ణుణ్ణ్ని. ఇద్దరం లేకుండా చెన్నపట్నంలో తిరగనేలేదు. ఆనర్సు ఐదవ తరగతి చదువుతూన్న మా చుట్టాలలో ఒకాయన నన్ను తన అండకు జేరదీసుకున్నాడు. డబ్బుగల చుట్టం, పలుకుబడిగల స్నేహితుడూ ఎవరికయినా వాంఛనీయులేకదా! వీరిద్దరే గాకుండా నాకింకా నలుగురైదుగురు దగ్గరగా చేరిన స్నేహితులేర్పడ్డారు. మదరాసు చదువూ, జీవితమూ చక్కగా సాగింది.
సిద్దప్పగారి ఆశ్రమానికి ఎలాగో అలాగు తీరిక చేసుకొని వెడుతూనే ఉన్నా. సతీర్దుడైన మా చుట్టమే నన్ను సిద్దప్పగారి ఆశ్రమానికి తీసుకువెళ్ళినాడు.'' ఒరే! మూర్తీ ! కళలో మునిగిపోయావంటే చదువు సముద్రంలో కలుస్తుంది. అవతల బొమ్మలేస్తున్నావు. ఒక పక్క టెన్నీసు దంచేస్తున్నావు. ఇంక మూడోపక్క చదువు పిండికొట్టేస్తా నంటున్నావు. విరాటరాజు కుమారుడవు మాత్రం కావద్దు నాయనా!''
'' నువ్వు నన్ను ఈ చదువు మహారథం ఎక్కించి బృహన్నల మాత్రం కావద్దని మనవి.''
'' ఓరి పిట్టపిడుగా! వేసావూ బ్రహ్మాస్త్రం?''
నేను : టేన్నిసంటే జ్ఞాపకం వచ్చింది. మామయ్యా, నేను ''బి'' కోర్టులో ఒకర్ని సవాలు చేయాలని వుంది. వీలయితే '' ఎ'' కోర్టులోనే ఎవరి నయినా సవాలు చెయ్యాలని వుంది. మా జిల్లాలో హైస్కూలు టోర్నమెంట్స్ లో నేను ఫస్టు ప్రయిజు కొట్టింది నీకు తెలిసే ఉంటుంది. నా ఆట చూస్తున్నావు. నాకేమైనా ఛాన్సు ఉందంటావా?
అచ్యుతరావు : ఏ కోర్టునేనా ఛాలెంజిచేసే వీళ్ళు నీకున్నాయి. నే ఆట చూసాను. కాని, కొద్దిరోజుల్లో యం. యు. సి., యం. సి. సి. టోర్న మెంట్లున్నాయి. ఆ పందేలలో మంచి దిట్టమయిన ఆటగాళ్ళు ఆడుతారు, అవి చూసి కొన్ని మెలుకువలు నువ్వు నేర్చుకోవలసి వుంటుంది. 'బి' కోర్టులో కొంచెం మధ్యరకంవాణ్ణి సవాల్ చెయ్యి, కాని రాక్షసుడిలా మాత్రం పరిశ్రమ చెయ్యాలి.
నాకు టెన్నిస్ ఆట వచ్చునని తీర్ధమిత్రడికీ, కల్పమూర్తికీ, హేమకుసుమకూ ఏమి తెలుస్తుంది? మదరాసు రాజధాని కళాశాలకు జరిగే పందేములలో నే నొక సంవత్సరం మొదటిపందెం నెగ్గాననిన్నీ, ఆ యేడే యం. యు. సి. పందెములలో గూడ ప్రథమ వీరుణ్ణయ్యాననీ వీళ్ళకు తెలియదు.
ఒకరోజున హేమకుసుమ టెన్నిసుకు తన స్నేహితురాలయిన సోఫీని పిలిచింది. ఆమె రాలేదు, నిశాపతి దేశాంతర్గతు డై నప్పటినుంచి టెన్నిస్ ఆడుటకు ఇతర స్నేహితులు చాలామంది వస్తూండేవారు. అతడున్నప్పుడూ వచ్చేవారనుకోండి. ఇప్పుడు సర్వసాధారణముగా వస్తున్నారు.
ఈ రోజున ఆటకు వీరు ముగ్గురే ఉన్నారు. హేమకుసుమ చాలా బతిమాలింది. నన్ను ''ఒక్కసారి బాటు చేతితో పట్టుకొని ఆడవయ్యా'' అని. నేను టెన్నిస్ ఆట మానెయ్యడానికి అనేక కారణాలున్నాయి. నా చరిత్ర వికసించినకొలదీ అవీ ద్యోతక మౌతవి, తీర్ధమిత్రుని కన్నులలోని అపహాస్యపు కాంతులు చూసినా నాకు ఆడాలనే హుషారు కలగలేదు. నేను రెండు చిరునవ్వులు విసిరివేసి ఊరుకున్నాను. ఇంతలో హేమకుసుమ నా దగ్గరకు సుడిగాలిలా పరుగెత్తుకొని వచ్చింది. ఆమెతో సుగంధాలునూ పొర్లుకొని వచ్చినవి. నా యెదుట నుంచుని, నా రెండు చేతులూ పట్టుకున్నది. భోరున వానకురిసి మేఘములు విడివడిపోయిన నిర్మలయామినీ వదనంతో ముత్యాలయిన తారకలులూ ఆమె కన్నులు నా కన్నులలోనికీ ఉజ్వలిస్తూ చూచినవి. ఆ కన్నులలో ఒక అద్భుతమైన ప్రశ్న ఉన్నది. ఒక్క నిమేషం నేను సర్వ ప్రపంచం మరచిపోయినాను. ఆ కన్నులలో హిమాలయ శిఖరాలపై ఆకాశనీలాలు కనబడినవి. ఆ దీ ప్తనీలాలలో మహాదూర పథాలను దర్శించినాను. ఆ దూరపథాలలో ఏదో దివ్య గాంధర్వము విన్నాను. ఇంతలో ఆ విశ్వము నాకు దూరమైనది.నవ్వే ఆమె కన్నులే! ప్రజ్వలించే ఆమె కన్నులే! అప్పుడామే మనోహరమైన నాసిక కనబడినది. ఫాలసముద్రపు ఆకులాంటి ఆమె ఫాలము కనబడినది. సర్వకాలమూ కలలు కంటూ,పాటలు పాడుకొంటూ, నృత్య మనోహరాలౌతూ, ఉషాబాలిక హృదయపు పొంగులౌతూ ఆమె పెదవులు కనబడినవి.
ఈ విచిత్ర సంఘతనంతా ఒక నిమేషంలో జరిగింది. నా కది ఒక దివ్యానందతత్వ మైనది.
'' సరే, హేమా! నీ కోసం ఆడుతా. పద కోర్టులోకి. నన్ను చూచి మాత్రం నవ్వకండి. చిన్నతనంలో ఎప్పుడో ఆడాను.''
తీర్ధమిత్రుడు : మేమంతా వున్నాము గాదయ్యా నీకు సహాయముచేయడానికి.''
'' మీ సహాయం వల్ల నాకు చిన్నతనంలో చేతనైన ఆ కొద్ది ఆటా తగలడుతుందేమో. పిల్చి తద్దినం కొనుక్కోకుండా మాత్రం చూసుకోండి'' అని అంటూ నేను టెన్నిస్ కోర్టులోనికి వెళ్లాను.
ఆట ప్రారంభించాము. నేనూ కల్పమూర్తీ ఓ పక్షాన, తీర్ధమిత్రుడూ హేమకుసుమా ఒక వైపున. నాలో కొంచెం భయం ఉదయించింది. నా చేతికి బ్యాటే కొత్త అనిపించింది. కల్పమూర్తిని కుడివైపున ఉండమన్నాను. తీర్ధమిత్రుడు ఆట ప్రారంభించాడు. కల్పమూర్తి నాకేమీ ఆట రాదన్న ఉద్దేశంతో కోర్టంతా తానే విజృంభించి విశ్వరూపం తాల్చాడు. అతని తప్పి జారివచ్చిన బంతుల్ని నేను తీయలేకపోయాను.'' మీకు ఆట వస్తోందండో'' అని తీర్థమిత్రుడు కేకవేశాడు. హేమకుసుమ కళ్ళల్లో ఏదో బాధ కనిపించింది. నేనూ మా వై పున కుడివై పు కోర్టుకు వెళ్ళినప్పుడు హేమకుసుమ నాకు వీలుగా పాయింట్లు తీసేట్టుగా సర్వీసు చేసింది. ఆ పాయింట్లు కొత్తగా నేర్చుకొనే వాడైనా తీయగలడు. ఐనా మేమే ఓడిపోయినాము. కల్పమూర్తి సర్వీసు గేము ఒక్కటే మాకు. తక్కిన రెండు గేములూ వారివి. ఇక నేను సర్వీసు చేయవలసి వచ్చింది. వారి కోర్టులో కుడివైపున నా కెదురుగా మూలగా తీర్థమిత్రుడు వానలులేని వర్షాకాలపు ఆకాశంలోని అపహాస్యంలా మొగము పెట్టుకొని నిల్చున్నాడు ఆ బ్యాటు అక్కడ ఉంచి, కల్పమూర్తి డజను బ్యాటుల్లోంచి నిశితమైన కృపాణంలోని కాంతుల్లాంటి తీగలు కలిగి ఉన్న దానిని, భీమసేనుని గదలాంటి సమున్నతమైనదానిని, మంచి పొంకాలున్న పారశీకాశ్వము యొక్క వేగం గలదాన్ని బ్యాటును తీసుకొన్నాను. కోర్తులోనికి వచ్చినాను. సాధారణంగా ఏ గొప్ప ఆటగాడూ సెట్టుకాకుండా బ్యాటు మార్చడు. నా పని మరింత అపహాస్యానికి పాలై ఉంటుంది. తీర్థమిత్రుని కండ్లలో నా కివన్నీ కనిపించనేలేదు.
