Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 27

 

    కాసేపటికి ప్రతాప్ లో దైర్యం పెరిగింది. అతడు మంచం దిగాడు. జై ఆంజనేయ అని ఓ కేక పెట్టాడు. అతనిలో దైర్యం ఇంకా పెరగాలనడానికి సాక్ష్యంగా ఆ కేక వనుకుతూనే వుంది.
    ప్రతాప్ కిటికీని సమీపించాడు. నెమ్మదిగా తలుపు లాగాడు అంతే!
    ఓ నల్లటి ఆకారం అతడి మీదకు దూకింది.
    కెవ్వుమని అరిచాడు ప్రతాప్! అది గావుకేక కాదు చావుకేక. చావు కేకలు పెట్టడం ప్రతాప్ కి మామూలైపోయిందేమో అలా కేకపెట్టినా అతడు చావలేదు.
    ఎందుకంటె తనమీద దూకిన నల్లటి ఆకారం దెయ్యం కాదు, సూర్యం కాదు ఒక పిల్లి!
    ఆ నల్లపిల్లి ఆ కిటికీ లోకి ఎలా వచ్చింది? ఎవరైనా కావాలని అక్కడుంచారా? లేక కాకతాళీయంగా అధక్కడ ఉందా?
    తనకు తెలిసినంతవరకూ ఈ భవనంలో పిల్లి- అందులోనూ నల్లపిల్లి తిరగడం లేదు. ఎవరో కావాలనే అక్కడుంచారు. అదెవరు-- సూర్యమా?
    ప్రతాప్ గుండెలు యింకా అదురుతూనే వున్నాయి. అతడు గుండెలు చిక్క బట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ కిటికీ అవతలకు తొంగి చూసే ధైర్యం అతడికి కలగలేదు. పిల్లిని గదిలోంచి బైటకు వదిలేసి కళ్ళు మూసుకుని మళ్ళీ కిటికీ తలుపు మూశాడు.
    ఇప్పుడెం చేయాలి? నిద్రపోవాలా - మరికాసేపు దెయ్యం కోసం ఎదురు చూడాలా?
    అతను మరోసారి టైము చూసుకున్నాడు. టైము ఇంకా పన్నెండు న్నర కాలేదు. పన్నెండున్నర లోపులో ఎప్పుడైనా రావచ్చు దెయ్యం!
    ప్రతాప్ మళ్ళీ మంచమెక్కి పద్మాసనం వేసుకుని ఆంజనేయ స్తోత్రం ఆరంభించాడు. అప్పుడప్పుడు అతని దృష్టి కిటికీ మీదనే పడుతోంది.
    టైము పన్నెండు ఇరవై అయిదు కాగానే ఏదో శబ్దం అయింది.
    ప్రతాప్ కిటికీ వంక చూశాడు. అక్కడ ఏదో దృశ్యం గోచరిస్తుందన్న భయం అతడి కుంది కానీ అక్కడ, ఏమీ లేదు. శబ్దం కూడా కిటికీ వద్ద అవడం లేదు. ఎవరో తలుపు తడుతున్నారని గ్రహించాడతను.
    "ఎవరు?" అన్నాడతను.
    సమాధానం రాలేదు. చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దంలో మరోసారి తలుపు తట్టిన చప్పుడైంది.
    "ఎవరు -- మాట్లాడరేం?" అరిచాడు ప్రతాప్.
    జవాబు లేదు. కానీ ఒక్క క్షణం ఆగి తలుపు మళ్ళీ చప్పుడైంది.
    ప్రతాప్ లో మళ్ళీ భయం చోటు చేసుకుంటోంది. ఆ తలుపు తడుతున్నది ఎవరు? పిలిస్తే పలకరెం? ఈరోజు కిటికీ తలుపు తెరిచి ధైర్యంగా చూడాలనుకుంటే దెయ్యం గుమ్మం దగ్గరకే వచ్చిందా? అది దెయ్యమా లేక సూర్యమా?"
    అతనిప్పుడెం చేయాలి? వెళ్ళి తలుపు తీయాలా - లేక ఊరుకోవాలా ?
    తలుపు మళ్ళీ చప్పుడైంది.
    "ఎవరు?" అన్నాడు ప్రతాప్. తలుపు మళ్ళీ బాదిన చప్పుడైంది.
    ఏమైతే అయిందని ప్రతాప్ మంచం దిగాడు. వణుకుతున్న కాళ్ళతో అడుగులు వేస్తూ వణుకుతున్న చేతులతో తలుపులు తీశాడు.
    అక్కడ....ఎదురుగా ... ఓ యువతి ....!
    ఆమె తెల్లచీర కట్టుకుంది.  తెల్లరవిక తొడుక్కుంది. జుట్టు విరబోసి వుంది. పసిమి చాయలో మెరుస్తున్న ఆమె ముఖం అస్పష్టంగా కనబడుతోంది.
    ఎవర్నువ్వు / అనాలని ప్రయత్నించాడు ప్రతాప్ ...నోట మాట రాలేదు.
    ఆమె లోపల అడుగు పెట్టింది. ఆమె నడుస్తుంటే చప్పుడు కావడం లేదు.
    ఆప్రయట్నంగా ప్రతాపే ఆమె పాదాలను చూశాడు. చీర పాదాలను కప్పేసింది. ఆవి అతడికి కనిపించడం లేదు.
    "ను.....ను....నువ్వు.....ఎ...ఎ....ఎ.....ఎవ.....ఎవరివి!" అన్నాడు ప్రతాప్ వణుకుతూ.
    "నన్ను గుర్తించలేదా ప్రియా?' అందామె .... ముఖం మీద జుట్టు వెనక్కు తోసుకుంటూ....
    వెంటనే ప్రతాప్ కు సుజాత గుర్తుకొచ్చింది--"

                             *    *    *    *

    "ఇంకా ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు ప్రియా!" అంది సుజాత.
    సుజాత కౌగిలిని వదలలేదు ప్రతాప్ "జరిగినన్నాళ్ళునూ" అన్నాడు.
    "నీకేం నువ్వు మగాడివి. నేను ఆడదాన్ని " అంది సుజాత.
    "ప్రేయసీ ప్రియుల్లో స్త్రీ పురుష భేధాలుండవు !" ఇద్దరం ఒక్కటే !' అన్నాడు ప్రతాప్.
    "ప్రేయసీ ప్రియులుగా ఇప్పుడొక్కటయ్యాము. ఇది మన ఆనందం కోసం, కానీ ఈ ఆనందాన్ని సమాజం మెచ్చదు. సమాజం మెచ్చడం కోసం మనం భార్య భర్తలుగా కూడా ఒకటవ్వాలి. అలాగ జరిగే వరకూ ఆడది ఆడదే -- మగాడు మగాడే!" అంది సుజాత.
    సుజాత చాలా తెలివిగా మాట్లాడుతుంది. వయసు మైకంలో ఆమె తెలివితక్కువదై ప్రతాప్ కి లొంగి పోయింది కాని -- పెళ్ళయ్యాక ,మళ్ళీ పూర్వపు తెలివి తేటలు పొందగల్గుతుంది. తెలివైన ఆడదాన్ని భార్యగా తెచ్చుకోవద్దన్నది ప్రతాప్ తండ్రి హెచ్చరిక. అదీకాక ప్రతాప్ తండ్రి తలమునిగే అప్పుల్లో వున్నాడు. కొంతకాలం పాటు కొడుకు సంపాదించి తన అప్పులన్నీ తీరిస్తే అప్పులన్నీ తీర్చాలని అతడి ఉద్దేశం. అప్పులు తీరేదాకా పెళ్ళి చేసుకునే ఉద్దేశం అతడికి లేదు. వయసు వేడిలో సుజాత మీదకు వల విసిరాడు. పడింది. ఆమెను భార్యగా చేసుకుంటే కానీ కట్నం రాదు.
    "నువ్వన్నది నిజమే - కానీ నా ఆర్ధిక పరిస్థితి బాగోలేదు. నువ్వా కట్నమివ్వలేవు. మనం కొంతకాలం వేచి వుండక తప్పదు" అన్నాడు ప్రతాప్.
    "మనమెలాగు - సంసారం చేస్తూనే వున్నాము . ఏ రిజిస్ట్రారఫీసులోనో పేరుకి పెళ్ళి అయిందనిపిస్తే నష్టమే ముంది? నువ్వు కావాలన్నపుడే నీ దగ్గరకు కాపరానికోస్తాను." అంది సుజాత.
    "నువ్వన్నది బాగానే వుంది. ఆలోచిస్తాను" అన్నాడు ప్రతాప్. అయితే అతడికి సుజాత మాటలు నచ్చలేదు. అమెనేలాగో అలా వదిలించుకోవాలని చూస్తున్నాడతను.
    ఓ రెండ్రోజులాగే రిజిస్ట్రాఫీసులో పెళ్ళి అన్న పేరు చెప్పి ఎవరికీ తెలీకుండా ఆమెను ఆ ఊళ్ళో నుంచి ప్రయాణం కట్టించాడు. అతణ్ణి నమ్మి ఆమె తలిదండ్రులక్కూడా తెలీకుండా అతనితో బయల్దేరింది.
    హైదరాబాద్ లో ఓ రెండ్రోజులామేతో గడిపి అమెనతను ఓ లోఫర్ గాడికి అమ్మేశాడు.
    అయితే సుజాత ఆ లోఫర్ గాడికి అందలేదు. ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయం లోఫర్ గాడు ప్రతాప్ కి చెప్పి , తన డబ్బు వాపస్ ఇమ్మని అడిగాడు. నమ్మకం కోసం ప్రతాప్ వాడితో వెళ్లి ఆమె శవాన్ని కూడా చూసి వచ్చాడు. తర్వాతనే వాడికి డబ్బు ఇచ్చాడు.
        
                                    12
    ఈ యువతి సుజాత ....అదే కళ్ళు.... అదే రూపు ....
    కానీ తనకు తెలిసిన సుజాత చనిపోయింది ..... అదీ తన కారణంగానే.
    ఇప్పుడు ఎదురుగా సుజాత నిలబడి వుంది. ఈ సుజాత తెల్లచీర కట్టుకుంది. తెల్లరవిక వేసుకుంది. చప్పుడు చేయకుండా నడుస్తుంది. జుట్టు విరబోసుకుంది. కళ్ళలో అదో రకమైన మానవాతీతమైన చూపు ..... ముఖంలో ఏదో తేజస్సు....
    అంటే ఇన్నాళ్ళూ.... తనను బెదిరిస్తున్న దెయ్యం సూర్యం కాదు.... సుజాత....
    ప్రతాప్ సుజాతను పరీక్షించి చూశాడు. ఆమె నోట్లోంచి కోరలుబుకుతున్నట్లూ , నెత్తికి కొమ్ములు మోలుస్తున్నట్లూ..... నాలిక ముందుకు చాపుతున్నట్లు అతడికి తోచింది.
    కెవ్వుమని భయంకరంగా అరిచి క్రింద పడిపోయాడు.
    ఇది తప్పకుండా చావుకేకే! ఈ కేక అనంతరం మనిషి బ్రతికే అవకాశం తక్కువ.
    కేకవిని ....గదిలోకి.... కొందరు మనుషులు వచ్చారు. క్రింద పడి వున్న ప్రతాప్ ని అతడి కెదురుగా వున్నఓ తెల్ల చీర అమ్మాయినీ విచిత్రంగా చూశారు.
    "ఏం జరిగింది?" అన్నాడు ముకుందరావు.
    "ఈ గదిలో ఉంటున్న ప్రతాప్ ఒకప్పుడు నన్ను పెళ్ళాడతానని మోసం చేసి ఓ లోఫర్ గాడికి అమ్మేశాడు. ఆ లోఫర్ గాడిని నేను తీవ్రంగా ఎదిరించాను. మానసంరక్షణకోసం నేను జరిపిన పోరాటం ఆ లోఫర్ గాడి మనసుని కదిలించగా -- వాడు నా పాదాలాంటి దణ్ణం పెట్టి నన్ను వదిలిపెట్టాడు. నేను చచ్చానన్న భ్రమ కూడా ప్రతాప్ కి కలిగించాను. చాలా కాలానికి ప్రతాప్ ఇక్కడున్నట్లు తెలిసి చూద్దామని వచ్చాను. నన్ను చూస్తూనే అతను పెద్ద కేక పెట్టి స్పృహ తప్పి పడిపోయాడు. ఏం జరిగిందో తెలియదు" అంది సుజాత.
    "తప్పు చేసినవాడే దెయ్యానికి భయపడతాడంటారు. అంతరాంతరాల్లో తను చేసిన తప్పు వేధించడం వల్లనే ప్రతాప్ దెయ్యానికి అంతగా భయపడ్డాడన్నమాట!" అన్నాడు సూర్యం.
    లక్ష్మీనారాయణ నాలుగడుగులు ముందుకు వేసి ప్రతాప్ ని కడపబోయి ఏదో అనుమానం వచ్చి నాడి చూశాడు. నాడి ఆడుతున్నట్లు లేదు. ముక్కు వద్ద వ్రేలు ఉంచి చూశాడు. శ్వాస ఆడుతున్నట్లు లేదు. ఆప్పుడే అతను ప్రతాప్ ని చూసి పెద్ద కేక పెట్టాడు.
    ప్రతాప్ రెండు కళ్ళూ తెరిచి వున్నాయి. ఆశ్చర్యం వాటిలో ప్రతిబింబమవుతుంది. ఆ కంటికి రెప్ప పడడం లేదు.
    "ప్రతాప్ చచ్చిపోయాడు" ఎవరో అరిచారు.
    సుజాత నిర్లిప్తంగా --"అయితే పోలీసుల్నీ పిలవండి. జరిగిందేమిటో చెప్పి, వెళ్ళాల్సిన బాధ్యత నాపైన వుంది. తర్వాత ఆమె సూర్యం వంక చూసి "మిస్టర్ సూర్యం ! ఐ థాంక్యూ వెరీ మచ్ ఫర్ యువర్ హెల్ప్ ఇన్ ది షాక్ ట్రీట్ మెంట్" అంది.

                         ---: అయిపొయింది :----


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS