ప్రతాప్ మంచం దిగి కిటికీ వరకూ వెళ్ళాలనుకున్నాడు కానీ అతడి కాళ్ళు సహకరించలేదు. భయంతో అతడి శరీరం గడ్డ కట్టుకుపోయింది.
అక్కడున్నది నిజంగా దెయ్యమా -లేక సూర్యమా?
తను వెళ్ళి కిటికీ తలుపులు తీస్తే -- దెయ్యం మీద పడితే !
కానీ తను ధైర్యం చేయాలి. ఆ దెయ్యం సూర్యమేనని అంతా అంటున్నారు. ఆ మాటల్లోని నిజం తెలుసుకొనడానికిదే సమయం. ఏమైనా తను లేచి తీరాలి....ఏదో ఒకటి అవుతుంది. ఈ రోజుతో తనేనా అంతం కావాలి, ఈ దెయ్యం కధైనా అంతం కావాలి.
అయితే ఒక అనుమానం ప్రతాప్ ని పీడిస్తూనే వుంది. భవనంలో యెవ్వరూ కూడా దెయ్యాన్ని నమ్మడం లేదు. అది తన భ్రమ అని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు సూర్యం గురించి కల్పించి చెప్పారు. కిటికీ దగ్గర తనకు కనపడుతున్న దెయ్యం తనకు తప్ప మరెవ్వరికీ కనబడదు. అందుకే తనది భ్రమ అని వారంతా భ్రమపడి సూర్యం కధ కల్పించారు. ఇప్పుడు తను ధైర్యం చేసి ముందడుగు వేస్తె.....
దెయ్యం యింకా అక్కడ ఆడుతూనే వుంది.
ప్రతాప్ లో భయం పెరిగింది. "సూర్యం వెళ్ళిపో.... సూర్యం ....వెళ్ళిపో !" అనారిచాడతడు. అక్కడున్నది సూర్యమేనని తన నమ్మే పక్షంలో తనే కిటికీ సమీపించవచ్చు గదా. ఆలోచన కూడా రావడం లేదతనికి.
"సూర్యం .....ప్లీజ్ ...నువ్వు వెళ్ళిపో....నేను చచ్చిపోతాను.....వెళ్ళిపో సూర్యం!" అంటూ అతడు కళ్ళు గట్టిగా మూసుకున్నాడు.
మరుక్షణం లోనే అతడికి తలుపు తట్టిన శబ్ధంవినిపించింది "ప్రతాప్ ప్రతాప్!" అంటున్నారెవరో.
ప్రతాప్ కిటికీ వంక చూశాడు. అక్కడ దెయ్యం లేదు.
అతడు లేచి వెళ్ళి తలుపులు తీశాడు. ఎదురుగా ముకుందరావు, సుబ్బారావు, సూర్యం వున్నారు. సూర్యాన్ని చూస్తూనే ప్రతాప్ కెవ్వుమని అరిచాడు.
"ఏం జరిగింది ?" అన్నాడు ముకుందరావు.
"మీరిప్పుడెక్కడి నుంచి వస్తున్నారు?" అన్నాడు ప్రతాప్.
"నిద్రపట్టక బైట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం ముగ్గురమూ. నీ గదిలోంచి సూర్యం అని పెద్దగా కేకలు వినబడుతుంటే ఏమిటో నని పరిగెత్తుకు వచ్చాం" అన్నాడు సుబ్బారావు.
"సందేహం లేదు . అది మనిషి కాదు. దెయ్యమే అన్నాడు ప్రతాప్.
'అసలేం జరిగింది ?" అన్నాడు సూర్యం.
ప్రతాప్ నెమ్మదిగా జరిగింది చెప్పాడు.
"మరి నువ్వు కిటికీ దగ్గరకు వచ్చి చూడాల్సింది . నేనేనని తెలిసేది!" అన్నాడు సూర్యం.
"ఇంపాజిబుల్! కిటికీ దగ్గర అది మాయమైన క్షణంలో నువ్వు నా గది గుమ్మం దగ్గరున్నావు" అన్నాడు ప్రతాప్.
సూర్యం దిగులుగా ముఖం పెట్టి "నేనేం చేయను? నీ భ్రమను తొలగించడం కోసం నేరం నా మీద మోపుకోవాలనుకున్నాను. కాని అది సాధ్యం కాలేదు. నిన్నీ దెయ్యం బారి నుంచి ఎలా రక్షించుకోవాలి అన్నాడు సూర్యం.
ప్రతాప్ బాధగా సూర్యం వంక చూసి "దేవుడని తమ తప్పులు కాస్తాడని నమ్మి ఆస్తికులెన్ని తప్పులైనా చేస్తారు. మానవత్వాన్ని నమ్మే నాస్తికుడు ఏ తప్పూ చేయదు. చేసినా ఒక్క తప్పుతోనే తన్ను తాను దిద్దుకుంటాడు. సూర్యం -- నేను ఆస్తికుడిని. దుర్మార్గుడిని. నేనెన్నో తప్పులు చేసాను. చేస్తున్నాను. నన్నీ దెయ్యం వదలదు. నాకోసం మీరంతా చేసిన సహాయం నన్ను సిగ్గుపడేలా చేస్తోంది. నేను మీ కేమవుతానని మీరంతా నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు. నాది భ్రమ అనుకుని రకరకాల నమ్మకాలతో, అబద్దాలతో నాకు మనశ్శాంతి కలిగించడానికి యత్నిస్తున్నారు మీరు. కానీ దెయ్యం నన్ను పీడిస్తున్న మాట నిజం! అది భ్రమ కాదు" అన్నాడు.
నవ్వాలో ఏడవాలో తెలియలేదు సూర్యానికి. అతడా రోజున తానేవ్వరో ప్రతాప్ కి తెలియబర్చాలనే కిటికీ దగ్గరకు వచ్చాడు. ప్రతాప్ ధైర్యం చేసి కిటికీ తలుపులు తెరుస్తాడని - అప్పుడు తనుముసుగు తీసి అసలు సంగతి చెప్పేద్దామని అనుకున్నాను. అయితే తన్ను చూసి మంచం కూడా దిగకుండా "సూర్యం వెళ్ళిపో...." అని అరిచే ప్రతాప్ ని చూస్తుంటే అతడి ఉద్దేశ్యం మారిపోయింది. రెండు అంగాలలో వెనుక నుంచి ముందుకు వచ్చి ప్రతాప్ గుమ్మం దగ్గర నిలబడ గల తన శక్తిని మానవాతీతశక్తిగా భావించే ప్రతాప్ కు తను నిజం ఎందుకు చెప్పాలి?" అతని భ్రమ భ్రమగానే ఉండనిస్తే కలిగే నష్టం ఏముంది?
మరోసారి ఇలాంటి షాక్ తగిలితే ప్రతాప్ చచ్చి పోతాడని డాక్టర్ అన్నాడు. అలాగని ప్రతాప్ కు షాక్ తగలకుండా చూడడం ఎలా?
తను సూర్యమో, దెయ్యమో తెలుసుకోలేని పరిస్థితిలో అతడీ పూట దెయ్యం వచ్చినపుడు కాస్త ధైర్యంగా వ్యవహరించాడు. ఇలాగే వ్యవహరించగలిగితే ఇక ముందే అతడికే ప్రమాదమూ వుండదు.
"మిస్టర్ ప్రతాప్! నువ్వు చెప్పేవన్నీ బట్టి చూస్తుంటే ఆ దెయ్యం నీ భ్రమ కాక నిజంగానే ఉన్నట్లయితే దాని ఉద్దేశ్యం నిన్ను భయపెట్టడమే కానీ చంపడం కాదు. నువ్వు భయపడకపోతే అది నిన్నేమీ చేయదు. నువ్వు ధైర్యంగా ఉండు. అసలు కిటికీ వైపు చూడకు. ధైర్యం చిక్క పట్టుకుని ఏం జరుగుతుందో చూస్తుండు" అన్నాడు సూర్యం.
"ఇలాంటివి ఒకరికి సలహా ఇవ్వడం సులభం. అనుభవంలోకి వస్తే తట్టుకోవడం కష్టం" అన్నాడు సుబ్బారావు.
"నువ్వు చెప్పింది నిజమే. కానీ ఈ దెయ్యం బాధ తప్పించుకోవడానికి మొండి ధైర్యం తెచ్చుకోవడం కంటే మరో ఉపాయం కనబడడం లేదు. కానీ నేను మొండి ధైర్యం ఎలా తెచ్చుకోగలను? మీరంతా కలిసి దెయ్యం కాదనీ- సూర్యమేననీ చెప్పినా కిటికీ వరకూ రాలేకపోయాన్నేను. రాత్రి పన్నెండయ్యే సరికి నా శరీరంలో వింతమర్పులు వస్తున్నాయి. నా శరీరం నా అదుపులో ఉండడం లేదు. ఏం చేయడానికి అశక్తుడిని అవుతున్నాను. నా మానసిక బలహీనతో - దెయ్యం ప్రభావితమో తెలియడం లేదు." అన్నాడు ప్రతాప్.
అతని మాట విని భారంగా నిట్టూర్చాడు సూర్యం.
11
ప్రతాప్ మంచం మీద పద్మాసనం వేసుకుని ఆంజనేయ స్త్రోత్రం చేస్తున్నాడు. ఆ సమయంలో గదిలో ఒక్క సారిగా అలారం మ్రోగింది. ప్రతాప్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు.
టైము సరిగ్గా పన్నెండయింది.
ప్రతాప్ కావాలనే అలారం పెట్టుకున్నాడు. ఆ రాత్రి దెయ్యాన్ని చూడాలన్న దృడ సంకల్పం అతనికి కలిగింది. తనేమై పోయినా సరే దెయ్యాన్ని చూడాలని అతడనుకున్నాడు.
అయితే ....టైము పన్నెండు కాగానే మళ్ళీ అతడి శరీరంలో సంచలనం ప్రారంభమైంది. ఆప్రయట్నంగా ఒకసారి కిటికీ వైపు చూశాడు. అక్కడ ఏమీ కనపడకపోయినా అప్రయత్నంగానే కళ్ళు మూసుకున్నాడు.
అతని పెదాలు ఆంజనేయ స్తోత్రాన్ని జపిస్తూనే వున్నాయి. అతడి కళ్ళు అప్పుడప్పుడు కిటికీ వైపు చూసి మూసుకుంటూనే వున్నాయి. శరీరం మాత్రం అంత కంతకూ బిగుసుకుపోతోంది. మంచం దిగాలన్న అతని కోరికకు అది సహకరించడం లేదు.
ఉన్నట్లుండి కిటికీ వెనుక ఏదో ఆకారం కదిలినట్లయింది. ప్రతాప్ కళ్ళు పెద్దవయ్యాయి. ఇప్పుడతని పెదవులు కూడా మంత్రోచ్చారణ ఆపేశాయి. కనుగ్రుడ్లు , కంటి రెప్పలు తప్ప అతని శరీరంలో మరేమీ కదలడం లేదు.
కిటికీ వెనుక ఏదో అకారమున్నట్లే ఉంది కాని ఆదాట్టే కదులుతున్నట్లు లేదు.
అది దెయ్యమా లేకా సూర్యమా?
ప్రతాప్ క్రమంగా ధైర్యం తెచ్చుకుని కిటికీ వంకనే చూశాడు. అక్కడ ఏదో నీడ లాంటిది వుంది. కాని నీడ కదలడం లేదు.
