మహాలక్ష్మి మంచంమీద ఇటూ అటూ దొర్లుతోంది కానీ సులోచన కదలడంలేదు. వాళ్ళు నిద్రపోవడం కళ్ళారా చూసి కదలాలన్న సురేంద్రకు కనులు మూత పడుతున్నాయి. అతను అప్సరకు సైగ చేసి-తన గదిలోకి వెళ్ళిపోయి-ఆమె వచ్చేలోగానే నిద్రకు పడ్డాడు. అప్సర వెళ్ళి నిద్రపోతున్న అతన్ని కదిపిచూసింది. యెక్కడా చలనంలేదు.
ఇంతలో టెలిఫోన్ మ్రోగింది. అప్సర పరుగున వెళ్ళి రిసీవర్ తీసింది.
"హలో - సులోచన నేనా మాట్లాడుతూంట-" అంది సుబ్బారావు కంఠం.
"నేను-అప్సరని మామయ్యగారూ-అత్తయ్యగా రిప్పుడే నిద్రకు పడ్డారు. లేపమంటావా?"
"అవసరం లేదులే అమ్మా-" అవతల ఫోన్ క్లిక్ మంది.
అప్సర చిన్నగా నిట్టూర్చి అక్కణ్ణించి నెమ్మదిగా తల్లివద్దకు వెళ్ళి-చిన్నగా-"అమ్మా!" అంది.
మహాలక్ష్మి చటుక్కున లేచి కూర్చుని-'సురేంద్ర నిద్రపోయాడా?" అన్నది.
"ఆహా-ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాడు-"
"ఫోన్ ఎవరిదగ్గర్నుంచి-సుబ్బారావుగారా?"
"అవును-అత్తయ్యగారిని పిలిచారు-"
"ఆయన గానీ వస్తాడేమో-" అంది మహాలక్ష్మి.
"అవకాశాలున్నాయి...." అంది అప్సర.
మహాలక్ష్మి ఆలోచనలో పడింది-"ఇంకా ఇద్దరు రావాలి. వస్తే మనం వెళ్ళిపోవచ్చు-"
"నాలుగుదాకా అనుకున్నాంగదా-అంతవరకూ ఆగవలసిందే-"
"నాలుగు వరకూ రాకపోతే-మళ్ళీ ఇలాంటవకాశం దొరకద్దూ-?"
ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది.
"సుబ్బారావుగారేమో?" అంది మహాలక్ష్మి మంచం మీద వాలిపోతూ.
"నేను వెళ్ళి చూస్తాను. నువ్వు నిద్ర నటించు-" అంటూ తన బ్యాగులోంచి ఓ తెలుగు పత్రికతీసి గుమ్మం వద్దకు వెళ్ళి తలుపు తీసింది.
వచ్చినది సుబ్బారావు కాదు. ఒక నడివయస్కురాలు.
"మీ అమ్మగారున్నారమ్మా?" అనడిగిందావిడ.
"మా అమ్మగారంటే?" ప్రశ్నించింది అప్సర.
"మీ అమ్మగారంటే మీ అమ్మగారే-దానికి వేరే అర్ధాల్లేవు-"అందా నడివయస్కురాలు.
"నిజమే-కానీ ఇది మా యిల్లుకాదు. ఈ యింటికి చుట్టపు చూపుగా వచ్చాం మేము. ఈ ఇంటావిడ మా అమ్మకాదు-" అంది అప్సర.
ఆ నడివయస్కురాలు గతుక్కుమన్నట్లు కనబడింది- "ఇంటావిడెవరైతే నాకేమమ్మా-పక్కింట్లో దిగి రెండ్రోజులైంది. కాస్త కాఫీపొడి కావాలి. ఉందంటారో లేదంటారోనని గిన్నె తెచ్చుకోలేదు. కాస్త ఏ డబ్బాలోనైనా వేసి ఇస్తే - తర్వాత మీ డబ్బా మీ కిచ్చేస్తాను-" అందావిడ.
మహాలక్ష్మి చటుక్కున లేచి కూర్చుని-"పెద్ద డబ్బానా, చిన్న డబ్బానా?" అన్నది.
"డబ్బా పెద్దధైతేనేం-చిన్నదైతేనేం-నాక్కావలసిందో కప్పుడు కాఫీ పొడుం-అంతేగా-"అని-"అసలే మా ఇంట్లో డబ్బాలులేవు. మీరే గ్లాస్కో డబ్బాలోనైనా వేసిచ్చారంటే సంతోషిస్తాను-...."అన్నది.
అప్సర సందేహించకుండా తమ సంచీలోంచి ఒక అరకేజీ గ్లాస్కో డబ్బాతీసి ఆవిడకిచ్చింది.
"వస్తానమ్మా - మీరేమీ అనుకోనంటే డబ్బా వుంచేసుకుంటాను" అంటూ అక్కణ్ణించి వెళ్ళిపోయిందావిడ. అప్సర ఆవిడ వెనకాలే వెళ్ళి తలుపులువేసింది.
"అమ్మయ్య-"అంది మహాలక్ష్మి-"ఇంక ఒక్కరే రావాల్సింది-"
13
టైము సుమారు పావు తక్కువ రెండయ్యేసరికి రంగనాధ్ వెళ్ళిపోయాడు. సుబ్బారావు భారంగా నిట్టూర్చాడు. ఇంతఃవరకూ ఏమీ జరుగలేదు. ఇంకా జరుగుతుందన్న అనుమానం కూడా ఆయనకు లేదు. మరోసారి యింటికి ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకుందామనుకున్నా డాయన. ఆ ప్రయత్నంలో అయన నంబరు డయల్ చేయబోతూండగా-
"మీరు తిన్నగా వున్నంతకాలం మీవాళ్ళకే ఇబ్బందీ రాదు. ఫోన్ చేయడం అనవసరం-...." అన్న మాటలు వినబడి అప్రయత్నంగా రిసీవర్ హుక్ చేసి వచ్చిన మనిషిని చూశాడు సుబ్బారావు.
"చాలాసేపటి క్రితమే రావాల్సింది నేను. కానీ మీతో యెవరో ఉన్నారు. అందుకని వేచివుండాల్సి వచ్చింది-"అన్నాడతను.
"ఎవరు మీరు?" అన్నాడు సుబ్బారావు.
"రంగనాథ్-" అన్నాడతను. సుబ్బారావులిక్కిపడి కంగారుగా ఆయనవంక చూశాడు-"నేను వస్తానన్న సంగతి మీకు తెలుసునని నాకు తెలుసు. నేనిప్పుడు వచ్చినది-సరిగ్గా అయిదంటే అయిదే లక్షలకోసం...."
"అన్నిపేపర్సూ తీసుకొచ్చారా?"
రంగనాథ్ నవ్వి-"పేపర్సెందుకు?" అన్నాడు.
"లోన్ శాంక్షన్ కి-"
"నేను డబ్బు తీసుకు వెళ్ళడానికి రాలేదు. దాచడానికి వచ్చాను. అయితే అయిదు లక్షలు దాచాలి...."
"ఎక్కడ-ఎలా?"
"ఒక బ్యాంక్ ఏజంట్ గా మీరీ ప్రశ్న అడగడం బాగోలేదు. మీకు లాకరుందికదా-అందులో దాస్తాను.." అన్నాడు రంగనాథ్.
సుబ్బారావాశ్చర్యంగా-"నా బ్యాంకులో నా లాకర్లో అయిదు లక్షలు దాస్తారా? మీకంత నమ్మకముంటే నాదేమీ అభ్యంతరంలేదు-" అన్నాడు.
"మనుషుల్ని నమ్మకంగా వుంచడం వెన్నతో పెట్టిన విద్య నాకు. ఆ విషయంలో మీరేమీ భయపడనవసరంలేదు-" అన్నాడు రంగనాథ్ గంభీరంగా.
"భయం నాకెందుకూ-మీకుండాలిగానీ-" అన్నాడు సుబ్బారావు.
"నాతో పరిచయం కత్తిమీద సామువంటిది. అది కొనసాగినంత కాలమూ యెవరైనా భయపడవలసిందే! అయితే నాకు నేనై యెవరి జోలికీ వెళ్ళను..."
"అది నిజంకాదు. మీకు మీరై నాతో పరిచయం కలిగించుకున్నారు-"
"పరిచయం కావాలనే చేసుకున్నాను. కానీ దాన్ని జోలికిరావడం అనరు. జోలికి రావడం అంటే నా విషయంలో తెలిసినవారెవ్వరూ ఇప్పుడు బ్రతికిలేరు-"
"అలాగా-ఉదాహరణలేమైనా ఉన్నాయా?"
రంగనాథ్ నవ్వాడు-"ఉదాహరణకు మీరిప్పుడు సహకరించలేదనుకోండి. సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి మీకు భార్యా వియోగమూ, కడుపుశోకమూ కలుగుతుంది-"
సుబ్బారావు ముఖంలో కలవరపాటు స్పష్టంగా కనపడింది-"మీరనవసరంగా కాలయాపన చేస్తున్నారు. నాకింకా చూసుకోవాల్సిన పనులు చాలా వున్నాయి. లాకర్లో డబ్బు దాచుకోదల్చుకుంటే ఆ పని త్వరగా చేసి వెళ్ళండి-" అన్నాడాయన.
"గుడ్-పదండి-" అంటూ రంగనాథ్ లేచాడు. సుబ్బారావెవర్నో పిలిచాడు. అతడికేదో చెప్పాడు. మరుక్షణంలో అతను సుబ్బారావుకు పెద్దసైజు తాళాలున్న గుత్తి ఒకటిచ్చాడు.
అందుకని-"రండి-" అన్నాడు సుబ్బారావు. ఏం జరుగుతుందోనని ఆయన గుండె దడదడలాడుతున్నది.
రంగనాథ్ లేచి నిలబడి ఉత్త చేతుల్తోనే ఆయన్ననుసరించాడు.
"ఉత్తచేతుల్తోనే వస్తున్నారు.." అన్నాడు సుబ్బారావు అనుమానంగా.
"అయిదులక్షలంటే క్యాషనుకున్నా రేమిటి? వజ్రాలు అంత విలువచేసే వజ్రాలు-జేబులో వున్నాయి పదండి" అన్నాడతను.
వజ్రాలనగానే సుబ్బారావు ముఖంలో ఏదో మార్పువచ్చింది. అయినా ఆయన తొట్రుపడకుండా-ముందుకు నడిచాడు. ఇద్దరూ లాకరున్న గదిలోకి వెళ్ళారు. సుబ్బారావు ముందు పెద్ద తలుపు తీశాడు. లోపల చాలా అరలున్నాయి. ప్రతి అరకూ మూడేసి కీ హోల్సున్నాయి. మాస్టర్ కీతో లాకర్ నంబరు పదకొండు తెరిచాక సుబ్బారావు తన జేబులోకి చేయి పోనిచ్చి స్వంత తాళాల గుత్తి తీశాడు. అందులోని ఒక తాళం లాకర్ రెండో కీ హాల్లోపెట్టి తిప్పేక లాకర్ తలుపు తెరుచుకుంది.
