"ఇలాగని ఒకడు జోస్యం చెప్పాడు" అన్నాడు గోవిందరావు.
"ఆ జోస్యాన్ని మీరు నమ్ముతున్నారా ?"
"నమ్మినా నమ్మకపోయినా మీ సాయం కోరుతున్నాను. ఇదివరలో సుదర్శనరావు, ప్రభాకర్ , ఇప్పుడు నేను- ఒకేరకంగా చావబోతున్నాము.అందుకు కారణం చెప్పగల ఒకే ఒక వ్యక్తీ వున్నాడు. వాడి వివరాలు మీకు నేను చెబుతాను. ఈరోజు కాసేపు మీరు నాతోగడపాలి."
"ఆమనిషి గురించి మీకు కాక ఇంకెవరి కైనా తెలుసా?"
"నా వ్యవహారాలూ చూస్తుండే వెంకట్రావు క్కూడా తెలుసు."
'అయితే సరే -- వెంటనే బయల్దేరి వస్తున్నాను."
గోవిందరావు ఫోన్ పెట్టేసి తృప్తిగా నిట్టూర్చి-- "ఇంకెక్కడికి పోతావ్ ? నీ అడ్రస్ పోలీసుల దగ్గరికి వెడుతోంది" అనుకున్నాడు.
12
ఓ కిళ్ళీ కొట్టుకు పక్కగా నిలబడి గోవిందరావు ఇంటి వైపే చూస్తున్నాడు రాము. మాటిమాటికి అసహనంగా గడియారం వైపు చూసుకుంటున్నాడు.
అతను చూస్తుండగా గోవిందరావు ఇంటి ముందు పోలీసు జీపు ఆగింది.
రాము ఉలిక్కిపడ్డాడు. గోవిందరావు యింటికి పోలీసు లెందుకు వస్తున్నారు? గోవిందరావు రమ్మని పిలిచేడా లేక తనను అనుమానించడం జరిగిందా లేక కాకతాళీయమా? తనని అనుమానిస్తే మాత్రం ఏం చేయగలరు?
రాము జేబులోంచి సిగరెట్ పెట్టి తీశాడు. అందులోంచి ఓ సిగరెట్ తీసిపెట్టి మళ్ళీ జేబులోకి తోసేశాడు. అతను చూస్తుండగానే ఇన్ స్పెక్టర్ రామనాధం గోవిందరావు ఇంట్లో అడుగుపెట్టాడు.
"రండి ఇన్ స్పెక్టర్ గారూ!" అంటూ ఆహ్వానించాడు గోవిందరావు.
"నిజానికి నాకు తీరుబడి లేదు. కానీ మీరు రమ్మన్నారు కాబట్టి నాకు తప్పలేదు. సంగతి వివరంగా చెప్పండి" అన్నాడు రామనాధం.
"ఈ రాత్రి నా మీద హత్యా ప్రయత్నం జరుగనున్నదని నా అనుమానం. అది నా భార్య సినిమా నుంచి తిరిగి వచ్చేలోగా . అందుకని అంతవరకూ మీరు నా దగ్గర వుంటే వో హత్య నాపిన వారావుతారు. మీరు నా దగ్గర ఉత్తినే కూర్చున్నట్లు కాక- మీ కు వో కేసుకు సమాచారం క్షుణ్ణంగా చెబుతాను " అన్నాడు గోవిందరావు.
నిజం చెప్పాలంటే రామనాదానికి మనసులో చాలా విసుగ్గా వుంది. గోవిందరావు నగర ప్రముఖుడు కావడం వల్ల తన విసుగుదల నతను పైకి ప్రదర్శించ కుండా -- ';చెప్పండి !" అన్నాడు.
గోవిందరావు ఏదో చెప్పడానికి సంసిద్దుడై ఆగిపోయాడు. చటుక్కున కుర్చీలో వెనక్కు జారిగిల పడ్డాడు. ఏదో ఆలోచిస్తున్నట్లుగా అయన కళ్ళు మూతబడ్డాయి.
రామనాధం అయన మాట్లాడతాడేమోనని సుమారు అయిదు నిమిషాలు ఎదురు చూసి -- "ఎందుకో సందేహిస్తున్నారు,ఫరవాలేదు చెప్పండి!" అన్నాడు.
గోవిందరావు మాట్లాడలేదు.
రామనాధం ఇంకో పది నిమిషాలు వోపికతో ఎదురు చూశాడు. అతడి సహానం నశించింది. నెమ్మదిగా మానసులో అనుమానం కూడా చోటు చేసుకుంది. లేచి గోవిందరావు దగ్గరకు వెళ్ళి గట్టిగా పిలిచాడు. ఆయనలో చలనం కలక్కపోయే సరికి భుజం తట్టి పిలవబోయాడు. అతనుభుజం మీద తట్టగానే అయన కుర్చీలో అటువాలిపోయాడు.
రామనాధం అనుమానం బలపడింది. అయన ముక్కు వద్ద చేయి పెట్టి చూశాడు. శ్వాస ఆడుతున్నట్టు లేదు.
రామనదానికి కంగారు పుట్టింది. చుట్టూ చూశాడు. తానున్న గదిలో అన్ని వేపుల నుంచీ తలుపులు దగ్గరగా వేసి వున్నాయి.గదిలో మరోమనిషి లేడు. రామనాధం వెంటనే ఫోన్ వద్దకు పరుగెత్తి నంబర్ డయిల్ చేశాడు.
13
"వండర్ పుల్!" అంది స్వాతి.
"స్వాతి -- నువ్విక నన్ను కరుణించాలి "అన్నాడు రాము.
"కరుణించకపోతే ?"
"నాకీ లోకంలో ఎవ్వరూ లేరు. అసలు నాకు జీవితేచ్చ లేదు. నిన్ను చూశాకనే నాకు జీవితేచ్చ కలిగింది. ప్రతిమనిషి ముఖంలోనూ మృత్యు కళ లు వెతుక్కుంటూ బ్రతకవలసిన అవసరం నాకు లేదు. ఈ జీవితానికి సరిపడ డబ్బుంది నాదగ్గర. నాకు నీ ఆస్తి మీద మోజు లేదు. కావాలనుకుంటే అది నీ తల్లికీ, అన్నకూ వదిలేసినాతో వచ్చేసేయ్. మనం హాయిగా జీవిద్దాం" అన్నాడు రాము.
స్వాతీ ముఖంలో మళ్ళీ విషాదం కనబడింది. "నీకు తెలియదు మిస్టర్ రామూ- నా ఇబ్బండులన్నీ యింకో పూర్తిగా తొలగినట్లు కాదు."
"ఏ ఇబ్బంది నైనా నేను తొలగించగలను గదా -- నాకు వివరంగా చెప్పు. నీకోసం యింత చేశాను. ఇంకా ఏమైనా చేయగలను " అన్నాడు రాము.
"మాటిమాటికీ నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు బాగోలేదు. అదీగాక తప్పనిసరి పరిస్థితుల్లో నా స్వార్ధం కోసం నాకిష్టం లేని పనులు నీచేత చేయించాల్సి వచ్చింది" అంది స్వాతి.
"ఫరవాలేదు . నీ ఇబ్బంది ఏమిటో చెప్పు. కానీ ఇలా ఒక్కటొక్కటిగా కాకఉన్న ఇబ్బందులన్నీ ఒక్కసారిగా చెప్పేస్తే అన్ని ఒక్క దెబ్బతో తీర్చేసి నిన్ను నాదాన్ని చేసుకుంటాను" అన్నాడు రాము.
'అయితే నీకు తెలియకుండా దాచిపెట్టిన విశేష మోకటుంది. అదిప్పుడు నీకు చెబుతాను విను" అంది స్వాతి.
గోవిందరావు కొడుకు ప్రభాకర్, స్వాతిని ప్రేమించాడు. స్వాతి, వెంకట్రావును ప్రేమించింది. వెంకట్రావు ప్రేమను స్వాతి తండ్రి సుదర్శనరావు నిరాకరించాడమే కాక వెంకట్రావు పరమ దుర్మార్గుడన్న విషయాన్ని అయన స్వాతి కి తెలియబర్చాడు.
స్వాతి వెంకట్రావు ను నిరాకరించింది.
వెంకట్రావు సుదర్శనరావు మీద పగబట్టాడు. కొడుకు కారణంగా గోవిందరావు కూడా సుదర్శనరావు మీద పగ పట్టాడు. ఇద్దరూ ఏకమైన కారణంగా సుదర్శనరావు మరణించాడు. అది హత్య అవునో, కాదో తెలియదు.
తండ్రి పోయాక స్వాతి పై గోవిందరాజుల ఒత్తిడి ఎక్కువయింది. ముందుగా ప్రభాకర్ నీ, ఆ తర్వాత గోవిందరావు ని స్వాతి వదుల్చుకోగలిగింది.
వెంకట్రావు, గోవిందరావు ను రాము మీదకు ఉసి గొల్పి తెలివిగా రంగం లోంచి ఆయన్ను తప్పించాడు. రాము సామర్ధ్యం వెంకట్రావు కు తెలిసినంతగా గోవిందరావు కు తెలియదు.
ప్రభాకర్, గోవిందరావులను రంగం లోంచి తప్పించడం కోసం స్వాతి వెంకట్రావు తో ప్రేమను నటించింది. ఇప్పుడామె వెంకట్రావు ను పెళ్ళి చేసుకోవలసి వుంది. కానీ ఆదామెకు ఇష్టం లేదు. వెంకట్రావు కూడా రంగం లోంచి తప్పుకుంటేనే ఆమె రామును పెళ్ళి చేసుకునేందుకు అడ్డం కులేమీ వుండవు....
స్వాతి చెప్పిన కధంతా వోపిగ్గా విన్నాడు రాము. కధ వింటుంటే అతనికి మతి పోయినట్ల యింది.
అతను స్వాతి వంక పరిశీలనగా చూసి నిట్టూర్చాడు. "నాకు రెండు రోజులు వ్యవధి కావాలి. ఏం చేయాలో తోచడం లేదు. నిన్ననే వెంకట్రావు ను చూశాను. అతడి ముఖంలో మృత్యు కళ లేదు."
"నిన్న లేకపోవచ్చు" కానీ రేపు రావచ్చుగా -- " అంది స్వాతి.
"రావచ్చు , రాకపోవచ్చు. నేనేమీ హత్యలు చేయడం లేదు గదా ...." అన్నాడు రాము.
స్వాతి అదోలా నవ్వి "ఇంకా నన్ను మభ్య పెట్టాలని ఎందుకు చూస్తావు? నిజం చెప్పు - నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్న పక్షంలో అబద్ద మాడకూడదు. మృత్యు కళ గురించి నువ్వు చెబుతున్నది అబద్దం! నువ్వు హత్యలు చేస్తున్నావు , అవునా?' అంది.
రాము కూడా నవ్వి "వెంకట్రావు చనిపోగానే నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావన్న మాట నిజమని దేవుడి మీద ఒట్టేసి చెప్పు. అప్పుడు నా సంగతీ చెబుతాను....' అన్నాడు.
స్వాతి ఆశ్చర్యంగా చూసింది రాము వంక. "నీకు నామీద అనుమానం కలిగిందన్న మాట! అది పొరపాటని త్వరలోనే తెలుసుకుంటావ్ !" అంది.
'అలా తెలుసుకోవాలనే నా ఆశ!" అన్నాడు రాము.
14
రాము కోరిక మీద తన యింట్లో పెద్ద డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసింది స్వాతి.
ఆ ఇంట్లోని వారు కాక ఆ డిన్నర్ కవ్వానించ బడిన వ్యక్తులు రాము, వెంకట్రావు! డిన్నర్ కు ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన తినుబండారం అదనంగా తీసుకు రావాలని స్వాతి చెప్పింది. అది రాము కోరిక మీదే.
స్వాతి తల్లీ మాలతి బజార్నించి చాక్ లెట్స్ తెప్పించింది. అన్న రాజు రసగుల్లా తెచ్చాడు. స్వాతి చిప్సు తెచ్చింది. వెంకట్రావు మిరపకాయ బజ్జీలు తెచ్చాడు. రాము మాత్రం చేతిలో ఒక డబ్బాతోవచ్చాడు. అందులో ఏముందో ఎవ్వరికీ చూపించలేదు.
