ఇంతకాలం ఆగి ఇప్పుడు తను శాంతినిగురించి పోలీసు ఫిర్యాదు యిచ్చాడు. శాంతి తల్లిదండ్రులు పోలీసు రిపోర్టు యివ్వకుండా తనతండ్రి అడ్డుపడ్డాడు. అదే ఆయనపై తనకుగల అనుమానాన్ని కూడా పెంచింది. తీరా యిప్పుడు తను రిపోర్టిస్తే శాంతి బ్రతికేవున్నట్లు తెలిసింది.
ఆ వుత్తరాన్ని మూడుసార్లు ముద్దుపెట్టుకుని కనబడ్డరిక్షా ఎక్కాడు రవి. రిక్షా ఎంత వేగంగా వెళ్ళినా అతనికి నెమ్మదిగా వేడుతున్నట్లే అనిపించింది. సుధాకర్ ఇల్లు మరీ దూరంలో లేకపోయినా చాలా దూరంలో వున్నట్లు తోచింది. అతని మనసునిండా ఆలోచనలనిండా శాంతి!
సుధాకర్ ఇల్లు రాగానే రిక్షాదిగి వాడికి డబ్బులిచ్చి తను వెళ్ళి కాలింగ్ బెల్ మ్రోగించాడు. గంట మ్రోగుతున్న ధ్వని అయింది కానీ ఎంతసేపటికీ ఎవ్వరూ రాలేదు. రవి మళ్ళీ కాలింగ్ బెల్ మ్రోగించాడు. లోపల్నుంచి యెవరో వస్తున్న అడుగుల సవ్వడి అవుతోంది.
తలుపుతీసి "మీరా?" అన్నాడు సుధాకర్ అతను మనిషి హడావుడిగా అగుపించాడు. ముఖంలో రవంత కంగారుకూడా వుంది.
"శాంతికోసం వచ్చాను" అన్నాడు రవి కళ్ళతో ఆత్రుతఃగా లోపల వెతుకుతూ.
"శాంతి ఇక్కడలేదని మీకు తెలుసుగదా" అన్నాడు సుధాకర్.
"నా ఆత్రుతను పెంచకండి సుధాకర్" అంటూ రవి అతడి చేతిలో సుజాత తనకు వ్రాసిన వుత్తరం పెట్టాడు. సుధాకర్ త్వరగా అది చదివి "అయితే సుజాత కూడా ఇక్కడుందని వచ్చారా మీరు?" అన్నాడు.
"అంటే?" అన్నాడు రవి కంగారుగా.
"నేను సుజాతకు ఫోన్ చేయలేదు. ఆమె ఇక్కడకు రాలేదు. శాంతి, రాధిక గురించి నాకేమీ తెలియదు. మతిపోయినట్లై ఆఫీసుక్కూడా వెళ్ళకుండా ఇక్కడే వుండిపోయాను."
రవి తలపట్టుకుని చతికిలబడిపోయి "అయితే ఏం జరిగిందంటారు?" అన్నాడు అతడికాళ్ళలో వణుకు ప్రారంభమైంది.
"మధు కానీ ఆమెకు నా పేరుతో ఫోన్ చేసి దారిలో ఆమెను కలుసుకున్నాడేమో -అతడికి ఒకవేళ శాంతి, రాధిక కనబడ్డారేమో" అన్నాడు సుధాకర్.
"అయితే మీరు కూడా రండి మధు ఆఫీసుకు వెడదాం" అన్నాడు రవి.
"నేనిప్పుడు ఎక్కడకూ రాలేను. ఊహలు నా ఆశల్ని చంపేశాయి కానీ బ్రతికించలేకపోతున్నాయి. రాధిక కనబడితే మాత్రం నాకు కబురుపెట్టండి" అన్నాడు సుధాకర్.
రవికి ఫోన్ లో తప్పుడు సమాచారం ఎవరు, ఎందుకు అందిస్తారా అని ఆలోచిస్తూ అక్కణ్ణించి మధు ఆఫీసుకు వెళ్ళాడు. అయితే సుజాత అక్కడికీ రాలేదని తెలిసింది. జరిగింది విని మధు కంగారుపడ్డాడు. ఎవరో సుజాతకు ఆపద తలపెట్టారని అతనికి అనిపించింది.
ఇద్దరూ కంగారుగా ఇంటికి వెళ్ళారు. ఇల్లింకా తాళం పెట్టేవుంది.
"రవీ! నాకు చాలా బెంగగా వుంది. మీ నాన్నగారు శాంతిని సుధాకర్ కి అప్పజెప్పారు. ఆమె అమాయకమైంది. రాధిక అతణ్ణి పెళ్ళిచేసుకుని మాయమయింది. అతని దగ్గర్నుంచి ఫోన్ వచ్చి బయల్దేరివెళ్ళిన సుజాత జాడ తెలియడంలేదు. సుధాకర్ మంచివాడు కాదని నాకు అనుమానంగా వుంది. నా సుజాను మళ్ళీ చూస్తానొ లేదో" అంటూ బెంగగా చతికిల బడిపోయాడు మధు.
"అలా చచ్చుపడిపోకు బావా? వాడి పాపం పండింది. వాడింటికి వెళ్ళి వెతుకుదాం. సుజాత తప్పక అక్కడే వుండవచ్చు" అన్నాడు రవి.
"ఈ ఆలోచన నీకు ఇదివరలోనే వచ్చి వుండా'ల్సింది. వాడింకా సుజాతను ప్రాణాలతో వుంచాడో లేదో-నా సుజాతను నేనుమళ్ళీ....." అని కళ్ళువత్తుకుని బయల్దేరాడు మధు.
14
ఆమె గోడకు ఆనుకునివుంది. కాళ్ళు, చేతులు గోడకున్న హుక్సుకు తాళ్ళతో కట్టబడి వున్నాయి. ఆమె నోటికి టేపు అంటించివుంది. ఆమె పెనుగులాడాలనీ, అరవాలనీ విఫల ప్రయత్నాలు చేస్తోంది.
ఎడమచేత్తో పొడవాటి, పదునయిన కత్తితో అతనామెను సమీపించాడు. ఆమెను సమీపించి-కత్తిని కుడిచేతిలోకి మార్చుకుని జేబులోంచి బాల్ పెన్ తీశాడు.
"నిన్ను చంపాలనీ, చంపాల్సి వస్తుందని నేననుకోలేదు. కానీ ఎంతో రహస్యంగా, నేను చేసిన హత్యలు చూడటమే కాక నన్ను కూడా గుర్తించావు నువ్వు. నా బ్రతుకుకొం నిన్ను చంపాల్సివస్తోంది. అందుకు బాధగానే వుంది. కానీ అది నీ దురదృష్టం" అని నవ్వాడతను.
అతని ఎడమచేయి చకచకా పనిచేసింది. ఆమె గుండెలమీది ఆచ్చాదన తొలగింది. ఆ సమయంలో ఆమెకు తను పరాయి మగవాడి ఎదుట అసహాయ స్థితిలో వున్న విషయం స్ఫురణకురాలేదు. అతను తన గుండెల వేపు చూస్తున్నందుకు శరీరం సిగ్గుతో కుంచించుకుపోలేదు. ప్రాణభయం-అదొక్కటే ఆమె మెదడు నిండా నిండి పోయివుంది. అతను నోటిమీద టేపుతీస్తే "నన్ను చంపవద్దు. నన్ను చంపవద్దు" అని ఆర్తనాదాలు మినహాయించి మరోపని చేసివుండేది కాదు.
అతను బాల్ పెన్ తో ఆమె గుండెపైన ఒక సున్నాచుట్టాడు.
ఆమె గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. పెరుగుట తరుగుట కొరకే అన్నట్లు-ఆ వేగం పూర్తిగా ఆగిపోవడానికేనని ఆమెకు తెలుసు. ఆ భయంకర హంతకుడు చేసిన రెండుహత్యలు కళ్ళారాచూసిన ఆమెకు ప్రాణాలమీద ఆశలేదు.
అతను నవ్వుతూ కుడిచేతిలోంచి కత్తిని ఎడమచేతిలోకి మార్చాడు. ఆమె ఊపిరి బిగబట్టి అతనివంక చూస్తోంది. ఆమె కళ్ళలోంచి ఆగకుండా నీళ్ళు కారిపోతున్నాయి.
తను కలలో ఇద్దరు అతివల మానసికాందోళన చూసింది. ఆ దృశ్యాలుచూసి ఎంతగానో వణికిపోయింది. కానీ అదే అనుభవం తనకే ఎదురవుతుందని అనుకోలేదు. ఎప్పటి లాగే ఇది కలగా మారిపోతే ఎంతబాగుండును.
కానీ ఇది కలకాదనీ పచ్చి వాస్తవమని కొద్దిక్షణాల్లో తన గుండెల్లోంచి రక్తం ఎగజిమ్ముతుందనీ తనతల పక్కకు వాలిపోతుందనీ ఆమెకు తెలుసు. ఆమె నిస్సహాయంగా ఆ హంతకుడివంక చూస్తోంది.
తను సుధాకర్ కోసమని వచ్చింది. ఇంటి తలుపులు తీసే వున్నాయి. లోపల అడుగుపెట్టింది. ఎవరూ కనబడలేదు. వెతుక్కుంటూ ఒకో గదిలోకే వెడుతూ ఓ గదిచేరి ఆ గదిచూసి ఆశ్చర్యపడింది. తనుకలలో చూసిన గదికి లాగానేవున్నది. గోడకున్న హుక్స్ చూసి గజగజా వణికిపోయింది. వెంటనే అక్కణ్ణించి వెళ్ళిపోవాలనుకున్నది కానీ అంతలోనే గది తలుపులు మూసుకున్న చప్పుడయింది. కంగారుపడి వెనక్కు తిరిగింది.
వాడే, ఆ ఘోరహంతకుడు. ఎవడు కళ్ళబడితే తన శరీరం ఆపాదమస్తకమా వణికిపోతుందో, వాడు అక్కడ నిలబడి క్రూరంగా చూస్తున్నాడు. భయంతో తన శరీరం చచ్చుబడిపోయింది. వాడు తనను బెదిరిస్తూ తీసుకువచ్చి హుక్సుకు బంధించాడు, నోటికి టేపు అంటించాడు.
ఇప్పుడు వాడిచేయి గాలిలోకి లేస్తోంది. ఇంక తన బ్రతుక్కు ఎంతో వ్యవధిలేదు. అప్రయత్నంగానే ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది.
అప్పుడే కాలింగ్ బెల్ ధ్వని గదిలో మార్మోగింది.
ఇందాకా తనను హుక్స్ కు కడుతున్నప్పుడు యిలాగే కాలింగ్ బెల్ మ్రోగింది. తనను పూర్తిగా బంధితురాలిని చేసి అప్పుడు బయటకు వెళ్ళాడు. ఎవరోవచ్చి తనను రక్షిస్తారని ఆశించింది కానీ కాపేపటికి మళ్ళీ వాడేవచ్చాడు.
