Previous Page Next Page 
వసుంధర కధలు-6 పేజి 26

 

    సుశీల భయంగా -- "సుభాష్-- నాకు భయంగా వుంది--" అంది.
    "మీ నాన్న పంపిన మనిషిని. నేనంటే నీకు భయమెందుకు?'అన్నాడు గోపీ హుందాగా నవ్వుతూ.
    "ఎవరు నువ్వు?" అంది సుశీల అతడి మాటలకు తెల్లబోయి.
    "మీ ఇద్దరికీ మీ నాన్న అబీష్టం ప్రకారం పెళ్ళి జరగాలనుకుంటున్నవాణ్ని ....' అన్నాడు గోపీ.
    సుభాష్ మాట్లాడకుండా గోపీ వంక చురుగ్గా చూశాడు.
    "అలా చూసి లాభం లేదు. నేను చెప్పినట్లు వినాలి" అన్నాడు గోపీ.
    "ఏమిటి నువ్వు చెప్పేది?"
    "వెంకోజీరావు కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్ పోస్టుకి ఇంటర్వ్యూ కి నువ్వు వెళ్ళకూడదు...."
    "ఎందుకని?"
    "చూడు మిస్టర్ సుభాష్! నేను సీదాసాదా మనిషిని . అయితే గూండాను. నన్ను ప్రశ్నలడగడం నీకు మంచిది కాదు. ఎందుకంటె నా జవాబుల్ని నువ్వు అరాయించు కోలేవు...." అన్నాడు గోపీ.
    "నేనూ గూండాలకు భయపడేవాడిని కాదు. నీ జావబుల్నే కాదు-- అవసరమైతే నిన్నే అరాయించుకోగలను-" అన్నాడు సుభాష్ కోపంగా.
    'అయితే అరాయించుకో -- " అంటూ తన జేబులోంచి ఓ బటన్ నైఫ్ తీశాడు గోపీ. అతడు బటన్ నొక్కగానే ఆరంగుళాల చాకు బైటకు వచ్చింది. అది తళతళ మెరుస్తోంది.
    సుభాష్ ఏదో అనాలని పెదవి కదిపాడు. కానీ గొంతు పెగలలేదు. అతడి చూపులా చాకు మీదనే నిలబడ్డాయి.
    "ఇంటర్వ్యూ కి నువ్వు వెళ్ళవు. ఒకవేళ నామాట కాదని బయల్దేరావా -- దీంతోనే ఆరోజు నిన్నపవల్సి వుంటుంది --" అనేసి గోపీ అక్కణ్ణించి లేచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళినా అక్కడ కాసేపు నిశ్శబ్దం అలాగే వుండిపోయింది.
    "సుభాష్ -- ఏమిటిదంతా?' అంది సుశీల నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ.
    "ఇది- మీ నాన్న తన ప్రిస్టేజిని నిలబెట్టుకునే పద్దతి!" అన్నాడు సుభాష్.
    అతడి గొంతులోని విసురు, వెటకారం సుశీల కర్ధమయ్యాయి.

                                   7
    "నాన్సెన్స్!" అన్నాడు మోహనమూర్తి.
    "మీ వ్యవహారమంతా నాన్సెన్స్ గానే వుంది. ఆఖరికి మీరిలా దిగజారి పోతారనుకోలేదు. కాబోయే అల్లుడి కుద్యోగ మిప్పించడం వల్ల మీ పరువు పోదు. ఏ పని కైనా గూండాలను నియమించడం మీ జీవితంలో మాయని మచ్చ...." అంది సావిత్రమ్మ.
    "సావిత్రీ -- నీ కర్ధం కావడం లేదా-- ఇది మనమ్మాయీ, ఆ అబ్బాయీ కలిసి చేస్తున్న అబద్దపు ఆరోపణ. ఇది నువ్వెలా నమ్ముతున్నావు?" అన్నాడు మోహనమూర్తి బాధగా.
    'అమ్మయబద్దం చెప్పదు. సుభాష్ ని తను ప్రేమించాన్న విషయమే అది మన దగ్గర దాచలేదు...." అంది సావిత్రమ్మ.
    "నువ్వు నాకంటే యెక్కువగా దాన్నే నమ్ముతావా?"
    "ఊ"
    "నేనలాంటి పనులెందుకు చేస్తాను?'
    "ఎందుకో సుభాష్ చెప్పాడు --"అమ్మాయికి...."    
    "ఎందుకట?'
    "వీరరాఘవయ్య గారికీ  వూళ్ళో నాలుగు షాపు లున్నాయి. ఆయన తలచుకుంటే ఈ వూళ్ళో యెంత పెద్ద వాళ్ళనైనా నాశనం చేయగలడు...."
    "అయితే?"
    "అయన మూడో కొడుకు నాగభూషణం మీ కాలేజీలో లెక్చరర్ పోస్టుకి అప్లై చేశాడు. అతడికింటర్వ్యూ వచ్చింది...."
    "వస్తే?"
    "అసలతడికి ఇంటర్వ్యూయే రాకూడదు, అయినా వచ్చింది. ఇప్పుడుద్యోగమూ వస్తుంది...."
    "అలాగా-- ఇంకా నీకేం తెలుసో చెప్పు...."వెటకారంగా అన్నాడు మోహనమూర్తి.
    సావిత్రమ్మ చలించలేదు. ఆమె చెప్పుకుపోసాగింది.
    వీరరాఘవయ్య మోహనమూర్తి ని కలుసుకుని హెచ్చరించాదం వల్లనే నాగభూషణానికి ఇంటర్వ్యూ పిలుపు వచ్చింది. ఉద్యోగం కూడా అతడికే ఇవ్వక తప్పదు. ఆ విషయంలో మోహనమూర్తి అసహాయుడు. అందువల్ల కావాలనుకున్నా సుభాష్ కాయన ఉద్యోగం ఇప్పించలేడు. ఆ విషయం ఒప్పుకోడానికి అహం అడ్డు వస్తోంది. ఇంటర్వ్యూ కని వచ్చి సెలక్టు కాకపొతే సుభాష్ సుశీలను కాదంటాడేమోనని భయపడి అయన ముందరి కాళ్ళకి బంధం వేస్తున్నాడు.
    "అయితే నేనేం చేయాలంటావు?"
    "సుభాష్ కు నిజం చెప్పేయండి. అతడు మిమ్మల్నర్ధం చేసుకుని మీకు సహకరిస్తాడు..."అంది సావిత్రమ్మ.
    "నిజం నీకు చెబుతాను. అది నువ్వు సుభాష్ కు చెప్పు...."
    "ఊ"
    "నాగభూషణం వీరరాఘవయ్య అసలు కొడుకు కాదు. అయన అసలు కొడుకు లందరూ వ్యాపారంలోనే వున్నారు. వీరరాఘవయ్య ఉంపుడు కత్తే కొడుకు నాగభూషణం. ఇది జగ మెరిగిన సత్యం. కానీ ఎవ్వరూ ఆ మాట అతడి ఎదురుగుండా అనరు. నాగభూషణం అప్లికేషన్స్ లో తన తండ్రి పోయినట్లు రాస్తాడు. కానీ వీరరాఘవయ్య పూర్తిగా అతడి ఆలనా పాలనా చూసుకుంటాడు...."
    మోహనమూర్తి యింకా ఏదో చెప్పబోతుండగా -- "ఈ సోదంతా నాకెందుకు గానీ -- అసలు విషయం చెప్పండి..." అంది సావిత్రమ్మ విసుగ్గా.
    "స్క్రీనింగ్ లో నాగభూషణం అప్లికేషన్ తీసేయాల్సింది. మేమసలు ఎనిమిది పేర్లు ఇంటర్వ్యూ కని సెలక్టు చేశాం. ఈలోగా వీరరాఘవయ్య నుంచి ఒత్తిడి వచ్చింది. నాగభూషణం పేరు ఇంటర్వ్యూ కి పిలవడానికి ఎన్నుకోక తప్పలేదు. అతడి గురించి అలాంటి వాడినే మరోకడ్ని కూడా కలపాల్సోచ్చింది. మొత్తం పది మందిని పిలిచాం --"
    "అంటే-- ఇంకేం -- సుభాష్ చెప్పింది నిజమేనన్నమాట. వీరరాఘవయ్య ఒత్తిడికి లోంగిపోయాక - మీరింకా స్ట్రిక్ట్ మిటండీ--"అంది సావిత్రమ్మ.
    "వీరఘవయ్య స్వయంగా నన్ను కలుసుకున్నాడు. ఆయనకు మా కాలేజీ కమిటీ మెంబర్స్ చాలామంది తెలుసు. ఏటా మా కాలేజీకి ఏదో రూపేణా విరాళాలిస్తుంటాడాయన. అయన మాటకు కొంత విలువివ్వక తప్పదు. అంతవాడూ ఏమన్నాడో తెలుసా -- మూర్తి గారూ, వాడిని ఇంటర్వ్యూ కి పిలిస్తే చాలు, సెలక్టు చేయనక్కర్లేదు.... అని మరీమరీ వేడుకున్నాడు."
    "ఏమైతే నేం -- ఒత్తిడికి లొంగి అర్హత లేనివాడ్ని ఇంటర్వ్యూ కి పిలిచారా లేదా - సుభాష్ కరెక్టుగానే చెప్పడన్నమాట!"
    మోహనమూర్తి ముఖం ఎర్రబడింది -- "నేను ఒత్తిడికి లొంగవచ్చు. అయితే ఇతరుల స్వార్ధానికి తల వంచినట్లు నా స్వార్ధానికి తలవంచను. వీరరాఘవయ్య మాట వినకపోతే నా ఉద్యోగానికేం భంగం రాదు. కష్టమంటూ వుంటే అది మా కాలేజీకి. సుభాష్ కుద్యోగమంటే అది పూర్తిగా నా స్వార్ధానికి సంబంధించిన విషయం."
    'అంటే మీరు ఆ నాగభూషణానికే ఉద్యోగ మిస్తారా?'
    "అవన్నీ నీ కానవసరం. సుభాష్ సుశీల ను పెళ్ళి చేసుకోవాలనుకుంటే -- ఈ ఉద్యోగం విషయం మర్చి పోయి తీరాలి."
    "మీరు చాలా మొండి -- అయితే మీ కూతురికీ మీ పోలికలే వచ్చాయి. ఏం చేస్తారో చూసుకోండి" అంది సావిత్రమ్మ.

                                        8

    "ఏమోయ్ గోపీ కులాసానా?" అన్నాడు వీరరాఘవయ్య.
    "ఏదోనండి -- మీ దయవల్ల " అన్నాడు గోపీ.
    "మా దయేముంది. నువ్వు కులాసాగా వుంటేనే మా వంటి వాళ్ళకు కులాసా" అని స్వరం తగ్గించి -- "నీకు రామేశం గారు తెలుసా?' అన్నాడు.
    "ఏ రామేశం గారండీ?' అన్నాడు గోపీ.
    "ప్రొఫెసర్ రామేశం గారు -- తల్లావర్హ్హుల వారి వీధిలో వుంటున్నారూ-- అయన" అన్నాడు వీరరాఘవయ్య.
    "తెలుసునండి"అన్నాడు గోపీ.
    "రేపు పద్నాలుగో తారీఖున అయన ఇల్లు కదలకుండా ఆపాలి నువ్వు. ఒకవేళ ఇల్లు కదిలినా అనుకున్న చోటుకు చేరకూడదాయన."
    గోపీ ఆశ్చర్యంగా -- "ఎందుకండీ?' అన్నాడు.
    "పనుందిలే....!" అన్నాడు వీరరాఘవయ్య.
    "పనేమిటో తెలియకుండా పనులోకి దిగితే ఒకోసారి వేడి పుట్టదండి."
    "నీ పని నువ్వు చేయి. వేడి అదే పుడుతుంది..." అన్నాడు వీరరాఘవయ్య. ఆయనకింకేక్కువ  మాట్లాడ్డం ఇష్టం లేనట్లు అర్ధం చేసుకుని గోపీ అక్కణ్ణించి సెలవు తీసుకుని తిన్నగా సుదర్శనం ఇంటికి వెళ్ళాడు.
    అప్పుడు సుదర్శనం ఇంట్లోనే వున్నాడు. గోపీని చూసి ఆప్యాయంగా తన గదిలోకి ఆహ్వానించాడు.
    "నీకు నచ్చని కబురొకటి తెచ్చాను .." అన్నాడు గోపీ.
    "ఏమిటది?" అన్నాడు సుదర్శనం కంగారుగా.
    "సుభాష్ ని నేను బెదిరించాను. అతడికా బెదిరింపు చాలని నేననుకుంటున్నాను. కానీ ఇంటర్వ్యూ రోజు వచ్చేసరికి అతడిలో వేడి పుట్టవచ్చు. ఆరోజు కతడిక్కాపలా కాద్దామా అనుకున్నాను. కానీ ఆరోజు నే నాకింకో పని తగిలింది...."
    "ఏమిటది?"
    "అది నువ్వడక్కూడదు , నేను చెప్పకూడదు. నన్ను నమ్మి నాకెందరో ఎన్నో రకాల పనులు చెబుతారు. అవన్నీ అందరికీ చెప్పే మాటైతే ఇంక నావల్ల ప్రయోజనమేవారికీ?"
    "చెప్పోద్దులే కానీ -- సుభాష్ ని ఇంటర్వ్యూ కి వెళ్ళకుండా అపలేవా?"
    "ఆపాలంటే ఆ పని ఇంకెవరికైనా అప్పజెప్పాలి. ఇది నీకూ నాకూ మధ్య నున్న రహస్యం. మూడో మనిషికి తెలియడం నా కిష్టం లేదు" అన్నాడు గోపీ.
    'అసలు పని జరక్కపోయినా రహస్యం కాపాడి మాత్రం ఏమి లాభం?' అన్నాడు సుదర్శనం దిగులుగా.
    "ప్రతి నేరానికీ కొన్ని హడ్డులుంటాయి. ఈ ఇంటర్వ్యూ విషయంలో ఇంతకూ మించి చేయడం న్యాయం కాదు. అదృష్టం బాగుంటే అన్నీ నీకు సహకరిస్తాయి..." అన్నాడు గోపీ. ఆ తర్వాత అతడేక్కువ సేపు వుండలేదు.
    గోపీ ఇలా వెళ్ళగానే అలా వచ్చాడు ఆనందరావు . అతడి ముఖంలో ఆత్రుత వుంది.
    "ఏమిటి విశేషం?' అని సుదర్శనం ఆనందరావు పలకరించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS