"ఒప్పుకోను. బాకీ ఇలా చెల్లగోట్టడానికి వీల్లేదు -- అన్నాడు శర్మ.
శర్మ మళ్ళీ బాకీ ఊసెత్తగానే అప్పారావుకు కోపం వచ్చింది. తనేవ్వరికీ బాకీ లేననీ మరోమారు బాకీంటే మర్యాద దక్కదనీ అతను తీవ్రంగా హెచ్చరించాడు. అయినా శాస్త్రి , శర్మ మానలేదు. అప్పుడు అప్పారావు చిరునవ్వు నవ్వి -- "పక్కింట్లో జంబులింగం వున్నాడు. నా బాకీ గురించి ఆయనతో ఓ పది నిముషాలు మాట్లాడండి. ఇక్కడేం జరిగిందో ఆయనకు చెప్పడం మర్చిపోకండి. ఆ తర్వాత మీకింకా సరదాగా వుంటే నా దగ్గరకొద్దురు గాని , ప్రస్తుతానికి వెళ్ళండి--" అన్నాడు.
శాస్త్రి, శర్మ జంబులింగం ఇంటికి వెళ్ళారు.
జంబులింగం సన్నగా ఊచలా వున్నాడు. మాట్లాడుతుంటే దగ్గుతాడేమోనని అనుమానం వస్తుంది. కానీ దగ్గడు. వంటికి తగ్గట్టే పిట్ట మొహం. మొహానికి తగ్గట్లే గుడ్లగూబ కళ్ళు.
"మీరు అప్పారావుగారితో దెబ్బలాడి వచ్చారా?' అనడిగాడు జంబులింగం కాస్త చిరాగ్గా.
"మీకెలా తెలుసు?" శర్మ ఆశ్చర్యంగా అడిగాడు.
"తనతో దెబ్బలాడిన వాళ్ళనే అయన నా యింటికి పంపుతాడు...." అన్నాడు జంబులింగం.
"నువ్వు ఆయనకంటే మొనగాడివా?" అన్నాడు శర్మ.
"అబ్బే-- అదేం కాదు. మా యింట్లోకి పరీక్షించి చూడండి. వీధిలో అన్ని దోమలూ, ఈగలూ వున్నాయి గదా -- మా యింట్లో ఎక్కడైనా ఒక్క ఈగైనా దోమైనా ఉన్నదేమో చూడండి--" అన్నాడు జంబులింగం.
శర్మ, శాస్త్రి కాస్త తీరుబడి గానే పరీక్షించారు. ఇంట్లో ఎక్కడా ఈగలు, దోమలు మచ్చుకి కూడా లేవు.
"అప్పారావు మా యింట్లోకి ఈగనూ, దోమనూ కూడా రానివ్వను. అది అయన గొప్పతనం. అయన నీడలో నేను చాలా సుఖపడుతున్నాను. ఆయనకు తన్ను తానూ పొగడుకొనడం ఇష్టముండదు, లేకపోతే తన గురించి తనే చెప్పుకోవాచ్చు. ఆయన్ను పొగడాలంటే ఆదిశేషుడి వేయి నాల్కలూ చాలవు. నా నాలికే పాటిది?" అన్నాడు జంబులింగం పరవశంగా.
శాస్త్రి చిరాగ్గా -- "నీ చిన్న మొహంలో నాలిక కూడా వుందా ?" అన్నాడు.
జంబులింగం మొహం చిట్లించి -- "వేళాకోళంగా వుందా -- నాకు అప్పారావు రక్షణ వున్నది--" అన్నాడు.
'అప్పారావు రక్షణ నీకు కలకాలం కావాలంటే -- అతణ్ణి నువ్వు రక్షించుకోవాల్సి వుంది . మర్యాదగా మా బాకీ తీర్చేయమని అతడికి చెప్పు --" అన్నాడు శాస్త్రి.
జంబులింగం కోపంగా -- "కోపం వస్తే అప్పారావు పచ్చి రక్తం తాగుతాడు తెలుసా?" అన్నాడు.
"కోపం రాకపోయినా మా రక్తం పచ్చిగా వుండదు. అప్పుడప్పుడూ వేడిగా సలసల మరుగుతూ వుంటుందని అప్పారావుకు చెప్పు--" అన్నాడు శర్మ.
జంబులింగం ఇద్దరి వంకా అదోలా చూసి -- "మీ ధైర్యం చూస్తె మీకు కరాటే బాగా వచ్చునన్న అనుమానం కలుగుతోంది. అప్పారావు కూ కరాటే వచ్చు--" అన్నాడు.
"కరాటే వచ్చినా రాకపోయినా అప్పు తీర్చడం వస్తే చాలు ...." అన్నాడు శాస్త్రి.
"మీరిక్కడే వుండండి -- అంటూ జంబులింగం ఓసారి పక్కింటి కెళ్ళి అప్పరావుని కలుసుకుని మాట్లాడి వచ్చాడు. వెళ్ళేటప్పుడు నిరుత్సాహంగా వున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు హుషారుగా వున్నాడు.
"అప్పారావుగారు మిమ్మల్ని మళ్ళీ కలవడానికి భయపడుతున్నారు. ఆయనకు సరసరాజు గారు యాభై వెలివ్వాలి. అయన ఇవ్వడం లేదుట. ఆ యాభై వేలు మీరు వసూలు చేసి తేగలిగితే అందులోంచి మీ పాతికవేలూ ఇచ్చేస్తారుట. నరసరాజు గారి దగ్గర బాకీ వసూలు చేయడం అప్పారావు గారి వల్లే కాలేదట. మీరా బాకీ వసూలు చేసి పెడితే మీ మేలు జన్మకు మర్చిపోలేరుట" అన్నాడు జంబులింగం.
మిత్రులిద్దరూ ముందు తటపటాయించి నా తర్వాత అంగీకరించి నరసరాజు వివరాలు తెలుసుకున్నారు.
వారం రోజుల పాటు వారికి ఘనమైన ఆతిధ్యమిచ్చే బాధ్యత జంబులింగం తీసుకున్నాడు.
3
ఇంటిదగ్గర అరుగు మీద కుర్చీలో ఓ మీసాల వ్యక్తీ కూర్చుని వున్నాడు. శాస్త్రి, శర్మ అడ్రస్ చూసుకుంటూ ఆ యింటిని సమీపించి ఆ వ్యక్తిని చూసి -- 'అయ్యా నరసరాజు గారంటే తమరేనా?" అన్నాడు.
సమాధానం గా ఆ వ్యక్తీ పులిలా ఘాడ్రించి - "నేను నరసరాజు నేనెలా అవుతాను? అయన నా అన్నగారు. నేను పులిలా ఘండ్రిస్తే అయన సింహం లా ఘర్జిస్తాడు--" అన్నాడు.
"మేమోసారి ఆయన్ను కలుసుకోవాలి?" అన్నాడు శాస్త్రి.
"ఎవరిని చెప్పమంటారు?" అంటూ నరసరాజు తమ్ముడు లేచాడు.
"సర్కస్ వాళ్ళని చెప్పండి ...." అంటూ శాస్త్రి శర్మ మేట్లేక్కారు.
నరసరాజు తమ్ముడు లోపలకు వెళ్ళి కొంతసేపటికి ఓ వ్యక్తితో వీధిలోకి వచ్చాడు. అప్పటికి శాస్త్రి, శర్మ అరుగు మీద స్థిరపడ్డారు.
"నాపేరే నరసరాజు. మాములుగా అయితే మిమ్మల్ని లోపలకు పిలిచి వుండేవాడ్నీ. కానీ మర్యాద తెలీనివాళ్ళను నేను వీధిలోనే కలుసుకుంటాను...." అన్నాడు నరసరాజు.
"నమస్కారమండి. పెద్దమనుశులకు అప్పిచ్చి అడగడం మర్యాదకాదని నాకూ తెలుసు. కానీ అప్పుచ్చుకుని అడిగించుకునే వాడు పెద్ద మనిషి అనిపించుకుంటాడంటారా?" మర్యాద ప్రస్తావన ఎలాగూ తెచ్చారు కాబట్టి అదే చూపించి -- అప్పారావు గారికివ్వాల్సిన యాభై వేలూ ఇచ్చేయండి--"అన్నాడు శాస్త్రి.
"ఓహ్ -- మిమ్మల్ని అప్పారావు పంపాడా? ఆ మాట ముందుగా చెప్పలేదేం? లోపలకు రండి డబ్బిచ్చేస్తాను..." అన్నాడు నరసరాజు. అయన ముఖంలోని కోపం మాయమైపోయింది.
శాస్త్రి, శర్మ ముఖముఖాలు చూసుకుని తమలో గుసగుస లాడుకున్నారు. ఇదేదో దొంగ నాటకంలాగున్నదని వారిద్దరికీ అనుమానం వచ్చింది. అయితే ఏం రోట్లో తలదూర్చడం తమకు కొత్తకాదు కాబట్టి ధైర్యం చేసి ఇద్దరూ లోపలకు వెళ్ళారు. నరసరాజు వాళ్ళిద్దర్నీ ఓ గదిలోకి తీసుకు వెళ్ళి కుర్చీల్లో కూర్చో బెట్టి మర్యాద చేసాడు. వాళ్ళకు కాస్త దూరంగా తను ఓ కుర్చీలో కూర్చుని --"మీకు ఎంత ఇవ్వాలన్నారు?" అన్నాడు.
"యాభై వేలు--" వినయంగా అన్నాడు శాస్త్రి.
"తమ్ముడూ -- సరిగ్గా యాభై వేలుట లెక్క చూసి పట్రా -- " అన్నాడు నరసరావు గట్టిగా. గది బయట నుంచి-- అలాగే అన్నయ్యా -- అని వినబడింది. మరుక్షణం లో శాస్త్రి శర్మ ల చేతులు , కాళ్ళు కుర్చీకి కట్టుబడి పోయాయి. మిత్రులిద్దరిలో ఒక్కసారిగా --" మోసం!" అని అరిచారు.
"తమ్ముడూ -- మోసం అంటే ఏమిటో ఒక్కసారి చూపించు ...." అంటూ నరసరాజు గట్టిగా అరిచాడు. అలాగే అన్నయ్యా -- అని గది బయట నుంచి వినబడింది. మరుక్షణం ఇద్దరి కుర్చీలూ గిరగిరా తిరగసాగాయి. అలా చాలా వేగంగా తిరుగుతున్నాయవి. నరసరాజు ఆ దృశ్యం చూస్తూ విరగబడి నవ్వసాగాడు. అయన నవ్వుతుంటే సింహం గర్జించినట్లుంది.
'అపు తమ్ముడూ!" అంటూ అరిచాడు నరసరాజు . కుర్చీలు తిరగడం ఆగిపోయింది.
"సర్కస్ ఎలాగుంది?" అన్నాడు నరసరాజు వాళ్ళ వైపు చూసి నవ్వుతూ, అయితే శాస్త్రి, శర్మ సమాధానం ఇచ్చే పొజిషన్లో లేరు. వాళ్ళకు ప్రపంచమంతా ఇంకా గిర్రున తిరిగుతున్నట్లే వుంది. వాళ్ళు మామూలు స్థితికి చేరుకోనడానికి కొంచెం సేపు పట్టింది. నరసరాజు ఓపిగ్గా వాళ్ళు తెరుకునేదాకా ఆగి - "సర్కస్ ఎలావుంది?' అని మళ్ళీ అడిగి-- సింహా గర్జన చేశాడు. అంటే నవ్వేడన్నమాట!
"సర్కస్ వాళ్ళు జంతువులకు శిక్షణ ఇచ్చేటప్పుడు అన్నీ ముందు తామే చేసి చూపిస్తారు. మేమూ అదే చేశాం. అంతే!" అన్నాడు శాస్త్రి.
సరసరాజు ఆశ్చర్యంగా వాళ్ళిద్దరి వంకా చూసి "మీధైర్యాన్ని మెచ్చుకోవాలి!"అన్నాడు.
"ధైర్యవంతులు కాబట్టే ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కుంటాం. ఎవర్నీ ఎందులోనూ మోసం చెయ్యం. అందువల్ల దేవుడు ఎప్పుడూ మా పక్షాన్నే ఉంటాడు-" అన్నాడు శర్మ.
"సరే -- మీచేత మళ్ళీ సర్కస్ చేయించాల్సి వుంటుంది. కానీ అవతల నాకింకా పనులున్నాయి గదా - అందాకా రెస్టు తీసుకోండి-" అంటూ నరసరాజు గది లోంచి వెళ్ళిపోయాడు. నరసరాజు ఆ గదిలోంచి వెళ్ళిపోయాక మళ్ళీ రెండు రోజుల వరకూ ఎవరూ అక్కడ అడుగు పెట్టలేదు. శాస్త్రి, శర్మ ఇద్దరికీ తినడానికి తిండి లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు.
"ఇలా తిండి, తిప్పలూ లేకుండా పడి చావదల్చుకుంటే మన రూములో నే ఆ పని చేయాల్సింది. అనవసరంగా ఇంత దూరం వచ్చాం. రూములో అయితే కాళ్ళూ, చేతులూ కదపడాని కుండేది. ఇక్కడ అదీ లేదు...."అన్నాడు శర్మ.
