Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 26


    'వారు నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటున్నారత్తయ్యా-- ఇంక యే సరదాలు స్నేహితులూ లేకుండా ఇరవై నాలుగ్గంట లూ నాతోడిదే లోకంగా గడపాలని నేను మాత్రం ఎలా అనుకుంటాను? ఈ ఇంట్లో నాకే కోరతా లేదు. నన్ను గురించి మీరు దిగులు పడకండి.' అంటూ అత్తగారికే ధైర్యం చెప్పేది కోడలు.
    ఆ మాటల్లో నిజం లేకపోలేదు -- పెళ్లి అయిన కొత్తలో బయట యెలా వున్నా ఇంట్లో వున్న కాస్సేపూ భార్యతో సరదాగా సంతోషంగా కాలం గడిపేవాడు లక్ష్మీ పతి-- కాలం గడుస్తున్న కొద్దీ పై సరదాలూ కాలక్షేపాలు మితి మీరటం, ఇంట్లో భార్య అంటే నిర్లక్ష్యం అధికం కావటం ప్రారంభమయింది-- అనురాగాలూ, అభిమానాలూ కోరవడినా పదేళ్ళు గడిచే సరికి ఆరుగురు బిడ్డల తల్లి మాత్రం అయింది తాయారు --   ఆ సంవత్సరమే లక్ష్మీ పతి తల్లీ తండ్రి చనిపోయారు. ఆస్తి అంతా పూర్తిగా అతని స్వాధీనం లోకి వచ్చేసింది -- ఇంక అతనికి అడ్డేముంది? నెలలు నిండి వున్న భార్యని, అయిదుగురు పిల్లల్ని వదిలేసి ఏ రెండు మూడు వేలో పట్టుకుని ఏ మద్రాసో , బెంగుళూరో వెళ్ళాడంటే పది రోజులు తిరిగేసరికి వట్టి చేతులతో తిరిగి వచ్చేవాడు.
    'ఈ సమయంలో ఇలా రోజుల తరబడి వూళ్ళో కూడా లేకుండా వెళ్ళిపోతే ఎలా.... పసిపిల్లలతో ఆడదాన్ని ఒక్కర్తీనీ వుండాలి....ఏ సమయంలో ఎలాంటి అవసరం వస్తుందో....' అని చెప్తున్న భార్య మాటలని పూర్తిగా వినకుండానే,
    'పురిటి రోజులు దగ్గర కు వస్తున్నాయని పిస్తే-- మీ అమ్మని పిలుచుకొ సాయంగా వుంటుంది-- ఇంక మంత్రసానీ , నర్సులూ , డాక్టరూ ఆసుపత్రి వుండనే వున్నాయి . నేను లేకపోతె మాత్రం భయం ఏమిటి' అని సమాధానం చెప్పాడు.
    అన్నంత పనీ చేశాడు కూడా. ఆరో బిడ్డ  పుట్టే నాటికి అతడు వూళ్ళోనే లేడు. ఇంట్లో విషయాలన్నీ తాయారు తల్లి చూసుకుంటే, మంత్రసానీ కి కబురు పంపటానికీ దానికీ ఇరుగుపొరుగు ఆదుకున్నారు.
    పురుడు వచ్చిన నాలుగో నాడు మధ్యాహ్నం ఊడి పడ్డాడు లక్ష్మీ పతి-- ఆల్లుడ్ని చూస్తుంటే అరికాలి మంట నెత్తి కేక్కుతున్నా, కూతురు అదివరకే పదేపదే చెప్పి బ్రతిమాలుకోటం వల్ల అల్లుడి ప్రవర్తనని పట్టించుకోనట్లే వుండి పోయింది తాయారు తల్లి-- ఈ ఖబురూ ఆ ఖబురూ చెప్తూ సాయంకాలం దాకా ఇంట్లో నే వున్నాడు లక్ష్మీ పతి-- సాయంకాలం స్నానం చేసి, తెల్లటి గ్లాస్కో పంచా, లాల్చీ వేసుకుని, జేబు నిండా ఇన్ని రూపాయిల నోట్లు కుక్కుకుని , చేతిలో సిగరెట్టు టిన్ను విలాసంగా పట్టుకుని చెప్పులేసుకుని వీధిలోకి వెళ్ళినతను భోజనాల వేళ దాటిపోయినా తిరిగి రాలేదు.
    'ఏమిటమ్మా ఈ వరస' అంటున్నతల్లితో,
    'ఏ క్లబ్బు లోనో, ఏ స్నేహితుడి ఇంటి లోనో పేకాట పెట్టుక్కూర్చున్నారేమో ఇంక ఆ ఆటలో పడితే టైము ధ్యాస వుండదు. ఆయనకిది అలవాటేగా-- పిల్లలకి పెట్టేసి, నువ్వూ అన్నం తినేసి పడుకోండి-- అయన వచ్చినప్పుడు తలుపు తియ్యొచ్చు.' అంది తాయారు లోపల బాధ పడుతూనే.
    అతను రాలేదు. రాత్రి గడిచిపోయింది 'ఇంక నైనా ఇతనికి ఇల్లు జ్ఞాపకం వస్తే బాగుండును' అనుకుంటున్న ముసలావిడ కి ఇరుగు పొరుగూ వో వార్త పట్టుకొచ్చారు.
    నిన్న వూరి నుంఛి వస్తూ వస్తూ వో బోగం దాన్ని వెంట పెట్టుకు వచ్చాడట. అసలు ఇదంతా ముందే ప్లాను చేసుకుని వున్నాడేమో -- ఊరికి వెళ్ళే ముందే ఆ సూరయ్య కొత్త డాబా అద్దెకు తీసుకున్నాడ ట-- రాగానే దాన్ని అందులో దింపాడట-- నిన్ననే చూచాయగా ఒకరిద్దరికి తెలిసినా అందులో నిజం ఎంతో అబద్దం ఎంతో అన్నట్లు వూరుకున్నారు. తెల్లవారింది -- ఊళ్ళో ఎవరి నోట విన్నా ఇదే మాట-- 'ఇంట్లో మహాలక్ష్మీ లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని....అయ్యో , ఇదేం విడ్డూరం' అంటూ ముక్కు మీద వేలు వేసుకున్నారు.
    కొయ్యబారి పోయినట్లే కాస్సేపు నిలబడి పోయిన ఆవిడ తరువాత ఎలాగో వాళ్ళని సాగనంపి , కూతురు గదిలోకి వచ్చి భోరుమంది-- సంగతంతా చెప్పి,
    'చివరికి ఎంతకీ తెగించాడో చూశావా ....అసలా మహమ్మారి ఎన్నాళ్ళ యి ఇతన్ని పట్టుకుందో చివరికి ఇవాళ వచ్చి ఇంటి మీదే తిష్ట వేసింది-- నువ్వు ఎలా భరిస్తావే ఈ గుండెల మీద కుంపటిని-- డబ్బు వుంది , ఆస్తి వుంది, ఎంతో సుఖపదతావు అంటూ మురిసి పోతూ ఈ సంబంధం చేశాను-- చివరికి నిన్నీ గతికి తీసుకోచ్చాడా -- ' అంటూ ఆవిడ పైకే రాగాలు తీస్తుంటే , కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకుని లోలోపల కుమిలి పోయింది తాయారు. పిల్లలు బిక్క మొగాలు వేసుకుని నిలబడ్డారు-- సరిగ్గా అలాంటి సమయంలోనే లక్ష్మీ పతి లోపలికి వచ్చాడు ఆ గదిలో దృశ్యం చూస్తుండ గానే అతనికి అంతా అర్ధం అయిపొయింది.
    అల్లుడ్ని చూడగానే ఆవిడ పసివాళ్ళని తీసుకుని బయటికి వచ్చేసింది కళ్ళూ, ముక్కూ తుడుచుకుంటూ.
    'ఏమండీ మేము విన్నది నిజమేనా ,' అంది తాయారు. లక్ల్ష్మీ పతి సంగతి తెలిసి వున్న వూరి వాళ్ళు చిలవలూ, పలవ లూ కల్పించి అలా చెప్పి వుంటారని. అది ఉత్త గాలి కబురని ఏదో ఆశ లాంటిది ఆమె గుండెల్లో పెనుగు లాడుతోంది.
    'అసలు మీరేం విన్నారు?' అని అడగలేదు లక్ష్మీ పతి. అక్కడ వున్న కుర్చీలో తాపీగా కూర్చుంటూ.
    'ఔను, నిజమే,' అన్నాడు.
    'ఈ మనిషికి కట్టుకున్న పెళ్ళాం, కన్న బిడ్డలూ అనే అభిమానం, మమకారం లేనే లేవా-- పదిమంది నవ్వి పోతారనే సిగ్గూ బిడియం అయినా లేవా.' అనుకుంది తాయారు.
    'మీరు ఇన్నాళ్ళూ నాలుగు రోజుల కోసారి పట్నం వెళ్తున్నాను , అంటూ ప్రయాణం అయినా, అక్కడ కాలం ఎలా గడిచినా, కొన్నాళ్ళ కి కాకపోతే కొన్నాళ్ళకయినా మారి తీరుతారు అనే ఆశ వుండేది నాకు...ఇంక ఇప్పుడు నేనూ పిల్లలూ.......'
    'లక్షణంగా వుంటారు.' మధ్యలోనే అందుకుని సమాధానం చెప్పాడు.
    'మరో మనిషిని తీసుకొచ్చి నా కళ్ళ ఎదుటే పెట్టటం మీకేమయినా ధర్మం అనిపిస్తోందా,' ఎంత అణుచుకున్నా అణగని కోపం అసహ్యం తాయారు మాటల్లో వ్యక్తం అయాయి.
    'రత్నాన్ని మన యింటికే తీసుకొచ్చి, నిన్ను తనకి వండి పెట్టమని, మర్యాదలు చెయ్యమని నేనేం అనలేదుగా-- తను ఈ వూళ్ళో నే వుండటానికి వీలులేదు అనటానికి నీకేదో అధికారం ఉందను కోకు- నీ హద్దులలో నువ్వుంటే నీకూ పిల్లలకీ, ఏ లోటూ రానివ్వను.' అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు.
    ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న దానిలా ముసలావిడ మళ్లీ లోపలికి వచ్చి,
    'ఎమన్నాడే తల్లీ పోనీ ఇంత డబ్బు ఇచ్చి దాన్ని ఎక్కడికయినా పంపించేయమనక పోయావా.' అంది-- తాయారు తల అడ్డంగా వూగిస్తూ తనకీ భర్తకీ మధ్య జరిగిన సంభాషణంతా పూసగుచ్చినట్లు చెప్పింది-- అమ్మమ్మ వెంటే గదిలోకి వచ్చిన పెద్ద మనవడు పదేళ్ళ మోహన్ కి పరిస్థితి సరిగ్గా అర్ధం కాకపోయినా, నాన్న ఎవరినొ తీసుకోచ్చారనీ అమ్మ  కోసమే ఇంతగా ఏడుస్తోందని అనిపించి, 'ఆ రాక్షసి ని , నేను కత్తి పెట్టి చంపి పారేస్తాను?' అన్నాడు కసిగా పిడికిళ్ళు బిగించి.
    'దాన్ని చంపటం మాట దేవుడేరుగు....మీరయినా మీ అమ్మని కాస్త అభిమానంగా చూసుకోండి-- అది ఇంక మీ కోసమే ప్రాణాలతో బ్రతికి వుంటుంది.' అంది ముసలావిడ మోహన్ ని దగ్గరకు తీసుకుని, కళ్ళు వట్టుకుంటూ.
    తరువాత రెండు నెలలు వుండి ఆవిడ వూరికి వెళ్ళిపోయింది --
    ఇంట్లో తాయారూ, పిల్లలూ మిగిలారు--లక్ష్మీ పతి ఇష్టం అయిననాడు ఇంటికి వస్తాడు లేనినాడు ఆ రత్నం అదే రాజారత్నం ఇంట్లోనే వుండి పోతాడు-- బుద్ది కుదిరితే భార్య చేతి వంట తిని వెళ్తాడు. లేకపోతె స్నానం భోజనం అన్నీ దాని యింట్లోనే --
    అదివరకు లా తరచు వూరి ప్రయాణాలు పెట్టుకోటం లేదు, కాగా బొత్తిగా తీరిక అన్నది లేనట్లు, ఏదో భారమైన పని నెత్తి మీద పెట్టుకున్నట్లు హడావిడి పడిపోతున్నాడు. అతని ఈ హడావిడి అంతా ఏమిటో, డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఎలా ఖర్చయి పోతోందో తాయారు కి తెలియలేదు మొదట--
    వో రోజు, 'నాన్నగారు ఇంకో కొత్త మేడ కట్టిస్తున్నారుటమ్మా-- మా స్కూల్లో పిల్లలు చెప్పారు.' అని మోహన్ అనేసరికి తాయారు కి  అంతా అర్ధం అయింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. 'అలాగా బాబూ, సరే నువ్వెళ్ళి ఆదుకో' అంటూ వాడ్ని పంపించేసింది.
    చూస్తుండగానే రెండతస్తుల మేడ తయారయి పోయింది-- ఆ వేసంగుల లోనే లక్ష్మీ పతి రాజరత్నాన్ని తీసుకుని ఊటీ వెళ్లి వచ్చాడు.
    ఇంత బాహాటంగా , విచ్చల విడిగా జరుగుతున్న అతని చర్యలన్నీ ఎవరో ఒకరి ద్వారా తాయారుకీ పిల్లలకీ అందుతూండేవి . వాళ్ళు అమాయకంగా తల్లితో  మళ్లీ అదే విషయం మాట్లాడబోయే సరికి తాయారు ఏదో మిష మీద వాళ్ళని అవతలకి పంపేసి తను గుండెలు పగిలేలా ఏడ్చేది చాటుగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS