"ఆమె నా మాటలు నమ్మిందో, లేదో తెలియదు, కానీ వెంటనే అయితే నేనూ నీ మరదలితో యుద్ధంచేసి చంపేస్తానంది."
కుసుమ కోపంగా-"అంత మాటంటే నువ్వేం జవాబిచ్చావు?" అంది.
లలిత మాటలకు నవ్వాను నేను. అయితే లలిత తన మాటలను వేళాకోళంగా తీసిపారేయవద్దని కోరింది. తను నిజంగా నన్ను ప్రేమిస్తున్నాననీ నీతో ద్వంద్వయుద్ధం చేయడానికి తను సిద్దమనీ పదే పదే చెప్పింది. చిట్టచివరకు అంగీకరించి ఇక్కడకు తీసుకొచ్చాను నిన్ను."
"అంటే?"
"ఇది మనకు అచ్చివచ్చినచోటు. నువ్వు ద్వంద్వ యుద్దంలో లలితను చంపేసేయ్. వెంటనే మన వివాహం జరుగుతుంది."
కుసుమకు నోట మాట రాలేదు.
"వధువుగా నీకెన్ని అర్హతలున్నాయో. వరుడుగా నాకూ అన్ని అర్హతలున్నాయి. నీకోసం నేను ద్వంద్వ యుద్ధం చేసినప్పుడు నాకోసం నువ్వు మాత్రం ఎందుకు చేయవు? అదిగో అటు చూడు. లలిత వస్తోంది యుద్దానికి సిద్దంగా...." అన్నాడు గణపతి.
"బావా-ఇంత దుర్మార్గానికి తలపడతావని నేనెన్నడూ అనుకోలేదు" అంది కుసుమ యించుమించు ఏడుపు కంఠంతో.
"ఇందులో దుర్మార్గమేముంది? నువ్వు చేసిందే నేనూ చేస్తున్నాను" అన్నాడు గణపతి.
అంతలో ఒక అమ్మాయి అక్కడకు వచ్చి నిలబడి "హాయ్ గణపతీ! కుసుమ అంటే ఈమేనా? చాలా బలహీనంగా వుంది. అయిదు నిముషాలు చాలేమో నాకు....." అంది.
"బావా-మనం వెనక్కు వెళ్ళిపోదాం....." అంది కుసుమ.
"లలితా-నువ్వేమంటావ్?" అన్నాడు గణపతి.
సమాధానంగా లలిత గణపతికో విజిల్ అందించింది.
"ఇక్కడింక ఎవరికీ బావలు లేరు. గణపతి మనకు రిఫరీ. అతను విజిల్ వూదగానే మనం యుద్దానికి తయార్. రెడీగా వుండు కుసుమా!" అంది లలిత.
"బావా!" అంది ఏడుపు కంఠంతో కుసుమ.
"వెళ్ళు కుసుమా! నీది నిజమైన ప్రేమ అయితే నువ్వే జయిస్తావు. నా ఆశీర్వచనం నీకెప్పుడూ వుంటుంది...." అన్నాడు గణపతి.
లలిత కుసుమ చేయి పట్టుకుని మధ్యకు లాగింది. ఇద్దరూ సరిగా నిలబడగా చూసి విజిల్ వేశాడు గణపతి. విజిల్ వేయడం కాగానే లలిత చేయిసాచి కుసుమ చేయి అందుకుని బలంగా లాగింది. కుసుమ ఆ విసురుకు తట్టుకోలేక పడిపోయింది.
"పడిపోయిన వాళ్ళమీద చేయి చేసుకోను నేను. లే త్వరగా లే...." అంటూ చేతులతో సౌంజ్ఞ చేసింది లలిత.
కుసుమ త్వరగా లేచింది. విసురుగా లలిత మీదకు వెళ్ళింది. కానీ లలిత ఆమె భుజంమీద కొట్టిన దెబ్బకు నవనాడులా కృంగిపోయినట్లయి మళ్ళీ నేలమీద పడిపోయింది.
"ఇద్దరిలో ఎవరో ఒకరే మిగలాలి. ఊఁక్విక్.....త్వరగా...." అంటున్నాడు గణపతి.
లలిత, కుసుమ పోరాటంలో జోరు హెచ్చయింది. ఆరితేరిన వస్తాదులా లలిత, కుసుమను చావగొట్టేస్తూంది. ఒళ్ళు హూనమైపోతోంది కుసుమకు. ఆఖరికి ఆమె బాధ భరించలేక రెండు చేతులూ ఎత్తి లలితకు నమస్కరించి "నన్ను వదిలేసేయ్......నీ పేరు చెప్పుకుంటాను" అంది.
"ఏం చేయమంటావ్ గణపతీ!" అనడిగింది లలిత.
ఏ పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దనీ ఆమె అంతం చూడమనీ చెప్పాడు గణపతి. హత్య చేయడం తనకిష్టంలేదని లలిత అన్నా అతను వినలేదు. అతని మాటలకు ఇంక తప్పదన్నట్లుగా లలిత కుసుమ మెడచుట్టూ చేతులు బిగించింది. అవి బలంగా బిగుసుకుంటున్నాయి.
కుసుమ కళ్ళలో ప్రాణభీతి స్పష్టంగా చూసింది లలిత. మనసొప్పక పట్టు సడలించింది.
"బావా-నన్ను రక్షించు" అని సర్వశక్తులూ కూడ గట్టుకుని అరిచింది కుసుమ.
"అయాం సారీ కుసుమా! ఇందులో నేను కలగజేసుకోను...." అన్నాడు గణపతి.
లలిత. కుసుమ వంక జాలిగా చూసి "నిన్ను చూస్తే నాకు జాలి వేస్తోంది. ఒక చిన్న అవకాశమిస్తున్నాను. ఒక్క నిమిషం టైమిస్తున్నాను నీకు. నీ ఇష్టం పరుగెత్తుకుని పారిపో. సరిగ్గా నిమిషం అవగానే నేను వస్తాను నిన్ను తరుముకుంటూ దొరికాక ప్రాణాలు తీయకుండా వదలను" అంది.
కుసుమకు గత్యంతరం కనబడలేదు. ఆమె లేచి శక్తి కొద్దీ పరుగెడుతోంది. వంట్లో శక్తిలేదు. కానీ ప్రాణభీతితో పరుగెడుతోందామె. మధ్య మధ్య చీర కాళ్ళకు అడ్డుపడిపోతోంది. అప్పుడప్పుడు వెనక్కు చూసుకుంటోంది.
ఎక్కడకు పరుగెత్తాలో ఏం చేయాలో ఎవరి సాయం కోరాలో కూడా ఆమెకుతెలియదు. అయినా పరుగెడుతోంది.
లలిత ఒక నిమిషం గడవగానే లేడిపిల్లలా పరుగెత్తింది. ఆమెకు కుసుమకు అందుకోవడం చాలా సులభమని గ్రహించిన గణపతి తను కూడా లేచి ఆమె వెనుకనే పరుగెత్తాడు. అయిదు నిముషాల పరుగులో లలిత, కుసుమను అందుకుంది. లలిత తనను బలంగా పట్టుకున్న అనుభూతి కలగగానే కుసుమ కెవ్వుమని అరచికుప్పలా కూలిపోయింది.
6
కుసుమ కళ్ళు తెరచి చూసేసరికి గణపతి ముఖం కనిపించింది. అతని కళ్ళలోంచి ఆప్యాయత కురుస్తోంది.
"నన్ను క్షమించు కుసుమా! నీ జబ్బుకింతకంటే మంచి చికిత్స నాకు కనపడలేదు. చిన్నతనంనుంచీ ఏ కష్టమూ ఎరక్కుండా అల్లారుముద్దుగా పెరిగిన నీహృదయం ఎందువల్లనో పాషాణప్రాయంగా వుంది. ఎందువల్లనో ప్రాణపు విలువని నీ మెదడు అంచనా వేయలేకపోతోంది. స్వానుభవం మినహా నీ కర్కశత్వాన్నిమార్చే గత్యంతరం లేదని నాకు తోచింది. విఠల్ ని నేను చంపలేదు. కానీ అతన్ని చంపి వుంటే ఆ క్షణంలో అతని మెదడు లోనైన అనుభూతులేమిటో ఈ రోజు నీకు తెలిసివుంటుంది. ఇక కర్కశంగా వుండడం జీవితంలో నీకు అసాధ్యం."
అతని మాటలకు అవునన్నట్లుగా తలాడించింది కుసుమ.
"నిన్ను నేను ప్రేమిస్తున్నాను. సంసార జీవితం ఇద్దరు మనుషులు గడపవలసింది. అనుకూలంగా లేక పోతే అది అనుమానమూ ద్వంద్వయుద్ధంగా తయారవుతుంది. అది తప్పించడం కోసమే ఈ రోజు నిన్ను కష్టపెట్టవలసి వచ్చింది. నన్ను క్షమించగలవా కుసుమా?"
"అయితే లలితా.....?" అని ఆగింది కుసుమ.
"నాకు సహాయపడిన వ్యక్తి. అంతే!"
"బావా-నన్ను క్షమించవూ?" అంది కుసుమ.
ఆమె హృదయంలోని మార్పు తెలుసుకునేందుకీ మాట చాలు.
ఓ పదిహేను నిమిషాల అనంతరం లలిత. కుసుమ, గణపతి కలిసి రోడ్డుమీదకు వచ్చేరు. విశాఖపట్నం వూళ్ళోకి పోవడానికేదైనా సాధనం కోసం ఎదురుచూస్తున్నారు వాళ్ళు.
* * *
