Previous Page Next Page 
శంఖారావం పేజి 26


    మైదానంలో ఆశ్చర్యంతో కూడిన నిశ్శబ్దం.
    వారందరూ చూస్తుండగా పద్మం రేకులు విచ్చుకున్నాయి.
    ఒక్కసారిగా మైదానంలో జయజయధ్వానాలు మిన్నుముట్టాయి.
    ఆ పద్మం లో పద్మాసనం వేసుకుని కూర్చున్న అలౌకికానంద స్వామి!
    అయన ముఖంలో దివ్య తేజస్సు .
    స్వామి కనులు తెరిచాడు.
    కొన్ని వేల చెతులోక్కసారిగా భక్తీ భావంతో జోడించబడ్డాయి.
    సీతమ్మ చెంపలు కూడా వేసుకుంది.
    ఉదయ విస్సీ బావ విషయం మర్చిపోయింది.
    కులభూషణ్ పరిసరాలు మర్చిపోయాడు.
    వేదాంతంలో ఉత్కంట పెరుగుతోంది.
    కొందరు యోగులు యోగ విద్యలో మహిమలు చూపించగలరు.
    అలౌకికానందుడిందుకు శాస్త్ర విజ్ఞానాన్నుపయోగించుకుంటున్నాడు.
    ఆ వేదిక ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాల ఆధారంగా ఏర్పర్చబడిందని వేదాంతం అనుకుంటున్నాడు.
    అంటే స్వామి శాస్త్ర విజ్ఞానంలో బాగా ముందున్నాడు.
    అక్కడింకా ఎలాంటి ఏర్పాట్లున్నాయో.
    ఆయనతో తను తలపడగలడా? అంతా తాననుకున్నట్లు జరుగుతుందా?
    అందరూ చూస్తుండగా స్వామి పద్మం లోనే లేచి నిలబడి చేతులెత్తి అందర్నీ ఆశీర్వదించాడు.
    హరహరమహాదేవ
    గోవిందా గోవిందా!
    జై జగన్నాద్! ఇలా రకరకాల పేర్లతో భక్తులు స్వామిని స్తుతించారు. అప్పుడు స్వామితో ప్రత్యెక దర్శనం ప్రారంభమైంది.
    ప్రత్యెక దర్శనమయ్యాక భక్తులు పది మంది ఒక గుంపుగా ఏర్పడి వేదిక మీదకు వెళ్లి ఆయనకు పాదాభివందనం చేసి వెనక మార్గాన బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు తెర మూసి తెరిచే తతంగముండదు. వేలాది భక్తులకు స్వామిని దగ్గర్నుంచి చూశామన్న తృప్తి ఆ విధంగా కలుగుతుంది.
    ప్రత్యెక దర్శనం ప్రారంభమయింది.
    సుమారు వంద మంది భక్తులున్నారు.
    అక్కడ అందరిలోకి పొడుగాటి వ్యక్తీ ఒకడున్నాడు. అతడు అరడుగుగలు పైనే ఉంటాడు. 'అతడు స్వామి అనుచరుడితో మంతనాలాడుతున్నాడు.
    "నేను వీలైనంత ముందుగా వెళ్ళాలి. నా తర్వాత ఆ యువతి స్వామి దర్శనం చేసుకోవాలి- " అంటూ అతడు జలజను అనుచరుడికి చూపించాడు.
    "ఏమిటి విశేషం ?" అన్నాడు అనుచరుడు.
    "నా సమస్యతోనే ఆమె సమస్య ముడిపడి ఉంది. నా సమస్య విడితే తప్ప ఆమె సమస్యను చెప్పుకుని కూడా ప్రయోజన ముండదు'...."
    అనుచరుడు విని ఊరుకున్నాడు.
    "అన్నీ సక్రమంగా జరిగితే స్వామికి లక్ష రూపాయల విరాళం ఇవ్వగలను. నేను స్వామి మీద చాలా ఆశలు పెట్టుకుని వచ్చాను....' అన్నాడా పొడుగు వ్యక్తీ.
    "నాక్కూడా ఏమైనా ప్రయోజన ముంటుందా?" అన్నాడనుచరుడు.
    "ఏం కావాలి నీకు ?"
    "డబ్బు...."
    "యెంత కావాలి?"
    "ప్రస్తుతానికి ఐదు వందలు...."
    పొడుగు వ్యక్తీ అతడికి వెంటనే అయిదు వందలు ఇచ్చి ....." తిరుపతిలో లాగే ఇక్కడ కూడా ఇలాంటిదుందా?" అన్నాడు.
    స్వామి అనుచరుడు నవ్వి -- "ఎక్కడ పాపముందో అక్కడ భక్తీ ఉంటుంది. ఎక్కడ భక్తీ ఉందొ అక్కడ దేవుడుంటాడు. ఎక్కడ దేవుడుంటాడో అక్కడ పాపముంటుంది-' అన్నాడు.
    'అక్షరలక్షలివ్వ దగ్గ మాటన్నావు --" అంటూ పొడుగు వ్యక్తీ అనుచరుణ్ణి మెచ్చుకుని---" నీ దేవుడి పై నీకున్న నమ్మక మేమిటి?" అన్నాడు.
    "నా దేవుడి పై మీకున్న నమ్మాకం -- నాకు జీవనాధారమయింది.....' అన్నాడతడు.
    పొడుగు వ్యక్తీ అనుచరుణ్ణి ప్రత్యేక్షంగా చూడలేదు. చూసి వుంటే అతడి కళ్ళలోని విషాదాన్ని గమనించి వుండేవాడు. ప్రత్యేక దర్శనంలో పోడుగువ్యక్తి మూడవ వాడు. జలజ నాల్గవది.
    మొదటి వ్యక్తీ వేదిక నెక్కాడు. తేర మూసుకుంది.
    మూడు నిమిషాల తర్వాత తెర మళ్ళీ తెరుచుకుంది. అక్కడ స్వామి మాత్రం నిలబడున్నాడు. అప్పుడు రెండో వ్యక్తీ వేదిక ఎక్కాడు. మళ్ళీ తెర మూసుకుంది. మూడు నిమిషాల అనంతరం తెర తెరుచుకోగానే -- మళ్ళీ స్వామీ ఒక్కడే......
    పొడుగు వ్యక్తీ వేదిక ఎక్కాడు.
    "ఎంత పొడుగున్నాడో ?" అంది సీతమ్మ.
    "వాడి పొడుగో లెక్కలోది కాదు. ఈ ప్రపంచంలో ఎనిమిదడుగులు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు...." అన్నాడు వేదాంతం.
    పొడుగు వ్యక్తీ స్వామికి మోకరిల్లాడు.
    తెర మూసుకుంది.
    చూస్తున్న జనాలు కబుర్లు చెప్పుకుంటున్నారు. వారిలో కొందరు జరగనున్న సంచలనం గురించి మాట్లాడుకుంటున్నారు.
    సంచలనం జరుగుతుందా? ఏమిటది?"
    మూడు నిమిషాలు గడిచి పోయింది.
    తెర తెరుచుకోలేదు.
    జనం కబుర్లు చెప్పుకుంటూనే వేదిక వంక చూస్తున్నారు. కొందరు స్వామి ఆకారాన్ని వర్ణిస్తున్నారు. ఆజానుబాహుడు, నల్లని జుత్తు, గెడ్డం లేదు. మీసం లేదు. ముఖం చూస్తె పాతికేళ్ళ యువకుడిలాగున్నాడు తప్ప -- నూటయాభై ఏళ్ళ మనిషిలా లేడు. మహానుభావుడు. ఆ ముఖంలో ఎంత తేజస్సు !" అంటున్నాడోకాయన.
    అయిదు నిమిషాలు గడిచాయి. ఇంకా తెర విడలేదు.
    కొందరు భక్తులు అలౌకికానందుడి పై భజన గీతాలు ప్రారంభించారు.
    రాణీ రాణమ్మ పాట వరుసలో అలౌకికానంద అంటూ పాట ప్రారంభమయ్యేసరికి అందులో ఎన్నో వేల గొంతులు కలిశాయి.
    పది నిమిషాలు గడిచాయి. ఇంకా తెరవిడలేదు.
    "ఇలాగైతే వందమంది భక్తుల ప్రత్యెక దర్శనానికే ఈ రోజంతా సరిపోదు --' అంది ఉదయ.
    "మనిషి పొడుగు కదా -- సమస్య కూడా పొడుగైనదే ఉంటుంది --' అన్నాడు వేదాంతం.
    అప్రయత్నంగా ఉదయ నవ్వింది. ఆ మాటలు విన్న ఇతర భక్తులు కూడా కొందరు నవ్వారు.
    వేదాంతం క్రీగంట ఉదయను చూస్తున్నాడు. ఆమె నవ్వు అతడి గుండెలో పన్నీరు చిలకరించింది.
    ప్రత్యెక దర్శనం క్యూలో జలజకు అసహనం పెచ్చు మీరి పోతోంది.
    ఆమెకు స్వామిపై ఆసక్తి లేదు. త్వరగా ఈ గొడవ పూర్తీ చేసుకుని పోవాలను కుంటోంది.
    ఇటీవల కులభూషణ్ ఆమెకు దూరంగా ఉంటునాడు. కారణం చెప్పడం లేదు. అతడి కోసం ఏమైనా చేయడానికి సిద్దంగా ఉందామె. అందుకే ఇష్టం లేకపోయినా బయల్దేరి వచ్చింది.
    పన్నెండు నిమిషాలు పూర్తయ్యాయి.
    భక్తులు మరో భక్తీ గీతం అందుకున్నారు.
    "చిన్నారి పొన్నారి అనందా --- అలౌకికానందా......"
    స్వాతి ముత్యం పాత కొత్త వరుసలో భక్తిని చిందిస్తోంది.
    వేల గొంతులు పాటలో శృతి కలుపుతున్నాయి.
    పదమూడు నిమిషాలు పూర్తవుతుండగా తెర విడింది.
    అంతా కుతూహలంగా వేదిక పైకి చూశారు.
    స్వామి మందహాస వదనంతో భక్తకోటిని చూస్తున్నాడు.
    జలజకు వేదిక ఎక్కాల్సిన వంతు వచ్చింది.
    ఆమె గుండె వేగంగా కొట్టుకుంది.
    ఇంత వరకూ ఏమీ జరుగలేదు. జరుగుతుందని ఆమెకు వేదాంతం చెప్పాడు. అందులో తన పాత్ర ఉంటుంది.
    ఏమిటి తన పాత్ర?
    తడబడే అడుగులతో ఆమె వేదికను సమీపించింది.
    వేదిక పైకి మెట్లున్నాయి.
    జలజ మెట్లెక్కింది.
    ఇప్పుడామెకు స్వామి దగ్గర్నుంచి కనబడుతున్నాడు.
    నిజంగానే మనిషిలో గొప్ప తేజస్సుంది.
    ఆ ప్రయత్నంగా ఆమె ఆయనకు చేతులు జోడించింది.
    చటుక్కున తెరలు మూసుకున్నాయి.
    భక్త కోటి గొంతెత్తి పాడుతున్నారు.
    స్వామి పద్మం లోంచి బయటకు వచ్చాడు. ఆయనకు పూరేకులు పక్కకు తొలిగి దారినిచ్చాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS