"కృష్ణా! చాల మారిపోయావ్".
"..........................."
"నిన్ను చూడాలనీ, నీకబుర్లు వినాలనీ అంత దూరం నుంచి రెక్కలు కట్టుకు వస్తే ఏమిటీ మవునం?"
"చూశారుకదూ?" కళ్ళు వాల్చుకున్నాను.
"మరి మాట్లాడవ్?"
"మాట్లాడానుకదూ?"
"అలాగా? అలిగావేమో అనుకున్నాను."
"బ్రతిమాలుతారని అనుకొంటే...."
"అలిగేదానివికదూ? ఎందుకంత కంగారు? అలిగి కాళ్ళా వేళ్ళా తిప్పుకొనే కాలం చాలా ఉంది. ఈ మూడునాళ్ళకీ అవన్నీ ఎందుకు చెప్పు? ఇకనిన్నుగాకపోతే ఎవర్ని ప్రాధేయపడతాను వేణూ?
"మరి మీకు మాత్రం అంత కంగారెందుకేమిటి? దూరంగా కూర్చుని మాట్లాడలేరూ?'
"అమ్మో! దూరంగా కూర్చోటానికే ఇంత దూరం వచ్చావా? ఎన్ని చెప్పినా ఆ కబుర్లు మాత్రం చెప్పకు. చెప్పినా వినను" అంటూ నా ఒడిలో తలవుంచుకుపడుకున్నాడు. నేను మాధవ్ మొహంలోకి చూస్తూ నవ్వాను.
"నిజం చెప్పు వేణూ! నన్నుదూరం చేసుకోవాలనే నీకు అనిపిస్తూందా?"
"ఛ! తప్పుకదూ? ఏదో సరదాకంటే ఎందుకంత నిష్ఠూరం? నిన్నే దూరం చేసుకుంటే ఇక నాకు దగ్గిర కావలసిందెవరు?" మాధవ్ జుట్టు మీద చేయివేసి నిమురుతూ-మాధవ్ చూపుల్లో చూపులు కలిపి వుండిపోయాను. ఎందుకో వున్న ట్టుండి మాధవ్ కళ్ళు చెమర్చాయి-" ఎక్కడో దూరాన వెలిగే నక్షత్రపువెలుగు నాజీవితంవరకూ పాకివస్తుందని ఏనాడూ అనుకోలేదు. ఎక్కడి నువ్వు? ఎక్కడి నేను! మనకి స్నేహమేమిటి చెప్పు. ఎక్కడవున్నా నక్షత్రంలా మెరుస్తూనే వుంటావు నువ్వు. నీవెలుగు అందుకోలేనంత దూరాన వుండిపోయాను నేను. కానీ ఈ దౌర్భాగ్యుడంటే నీ కెంతకరుణ వేణూ? ఎందుకింతదగ్గిరవుతున్నావు? అన్నీ ఆలోచించావా? నిన్ను దేవిరించటం తప్ప ఆజ్ఞాపించే హక్కుదారును కాను వేణూ! నిజమాలోచిస్తే నీకూ నాకూ ఎక్కడి సామ్యం? వూరూ పేరూ లేకుండా రాలిపోయె నా బ్రతుకు వంటి బ్రతుకులు చాలా వుంటాయి. వాటికోసం నీవంటి వాళ్ళేది చేసినా త్యాగమే అవుతుంది. కాని నీకయిష్టంగా ......."
"ఏమిటీ వెర్రి మాధవ్? నాకు ఇష్టమే లేని వాడు నీ స్నేహం ఎందుకు చెయ్యాలి? నేను నా స్వార్ధం చూసుకోకుండా త్యాగాలేమీ చెయ్యటం లేదు. నా మనసుకోరే మనిషికోసమే నేనూ పాకులాడుతున్నాను-ఇకనుంచి నువ్వెప్పుడు దౌర్భాగ్యుడినని అనుకోవద్దు. ఇంకా నీకేమిలోటని..."
"లేదు వేణూ! లేదు ఇక నా కెటువంటి లోటూ లేదు. నువ్వు దయామయిని వేణూ! జీవితంలో ఏనాడూ నీపై కృతజ్ఞతా భావం మర్చిపోలేను. నీ సహచర్యంతో నరకం వంటి నా బ్రతుకు నందనవనం చేసుకుంటాను."
కొన్ని నిముషాలు నిశ్శబ్దంగా గడిచాయి.
నేనే అడిగాను- "కాని ఈపని మీ వారందరికీ ఇష్టమవుతుందా?" మాధవ్ నవ్వాడు. "ఎవరికకిష్టమవుతుందో, ఎవరికి కష్టమవుతుందో నాకవసరం లేదే. నాకు కావలసింది నువ్వు. నీతో తప్ప నాకెవరితోనూ ప్రమేయం లేదు. ఎవర్నీ-ఆఖరుకి అమ్మని కూడా లెక్కచెయ్యదల్చుకోలేదు. మన సంగతి లక్ష్మికీ, అమ్మకీ చాలవరకు తెలుసు. నీఫోటో చూపించి-"వదిన" అని చెప్పాను. లక్ష్మితో నిన్న బయల్దేరివస్తున్నప్పుడు కూడా-" కృష్ణవేణిని చూసిరావటానికే వెళ్తున్నానమ్మా! వచ్చే వేసంగితో కాహ్డువు పూర్తి కాగానే మనింటి కొచ్చేస్తుంది" అన్నాను. ఆవిడకి కోపమే వచ్చింది. ఏమిటేమిటో మందలించబోయింది- "నాసుఖం కోరేదానివైతే మాత్రం ఇక ఈ విషయంలో అడ్డు చెప్పకమ్మా!" అని నా అభిప్రాయం నిర్ధారణ గా తెలియజేశాను, ఎంతైనా పెద్దవాళ్ళు కదా? ఏదో తప్పుడుదార్లు తొక్కుతామేమోనని భయపడి వారించబోతారు. కాని మా అమ్మ చాల మంచిది వేణూ! నిన్ను కోడలిగా చూస్తే అన్నీ మర్చిపోతుంది. మనవడు కావాలని గొడవచేస్తుంది.
నేను నవ్వాను-"అలాగా"?
"అలాగా కాదు వేణూ! చదువుకొనే రోజుల్లో ఓసారి కాలేజి డే కి శకుంతల నాటకం వేశాం. అందులో దుష్యంతున్ని నేనే. అదేమిటో భరతుడి తో నటించిన కొద్ది కాలంలోనే చిత్రమైన కోరిక పుట్టుకొచ్చింది. కొడుకంటూ వుంటే భరతుడి వంటి కొడుకే వుండాలని ఆక్షణం నుంచీ నాకదే కోరిక-ఆనాడు స్టేజిమీద నటించాను. ఈ నాడు జీవితరంగంలో నీతో నటించి......."
"కానీ నేను లోకం దృష్టిలో హీరోయిన్ ని కాను. వాంప్ ని".
"నా బ్రతుకే ఒక డిటెక్టివ్ డ్రామా అంతానికి వాంప్ పాత్రధారిణే హీరోయిన్ అవుతుందిలే. కానీ నాకోరిక చెప్పానే. ఎప్పుడు చెప్పు నువ్వు తీర్చేది?"
"నాదేముంది? నువ్వు దుష్యంతుడవైతే సరి, భరతుడే పుడతాడు".
"కాదులే. నువ్వు శకుంతలవే అయితే భరతున్నే కంటావు. మరి నువ్వు శకుంతలవే కదూ?"
నేను సిగ్గుపడ్డాను. మాధవ్ నవ్వి దగ్గిరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు-"ఛ! పోదూ! ఏమిటది?" అన్నాను చిరుకోపంతో.
మాధవ్ నవ్వాడు-"ఉత్తరాల్లో ఏం రాశానో గుర్తుందా? అధరామృతం అంత తేలికగానా? ఆశపెట్టి ఆహ్వానించి చటుక్కున దోసిట్లో మొహందాచుకుంటానన్నావ్ ఏది వారించలేదేం?"
"మర్చిపోయాను మరి" చిన్నగా నవ్వాను.
కాదు. జ్ఞాపకం వున్నా నువ్వేమి చెయ్యలేవు, ఏదో బెట్టుగా వుండాలనుకొంటావు. అది అనుకోటం వరకే. అనుకోటాలకీ-అనుభవాలకీ చాలా దూరం వుంటుంది రాణీ! తెలిసిందా?"
నేను మూతి ముడుచుక్కూర్చున్నాను.
"అలా మూతి ముడుచుకోకు. ముద్దుపెట్టుకోవాలనిపిస్తుంది".
నవ్వు దాచుకోవాలని మొహం తిప్పుకున్నాను.
"నువ్వెంత అందంగా వున్నావో నీకు తెలుసా? క్రిందటి సారి చూసినప్పుడు నాకీ అందాలన్నీ కన్పించలేదెందుకని? గులాబీ రేకులవంటి పెదవులూ అద్దాలవంటి బుగ్గలూ-నున్నని నుదురూ సన్నని గడ్డం- ఆ క్రింద........వింటున్నావా? ఎత్తైన ....."
"ఛ! ఏమిటది? మరీ మితిమీరి పోతున్నావ్"
'అయితే ఇటు తిరిగి కూర్చో".
"నేను తిరగను."
"సరే! అలాగే అంటాను. చూశావ్! అద్దాల వంటి నీ చెక్కిళ్ళలో అన్నీ కన్పిస్తాయటా! కాస్త ఇలా తిరిగితే నన్ను నేను చూసుకుంటాను. అన్నట్టు నీ బుగ్గల్లోనే గులాబీలు పూస్తాయి. కాబోలు వేరే పూలుకొనే బాధలేదు కదూ? యీ అబ్బాయి పెదాలు నా పెదాల్లా మోటుగానే వుండాలిగానీ, నీ పెదాల్లా అలా సన్నసన్న గా ఉంటాయంటే నాకేం నచ్చదు సుమా!..... ఎంత అందమైతే మాత్రం ఆ ముక్కు మరీ అంత సూదిలానా ఎవడు భరించగలడనీ ....
ఫక్కుమని నవ్వేశాను - "ఎంత చిలిపివాడివి మాధవ్!"
"మరి నువ్వుమాత్రం? ఎంత పెంకిదానివి!" మాధవ్ ని నిండుగా గుండెలకి హత్తుకున్నాను. మాధవ్ పసిపాపలా -నాగస్వరాలకు మైమరచిన నాగుపాములా కళ్ళు మూసుకున్నాడు. ఫౌంటెన్ నుంచి చింది పడుతూన్న నీటి తుంపరలు మాధవ్ నొక్కులనిండా పేరుకొంటూంటే తుడుస్తూ కూర్చున్నాను.
సూర్యబింబం పూర్తిగా అదృశ్యమైపోయింది. నక్షత్రాల్లా విచ్చుకొంటూన్న నైట్ క్వీన్ పువ్వుల నుంచి నెమ్మది నెమ్మదిగా సువాసనలు వాతావరణ మంతా అలుముకొంటున్నాయి. పార్కంతా లైట్లు వెలిగాయి కాబోలు ఫౌంటెన్ లో రంగు రంగుల బల్బులు వెలిగాయి. రంగు కాంతుల్లో వుబికి వస్తూన్న నీటిధారలు పూసల తోరణాల్లా మెరిసిపోతున్నాయి - ఏచెట్టు చూసినా ఏపుట్ట చూసినా కొత్త అందమే అనిపించసాగింది.
మాధవ్ తదేకంగా నా మొహంలోకి చూస్తన్నట్టు తెలిసి రాగానే సిగ్గు ముంచుకొచ్చింది. చిన్నగా నవ్వుతూ కళ్ళు దించుకున్నాను-"అందం ఆనందించటానికీ - జీవితం అనుభవించటానికే కదూ కృష్ణా? కాని ఇంతమంది వ్యక్తులనుభవిస్తూన్న ఆనందాలలోనూ, అనుభూతులలోనే ఎన్నో తేడాలుంటాయి. పరిపూర్ణమైన ఆనందాలూ - ప్రపంచాన్ని మరిపించే అనుభూతులూ చాల తక్కువమందికే అనిపిస్తుంది. ఏనాటి నుంచో నామనసు కోరేకోరికలు మొదలంటూ తీరిపోతున్నట్లే భావన కల్గుతూంది కృష్ణవేణీ! ఒక పవిత్రమైన హృదయంలో నాకింత చోటు వుందని అనుకొంటేనే ..."
"ఊఁ ఆగిపోయావేం?"
"ఇక మాటలు దొరకటం లేదు. నువ్వు చెప్తూండు. వింటాను."
"నాకు చేతకావు మరి."
"అభిసారికవి కదా? చెప్పకపోయినా సువాసనలు పూసుకువచ్చావే. మాటలు మాత్రం నేర్చుకోవూ?"
"నేనేమీ పూసుకు రాలేదు. పూలచెట్లలో పవ్వళించామని మర్చిపోయారేమిటి?"
"నీ సన్నిధిలో సర్వం మర్చిపోవచ్చుగానీ నైట్ క్వీన్ కీ, నూర్జహాన్ కీ తేడా తెలీనివాణ్ణి కాదే."
"పోదూ! నీతో నేను మాట్లాడను."
"పోనీ నీతో నేను మాట్లాడతాను - రేపు మీ ఇంటికొస్తాను."
"దేనికి?"
"మాట్లాడనన్నావ్."
"సరేగాని మా ఇంటికేం రానక్కర్లేదు."
"నువ్వేం చెప్పక్కర్లేదు."
"నేను మాత్రం కన్పించను.
"నేనే వెతుక్కొంటూ వస్తాను."
"మొండి మనిషి!" అన్నాను నవ్వి.
"నువ్విలా అంటావుగానీ నేను చాలా మంచి వాడినట. మా అమ్మ అంటుంది" ఇద్దరం నవ్వుకున్నాం.
"నిజంగా రేపు మా ఇంటికి రాకూడదూ?"
"ఒద్ధన్నావుగా?"
"ఈ బెట్టుకేం గానీ, రేపుదయం వస్తే నీతో కలిసి నేనూ వస్తాను. అటే కదా కాలేజీ."
"నేను వచ్చినట్టు రేణుకి తెలుసా?"
"చెప్పలేదు."
"అదేం?"
"దాని కిష్టముండదు మన వ్యవహారం."
"అయితే ముఖ్యంగా ఆవిడని చూడాల్సిందే. దానివల్ల మనకి పోయేదేమీ లేదుగా?"
"రేపు తీసుకొస్తాను. అది నిన్ను చూడటం కూడా మంచిదే." ఏవేవో కబుర్లతోనే మరి కొంతకాలం గడిచిపోయింది.
"చాల చీకటిపడింది. వెళ్దాం" అన్నాను.
మాధవ్ అయిష్టంగానే లేచి నిలబడ్డాడు. నాచేయి పట్టుకు నడక సాగించాడు.
"క్రిందటి సారికీ ఈసారికీ నాలో నీకేం తేడా కన్పించింది?"
"కన్పించేదంతా తేడాయే. క్రిందటిసారి రావు గారిలా-ఈసారి మాధవ్ గారు చూస్తున్నానుకదా?"
పార్క్ లో జన సమ్మర్ధం తగ్గి నిశ్శబ్దత ఆవహిస్తూంది. గేటు సమీపించింది.
"ఓగులాబీ ఇవ్వు. అఘ్రాణిస్తూ కన్ను మూస్తాను హోటల్లో"
"నా దగ్గిరేవీ?" నా తల్లోని గులాబీలు కావు.
"బుగ్గల్లో ఇన్ని వుంచుకొని..." అంటూ బుగ్గ గిల్లాడు. ఏవేవో కబుర్లు చెప్తూ ఇంటి వరకూ వచ్చాడు.
"గుడ్ నైట్" చెప్తూ చెయ్యి వదిలించుకొని కాంపౌండ్ లోకి దారి తీశాడు.
* * *
మర్నాటి వుదయం మాధవ్ ని కొత్త లెక్చరర్ గా పరిచయం చేశాను అన్నయ్యకీ-వదినకీ-అమ్మకీ. అన్నయ్య హాస్పిటల్ కి వెళ్ళే హడావిడిలో వున్నాడేమో-" వస్తాను మాష్టారూ! నేను తొందరగా వెళ్ళాల్సివుంది. మీ శిష్యురాలు వుంది కదా? కాస్సేపు కూర్చొని వెళ్ళండి-ఏమీ అనుకోరుగా" అంటూ లేచి నిలబడ్డాడు.
మాధవ్ నవ్వి - "నౌ. నొ. వెళ్ళిరండి." అన్నాడు. అన్నయ్య వెళ్ళిపోయాక మాధవ్ ని పైకి తీసికెళ్ళాను.
"బావగారుగా పరిచయం చేస్తావనుకున్నాను. ఎందుకలా అబద్దమాడావ్?" అన్నాడు మాధవ్.
"అంత ముచ్చటగా వుంటే మీరే చెప్పుకోలేక పోయారూ?" అన్నాను. మాధవ్ పైన గదులన్నీ చూస్తున్నా ఏదో ఆలోచనలో నిమగ్నమై వున్నట్టు తోచి అడిగాను -"ఏమిటి? అంతగా ఆలోచిస్తున్నారు?"
