37
అరుణ బి.టి కూడా పాసయింది. ఆమె భావి జీవితాన్ని గురించి, రఘు ఒక రకమైన కలలు కంటున్నాడు! సేతుపతి మరో విధమైన కలలు కంటున్నారు!
ఒక పదెకరాల స్థలం కొనడం, అందులో ఒక ఉద్యావనం పెంచడం, ఆ తోట మద్యని ఒక బ్రహ్మాండ మైన కట్టడం కట్టడం ; దానికి చాచా నెహ్రూ మంటేస్సోరీ విద్యాలయం అని పేరు పెట్టడం ; అరుణను ప్రధాన ఉపాధ్యాయిని గా అక్కడ నెలకొల్పడం ; తమ సంస్థల్లోని వర్కర్ల పిల్లలందరి కీ ఎస్. ఎస్. ఎల్.సి వరకూ అత్యాధునిక పద్దతులో, అక్కడ చదువు చెప్పించడం; చదువు రాని వర్కర్ల కు, వారి కుటుంబం లోని పెద్దలకూ అక్కడే నైట్ స్కూల్ నడిపి, అందరినీ అక్షరాస్యుల్నీ చేయడం ....అవీ రఘు కలలు!
'సాధ్యమైనంత త్వరలో రఘుకు అరుణ నిచ్చి పెళ్లి చేసెయ్యాలి. అరుణ ఉద్యోగం చెయ్యడమన్న సమస్యే అసలు లేదు. రఘు, తన స్థానాన్ని ఆక్రమించు కోగలడన్న ఆశ క్రమ క్రమంగా ఎలాగూ క్షీణించి పోతుంది. ఈ వయసులో తాను మాత్రం ఎందుకూ ఈ బాదర బందీ అంతా అంటగట్టుకుని అలమటించడం? ఈ మేనేజింగ్ డైరెక్టర్ షిప్పూ వద్దు, ఇతర కంపెనీ లోని డైరెక్టర్ హోదాలూ వద్దు! ఉన్న షేర్లన్నీ అమ్మి పారేసి, వచ్చిన డబ్బుతో ఓ అయిదారు బంగళాలు కట్టించి పడేస్తే, అవే పడి ఉంటాయి. నెలనెలా ఆరేడు వేలు అద్దెలు వస్తాయి. అది చాలు! తానిక హాయిగా రెస్టు తీసుకోవచ్చు! రఘూ, అరుణా ఆడుకుంటూ పాడుకుంటూ కాలం గడిపినా , వారికీ , వారి సంతానానికి .....ఆ మాట కొస్తే తన ముని మనమలకు కూడా ఏ లోటూ ఉండదు! ఇక, ఆ తరవాత నంటారా? ఏది, ఎప్పుడు, ఎలా, జరగాలని ఉందొ అలా జరుగుతుంది! ఆసలు, అనవసరంగా ఆలోచన -- అన్నదే తాను చెయ్యకూడదు!" సేతుపతి గారి ఆకాశ హర్మ్యాలు ఆ ఆశల మీద అలా అలా పైకి లేచి పోతున్నాయి!
ఆశ అన్నది లేకపోతె , మానవుడు అసలు బ్రతకలేడు . కానీ ....మానవులం మనం ఆశించినంత మాత్రాన అన్నీ అనుకున్న విధంగా నేరవేరతాయా? మనకు తెలియని శక్తి ఏదో.....మనల్ని ,మన జీవిత మార్గాల్లో నడుపుతుంటుంది. అది , కొందరి జీవితాల్ని కంటకమయమైన రస్తాలో పడవేస్తుంది. కొందర్ని అక్కణ్ణించి మళ్ళీ రాజమార్గం లోకి మళ్ళిస్తుంది! కొందర్ని ఆ రాచామార్గం లోనించి తీసుకువెళ్ళి నడి సముద్రం లో వదిలి వస్తుంది! బహుశా దాన్నే విధి అన్నారేమో మన పెద్దలు!
అరుణకూ ఒక కోరిక కలిగింది. చదువు పూర్తిగా పూర్తి అయింది. ఇక మీదట ఆ అమ్మాయి చదవదలుచుకోలేదు కనక, ఒకసారి వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని వద్దామను కుంది.
'అయినా.....ఇదేమిటి? ఇంత దగ్గిరి మద్రాసులో ఇన్నేళ్ళుగా ఉంటూ కూడా ....అఖిల భారతావనికి ఆరాధ్య దైవమున ఆయన్ని చూడాలన్న అభులాష నాకెందుకు కలగలేదూ?' అని తనను తానె ప్రశ్నించుకుంది అరుణ . ఇక జాగు చెయ్యరాదనుకుంది. వెళ్లి సేతుపతి గారికి తన ఉద్దేశాన్ని విన్నవించుకుంది.
"పిచ్చి తల్లీ, ఈ ఆరేడేళ్ళుగా నేనూ, చండీ ఎన్ని తూర్లు వెళ్లి రాలేదు? రమ్మంటే, నీవు వచ్చావా/ ఎప్పుడు చూచినా చదువు , చదువు! ఇప్పుడసలు ఊసుపోడం లేదు కదూ నీకు?"
"అంతా....ఏదో పిచ్చి పిచ్చి గా ఉండండి మామయ్య గారూ!"
"పోనీ ....ఎం.కాం చదువు అరుణా! ఆ తరవాత అమెరికా వెళ్లి ఎం.బి.ఎ. డిగ్రీ పుచ్చుకుందువు గాని."
"వద్దు బాబు వద్దు! ఈ చదువు కిక ఒక నమస్కారం! ఎక్కడో ఒకచోట పంతులమ్మ గా చేరతాను."
"ఉహూ ? ఆశ పాపం! నిన్నింత దూరం చదివించింది ఎందుకను కున్నావు? అక్కడెక్కడో నీవు నేర్పదలుచుకున్న విద్యను, మనింట్లో మా అందరికీ నేర్పు! ఆ జీతం మేమే ఇచ్చుకుంటాం!" -- అదొక ఛలోక్తి అయింది ఆ ఇద్దరికీ! నవ్వుకున్నారు.
జీవితంలో మరొక విచిత్రముంది! ఒక చెంప నవ్వుతూనే మరొక చెంప మనం ఏడవడం వైపు దారి తీస్తుంటాం. అకస్మాత్తుగా అరుణకు సేతుపతి గారు సమక్షంలో ఉండగానే, తన గతం గుర్తుకు వచ్చింది. ఒక విషాద చ్చాయ వచ్చి , పున్నమి నాటి చందమామ ను తేలి తేలిపోతున్న ఒక బూడిద రంగు మబ్బు కమ్మి నట్టు, అరుణ ముఖారవిందాన్ని ఆవరించింది.
"మామయ్యగారూ , చౌదరి గారి నుండి మనకు ఉత్తరం వచ్చి, ఎన్నాళ్ళయిందంటారు?"
"ఎమమ్మోవ్! నీవు నా సెక్రెటరీ వి, నేను నీ సెక్రెటరీ ని కాను! ఇటు వంటి విషయాలన్నీ కూడా నీకే జ్ఞాపక ముండాలి!" అంటూ సేతుపతి గారు హృదయ పూర్వకంగా నవ్వారు. అరుణ జీవం లేని మందహాసం చేసింది!
"దాదాపు మూడేళ్ళ యిందండీమామయ్యగారూ! మనకు తెలియకుండానే కాలం ఎలా దొర్లుకు పోయిందీ? నాన్నగారు కూడా నా మనసులో మెదిలినట్టు, ఇన్నేళ్ళు మీరు నన్ను కాపాడారంటే నేను మీకెంత ఋణపడి ఉన్నానంటారూ? పాపం, నాన్నగారు ఇప్పుడెలా ఉన్నారో?.....సీతామహాలక్ష్మీ , సరస్వతి ...ఇద్దరూ పెళ్లీడు పిల్లలయి ఉంటారు! మామయ్యాగారూ , నాన్నగారు నన్నిప్పుడు చూస్తె ఎంత సంతోషి స్తారనుకున్నారు?"
"నిన్ను చూచి సంతోషించని మానవుడంటూ ఉండడు అరుణా! ఇక శంకర నారాయణ గారి సంగతీ ....నా సంగతీ వేరే చెప్పాలా?"
"నాకో నమ్మక ముందండీ మామయ్యాగారూ! నేనూ, నాన్నా మళ్లీ కలుసుకుంటాం!"
"నీకు ఆనందాన్నీ, తృప్తినీ ఇచ్చే సంఘటన ఏది జరిగినా నాకు సంతోషమే తల్లీ!"
ఆ తరవాత , తమకే తెలియని తృప్తిని దేన్నో అనుభవిస్తూ , ఆ ఇద్దరూ అలానే ఉండిపోయారు ఎంతో సేపు!
38
ముప్పై అయిదు వేలరూపాయలు చందా ఇచ్చి, కొండ మీద సేతుపతి గారు ఒక బంగాళా కట్టించారు. ఆ బంగాళా లోనే దిగారు -- సేతుపతీ, చాముండేశ్వరి , అరుణా, సంబంధమూ, మరో ఇద్దరు నౌకర్లూను. రఘు ససేమిరా రానన్నారు!
"మాధవ సేవే మాధవ సేవ అని మన పెద్దలే అన్నారు. స్వామిని సేవించే నెపంతో అంతదూరం పాతిక గాలన్ల పెట్రోలు కాల్చుకుంటూ పోనక్కరలేదు!" అన్నాడతను. అదీ అరుణ తోటే ననుకోండి. అసలు తండ్రీ కొడుకులు ఈ మధ్య ముఖాముఖి గా ఏ విషయాన్ని గురించీ చర్చించు కొడం లేదు.
కొండమీద అంతా ఆనందమయంగానే అగుపడుతుంది అరుణకు!
"మామయ్యగారు ! మనవాళ్ళు ఒక పొరపాటు చేశారండీ. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ని ఇక్కడే నెలకొల్పి ఉంటె ఎంతో బాగుండేది!"
"ఎందుకమ్మా? ఇప్పటికే చాలామంది ఇక్కడి పవిత్రత పోయిందనీ..... ఇదొక బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ వసతులున్న పిక్ నిక్ సెంటరయిందనీ బాధ పడుతున్నారు! ఇక ఆ రెండు , మూడు వేలమంది విద్యార్ధులూ, విద్యార్దినులూ కూడా ఇక్కడ చేరితే ఇంకేమైనా ఉందా?"
"అదీ ఆలోచించ వలసిన విషయమే!" అంటూ, అరుణ తన చుట్టూ ఉన్న కోతులతో ముచ్చట లాడడం మొదలు పెట్టింది.
సంబంధమూ, ఆ ఇద్దరు నౌకర్లూ వెళ్లి, వేంకటేశ్వరుడికి తలలు ఇచ్చి వచ్చారు. అందరూ కలిసి పాపనాశనానికి వెళ్లి అక్కడ్నించీ సరాసరి ఆలయానికి చేరుకున్నారు. అప్పటికే అధికారులు కళ్యానోత్సవానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. సేతుపతి గారంటే మాటలా మరి.
"ప్రదిక్షణం చేద్దమ్మా అమ్మా?' అన్నారు సేతుపతి అరుణ నుద్దేశించి.
"తప్పకుండా నండి మామయ్యగారూ!"
అందరూ ముకుళిత హస్తులై ఆలయం చుట్టూ తిరుగుతున్నారు. పొర్లుడు దండాలు పెడుతున్న కొందరు మహిళల ను చూచి అరుణ నివ్వెరపోయింది!
'ఎంతటి ఆపదలో ఉండి, వారా మొక్కు మొక్కుకున్నారో! వడ్డీ కాసుల వాడయినా నిజంగా వరాలిచ్చే దేవుడు అయన ఒక్కడే అంటారు. నిజమేనేమో! కానిదే , ఇన్ని లక్షల మందికి ఇన్నిన్ని తరాలుగా అయన మీద ఉన్న ఆ గాడ విశ్వాసం అలాగే ఉండి పోతుందా? ఓ ఏడు కొండలవాడా! నాకూ రెండు కోరుకలున్నాయి! మా నాన్నగారు ఎక్కడున్నా సరే, వారినీ, వారి భార్యనూ, పిల్లలను చల్లగా చూడు. మామయ్యగారి కి దీర్ఘాయురారోగ్యాభివృద్దిని కలగజేస్తూ, రఘు వల్ల అయన మానసికంగా ఏనాడూ ఎటువంటి బాధ పడకుండా అనుగ్రహించు!' అనుకుంది అరుణ తనలో తాను. మనసులోనే శతాదిక నమస్కారాల్ని అర్పించుకుంది.
ఆ క్షణాన్నే వినవచ్చింది "భజగోవిందం" గీతం! కొంత దూరాన్నించి వస్తుంది ఆ ధ్వని. అదిరిపోయింది అరుణ! మనసునంతా...జ్ఞానేంద్రియాల నన్నింటినీ.....ఆ ధ్వని మీదే లగ్నం చేసింది! పాడుతున్నది ఇద్దరు! ఒకటి మొగ గొంతుక, ఇంకొకటి అడ గొంతుక. మధ్య మద్యని మగ గొంతుక ఆగిపోతుంది దగ్గుతుంది!
"పునరసి జననం పునరసి మరణం
పునరసి జననీ బకరే శయనం
భజగోవిందం....భజ గోవిందం ....."
"ఓసీ పాపిష్టి దానా! ఇంకా సందేహ మెందుకే?" అరుణ ఆత్మ అరుణను నిలదీసింది, హెచ్చరించింది , దెప్పి పొడిచింది!
"నాన్నా! ' అంటూ పరుగు దీసింది అరుణ!
"అమ్మా! అరుణా!"
ఇంకెక్కడి అరుణ> పిచ్చిదానిలా "నాన్నా! నాన్నా!" అంటూ కేకలు వేస్తూ , మైమరచి పరిగెత్తు తుంది!
"సంబంధం ! వెళ్ళు....చూడు, అసలు సంగతేమిటో?"
"సరి సర్!" అని, సంబంధం పరుగు తీశాడు! సేతుపతి గారు మాత్రం అగగలరా? ఆయనా సంబంధం వెంటనే బయలుదేరాడు! తాను నడవ గలిగినంత త్వరత్వరగా నడిచాడు. సంశయమూ, ఆరాటమూ, ఆత్రుత , అవేశమూ ఎక్కువయ్యే కొద్దీ అయన నడక పరుగుగా పరిణమించింది!
"నాన్నా!" అంటూ అరుణ శంకర నారాయణ గారి పాదాల మీద వాలింది!
"అరుణా, నా తల్లీ! నీవేనా?"
"సీతామహాలక్ష్మీ!"
"అక్కయ్యా!"
"అమ్మేదీ? సరస్వతేదీ? నాన్నా! ఇదేం దురవస్థ నాన్నా మీకు? ఎందుకింత అన్యాయం చేశారు? ప్రపంచానికంతటికీ మేలుకోరే మీకా ఈ దుస్థితి? ఓ భగవంతుడా! ఎంత చల్లని చూపు చూశావు స్వామి! ఈనాటి కయినా నా నాన్నను నాకు అప్ప చెప్పావు! నాన్నా! నాన్నా! నేను బి.కాం పాసయ్యాను నాన్నా. మొన్నమొన్ననే బి.టి డిగ్రీ కూడా పుచ్చుకున్నాను. నాన్నా, నేను జీవితంలో అన్ని సుఖాలూ అనుభవిస్తుంటే, మీరిలా తయారయ్యారా? దేవుడా! ఇదెక్కడి న్యాయం! నాన్నా! ఇంకా మీకేమీ భయం లేదు! మీరు ఇంకా కష్టపడుతూనే ఉండిపోతే , ణా బ్రతుకెందుకు? కాల్చనా?నాన్నా, అమ్మా, సరస్వతీ బాగున్నారా? సీతా, నీవూ , చెల్లాయీ ఏం చదివారమ్మా? నాన్నా! నాన్నా! ఈ వేళ ఎంత పర్వదినం నాన్నా! మీరేదయినా మాట్లాడండీ. నన్నాశీర్వదించండి నాన్నా." ఈలోగానే సంబంధం వచ్చాడు, సేతుపతి గారు వచ్చారు.
"నాన్నా, వీరే నాన్నా సేతుపతి మామయ్యగారు! వీరే నాన్నా నన్ను ఉద్దరించిన వారు!"
తనకు తెలియకుండానే సేతుపతి, శంకర నారాయణ గారి పాదాల మీద తల ఆనించి మొక్కాడు!
"తప్పు బాబూ, తప్పు! మీ రిక్కడ.....నే నెక్కడ? చేతులెత్తి నమస్కరించలేను! హృదయ పూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను! మీరూ, మీ భార్యా పుత్రులూ, బంధు వర్గమూ అంతా కలకాలం చల్లగా వర్ధిల్లండి! దర్శనం చేసుకునిరా తల్లీ. అంతా ఇంటికి వెళ్దాం. సీతా, నువ్వు ముందు వెళ్లి, అమ్మతో చెప్పిరా, చుట్టాలు వస్తున్నారని. ఇంద, ఈ డబ్బులు తీసుకు వెళ్ళమ్మా!" అంటూ, తాను కూర్చున్న చాప మీదికి భక్తులు విసిరిన చిల్లర డబ్బుల్ని ఎడుకోడం మొదలు పెట్టాడు శంకర నారాయణ. పాపం, అసలు ఏ చెయ్యి సక్రమంగా పని చెయ్యడం లేదు. సీత ఆయనకు సాయపడుతుంది.
"నాన్నా!" అంటూ అరుణ గుండెలవిసి పోయేలా ఏడ్చింది.
"మీరా? బిచ్చ మెత్తుకోడమా? ఇదా మీరు చేసున్నామన్న ఉద్యోగం! ఎంత అన్యాయం చేశారు నాన్నా....నన్నెంత అన్యాయం చేశారు!"
"తప్పు లేదమ్మా! ఊరుకో, ఇప్పుడు నీవు వచ్చావుగా? ఇక నాకే భయమూ లేదమ్మా! ఏ బాధ ఉండదు; నాకు తెలుసు. వెళ్ళు, వెళ్లి దర్శనం చేసుకుని రా! ఫో!" అంటూ చిల్లర డబ్బులు ఏరు కుంటూనే ఉన్నాడాయన.
