Previous Page Next Page 
బ్రతుకు బొంగరం పేజి 26

                            
                                   17
    ఉరుములతో మెరుపులతో పెళ పెళ మంటూ వర్షం పడసాగింది.
    రవిచంద్ర భోజనం చేసి బయటికి వచ్చాడు.
    రాత్రి తొమ్మిది గంటలయింది. దేదీప్యమానంగా బంగళా లో దీపాలు వెలుగుతున్నాయి. విండో ఫాన్సు మీద టపటప మంటూ చినుకులు పడి వింత శబ్దాన్ని కలిగిస్తున్నాయి.
    వాలు కుర్చీలో రవిచంద్ర కూర్చుండే సరికి బంట్రోతు ప్లాంకూ, ఆవేళ చూడవలసిన ఫైళ్ళు తీసుకు వచ్చి కుర్చీ మీద అమర్చాడు.
    రవిచంద్ర తన పని లో నిమగ్నుడయ్యడు
    గభాల్న బయట తలుపు ఎవరో నేట్టినట్లయింది.
    ఉలిక్కిపడిన బంట్రోతు గబగబా వెళ్లి తలుపు తీశాడు.
    తడిసిపోయి వచ్చిన సురేంద్ర తటాలున తలుపు మూసి రవిచంద్ర దగ్గిరికి వచ్చాడు.
    ఇంకో బంట్రోతు ఆ గదిలో ఏదో సర్దుతూ నిల్చుని ఉన్నాడు.
    అతణ్ణి బయటకు వెళ్ళమన్నట్లుగా సైగ చేసి, గభాల్న ఆ తలుపు కూడా మూశాడు.
    నిర్ఘాంత పోయాడు రవిచంద్ర అతని వింత ప్రవర్తనకు!
    "ఏమిటి, సురేంద్ర? ఏమిటిది?" అన్నాడు.
    సురేంద్ర వింతగా ఉన్నాడు. కొత్తగా, భయంగా, బెరుగ్గా, అధైర్యస్తూడిలా ఏది నేరం చేసిన వాడిలా!
    మనిషి కొంచెం తూగుతున్నాడు. రవిచంద్ర ను సూటిగా చూడలేక పోతున్నాడు. మనిషి వణికి పోతున్నాడు!
    'సురేంద్రా, ఎన్నిసార్లు చెప్పాను నిన్నీ తాగుడు మానుకోమని?' రవి అతణ్ణి కోపంగా చూస్తూ అన్నాడు.
    అమాంతం సురేంద్ర వచ్చి రవిచంద్ర ను వాటేసు కొని, "రవీ!" అన్నాడు. ఆ పిలుపులో ఏదో భయం....తెలియని బెరుకు.
    "ఏమిటిది?"
    రవి ముఖంలో ముఖం పెట్టి, "రవీ, నన్ను రక్షించాలి,. నీవు నన్ను రక్షించాలి" అన్నాడు.
    రవికి ఏమీ అర్ధం కాలేదు. "ఏమిట్రా? అలా కూర్చో " అంటూ అతణ్ణి కూర్చో బెట్ట బోయాడు. కాని సూరీ కూర్చోలేదు. అతని మీదికి అలా వంగుతూనే "రవీ, నేనొక ఘోరమైన పని చేశాను" అన్నాడు.
    షాకు తిన్నట్టుగా వెనక్కి తగ్గాడు రవి.
    సురేంద్ర భయంతో, అటు, ఇటు చూడసాగాడు.
    మనిషి తనను తాను అదుపులో ఉంచుకోలేక పోతున్నాడు. సురేంద్ర ను ఆ విధంగా చూడటం రవిచంద్ర కు ఇది మొదటిసారి.
    అతణ్ణి అదుపులో ఉంచటానికి ప్రయత్నించాడు కాని శక్యం కాలేదు.
    బయట వర్షం. పెనుగాలికి కిటికీ రెక్కలు టపటపా కొట్టుకుంటున్నాయి.
    "రవీ , నీకు ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు. నేను నీచుణ్ణి....పాతకుడ్ని." అతని కంఠం బిగుసుకుని పోయి అదో మాదిరిగా మారిపోయాడు.
    "ఏం జరిగింది?" ఖంగారుగా రవి అడిగాడు.
    "నేను......."
    "ఊ.......నీవు?"
    "నాకు ఈ సాయంత్రం సురేఖ ను చూడాలనిపించింది. ఎంత బలంగా ఆ కోర్కెను అణుచుకుందామనుకున్నా అణుచుకోలేక పోయాను.
    ఎందుకనో రవికి గుండెల్లో వణుకు కమ్ముకొని వచ్చింది. సురేఖ ను తలుచుకుంటే చాలు, అతను నిబ్బరాన్ని కోల్పోతున్నాడు. సురేంద్ర తాగి వెళ్లి అక్కడేమన్నా గొడవ చేసి రాలేదు కదా?
    "తాగి వెళ్లావా?" అనుమానంగా అడిగాడు.
    "అవును. అందుకనే నన్ను నేను కంట్రోలు చేసుకోలేక పోయాను. మత్తులో ఏం చేస్తున్నానో తెలిసి గూడా ఆవేశాన్ని ఆపుకోలేక పోయాను."
    రవిచంద్ర ఇకభరించలేక పోయాడు. అతణ్ణి  పట్టుకొని ఊపుతూ , "ఏం చేశావు? సురేఖ ను ఏంచేశావు?' అని అడిగాడు.
    "చంపేశాను!"
    "ఆ! " ఆకాశం విరిగి భూమి మీద పడ్డట్లు అనిపించింది. లక్ష నయాగారా జలపాతాల ప్రవాహాలు ఒక్కసారి అతని నెత్తి మీద పడ్డట్టనిపించింది.
    అతణ్ణి అలాగే వదిలేసి నిరామయంగా కూలబడ్డాడు.
    "చంపేశాను. కుత్తుక పిసికేశాను. నా గుండెల్లో అగ్ని జ్వాలలు రగుల్కోల్పినందుకు, మానాభిమానాలు లేకుండా బజారు స్త్రీగా మారినందుకు. నేను వెళ్లేసరికి ఎవరో వితుడితో సిగ్గు లేకుండా కులుకుతున్నందుకు."
    రవికి సురేఖ అందమైన ముఖం దీనంగా కనిపించినట్లయి చేతులతో ముఖాన్ని కప్పుకున్నాడు.
    "నిజంగానే రవీ,సురేఖను....ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన సురేఖను చంపేశాను. ఈ చేతులతోనే గొంతు పిసికి చంపేశాను. నేను పాపిని, నేను హంతకుణ్ణి." అతను వికటంగా నవ్వుతున్నాడు; ఏడుస్తున్నాడు. నవ్వో, ఏడుపో తెలుసుకోలేనటు మరేదో చేస్తున్నాడు. ధారాపాతంగా కంటి వెంబడి అశ్రువులు వస్తున్నాయి. సురేఖ ను ఆ హీన స్థితి నుంచి విముక్తి రాలిని కావించి నందుకు నవ్వుతున్నాడు. సంతోషం తోటి ఆనంద భాష్పాలు రాలుస్తున్నాడు! ప్రాణాధికంగా ప్రేమించి, తన ప్రాణాన్ని తానె తీసుకున్నట్లు ఆమెను గొంతు పిసికి చంపేసినందుకు ఏడుస్తున్నాడు! శాశ్వతంగా తనకు ఆమె దూరమయినందుకు ఏడుస్తున్నాడు.'
    ఎగసి ఎగసి వస్తున్నది అతనికి దుఃఖం. చంపబోయే ముందు ఏ విధంగా నైతే ఎగసి ఎగసి ఆవేశం వచ్చిందో ! గుండెలు పగిలేలా, కళ్ళు కాయలు కాచేలా అతను ఏడుస్తున్నాడు. సురేంద్ర దుఃఖిస్తున్నాడు.
    సృష్టి ప్రళయం వచ్చిన తరవాత ఏమీ అర్ధం కాని నిరామయ పరిస్థితి వచ్చినట్లుంది రవిచంద్రకు. దుఃఖించటము ,మ్ బాధ పడటము , తల బాదుకోటము హృదయము, శరీరము-- మనిషి ఉన్నప్పుడు జరుగుతాయి. తను లేడు తన శరీరము లేదు. తనకు దుఃఖం లేదు. ఈ సురేంద్ర ఎవరు? ఆ సురేఖ ఎవరు? ఇతను ఆమెను ఎందుకు చంపాడు? అసలు ఈ చావు పుట్టుకలు ఏమిటి? అతని మస్తిష్కం రకరకాల ఆలోచనలు ఆ క్షణంలో చేయసాగింది. అతని శరీరం కుంగిపోయి నట్లుగా కుర్చీలో చేరగిల బడి ఉంది. అతని కళ్ళు రెప్పలు వేయకుండా సురేంద్రను చూస్తున్నాయి. ఏమిటో అతనికి అతను కానట్లు, అతని రూపంలో ఇంకెవరో ఉన్నట్లు అనిపించసాగింది. ఆ పరిస్థితి ఆశ్చర్యానికి, బాధకు, ఆవేదనకు, దుఃఖానికి అతీత మైనటు వటుంది. అది ఇటువంటిది అని చెప్పలేనటు వంటి పరిస్థితి! మాటలకు భావానికీ అందనిది!
    "ఆ గొందుల్లో బరితెగించిన సురేఖ ను చంపటం మంచిది కాదంటావా? ఆ సురేఖ రవిచంద్ర స్నేహితురాలంటే నీవు సహించగలవా ఇప్పుడు? అందుకనే చంపేశాను. నేను మంచి పని చేయలేదా రవీ? నీకు అలా అనిపించటం లేదా, రవీ? ఎక్కిళ్ల మధ్య అతని మాటలు. బల్లకే నొప్పి పుడుతున్నట్లు గా తల బాదుకుంటున్న సురేంద్ర!
    "నాదను కున్న సురేఖ , నన్ను తిరస్కరించిన సురేఖ వాడి చేతుల్లో, వాడి ఒళ్లో కులుకుతుంటే నేను సిగ్గుతో తల వంచుకోలేక చంపేశాను....అహహ....అహహ..." నవ్వూ, ఏడుపూ , కేకలూ.
    బయటి నించి బంట్రోతులు బిగ్గరగా తలుపులు బడుతున్నారు. సురేంద్ర అరుపులు బయటకు వినిపించి. ఉరుములు, మెరుపులతోటి వర్షం వచ్చింది. ఏమీ లేకుండానే ఈ ప్రళయమేమిటో వారి కర్ధం కాలేదు.
    రవిచంద్ర హృదయం లో, మస్తష్కం లో, బంగళా లో ప్రతి చోట ఏదో కల్లోలం, ఏదో ఉపద్రవం!
    "రవీ! నన్ను క్షమించు. నన్ను రక్షించు" అనేపదం పదేపదే రవి మెదడు లో తిరగసాగింది. ఎలా రక్షించాలి? ఎందుకు రక్షించాలి? తను ఎవరు రక్షించటానికి? అయినా ఈ జీవితమే అనిశ్చయమైనప్పుడు తాత్కాలికమైనప్పుడు ఈ రక్షణ అనే పదానికి అర్ధం ఉందా?
    సురేంద్ర ను హంతకుడుగా లోకానికి పట్టి ఇస్తేనే అతణ్ణి రక్షించడమవుతుందేమో ? ఏదో పాపం చేశాను అనే భావం ఉద్భవించి నప్పుడు ప్రాయశ్చిత్తం అవసరమా? ప్రాయశ్చిత్తం లేకపోతె అతని ఆవేదన మండి, గునపాల తోటి పోడుస్తున్నట్లుగా పదేపదే వెలికి వచ్చే బాధ నుండి అతణ్ణి ఎవరు రక్షిస్తారు?
    గణగణ మని ఫోను మోగింది.
    యాంత్రికంగా అందుకున్నాడు రవిచంద్ర "యస్."
    "ఆయామ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ టూటౌన్ సర్ మిస్టర్ సురేంద్ర ఈ వీధిలో సురేఖ అనే అమ్మాయిని చంపినట్లుగా రిపోర్టు. ఎంక్వైరీ చేస్తే ఆ సురేంద్ర మీ స్నేహితుడని, మీ దగ్గిరే ఉంటాడని...." అవతలి స్వరం.
    "అవును , ఇక్కడే ఉన్నాడు. మీరు వచ్చి అరెస్ట్ చేయవచ్చు." రవి అన్నాడు.
    "థాంక్స్" అవతలి కంఠం ఫోను పెట్టేసింది.
    ఆ మాటలు వింటున్న సురేంద్ర కు ఉదయం రాబోయే ముందు ఆకాశంలో తెలుపు రేఖలు విచ్చు కుంటున్నట్లుగా, మెదడులో మైకపు రేఖలు విచ్చుకోసాగాయి.
    తను హంతకుడు. అరెస్టు కాబోతున్నాడు. తన ప్రాణ స్నేహితుడు రవిచంద్ర తనను అరెస్ట్ చేయిస్తున్నాడు. అతను అచేతనంగా అలాగే ఉండిపోయాడు పోలీసులు వచ్చేంత వరకు.

                              *    *    *    *
    రాజగోపాలం, ప్రియంవదలు ఖిన్నులయ్యారు ఆ వార్తా వింటూనే. ఎన్నడూ లేనిది రాకగోపాలం కొంచెం కంపించాడు. క్షణకాలం ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఎదురుగా రవిచంద్ర , చెదిరిపోయిన రవిచంద్ర, బెదిరిపోయిన రవిచంద్ర, క్రుంగి పోతున్న రవిచంద్ర! అధికారం సంకెళ్ళు వేసి అతణ్ణి బంధిస్తే ఏం చేయలేక ప్రాణ స్నేహితుణ్ణి సంకెళ్ళ తో బంధించేలా చేసిన రవిచంద్ర!
    "అయినా సురేంద్ర చేశాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. సురేంద్ర అంత తెలివి తక్కువ వాడా? ఎంత స్నేహితురాలయినా, బజారు పాలయిన ఒక స్త్రీని చంపితే అతనికి వచ్చేదేమిటి? నేను నమ్మను." దృడంగా అన్నాడు రాజగోపాలం.
    ప్రియకు నోట మాట రావడం లేదు. శిలా ప్రతిమలా సోఫాకు అంటుకొని పోయింది.
    "ఏమో మరి? నాతోటి అలాగే చెప్పాడు. పోలీసు దగ్గిర ఆవిధంగానే ఒప్పుకున్నాడు." పేలవంగా అన్నాడు రవి. అతనికి రాత్రి నించి నిద్ర లేదు. ఆహారం లేదు. ఒక్క రోజుకే కొన్ని రోజుల నించి ఉపవాసం ఉన్నవాడి మాదిరి క్రుశించినట్లు అయ్యాడు.
    "సురేంద్ర ను చూడాలి నేను. నేను కనుక్కుంటాను. సురేంద్ర నా దగ్గిర దాచడు." అమాంతం లేచాడు రాజగోపాలం.
    భయంభయంగా ప్రియ "నేనొక్కదాన్నే త్వరగా రావాలి." అంది. ఉదయం అన్న సంగతి కూడా మరిచిపోయింది ఆమె. తమతో నవ్వుతో పేలుతూ కులాసాగా తిరిగిన ఇద్దరిలో ఒకరు హంతకులు. ఇంకొకరు హత్య చేయబడిన వారూనా? ఒకపక్క విస్మయం, మరొక పక్క వణుకు ఆమెను భయ కంపితురాలుగా మర్చి వేశాయి.
    రవిచంద్ర , రాజగోపాలం ఇద్దరు కారులో సరాసరి సబ్ జైలుకు వచ్చారు.
    రవిచంద్ర లోనికి వెళ్ళటానికి సంశయించాడు.
    రాజగోపాలం జైలు అధికారుల పర్మిషన్ తీసుకొని లోనికి వెళ్ళాడు.
    వాచిపోయిన కళ్ళతో , రేగిపోయిన జుట్టుతో సురేంద్ర వాడిపోయి ఉన్నాడు.
    రాజగోపాలాన్ని చూడగానే శుష్క మందహాసం చేశాడు. రాజగోపాలానికి కళ్ళలో నీళ్ళు అప్రయత్నంగా తిరిగాయి. బలవంతాన తనను తాను అదుపులో పెట్టుకుంటూ నెమ్మదిగా అక్కడ కూర్చున్నాడు.
    ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క గంటలా అతి భారంగా కదులుతున్నది. కాసేపటి దాకా రాజగోపాలం ఏమీ మాట్లాడలేక పోయాడు.
    "ఏమిటిది , సురేంద్రా?" అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని అడిగాడు.
    "ఖర్మ!" వైరాగ్యంతో కూడుకున్న విషాదంతో అన్నాడు సురేంద్ర.
    "నాకేం బోధపడటం లేదు."
    రాజగోపాలం మాటలకు సురేంద్ర తల వంచుకున్నాడు.
    "ఇదంతా నిజమా?"
    "నిజమే"
    "సురేఖను నీవు చంపావా?"
    "చంపాను."
    "నేను నమ్మను.' రాజగోపాలం మొండిగా అన్నాడు.
    "అదంతా మీ మంచితనం. కానీ, నిజం. నేను సురేఖను....నా సురేఖ ను చంపుకున్నాను."
    "అలా ఎందుకు చేశావ్?"
    "నేను నేనుగా లేని పరిస్థితుల్లో అలా చేశాను"
    "నీ ఆవేశం ఎంత ప్రమాదానికి దారి తీసిందో తెలుసా?"
    "ఏమయింది? రవిచంద్ర క్షేమంగా ఉన్నాడా?" ఆత్రుతతో అడిగాడు.
    "అందరం క్షేమంగానే ఉన్నాం. జీవచ్చవాల్లా ఉన్నాం" రాజగోపాలం గొంతులో అనుకోకుండానే ఆవేశం ధ్వనించింది.
    "నాకోసం బాధపడకండి. రాజగోపాలం గారూ, ఇప్పుడే నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను. సురేఖ బ్రతుకులో లేని సుఖం సురేఖ చావులోనే నాకు లభించింది."
    "సురేంద్రా!"
    "అవును."
    "నీవు హత్య చేసినట్లు ఒప్పుకున్నావా?"
    "నిజం దాచినా దాగదుగా, రాజగోపాలం గారూ!"
    "ఛీ...ఛీ సురేఖ కోసం, మారిపోయిన సురేఖ కోసం, మనిషిగా బ్రతకటం మానుకున్న సురేఖ కోసం నీ నిండు జీవితాన్ని నాశనం చేసుకుందామనుకున్నావా?" గొంతు జీరపోయింది రాజగోపాలానికి.
    "ఆ క్షణం లో నా జీవితం జ్ఞాపకం రాలేదు. ఆ క్షణం లో సురేఖ విముక్తే నాకు జ్ఞాపకం ఉంది." రెండు కన్నీటి బొట్లు అప్రయత్నంగా రాలాయి.
    రాజగోపాలం బరువుగా లేచాడు. ఇంకొంచెం సేపు అక్కడ ఉంటె అతనే బేలగా మారిపోయే పరిస్థితి అది.
    అతను వెనక్కి తిరిగి రెండడుగులు వేసిన తరవాత "రాజగోపాలం గారూ" అని సురేంద్ర దుఃఖంతో పిలిచాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS