Previous Page Next Page 
మారిన విలువలు పేజి 26

 

    ఆ రోజు రోజల్లా వర్షం పడుతూనే ఉంది. గొడుగు వేసుకున్నా తడిసి ముద్దయి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చింది జానకి. చలికి పైట కొంగు నిండుగా కప్పుకొని కూర్చున్నది సుందరమ్మ. కనకం పక్కలు దులిపి పరుస్తున్నది. దీపం దగ్గర కూర్చుని అందంగా అలంకరించుకోడమేలా? అన్న వ్యాసం చదువుతున్నది శాంత.
    జానకి గొడుగు మడిచి గడపలో పెట్టి, "సాంబేడమ్మా!" అని తల్లిని ప్రశ్నించింది.
    "అదేమిటే! నీతో వాడు రాలేదూ? ఉదయం కూర్చున్న వాడిని లేవగొట్టి తీసుకెళ్ళేవు గదుటే?" సుందరమ్మ ఎదురు ప్రశ్న వేసింది.
    "నాతొ కాస్త దూరం వచ్చేసరికి వాళ్ళ కాలేజీ పిల్లలు కనిపించేరు. ఈరోజు రిజల్టు వస్తాయనుకొంటున్నారు. మేము స్టేషను కి వెళ్తున్నాము. వస్తావా?" అన్నారు. వాళ్ళతో వెళ్ళేడు. తిరిగి నా దగ్గరికి రాకపోతే ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడనుకొన్నాను. అప్పటి నుంచీ ఇంటికి రాలేదా?' అత్రతగా ప్రశ్నించింది జానకి.
    "రాలేదనేగా చెప్తుంట? ఇంతకీ పరీక్షా ఫలితాలు వచ్చాయా?" సాంబు పాసయ్యేడా?"
    "సాంబు పరీక్ష పోయిందమ్మా! వాడి నంబరు లేదు."
    "అయ్యో , అయ్యో! అదేమిటే! వాడి పరీక్ష పోవడమేమిటే! సరిగా చూసేవే, జానకీ?"
    "సరిగ్గానే చూశానమ్మా! అది చూసిందగ్గరి నుంచి నా మనస్సెం బాగులేదు. ఇంటి కొచ్చేద్దామని ఎంత ప్రయత్నించినా పడలేదు. ఇప్పటి వరకు కాలు కదిపిందికి అవకశం లేకపోయింది. ఈరోజు ఈ వర్ష మొకటి శనిలా. అన్ని పనులూ తగలెట్టి పారేసింది."
    "అయితే సాంబేడి?"
    "అదే నేను అలోచోస్తున్నానమ్మా! పరీక్ష పోగొట్టుకొని ఇంత రాత్రి వరకు ఈ వర్షంలో ఎక్కడ తిరుగుతుంటాడు? వాడికి చెప్పుకోదగ్గ స్నేహితులైనా లేరు."
    "అయ్యో! అయ్యో! ఇదేం ప్రారబ్ధమే! పాడు పరీక్ష పొతే పోయింది కాని. ఇంత వర్షంలో పిల్లడు ఎక్కడ తడుస్తున్నాడే? ఇంటికి రావడానికి ముఖం చెల్లక ఏ ఇంటి అరుగు మీదో కూర్చుని ఉంటాడు. ఎక్కడని వెతకడమే, జానకీ! ఏం చెయ్యడం? అన్నయ్య ఊళ్ళో లేడాయే! ప్రకాశం అయినా ఇంటికి రాలేదు. సరిగా ఈ పాడు వాన ఈరోజే పట్టుకొంది. అలా నాలుగు వీధులు తిరిగొద్దాం వస్తావూ? వాడి క్లాసు పిల్లల ఇళ్ళ యినా నీకు తెలుసుటే? ఏం చెయ్యనే జానకీ! అలా మొద్దులా కూర్చుంటావేమే, తల్లీ!"
    "ఉండమ్మా , నన్నోక్క క్షణం ఆలోచించనీ!"
    "నీ ఆలోచన బంగారం గానూ! ఉదయం నుండి ఆలోచిస్తున్నావు కదుటే? వాడి పరీక్ష పోయిందని తెలిసేక ఇంటికి తిన్నగా వచ్చేడో రాలేదో కనుక్కోవాలన్న బుద్ది నీకు లేక పోయిందేమే! నా బాబు ఎక్కడున్నాడే?"
    నిజమే, అమ్మకున్నపాటి జ్ఞానం తనకు లేకపోయింది. సాంబు ఈ పరీక్షను తన జీవన మరణ పరీక్షగా తీసుకొంటున్నాడని తెలిసి కూడా, తను పర్వవసానం ఇలా ఉంటుందేమో అని ఆలోచించ లేకపోయింది. ఇప్పుడేమిటి మార్గం? సాంబు కోసం ఎక్కడని వెతకడం? జానకి ఏదో నిశ్చయానికి వచ్చినట్టు లేవబోతుంటే , సూర్యారావు చావిట్లోకి వచ్చేడు.
    "అయ్యో, సూర్యం! సూర్యం! సాంబురా! సాంబురా!" సుందరమ్మ గోల పెట్టింది.
    "ఏమైందమ్మా ? సాంబు కేమైంది?"
    "సాంబు పరీక్ష పోయింది. "జానకి నెమ్మదిగా చెప్పింది.
    క్షణం కాలం రెండు చేతులతో బుర్ర పట్టుకొన్నాడు సూర్యారావు.
    "ఎంత పనైంది! ఏడీ? సాంబేడి?"
    "ఇంకా ఇంటికి రాలేదు."
    "ఎక్కడి కెళ్ళేడు? ఎప్పుడు వెళ్ళేడు?"
    జానకి జరిగిన సంగతి చెప్పింది.
    "నువ్వు వాడికోసం చూడలేదూ? ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు?"
    "నేనూ ఇంతక పూర్వమే వచ్చెను"
    "ప్రకాశం ఏడీ?"
    "అదిగో, వాడూ వస్తున్నాడు" అన్నది శాంత. ప్రకాశం పేపర్లు చేతిలో పడగానే బి.ఎ, బి.ఎస్.సి రిజల్ట్స్ పడ్డాయంటే పేజీలు  తిప్పి చూసేడు. తన అన్న పరీక్ష పోతుందన్న తలంపే అతనికి రాలేదు. అన్నయ్యకు ఏం ప్రజంటూ కొనియ్యాలా అని ఆలోచిస్తూనే పేపర్లో నెంబర్లు చూసేడు. సాంబు నంబరు కనిపించలేదు. ఈసారి కాస్త పరీక్షగా చూసేడు. నిజంగా సాంబు నంబరు అందులో లేదు. కాస్తసేపు ఏమీ ఆలోచించకుండా అలాగే నిలబడి పోయేడు ప్రకాశం.
    పిరికివాడు . పోతుంది , పోతుందని భయపడి, పరీక్ష పోగొట్టుకున్నాడు. దీనికి చాలావరకు కారణం అన్నయ్యే. నువ్వు పరీక్ష పాసవకపోతే ప్రపంచం తలక్రిందలై పోతుంది అన్నట్లు మాట్లాడేవాడు. నిజమే అనుకోని సాంబు హడలిపోయేవాడు. ఆరోజు ఆ మాటే అన్నాడు.
    "ఏం చెయ్యనురా, ప్రకాశం! పెన్ను పట్టుకొంటే మీరంతా తలపుకోస్తారు. చెయ్యి గడగడ వణికి పోతుంది. శాంత, అన్నయ్య, అమ్మ అంతా నన్నే చూస్తూ, నా చుట్టూ తిరుగుతున్నట్లనిపిస్తుంది. నేనీ పరీక్ష పాసవాలి. అన్నయ్య కోరిక తీర్చాలి. శాంత పెళ్ళి చెయ్యాలి అనే పట్టుదలతో రాద్దామనుకొంటాను. కాని బుర్రలో చదివిన పాఠాలు మాయమయి పోతాయి. నేను పెంచుకొన్న బుణం , తీర్చుకోవలసిన బాకీ, అన్నయ్య బాధలు, శాంత ఆశలు నిండిపోతాయి. అవి రాస్తే ఎవరూ మార్కులిస్తారు. నాకు తెలుసు నేనీ పరీక్ష పాసవలేను. నాకింద ఖర్చు పెట్టిన ఈ డబ్బంతా అన్నయ్య కి దండుగే" అనేవాడు.
    ఏదో భయం కొద్దీ అలా గంటున్నాడే కాని, ఆమాత్రం పాసు మార్కులు రాకపోవు అనుకొన్నాడు ప్రకాశం. మూడవసరిగా నంబర్లు చూసి, అందులో సాంబు నంబరు లేదని నిర్ధారణ చేసుకొని, పేపర్లు పంచేందుకు సైకిలేక్కాడు ప్రకాశం.
    ఆ పేపర్లు నాలుగైదు గంటలకు ముందే పతితులకందవలసి ఉంది. కాని, త్రోవలో ఏదో గూడ్సు బండి పట్టాలు తప్పిన కారణంగా ఆరోజు మెయిలు నాలుగ్గంటలు లేటు. ఆఫీసులకు పోవలసిన వాళ్ళంతా ఆత్రతగా వీధి గుమ్మాల్లో పేపర్ల కోసం చూస్తున్నారు.
    "ఏమిటోయ్, ఇంతాల్లస్యం చేసేవు?"
    "ఈరోజు మెయిలు లేటండి" సైకిలు మీంచే జవాబులు , పేపర్లు పంచి పెడుతూ ప్రకాశం తన పని పూర్తీ చేసుకొనేసరికి ఆకాశం నిండా మబ్బులు పేరుకొని వర్షం వచ్చేలా ఉంది. ఇంటికి బయలుదేరిన ప్రకాశం మధ్యలో మనస్సు మార్చుకొని బజారు వైపు వెళ్లిపోయేడు.
    అన్నయ్య ఊళ్ళో లేడు. అక్క ఆఫీసులో ఏదో పనుంది తొందరగా పోవాలంది. ఇంక ఇంట్లో మిగిలిన వాళ్ళు పేపరు చూసేరో లేదో? ఈ అవాంచనీయమైన వార్తను తను మొదట తీసుకెళ్ళి సాంబుకు చెప్పడం ఎందుకు? తనకు ఇతరులను ఓదార్చడం తెలియదు.  వాడు కాని ఈ వార్తా విని ముఖం వేలేసుకొని కూర్చుంటే ఏం చెయ్యలేక చావాలి.
    ఈరోజుకు కాస్త బయట కాలక్షేపం చేసి, దీపాలు పెట్టెక ఇల్లు చేరుకుంటే, తెల్లావారే సరికి , 'నిన్న' అయిపోతుంది. మహా మహా కష్టాల్నే మనుష్యులు మరిచిపోతుంటారు. ఇదే పాటిది? ఈసారి సాంబు పరీక్ష పొతే, వచ్చేసారి పాసవుతాడు. కాకపోతే, కాస్త శ్రమ, డబ్బు ఖర్చు అవుతాయి అంతే కదా! అనుకొన్నాడు ప్రకాశం.
    తన ఆలోచనను ఆచరణ లో పెట్టి పగలంతా బయట వర్షం పడుతుంటే, వెచ్చగా అప్పన్న తో కబుర్లు చెప్తూ పుస్తకాల కొట్లో కూర్చున్నాడు. ఎప్పటికి వర్షం వెలిసే సూచన లేక, ఎనిమిది గంటల రాత్రికి , వర్షంలో సగం తడుస్తూ గొడుగులో బుర్ర దాచుకొని ఇంటి ముఖం పట్టెడు.
    చావిట్లో నే కుటుంబసభ్యులంతా గుమిగూడి ఉండడం చూసి, ఏం మాట్లాడాలో , ఎలా మాట్లాడాలో బోధపడక కొంచెం సేపు తికమక పడ్డాడు. అప్పటికి ఏ మాటా నోటికి రాలేదు.
    "ఏం వర్షం , ఏం వర్షం! కొట్లోంచి కాలు కదప నివ్వలేదు" అన్నాడు అరుగు అంచుకు పోయి బట్టలు పిండుకుంటూ.
    "ప్రకాశం , సాంబు పరీక్ష పోయింది" అన్నాది జానకి.
    "అవును, ఉదయం పేపరు చూసేను."
    "చూసేవా, ఇప్పటి వరకు ఇంటికి రాకుండా తిరిగేవు?" అన్నది కనకం.
    "నే వచ్చి చేసేదేముంది , వదినా?"
    "సాంబు కోసం వెతికేవాడివిగా?"
    "ఏం, సాంబు ఇంట్లో లేడా?"
    "ఉదయం నుండి ఇంటికి రాలేదు"
    ప్రకాశం పిండు కొంటున్న బట్టల్ని వదిలి పెట్టేడు. "ఆ గొడుగు , లాంతరూ ఇలా ఇయ్యండి, వదినా!"
    "ఈ వర్షంలో ఎక్కడికి రా?" అన్నాడు సూర్యారావు.
    "ఎక్కడికేమిటి? వెతికిందికి." ప్రకాశం ఆ మాట అంటూనే గుమ్మందిగేడు.
    "ఉండు నేనూ వస్తున్నాను. "పంచ పైకి ఎగకట్టి తమ్ముణ్ణి అనుసరించేడు సూర్యారావు.
    "వెళ్తున్నప్పుడే చాలా నీరసంగా ఉన్నాడు, వదినా! ఎక్కడా ముఖం తిరిగి పడిపోయి ఉండడు కదా?" అన్నది జానకి.
    "అలా జరిగి ఉండదు , జానకీ! ఒకవేళ అటువంటి దేమైనా అయితే కూడా ఉన్న పిల్లలు వదిలేస్తారా? ఇంటికి దిగబెట్టరూ?" అన్నాది కనకం.
    రాత్రి రెండు గంటల దాకా వదినా, మరదళ్ళు ఒకరి కొకరు ధైర్యం చెప్పుకొంటూ అలాగే కూర్చున్నారు. అనుకోని ఈ సంఘటన అరగించుకోలేనట్లు, ఒక గోడకు చేరగిలబడి కళ్ళు మూసుకొని కూర్చున్నది శాంత. సుందరమ్మ తనలో తనే ఏదో మాట్లాడుకొంటూ, కళ్ళు వత్తుకొంటూ కూర్చున్నది.
    రెండు గంటల ప్రాంతంలో అన్నాదమ్ములిద్దరూ ముఖాలు వేలాడేసుకుని వచ్చేరు.
    "అన్నీ గాలించెం, ఎక్కడా కనిపించలేదు. ఇంక తెల్లవారితే కాని, చెయ్యగలిగింది ఏమీ లేదు" అన్నాడు సూర్యారావు నిరాశగా.
    "సాంబు ఎటువంటి బట్టలు వేసుకొన్నాడు వదినా?" ప్రకాశం ప్రశ్నించేడు.
    "తెల్ల పేంటు, తెల్ల షర్టు."
    "ఎందుకైనా మంచిది, పోలీసు రిపోర్టు ఇచ్చి వస్తాను."
    ప్రకాశం వెళ్ళేసరికి అక్కడో పోలీసు కుర్చీలో కునికిపాట్లు పడుతున్నాడు. ప్రకాశం చెప్పిన వివరాలు నాలుగు పుంజీలు తప్పులతో వ్రాసుకొన్నాడు. ఇప్పటి వరకు ఇటువంటి అబ్బాయి గురించిన భోగట్టా ఏదీ మీ దృష్టిలోకి రాలేదా -- అని ప్రశ్నించేడు ప్రకాశం. "లేదని చెప్తున్నాను కదయ్యా" అన్నాడు అతడు పెద్దగా అరుస్తూ. ప్రకాశం గేటు దాటాక ముందే అతని గుర్రు గట్టిగా వినిపించింది.
    ఆ రాత్రికి ఇంట్లో ఎవ్వరూ కన్ను మూయ్యలేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. తెల్లవారుజాము నాలుగు గంటలైంది. ప్రకాశం లేచి బట్టలు వేసుకొంటూన్నాడు.
    "ఎక్కడికిరా?' జానకి ప్రశ్నించింది.
    "పనిలోకి. మన విచారంతో ప్రపంచానికి సంబంధం లేదు. అంతా పేపర్లు కోసం ఎదురు చూస్తుంటారు." అన్నాడు చెప్పులుతొడుక్కుంటూ                                                                                                                                                                                                      


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS