Previous Page Next Page 
పన్నీటి కెరటాలు పేజి 26


    ఇన్ స్పెక్టరు ఎందుకు ఇష్ అన్నాడో అహోబిలానికి అర్ధంకాలేదు.
    "ఏమిటి?" అన్నట్లు కళ్లెగరేశాడు.
    "ఇప్పుడు మనం మారువేషాలతో ఉన్నాం. నన్ను నువ్వు సార్ అని పిలవకూడదు. వేషం మార్చినప్పుడు భాష కూడా మార్చాలని చెప్పానా లేదా. ఇప్పుడు మనిద్దరం ఏ వేషాలలో వున్నాం?" ఇన్ స్పెక్టరు అడిగాడు.
    'పల్లెటూరి బైతులు వేషాలలో వున్నాం, కంగారుగా చెప్పాడు అహోబిలం.
    "నువ్వు చెప్పింది కరెక్ట్. మన వేషాలు రైతులవి అయినా మనం మెలగాల్సింది తెలివితక్కువ బైతుల్లాగానే. అప్పుడు ఎవరికీ మనమీద అనుమానం రాదు. మనం భాష కూడా యాసగానే మాట్లాడాలి. వెర్రి భక్తుల్లాగా ప్రవర్తిస్తూ అలాగే మాట్లాడాలి. బాగా గుర్తుంచుకో. మళ్ళీ సార్ అని పిలిచి నా పరువు గంగలో కలుపకు"
    'అలాగే, సా.........' సార్ అనబోయి 'సా' దగ్గరే ఆగిపోయాడు అహోబిలం.
    "నా పేరు రామన్న, నీపేరు లచ్చన్న, ఇప్పుడు మనం మారువేషాల్లో ఉన్నాం కాబట్టి నన్ను నీవు రామన్నా అని నేను నిన్ను లచ్చన్నా అని పిలుచుకుందాం. నేను ఆజ్ఞాపిస్తున్నానని కాబట్టి నువ్వు నన్ను అలా పిలవవచ్చు పరవాలేదు. వేషానికి తగ్గట్టు ప్రవర్తించాలి, అదిమాత్రం మరచిపోకు.'
    "అయితే నేను కుంటుకుంటూ నడవనా?' అడిగాడు అహోబిలం.
    'నువ్వు కుంటుకుంటూ నడవనక్కర్లేదు. దేక్కుంటూ పోనక్కర్లేదు. నోరు మూసుకుని నా ప్రక్కనే రా' ఆ మాట అంటూనే వర్ధనరావు ముందుకు సాగాడు.
    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు వెనుకనే సాగాడు అహోబిలం.
    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు, కానిస్టేబుల్ అహోబిలం చాలా కష్టపడి పల్లెటూరివారి వేషాలు వేసుకున్నారు. ఇద్దరూ తలకి తలగుడ్డలు చుట్టుకున్నారు. నెత్తిన టోపీలు వుంచుకోవటం వారికి అలవాటే కాబట్టి తల గుడ్డలు వారికేమీ బరువు అనిపించలేదు. ఇద్దరూ పంచెలు కట్టుకుని, ముతక చొక్కాలు వేసుకున్నారు. మెడకీ జబ్బలకి తాయెత్తులు కట్టుకున్నారు. కాళ్ళకి కిర్రుచెప్పులు వేసుకున్నారు. ఇద్దరి చేతుల్లో గుడ్డ సంచీలు పుచ్చుకుని వేషం బాగానే ధరించారు.
    నుదుటిమీద బారుగా అడ్డంగా విభూతి రేఖలు, రెండు కనుబొమ్మల మధ్యా పెద్ద కుంకంబొట్టు, మీసాలకి బాగా నూనె పట్టించి క్రిందకి దువ్వారు. నూనె వల్ల ముఖమంతా జిడ్డు ఓడుతూ వుంది. మొత్తానికి వాళ్ళ రూపాలు పూర్తిగా మార్పు చెందాయి.
    జనానికి దూరంగా వుండి మాట్లాడుకోవటం వల్ల వారి మాటలు ఎవరూ వినలేదు.
    పది నిమిషాల తరువాత వాళ్ళిద్దరూ జనంలో కలసిపోయారు.
    ఒక చెట్టుక్రింద రెండు రాళ్ళు పాతివున్నాయి. ఆ చెట్టుకి వ్రేలాడుతూ ఒక గంట వుంది. అప్పుడు అనేవాడు అక్కడనించుని ఆ స్థలం ప్రాముఖ్యత అక్కడవున్న భక్తులందరికి వివరించి చెబుతున్నాడు. వర్ధనరావు, అహోబిలం అక్కడికి వెళ్ళారు. అక్కడ జరుగుతున్నది చూస్తూ నుంచున్నారు, చుట్టూ మూగిన భక్తులకి చెబుతున్నాడు అప్పుడు.
    "పూర్వం అమ్మవారు ఈ చెట్టుకి ఉయ్యాల వేసుకొని ఊగేవారు. ఈ చెట్టు కొన్ని వందల ఏళ్ళ క్రితంది. ఉయ్యాల వూగీవూగీ అమ్మవారికి అలుపు వచ్చేసరికి ఇదిగో రాళ్ళు ఉన్నచోట కొద్దిసేపు విశ్రాంతిగా కూచుని వెళ్లారట. ఈ గంట మ్రోగించి ఈ రాళ్ళమీద రెండు చేతులూ ఉంచి కళ్ళకద్దుకుని చెట్టు మొదటిలోని మట్టిని నుదుటికి అద్దుకుంటే సర్వ పాపాలూ హరిస్తాయట. అమ్మవారి దయ వాళ్ళమీద ఎప్పుడూ వుంటుందిట." అని అప్పుడు చెబుతూంటే భక్తులు బహుశ్రద్ధగా విని, ఒక్కో భక్తుడు ముందుకువచ్చి చెట్టుకు ఉన్న గంటను ఒకసారి మ్రోగించి, రాళ్ళ మీద చేతులుంచి కళ్ళకి అద్దుకుని చిటికెడు మట్టి తీసుకుని నుదుటికి అద్దుకుని కొందరు అదే చేత్తో నోట్లో ఆ మట్టిని కొంచెం వేసుకుని చప్పరించటం చేశారు, అలా చేసిన ప్రతి భక్తుడూ అక్కడే ఉన్న హుండీలో, ఎంతోకొంత వాళ్ళకి తోచినంత కానుకలు (డబ్బు) తీసి హుండీలో వేసి పోతున్నారు.
    అప్పుడు కాషాయరంగు గుడ్డల్లో ఉన్నాడు. గడ్డాలూ, మీసాలూ, తలవెంట్రుకలూ బాగా పెంచాడు. అడ్డ బొట్టూ నిలువు బొట్టూ పెట్టుకుని మెడలో రుద్రాక్షలు వేసుకుని ఉన్నాడు. అయినా కూడా అప్పడిని గుర్తుపట్టాడు అహోబిలం,
    అప్పుడు గతంలో సైకిళ్ళ దొంగ.
    అప్పడిని చూస్తూనే అహోబిలం గుర్తుపట్టాడు. వెంటనే అహోబిలం ఇన్ స్పెక్టరు చెయ్యి పట్టుకుని "నీ చుట్టల కట్టా, అగ్గిపెట్టె అక్కడే మరచిపోయి వచ్చాను, తొందరగా వెళ్ళి తెచ్చుకుందాం పద. లేకపోతే ఎవరో ఒకళ్ళు తీసుకుపోతారు" అన్నాడు అహోబిలం,
    "ఇంకా అక్కడ ఉంటుందా చస్తుందా! ఈ పాటికి ఎవడో ఒకడు కొట్టేసే ఉంటాడు" అన్నాడు వర్ధనరావు.
    "ఎందుకయినా మంచిది ఒకసారి వెళ్ళి చూద్దాం. మంచిరకం లంక పొగాకు చుట్టలు, అవి పోతే మళ్ళీ దొరకవు పదపద" అన్నాడు అహోబిలం బయలుదేరుతూ.
    అహోబిలం బయలుదేరటంతో వర్ధనరావు కూడా బయలుదేరాడు అహోబిలం వెనుకనే.  
    వాళ్ళిద్దరూ వేషాలు మార్చుకుంటున్నప్పుడే అనుకున్నారు "వాళ్ళిద్దరిలో ఎవరయినా సరే. ముందు ఎవరు రహస్యం తెలుసుకుంటారో ఆ రహస్యం తెలుసుకున్నవాళ్ళు రెండవవారికి అర్ధమయ్యేలా లంకపొగాకు చుట్టలూ మరచిపోయి వచ్చాము' అనుకుంటారు. కోడ్ భాష ఉపయోగిస్తూ ఇలా మాట్లాడుకోంగానే అవతలకి వెళ్ళాలన్నమాట. అక్కడ అసలు విషయము చెప్పుకుంటారు. ఇప్పుడు వాళ్ళు అదే పనిమీద అవతలకి వెళ్ళాడు.
    వర్ధనరావు అహోబిలం కొద్దిప్రక్కగా వెళ్ళి అక్కడ ఎవరూ లేకుండా చూసుకుని నుంచున్నారు.
    "ఇంతలో ఏం రహస్యం కనిపెట్టావని ఇవతలకి లాక్కొచ్చావు?" కోపంగా అడిగాడు వర్ధనరావు.
    అహోబిలం నెమ్మదిగా చెప్పాడు.
    అక్కడ చెట్టుక్రింద నుంచుని పూజ చేసేది సైకిళ్ళ దొంగ 'అప్పుడు' అండీ! దొంగ సన్యాసి వేషంలో అక్కడ నిలబడి భక్తులకి ఆ మాటలూ ఈ మాటలూ చెప్పి డబ్బులు సంపాదిస్తున్నాడు. మరో క్రొత్త అవతారము ఎత్తాడు."
    "అరె! నిజంగానా? నువ్వు చెప్పేది నిజమేనా?" వర్ధనరావు ఆత్రుతగా ఆశ్చర్యంగా అడిగాడు.
    "నిజమనేదానిలో ఎంతమాత్రం సందేహం లేదండీ. సైకిళ్ళ దొంగ అప్పడికి మెడమీద రెండు పుట్టుమచ్చలు ఉన్నాయి. వాడు వంగినప్పుడు గడ్డం కాస్త ముందుకి రావటంతో మెడమీదవున్న పుట్టుమచ్చలు చక్కగా కనిపించాయి. కంఠస్వరం కూడా అదే"
    "అయితే ఇంకేం, మరీ మంచిది. రాత్రికి మాటు వేసి వాడిని పడదాం. ప్రతిరోజూ అక్కడ వచ్చిన డబ్బుల్లో సగం మాకిస్తే సరే లేకపోతే, బొక్కలోకి తోస్తానురా నా కొడకా అని చెపుతాను. 'సైకిళ్ళని పట్టుకొని వాటిని దాచి ఈ గోల బదులు ఇలాంటి కేసుల్ని పట్టుకుంటే తేలిగ్గా నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇలాంటి కేసులే ఇంకా తగులుతాయేమో, నేనూ చూస్తుంటాను. నువ్వు జాగ్రత్తగా చూస్తూండు" అన్నాడు వర్ధనరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS