Previous Page Next Page 
తుపాన్ పేజి 25

    నీలాలైన ఆ సముద్ర కెరటాలు మమ్మాహ్వానించినవి.  సముద్రం హోరులో భై రవరాగాలాపన పరమాద్భుతమై నాకు వినిపించింది. మేఘాలు  లేని నీలాకాశం, కొంచెం పడమటకు వాలి ఉన్న సప్తమినాటి చంద్రుడు, వెన్నెలకిరనాలల్లో భై రవరాగమూర్తికి  ప్రణయదేవినైన దేవక్రియా రాగిణీదేవి తన కిన్నెరీకంఠమును సవరించుకొని  శ్రుతి కల్పినది. నేనా బంగారపు ఇసుకమీద తక్కిన మువ్వురివెనకా శకుంతలా స్మృత్యారాధన శాంతిలో నిశ్చలుడనై కూర్చుంటిని.

    ఆ విచిత్ర బాలిక హేమ నీకు ప్రజ్ఞాపరిమితి అని ఆ బౌద్దాచార్యులు నాకు సెలవిచ్చినారే? అతడు తన దివ్య శక్తితో  ఈ బాలికను పార చూచినాడు. ఈ బాలిక కొరకేనా నన్నా పవిత్ర త్రివిష్టవ ప్రదేశాలనుండి పంపించినది? ఆ కైలాసపర్వతముల  దివ్యభూతముల నుండి ఈమె కొరకేనా నేను వచ్చినాను? చదువుకొన్నది, కళారహస్యాలర్ధము చేసికొంటుంన్నది. అత్యంత సూక్ష్మగ్రహణ  శక్తి గలది. ప్రతిభావంతురాలు. ఐనా యీమెలో ఏమిటో లోటు. ఇంకనూ చిన్నబిడ్డా? ఈ బాలిక పరమాద్భుత బాహ్య సౌందర్యమూ, ఆ సౌందర్యంలో వదిగింపబడిన ఒక తేజస్సూ  అన్నింటికన్నా నా దివ్య దేవీమూర్తికి  సరిపోవు పోలికలూ న న్నీమెకు  దాసుణ్ణి  చేసినవి. నా హృదయ మామె  తెలిసికొనలేదు. ఆమెకు నా పైని ఉన్న భావము నాకు సువ్యక్తము. హేమకుసుమదేవీ! నీలో తుపాను చెలరేగబోతున్నది.

    చంద్రుడు పశ్చిమానికి  దిగుతున్నాడు. వాళ్ళు మువ్వురూ కిలకిల లాడుతున్నారు. హేమ ''త్యాగతీ! రావయ్యా, అంతా బడాయే'' అన్నది.

         
                      *       *       *  
              

    శకుంతల ఫోటోలను చూచి నా హృదయంలోని  ఆమె మూర్తిని తలుచుకొని ఒక శిల్పం వెనుక రచించాను. మాగురువుగారు  సెబాసన్నారు. కాని అసలు శకుంతలను  ఈ బొమ్మను ఎలా పోల్చగలం? ఆ బొమ్మను  ఆ దసరా బొమ్మలమధ్య  అలంకరించాను. ఆ బొమ్మ చుట్టూ నేను మదరాసు నుంచి  తీసుకువచ్చినవి, శకుంతల బొమ్మల్లోని మంచివి అమరించినాను. ఉదయమే శకుంతల హేమను తీసుకువచ్చింది. తన బొమ్మను చూచుకొని ఆశ్చర్యపడిపోయింది. ఆమె  చిన్న హృదయంలో  ఎలాంటి భావాలు  ఉదయించాయో! ఆమె తేజస్సుతో వెలుగుతూ ఒక దివ్య పూజామూర్తిలా  తన చెల్లెలి చెయ్యి పట్టుకొని నిలిచిపోయినది. పండుగైన వెనుక చెన్నపట్టణం వచ్చాను.

    రోజూ పదిగంటలకు కళాశాల తెరుస్తారు. కార్లమీద  వచ్చేవారున్నారు. ఆడపిల్లలూ, మొగపిల్లలూ, విక్టోరియా హాష్టలులోనూ  ట్రిప్లికేసులోనూ  ఉండేవారంతా నడిచేవస్తారు. ఎక్కువభాగం సైకిళ్ళమీద  వస్తారు. విద్యార్ధినులు కొందరు రిక్షాలమీద  కూడ వస్తూంటారు. గంటకొట్టి, పని ప్రారంభించే లోపుగా వరండాలో తిరుగుతూంటాము. క్లాసుల్లోకే వెళ్ళి కూచుంటూ ఉంటాము. బాలికలు మాత్రం వారి విశ్రాంతి మందిరంలో వుంటారు.

    మా విద్యార్దులు  ధరించుకునే  దుస్తులు మాత్రం ఎంత వివిదత్వాన్నైనా ప్రదర్శిస్తూంటాయి. ఇంగ్లీషు డిన్నరు పార్టీకి వెళ్ళే మొదటి తరగతి ఆంగ్లో సాక్సన్  దొరలారా  తయారై  వస్తాడొకడు. ఫస్లుక్లాసైన సాంబారయ్యరులా  తయారై వస్తాడొకడు. గాంధీ  సేవాసంఘంలోకి  వెళ్ళే అహింసావాదిలాగ ఖద్దరులాల్చీ, ధోవతి, టోపీ పెట్టుకొని ఒకడు, వారం రోజులై మడతలుపోయి దుప్పటిగుడ్డల్లా ఒదులైన డ్రాయర్స్ తొడుక్కొని రైల్వేదొరల కోట్లంటి కోట్లు ధరించి ఈరెండింటి! గూడా అపశ్రుతి అయ్యే టై  తగిలించుకొని ఒకడు, పూర్వాచారానికి  విరుద్దంగా వుండడాని కిష్టంలేక ఉంచుకున్న సందెడు కురులనూ హేట్ల క్రింద దాచడానికి వీల్లేదు గాబట్టి, మా సంస్కృతం అయ్యరు మాష్టారుల  బ్రహ్మాండమైన తలపాగావంటివి  చుట్టుకు వచ్చే విద్యార్ధులు కొందరు.


    ఆక్స్ ఫర్డులోనూ,  హార్వర్డులోనూ  ఇంకా ఇతర  ఇంగ్లీషు, అమెరికన్ కళాశాలల్లో  విద్యార్ధులందరికీ ఒకటే రకం  డ్రస్సు వుంటుందని విన్నాము. కాని  హిందూదేశంలో ఏ  యిద్దరు  విద్యార్ధులకూ ఓకే రకమైన దుస్తులు మాత్రం ఉండవు.  దుస్తుల విషయంలో మాకున్న భిన్నత్వం మరే జాతిలో ఎప్పుడూ, ఎక్కడా ఉండదని ఘంటాపథంగా  చెప్పవ్సచ్చు.

    కాలేజీకి వచ్చే విద్యార్దినులంతా ఎంతో అందంగా అల్సంకరించుకొని వస్తారు. వారు కట్టే చీరల్లో, ధరించే రవికల్లో, అలంకరించుకొనే భూషణాలలో, తలమీద మనోజ్ఞంగా తురుముకొనే పువ్వులలో ఎంతో వివిదత్వమున్నా, అద్భుతమైన సుందరత్వము తొణికిసలాడుతూ ఉంటుంది. వారి అలంకారాల్లో ఒక విధమైన అమెరికా ఉంటుంది.

    మాలో అన్ని బాషలవారూ వున్నారు. తెలుగువారు, అరవవారు, కన్నడులు, మలయాళులు, సిరియన్ క్రిష్టియన్లు, సిరోయన్ యూదులు, యూరేషియన్లు, తంజావూరి మహారాష్ట్రులు, పారశీకులు, మహమ్మదీయులు,  హిందువులు, భౌద్దులు, ఆర్యసమాజిస్టులు, వైష్ణవులు, హైందవ క్రిష్టియనులు, ఒకరనగా నేమిటి, మా కాలేజీ ఒక ప్రపంచమే! భాషలను బట్టి, మతాలననుసరించి, జిల్లాలను లెక్కించుకొని స్నేహాలు జట్టులు ఏర్పడుతూంటాయి. సాధారణంగా తెలుగువాళ్ళు ఒకటౌతారు. అందులో జిల్లాలు తేడాలు వస్తుంటాయి కూడా.

    ఇది మాకూ, ఆచార్యులవారలకూ ఉండే సంబంధము సారె  తంతి అల్లికవంటిదే. వా రెవరో మే మెరుగము. మే మేవర మో  వా రెరుగరు. క్లాసులోకి వెళ్ళి కూచోగానే ఆచార్యులవారు  చక్కగా వస్తారు. అటెండెన్సు తీసుకుంటారు. అక్కడ నుంచి ఆయన ఉపన్యాసం ప్రారంభిస్తారు. అతి జాగ్రతైన విద్యార్దులు అది నోట్సు తీసుకుంటారు. మధ్యరకంవారు శ్రద్దగా వింటారు. ముడోరకంవారు వింటూ వుంటారు, వినకుండానూ ఉంటుంటారు. నాలుగో రకంవారు నావల్స్ ఏదో చదువుకొంటూంటారు. ఐదవ రకంవారు  నిద్రపోతారు, ఆచార్యులవారు కని పెట్టకుండాను ! ఇంతకన్న మాకూ, ఆచార్యుల వారికీ ఉండే సంభంధం ఏమి ఉంది?

                                                     9

    నేను లెక్కలూ, పదార్థ  విజ్ఞానశాస్త్రమూ,  రసాయనశాస్త్రమూ  పాఠ్యములుగా ఏరుకున్నాను.  క్రొత్తలో ప్రెసిడెన్సీ  కళాశాల అంటే భయమే వేసింది. కాని, విద్యార్ధుల వివిధత్వమే  ఆ భయాన్ని చాలా తీసివేసింది. నేను జాగ్రత్తగా వేసుకున్న సూటును చూచి ఎవరేమనుకుంటున్నారో అనే ఆలోచన, నేను వట్టి కొల్లిపర  మనిషిని  గ్రహించారేమో ననే భయము. మా విద్యాశాలనుంచే వచ్చిన ఇంకో విద్యార్డీ, నేనూ ఒకరి కొకరు సహాయమా అన్నట్టుగా ఒక నిముషమైనా  వదలకుండా క్లాసులోనే కూచోవడం, క్లాసు వదలగానే ఇంకో క్లాసుకు వెళ్ళడం. ఈరకంగా ఉండే వాళ్ళము. అక్కడినుంచి  కొంచెంగా బరిమీదపడ్డాను. మదరాసంటే భయం వదిలింది, ప్రెసిడెన్సీ కళాశాల పాతపడిపోయింది. మూడు మాసాల పరీక్షలో కొంచెం బాగానే మార్కులు పై కాయితలమీదికి వచ్చేటట్టు చూసాను. కాని అరవ వాళ్ళతో పోటీ చేయటమంటే మాత్రం హడలే. తెలుగువాళ్ళలో నేను మొదటివాడ నై, అరవవాళ్ళలో ఇంగ్లీషులో పదిమందికి వెనుక ఉన్నాను. సాంబారులో ఉందేమో ఆ మహత్తు! ఆవకాయ పదోప్లేసు తప్ప ఇంకే మివ్వగలదు?
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS