'రోజూ వ్యక్త పరుస్తూనే ఉన్నారు కదా ...."
"అది కాదు శ్యామలా! ఇంతకాలం మనమిద్దరం శారీరకంగా ప్రేమను వ్యక్తం చేసుకుంటున్నాం. కానీ అందుకు కారణం మనిద్దరి మనసులూ కలవడమేనన్న సంగతి నాకు తెలుసు కానీ మనమెప్పుడూ ఒకరినొకరు మానసికంగా తృప్తి పర్చుకునే అవకాశం లేదు."
"శరీరాలు తృప్తి చెందితే మనసుకు తృప్తి కలగదా?"
"కలగదు శ్యామలా! ఉండహరణకు నీకు లాటరీ లో పది లక్షలు వచ్చేయనుకో -- నాకోసం ఏం చేస్తావు? నాకు లాటరీలో పది లక్షలువస్తే అదంతా నీపెరిట దస్తావేజు రాస్తాను. ఎలా రాస్తానో చూద్దువు గానీ ---" అంటూ లెటర్ పాడ్ లో ఒక కాగితం మీద ప్రేమ దస్తావేజు రాశాను.
శ్యామల అది చదివింది. ఆమె కళ్ళు మెరిశాయి.
"చూశావా ? నా చర్య నీ కెంతో తృప్తి నిచ్చింది. అలాగే నీవేం చేయడల్చుకున్నావో నాకు రాసి ఇయ్యి--" అన్నాను.
ఆమె ఉత్సాహంగా ఏమో రాసి సంతకం చేసి నా కిచ్చింది. అది చదువుతూనే -- నేను ఒక్క ఉదుటున ఆమెను బలంగా కౌగాలిన్చుకున్నాను. "ఏమిటిది?" అందామె.
"ఈరోజు నాకెంత తృప్తిగా ఉందో చెప్పలేను. నిజంగా నామీద నీకింత ప్రేమా?" అన్నాను. ఆమె కళ్ళలో వెలుగు, అభిమానం కనిపించాయి.
"భగవంతుడు ప్రత్యక్షమై నీ కోరికలన్నీ ఒక ఉత్తరంగా రాసి నాకు పంపితే అన్నీ తీర్చేస్తానన్నాడనుకో ఉత్తరమేలా రాస్తానో తెలుసా?" అన్నాను నేను. ఆమె కుతూహలంగా నా వంక చూసింది. నేను రాయడం మొదలు పెట్టాను. నేనూ రాస్తుండగానే ఆమె చదవడం మొదలు పెట్టింటి. నేను రాయడం పూర్తీ కాగానే ఆమె నా ముఖం నిండా ముద్దులు కురిపించింది.
"మరి నువ్వో?" అన్నాను. శ్యామల రాసింది. ఎంత బాగా రాసిందో చెప్పలేను. ఈసారి ఆమెను కౌగలించుకోలేదు. హటాత్తుగా నిరుత్సాహంగా కూర్చుని "మనిద్దరం ఇంతగా ప్రేమించుకున్నాం గదా మనలో ఏ ఒక్కరు లేక పోయినా --"
శ్యామల నా నోరు మూసింది. మృదువుగా విడిపించుకుని "ఆ ఆలోచనే నామతి పోగొడుతుంది" అన్నాను.
"మీరు లేకపోతె నేను పిచ్చిదాన్నై పోతాను" అంది శ్యామల.
"నేను ప్రపంచం మర్చిపోలేని ఒక ఆదర్శ ప్రేమలేఖ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంటాను" అన్నాను. అంటూనే ఒకవిషాద భరిత లేఖ రాసి సంతకం పెట్టాను. శ్యామలకూ ఆవేశంవచ్చినట్లుంది. ఆమె కూడా ఒక దీర్ఘ లేఖ రాసి సంతకం పెట్టి నా చేతికిచ్చింది. అది చదివాను. తన చావును నేను భరించలేనని ఆమె అనుకుంటోంది. ఆ భావనతో నా చావును భరించలేనంటూ ఒక లేఖ రాసింది. అది చాలా పెద్ద లేఖ. ఆలేఖను నేనామెను హత్య చేయడం కోసం ఉపయోగిడ్డామనుకుంటున్నాను.
ఆ లేఖ పూర్తిగా చదివేక నాకుకలిగిన ఉత్సాహమింతా అంతా కాదు. జీవితంలో తను ప్రేమించిన ఒకే ఒక వ్యక్తీ మరణించేక ఇక సారం కనబడడంలేదనీ -- బ్రతుకు అర్ధంతెలియడం లేదనీ -- త్వరగా తనువూ చాలించి స్వర్గ లోకంలో తన భర్తనుకలుసుకోవాలనుకుంటున్నదనీ రాసిందామే. చివర ఆమె సంతకం అందంగా మెరుస్తోంది. ఉత్సాహంతో ఆమెను గట్టిగా కౌగలించుకున్నాను. ఆమె మనోహరంగా నవ్వింది.
గదిలో ఒక గంటసేపు చీకటి రాజ్యం చేసింది.
"మరి వెడతాను" అందామె లేస్తూ.
"ఈరోజు స్పెషల్ గదా రెండు గ్లాసులతో పాలు సిద్దంగా ఉన్నాయి మరి" అన్నాను.
ఇద్దరం చెరో గ్లాసు తోనూ పాలు తాగం. ఆమె వెళ్ళబోయింది. "నీ ఉత్తరం!" అంటూ ఆమెకు అందించాను. "ఊ" అని విసుగ్గా ఆమె జాకెట్లోకి తోసేసి వెళ్ళి పోయింది. నా చేతులు వణుకుతున్నాయి. ఆమె మరి రాదు. ఈ రాత్రితో ఆమెకు నాకూ సరి!
ఆమె వెళ్ళిపోయింది. నేను వెళ్ళి శుభ్రంగా రెండుగ్లాసులు కడిగేశాను. ఆమె తాగిన పాలలోని విషం ప్రభావం వల్ల మరొక్క రెండు గంటలలో ఆమె మరణిస్తుంది. వణుకుతూనే నా గదిలో ఆమె రాసిన ఇతర కాగితాలన్నీ ముక్కలు ముక్కలు చేసి లెట్రిన్ లో ప్లష్ లో కొట్టేశాను.
3
ఇదీ నా ప్లాను. నా అభిప్రాయంలో చాలా చాలా చక్కటి ప్లాను. జాగ్రత్తగా ఏ పని ఏ వరుసలో జరగాలో ఆకాగితం మీద రాశాను. ఒకసారి చదువుకున్నాను. ఆ ప్లాను చదువుకున్నాక నాలాంటి తెలివైన వాడు హత్య చేస్తే దేవుడు కూడా పట్టలేడనిపించింది.
నా గదిలోంచి కొట్టు గది ద్వారా శ్యామల గదిలోకి వస్తున్న వివరం గురించి ఎవరూ తెలుసుకోలేరు. అందుకు సంబంధించిన జాగ్రత్తలన్నీ శ్యామల చాలా పక్కాగా ఏర్పాటు చేసుకుంది. శ్యామల దగ్గరున్న ఉత్తరం ఆమె తాగిన విషం ఆమె ఆత్మహత్య ని ధ్రువ పరుస్తాయి. మూడు వంతులు శ్యామల తలిదంద్రులీ విషయాన్ని పోలీసుల దాకా వెళ్ళనివ్వరు. నన్ను గురించి ఎవ్వరూ ఏ విధంగానూ అనుమానించలేరు.
నెమ్మదిగా నిద్రకు పడ్డాను. అంత బాగా నిద్ర పట్టలేదు. కలత నిద్రలో ఎవ్వరో నా గదిలోకి వచ్చి టేబిల్ మీద నేను రాసిన కాగితాలన్నీ చూసినట్లూ నామీద హత్య ప్రయత్న నేరం ఆరోపించినట్లూ అనిపించి ఉలిక్కిపడి లేచాను. టేబిల్ మీద వున్నా కాగితాలన్నీ తీసుకెళ్ళి పాంటు జేబులో పెట్టేవరకూ తోచలేదు. ఆ తర్వాత కాస్త బాగానే నిద్ర పట్టింది.
మర్నాడు నిద్ర లేచేసరికి బాగా పోద్దేక్కి పోయింది. హడావుడిగా తెమిలి కాలేజీ కి బయల్దేరాను. ఎడ్రస్ రాసిపెట్టి రెడీగా ఉన్న కవర్లో టేబుల్ మీద ఉత్తరం తోసేసి దారిలో పోస్ట్ చేసేశాను. క్లాసులో కుర్రాళ్ళకీ పాఠం చెబుతున్ననన్నమాటే కానీ నా మనసు మనసులో లేదు. రాత్రి నేను చేయబోయే శ్యామల హత్య గురించే పిచ్చిగా ఆలోచిస్తూన్నాను.
శ్యామల వంటి దాన్నిచంపడం ఎంత వరకూ న్యాయమని అంతరాత్మ ప్రశ్నిస్తోంది. "శ్యామలకు నీ తమ్ముడితో సంబంధముందని తెలిసి ఆమెను చంపాలనుకుంటున్నావు? మీ ఇద్దరి సంబంధం తెలిస్తే ఆమె భర్త నిన్నేం చేయాలి ?" అంటోంది అంతరాత్మ.
నేను వినదల్చుకోలేదు. శ్యామల పతిత కావచ్చు. కానీ ఆమె మూలంగా నా భార్యకూడా పతిత కాబోతోంది. నా తమ్ముడు పాడవుతున్నాడు.
ఆమెను చంపాలన్న ఆలోచన క్రమంగా తీవ్రతరమవుతుంది నాలో. మరొక్కసారి నాప్లాను చదవాలనుకున్నాను. ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకోవాలి. అందుకే పాంటు జేబులోంచి కాగితం తీసి చదవసాగాను.
"ప్రియమైన సుబ్బుల్ని దీవించి వ్రాయునది...."
ఉలిక్కిపడ్డాను. గుండె ఆగింది. ఇది నేను నా భార్యకు రాసిన ఉత్తరం. మరి ఉదయం భార్యకు పోస్టు చేసినది...." అమ్మ బాబోయ్!
శ్యామలకూ నాకూ ఉన్నసంబంధం , శ్యామలకు నా తమ్ముడి తో పరిచయమైన సంగతి , ఆమె వాడిని దేనికి ప్రోత్సహిస్తున్నదీ ఆమెను నేనేవిధంగా చంపదల్చుకున్నదీ అన్నీ వివరంగా రాశాను ఆ కాగితంలో. అది కూడా -- శ్రీమతికి రాసిన లెటర్ పాడ్ లోని కాగితం మీద రాశాను. రెండూ మడత పెట్టి ఉన్నాయి. ఎంతో జాగ్రత్తగా ఉండాలనుకుంటూనే చాలా పెద్ద పొరపాటు చేసేశాను.
శ్రీమతికి నా ఆయువు పట్టు పోస్టు చేసేశాను. అది ఆమె చదివిందంటే కొంప మునిగిపోతుంది.
ఒక్కక్షణం మతి పోయినట్లయినా త్వరగా బుద్ది పని చేసింది. ఉత్తరం ఎక్కణ్ణించి పోస్టు చేశానో గుర్తుంది అక్కడ క్లియరెన్స్ సుమారు ఒంటిగంట ప్రాంతాల. ఇప్పుడు టైము అయిదు నిముషాల ఒంటిగంటయింది. సాధారణంగా పోస్టు మాన్ క్లియరెన్స్ కాస్త లేటుగానే చేస్తాడు. ఉరకలు పరుగుల మీద వెడితే అక్కడి కక్కడే ఆ ఉత్తరం సంపాదించవచ్చు.
ఒక సైకిల్ పుచ్చుకుని అక్కడికి వెళ్ళాను. పోస్టు బాక్సు మీద ఇంకా 1-05 అని రాసి ఉంది. అంటే క్లియరెన్స్ కాలేదన్న మాట. మనసు కుదుటపడింది. టైము చూసుకున్నాను. 1-10 అయింది. ఆలస్యంగా క్లియరెన్స్ చేసే పోస్టుమాన్ ని ఆ క్షణంలో అభినందించకుండా ఉండలేక పోయాను.
టైము గడుస్తోంది. ఒంటిగంటన్నరయినా పోస్టు మేన్ రాలేదు. అతగాడి అలశ్యానికి నా ఒళ్ళు మండసాగింది. కాస్త ఆలస్యం ఫరవాలేదు కానీ మరీ ఇంత అలస్యమా అని విసుక్కోసాగాను. టైము రెండు కావచ్చెసరికి నాకు విపరీతంగా చిరాకు, కొద్దిగా అనుమానమూ కలగసాగాయి. ఆ సమయంలో ఆపద్భాందవుడిలా వచ్చాడు పోస్ట్ మెన్ . అతగాడు జేబులోంచి తాళాలు తీసి బాక్సు ఓపెన్ చేయబోతుండగా - "ఒంటిగంటా అయిదు నిమిషాలకి క్లియరెన్స్ అంటే-- రెండూ అయిదుకి చేస్తున్నావు" అన్నాను.
అతగాడు నాకేసి చిత్రంగా చూసి, "క్లియరెన్స్ ఒంటిగంటకే చేసేశానండీ -- అయితే టైము బిళ్ళ మార్చడం మరిచిపోయాను. ఉత్తరాలను పంపించే పని పూర్తీ చేసుకుని బిళ్ళ మార్చడం కోసం వచ్చాను" అన్నాడు.
మళ్ళీ మరోసారి గుండె ఆగింది. క్లియరేన్సు టైమింగు మార్చి పొస్టుమేన్ వెళ్ళిపోయాడు. నేనుమాత్రం మరి కాసేపు అక్కడే వుండిపోయాను. ఉత్తరం నా చేయి దాటిపోయిందనీ -- నేను ప్రమాదంలో ఇరుక్కున్నాననీ అర్ధమై పోయింది. హాయిగా సాఫీగా నడిచిపోతున్ననా జీవిత నౌక ఇప్పుడు పెను తుఫాను నేడుర్కోబోతోంది. నా ఇబ్బందులన్నింటికీ కారణం ఒకే ఒక చిన్న ఉత్తరం అని నా శ్రీమతి అందకుండా ఆపాలి.
