శ్యామల ఆత్మహత్య !
వసుంధర
"శ్యామలను చంపేయాలి!" అనుకున్నాను.ఇది సామాన్య మైన నిర్ణయం కాదు. నా దృడ నిశ్చయం.
శ్యామల తెలిసి నాకే అపకారమూ చేయలేదు. పైగా ఎన్నో ఉపకారాలు చేసింది. నా దగ్గర ఆమెకు ఏ రహస్యాలూ లేవు. ఆమెకు వివాహమై రెండు సంవత్సరాలు గడిచింది. అయినా ఏడాదికి నాలుగైదు సార్లు పుట్టింటికి వస్తుంది. అందుకు ఒకటే కారణం - నేనుండే ఊరూ, అమె పుట్టిల్లూ ఒకటి కావడం.
నాదీ శ్యామలదీ ఈనాటి పరిచయం కాదు. నేను కాలేజీలో బియస్సీ చదువుతున్నప్పుడు ఆమె యస్సేస్సేల్సీ చదువుతుండేది హైస్కూల్లో. మనిషి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండడమే కాక- నాకు అందుబాటులో కూడా ఉండేది. అందుక్కారణం నేను శ్యామలా వాళ్ళింట్లోనే అద్దెకుండేవాడిని. నాకు తోడుగా మా అమ్మమ్మ ఉండేది.
అమ్మమ్మ వంక పెట్టుకుని చాలా తరచుగా మా ఇంటికి వస్తుండేది శ్యామల. పైకి కనబడే నా ప్రవర్తనను బట్టి చాలా బుద్ది మంతుడిలా తప్పు అంచనా వేసిన శ్యామల తల్లి దండ్రులు తరచుగా నా దగ్గర లెక్కలు నేర్చుకోమని పంపించేవారు.
నాలోని ఉపాధ్యాయుడు ఆమెను లెక్కలోకటే కాదనీ- ఇంకా ఏమైనా చెప్పాలని ప్రోత్సహించాడు.
ప్రయత్నాలు మొదలుపెట్టాను. మాకు బోలెడు అవకాశాలు. అమ్మమ్మ పూజలోకి పోయిందంటే, ఒకోసారి గంటదాకా బయటకు రాదు. అలాంటప్పుడు అమ్మమ్మ వంకతో వచ్చే శ్యామలను నెమ్మదిగా నా దారికి తీసుకు రావడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.
ఎవ్వరికీ తెలియకుండా అతి రహస్యంగా శ్యామలను నేను కలుసుకుందుకు ఒక ఉపాయముంది. మా ఇంటి పడక గది తలుపులు తీస్తే శ్యామల వాళ్ళ కొట్టుగది వస్తుంది. ఆ గది అనుకుని ఉన్న గదిని తన పడక గదిగా చేసుకుంది ఆమె. ఆ గది తలుపు లోపల బిగించుకుని, రాత్రి వేళ కొట్టు గది ద్వారా నాపడక గడిలోకి రావడం చాలా సులభం. ఎటొచ్చీ నా భార్యకు దొరకకూడదు మరి. అందుకే శ్రీమతిని ఏదో వంక పెట్టి పుట్టింటికి పంపించేస్తుంటాను. శ్యామల వచ్చినప్పుడల్లా. వెర్రి శ్రీమతి, అదంతా తనమీద ప్రేమే అనుకుంటుంది. ఆమెకు పుట్టింటి వెర్రి, అందువల్ల నన్ను వదలలేనంటూనే అనుమతి లభించగానే వెళ్ళి పోతుంటుంది.
అన్నింటికీ హాయిగా భార్య ఉండగా ఈ కర్మేమిటనుకోవచ్చు -- ఇది విన్న ఎవరైనా?
పొరుగింటి పుల్లకూర సామెత నిజమే అయుండాలి. శ్యామల వల్ల నాకు కలిగే ఆనంద మింతా అంతా అని చెప్పలేను. అందులోనూ నాకులాంటి అవకాశం వస్తే చేతులు ముడుచుకునే మగవాళ్ళు ఎంతమంది ఉంటారు కనుక!
అయితే, ఇప్పుడా శ్యామలను చంపేయాలని నిర్ణయించుకున్నాను. అందులోనూ ఇది సామాన్య నిర్ణయం కాదు. నా దృడ నిశ్చయం.
శ్యామల నాకు చేసిన అన్యాయమేమీ లేదు. మానసికంగా, శారీరకంగా నానుంచి ఏమీ దాచలేదు. బహుశా అదే ఆమె చేసిన తప్పేమో! ఆమె నా దగ్గర దాచని ఎన్నో రహస్యాలలో ఒకటి నాకు చాలా ముఖ్యమైనది. ఆ సంగతి ఆమెకు కూడా తెలియదు. తెలిస్తే కోరి మృత్యువు ఆహ్వానించేది కాదు.
ఎప్పట్లాగే మా ఆవిడ ఊళ్ళో లేదు. రాత్రి పన్నెండు గంటల ప్రాంతాల శ్యామల నాగదిలోకి వచ్చింది. నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. వెళ్ళి బలంగా కౌగలించుకున్నాను. ఆమె నవ్వి, "అందుకే మీరంటే నాకంత ఇష్టం" అంది.
ఆమె నన్ను మీరు అనే అంటుంది. నా భార్య కాలేక పోవడం తన దురదృష్టమంటుంది. నేను ఆమె నెంతవరకూ ప్రేమిస్తున్నానో తెలియదు గానీ విపరీతంగా కామిస్తున్నాను. నా కళ్ళకు-- ఆమె జాకేట్లోంచీ ఒక ఉత్తరం కనబడింది."అదేమిటి?" అన్నాను.
ఆమె చాలా నెమ్మదిగా నవ్వి, ఆ ఉత్తరాన్ని నా కందించింది- "అది మా అయన రాసిన ఉత్తరం. చదువుదామనుకుంటూనే మరిచిపోయాను. ఇక్కడున్నంతకాలం మిమ్మల్ని కలుసుకోవాలనే తప్ప -- మరి దేనిమీదా ధ్యాస ఉండదు" అంది శ్యామల.
గర్వపడ్డాను. ఆ ఉత్తరాన్ని దూరంగా విసిరేశాను. భర్త ఉత్తరం కంటే శ్యామలకు నేను ముఖ్యం.
ఒక గంటసేపు నాతొ గడిపి వెళ్ళిపోయిందామె . ఒకసారి పక్క దులిపి వేసుకుందామనుకున్నాను. దుప్పటి కదిపెసరికి కవరు కనబడింది. అదే - శ్యామల భర్త రాసిన ఉత్తరం . రాశాడో ?
ఒక్క నిముషం ఆలోచించాడు. శ్యామలకు నా దగ్గర ఏమీ రహస్యాలు లేవు... ఆమెకూ భర్తకూ మధ్య ఎటువంటి ఉత్తరాలు నడుస్తున్నాయో చూడాలని పించింది. కవరు చింపాను.
"డియర్ శ్యామూ!
ఈ ఉత్తరం మీ అయన రాసిందనుకుని నువ్వు పొరబడి వుంటావు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండడం కోసం నేనే తెలివిగా ఫ్రం అడ్రస్ మీ ఆయనది రాశాను. ఈ ఉత్తరం రాయవలసిన అవసరం ఎందుకొచ్చింది అంటావా - " నువ్వు లేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇంకా ఎన్నాళ్ళు పుట్టింట్లో ఉంటావు? హాస్టల్లోంచి నీఇంటికి నేను మరీనదెందుకని?
త్వరగా వచ్చేసేయమని కోరుతున్నాను. సెక్సు కు సంబంధించినంతవరకూ నీ సిద్దాంతం నాకు చాలా చాలా నచ్చింది. సెక్సు కు వావివరసలతో నిమిత్తం లేదు . ఏం చేసినా తప్పు లేదు. ఎటొచ్చీ సంఘం హర్షించదన్న భయం ఉంటె - చేసే పని రహస్యంగా చేయాలి అని నువ్వు చెప్పిన సిద్దాంతం నేను రోజుకొకసారి వల్లే వేసుకుంటాను.
'అయితే నీ సలహా ననుసరించి - ఇంకా మా వదిన దగ్గర చొరవచేయడానికి ధైర్యం రావడం లేదు. ఈసారి నువ్వు వచ్చి నాకు మరింత ధైర్యం ప్రసాదిస్తే - తప్పక ఇంట్లో ప్రయత్నించగలను. వివాహమయ్యేవరకు ఏదైనా అవస్థ పడక తప్పదు కదా! నువ్వు వచ్చేలోగా నాకొక ప్రేమ ఉత్తరం రాయగోర్తాను. ఫ్రం అడ్రస్ మా ఇంటిది రాసేసేయ్. ఇక్కడ నీకు నా చిరునామా, మా ఊళ్ళోని నా ఇంటి చిరునామా కూడా ఇస్తున్నాను.
ముద్దులతో --
నీ
రామచంద్రరావు.
ఉత్తరం పూర్తీ అయేసరికి నా పిడికిళ్ళు బిగిసాయి. ఒళ్ళంతా ఆవేశంతో వణికింది. వెధవ -- చదవు పేరిట చేస్తున్న పని ఇదా - అనుకున్నాను. ఎందుకంటె ఆ రామచంద్రరావు స్వయానా నాకు తమ్ముడు. వాడికి నెల నేలా నేను కొంత డబ్బు కూడా పంపిస్తున్నాను.
రెండు చిరునామాలు కరెక్టుగా సరిపోయాయి. హాస్టల్లో చదువు సరిగా సాగడం లేదనీ , తనకు మంచి గది ఒకటి దొరికిందనీ -- అందువల్ల హాస్టల్లోంచి అ గదిలోకి మరి పోతున్నానీ క్యారేజీ భోజనం చేస్తున్నానీ తమ్ముడు రెండు నెలల క్రితం వ్రాశాడు.
నాలుగు రోజుల క్రితం "హటాత్తుగా మీ తమ్ముడిక్కడికి వచ్చి ఒకరోజుండి మర్నాడు వెళ్ళిపోయాడు. ఎందుకో నన్ను చూసి భయపడ్డాడు." అని శ్రీమతి తన పుట్టింటి నుంచి ఉత్తరం రాసింది.
వెధవ -- అక్కడి కెందుకు వెళ్ళాడో అర్ధం కాక తన్నుకు చచ్చాను. ఇప్పుడర్ధమైంది శ్రీమతికి రాసిన ఉత్తరం ఇంకా టేబిలు మీద ఉంది. రేపు దాన్ని పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంతలో ఈ ఉత్తరం నేను చదవడం తటస్థించింది.
అయితే శ్యామల నాకిప్పుడు చాలా ప్రమాదకారిగా తయారయింది. నా తమ్ముడిని పాడు చేయడమే కాక -- మా ఇంట్లోనే విష బీజాలు నాటడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను నేను క్షమించలేను. ఈ సమస్యకు మరో పరిష్కారం కూడా కనబడలేదు.
అప్పుడే నేను దృడంగా నిశ్చయించుకున్నాను. "శ్యామలను చంపేయాలి" అది సామాన్యమైన నిర్ణయం కాదు మరి.
కుర్చీలో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాను. టైము రెండు గంటలు కావస్తోంది. ఆలోచనలు ఎప్పటికీ తెగడం లేదు. ఆఖరికి అనిపించింది -- నా ఆలోచనలను ఒక కాగితం మీద పెడితే బాగుంటుందని, శ్రీమతికి పూర్తీ చేసిన ఉత్తరం -- బల్ల మీద పేపర్ వెయిట్ క్రింద ఉంది. పక్కనే లెటర్ పాడ్ ఉంది. బాల్ పెన్ వుంది. ఒక్కక్షణం అలోచించి రాయడం మొదలుపెట్టాను. నా హృదయం లోని కసి, సంఘర్షణ -- నెమ్మదిగా కాగితం మీద చోటు చేసుకోసాగాయి. శ్యామల హత్యకు పధకం రూపుదిద్దుకోసాగింది.
2
"వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇంట్లో అందరూ పడుకున్నారా?
అన్ని జాగ్రత్తలూ తీసుకోకుండా రానని మీకు తెలుసు కదా!"
"శ్యామలా ...నీలో విశేషమేమిటో కానీ -- నన్ను పూర్తిగా వశపర్చుకున్నావు. ఈరోజు నా ప్రేమనంతా నీ ముందు వ్యక్తపర్చుకోవాలని ఉంది--"
