తగిన వరుడు
జొన్నలగడ్డ రామలక్ష్మీ
" ప్రతిక్షణం ఎంతో విలువైనది. మాటలతో వృధా చేసుకుంటే నీకే నష్టం!" అంది గీత.
"గీతా! నేను మాటల కోసమే ఇక్కడకు వచ్చాను." అన్నాడు రాంకుమార్ గంబీరంగా.
'అంటే?" అంది గీత ఆశ్చర్యంగా.
"నీకు నేనిచ్చే వందరూపాయలకూ నీ నుంచి నేనాశించే ప్రతిఫలం వేరే వుంది --" అన్నాడతడు .
"ఏమిటది ?"
"నేనొక అమ్మాయిని ప్రేమించాను. ఆమె పేరు జ్యోతి. ఆమె కూడా నన్ను ప్రేమించింది. ఇద్దరం పెళ్ళి చేసుకోవాలను కుంటున్నాం ...."
గీత అసూయగా అతడి వంకా చూసి -- 'అయితే ?" అంది.
"నేను పెద్ద కంపెనీలో మేనేజర్ని నా కింద నలుగురు స్టెనో లుంటారు. నలుగురూ ఆడవాళ్ళే ఫేషనబుల్ గా ఉంటారు. వలల్తో చాలా క్లోజ్ గా మువ్ అవుతూండాలి పెళ్ళయ్యాక నా భార్య ఇది ఎంతవరకూ సహిస్తుందని నా అనుమానం ?" అగాడతడు.
"అయితే ?"
"నువ్వు యధాలాపంగా ఆమె - అంటే జ్యోతిని కలుసుకో. మనిద్దరికీ ఏదో సంబంధమున్న బ్రాంతిని కలిగించు ఆ తర్వాత ఆమె ప్రవర్తన ఏవిధంగా ఉంటుందో నేను గమనిస్తాను....' అన్నాడు రాంకుమార్.
"ఇదేం సరదా నీకు?"
"నా సరదా నీకు వందరూపాయలిస్తోంది "- అన్నాడతడు.
'అవును, అదీ శ్రమ లేకుండా ?" అని ఆమె ఓసారి వళ్ళు విరుచుకుని "ఒంటరిగా హోటల్ గదిలో డబ్బిచ్చి కొనుకున్న ఆడదాన్ని ఏ మాత్రమూ వాంచించకుండా -- తను కోరిన మరో ఆడదాని శీలం గురించి పరీక్షించమని నియమించే నీవంటి భర్త లభించడం ఆ జ్యోతికి న్యాయమో, అన్యాయమో అర్ధం కావడం లేదు. నీవంటి వాడికి నలుగురు కాదు నలభై మంది అడ స్టెనో లున్నా ఇబ్బంది లేదు -" అందామె.
"ఇది నాకు కంప్లిమేంటే అవుతుంది. అనుకున్న ఫలితం సాధిస్తే నీకు మరో వందరూపాయ లిస్తాను-" అన్నాడు రాజకుమార్.
"ఇట్సా ల్రైట్ -- శ్రమ లేకుండా మరో వంద సంపాదించు కుంటాను నువ్వు సాధించదల్చుకున్న ఫలితం మాత్రం నాకర్ధం కావడం లేదు--' అంది గీత.
"దీన్నే అట్నించి నరుక్కురావడమంటారు -" అని నవ్వాడు రాంకుమార్.
రాంకుమార్ జ్యోతిని అందం చూసి ప్రేమించాడు. ప్రేమించి ఏడాది దాటింది. అతడెంత ప్రయత్నించినా జ్యోతి వారి మధ్య కొంత మినిమమ్ డిస్టన్స్ మెయింటైన్ చేసింది. ఆమె నైతిక విలువలకు ప్రాధాన్యత నిచ్చే మనిషి అని అతడు గ్రహించాడు.
రాంకుమార్ గత జీవితం అంత మంచిది కాదు. అతడు చేసిన కొన్ని తప్పులు బయటపడితే జ్యోతి సహించక పోవచ్చు. అప్పుడు దాంపత్య జీవితం నరకం కావచ్చు. అందుకని పెళ్ళికి ముందే ఆమె తన తప్పులకేలా రియాక్టవుతుందో చూడాలి. సూటిగా వచ్చి తననడుగుతుందా ? లేక తన కీ అదృష్టమే చాలనుకుని సరి పెట్టుకుంటుందా?
ఆమె తనకు దూరమై మరిచిపోవాలని ప్రయత్నిస్తే ! తను దగ్గర కావాలనుకున్నా రానివ్వక పొతే?
ఫరవాలేదు. తనకు అల్టర్నేటివ్ ఉంది. అల్టర్నేటివ్ పేరు చందన. చందనకు అందమే కాదు ఆస్తి కూడా ఉంది. అమెవన్నీ ఆధునిక భావాలు. ఈ ఆధునిక యుగంలో ఆమె వంటి యువతి తోడుగా ఉంటె తనకు అదృష్టమే!
జ్యోతిని వదుల్చుకుందుకు తానీ పధకం వేశాడా? ;లేక నిజంగా జ్యోతిని పరీక్షించాలనుకుంటున్నాడా?
ఆ విషయం రాం కుమార్ కే తెలియదు. లేక తెలియదని తన్ను తాను మోసగించుకుంటున్నాడో!
ఈ పధకం మాత్రం అతడికి చందనను చూశాకా, ఆమె ఆస్తి గురించి తెలిశాకా, ఆమె కూడా తనంటే యిష్ట పడుతున్నదని గ్రహించాకా -- తట్టింది.
"ఎట్నించైనా కానీ -- ఈ నరకడాలు నాకు నచ్చవు. ఏది ఏమైనా నరుకుతున్నది నేను కాదు గదా - అనే నాకు తృప్తి !' అంది గీత.
2
పోస్టాఫీసులో నిలబడి ఎదురింటి వైపే చూస్తోంది గీత. అదే జ్యోతి యిల్లు.
ఆ యింటికి వెళ్ళి అమెనేలా పలకరించాలీ ఆమెతో ఏం మాట్లాడాలీ అని ఆలోచిస్తోంది గీత. ఒక పధకం ఆమె బుర్ర లో రూపు దిద్దు కుంటోంది.
గీత ఆలోచిస్తుండగానే తలుపులు తీసుకుని ఆ ఇంట్లోంచి ఓ యువతి బయటకు వచ్చింది . ఆకాశం రంగు చీర. అదే రంగు బ్లవుజు -- విరబోసుకున్న జుట్టు -- ఆమె ఆకాశ గంగాలా వుంది.
"జ్యోతి బాగుంది ?" అనుకుంది గీత.
ఆ యువతి రోడ్డు మీదకు వచ్చింది. ఆమె నడకలో వయ్యారాలున్నాయి.
"రాం కుమార్ ది మంచి చాయిస్ " అనుకుంది గీత. ఆమె యిక ఆలస్యం చేయలేదు. త్వరగా వెళ్ళి ఆమెను కలుసుకుని -- "హలో !' అని పలకరించింది.
"హాయ్ "-- అందామె.
"తీయని గొంతు " -- అనుకుంది గీత --" మీతో అర్జంటుగా మాట్లాడాలి --" అంది జ్యోతితో.
"నాతోనా -- మీరెవరో నాకు తెలియదు ...." అంది జ్యోతి.
"నాకూ మీ గురించి పూర్తిగా తెలియదు. అయినా మాట్లాడే విషయానికి పరిచయం అవసరం లేదు....' అంది గీత.
"ఏమిటి మీరు మాట్లాడేది ?"
"ఇక్కడ బాగుండదు. దగ్గరలో పార్కుంది. అక్కడకు వెడదాం " అంది గీత. జ్యోతి అయిష్టంగానే ఆమె ననుసరించినది.
ఇద్దరూ రెండు సందులు తిరిగి ఓ పార్కులోకి వెళ్ళారు. అక్కడ స్థిమితంగా కూర్చున్నాక -- "ఇది పురుష ప్రపంచంగా ఉంటోంది తలచుకుంటే మగాడినో అట అదించగల స్త్రీ , మగాడి చేతిలో కీలుబొమ్మగా ఉంటోంది" అంది గీత.
'అయితే ?" అంది జ్యోతి.
"ప్రచారంలో ఆడది. సినిమాల్లో ఆడది. సౌక్యానికి ఆడది ఎక్కడ చూసినా ఆడదానికి ఆటబొమ్మకు మించిన విలువలేదు . ఇది అన్యాయం. ఈ అన్యాయాన్ని ఆడది ప్రతిఘటించాలి. పురుషుడికి తగిన విధంగా బుద్ది చెప్పాలి." అంది గీత.
"మీరు ఉమెన్స్ లిబ్ ప్రతినిధులా?" అంది జ్యోతి.
'అవును, నాకు మీ వంటి యువతులు సహకరించలి "
"ఏ విధంగా?"
"నువ్వూ నా దారిలోనే నడుస్తున్నావని తెలిస్తే -- మనం చేతులు కలిపి మరికొందరు యువతులను మనకులా తయారు చేయాలని కోరిక పుట్టి నిన్ను పిలిచాను."
జ్యోతి ముఖం ఆవేశంతో ఎర్రబడింది - "మనం మనం అని పదే పదే అనకు. నీదారీ నా దారీ ఒకటి కాదు" అందామె.
"మన దారులోకటే అనడానికి రుజువులెన్నో ఉన్నాయి....' తాపీగా అంది గీత.
"ఏమిటవి?"
"ఉదాహరణకు రాం కుమార్...."
"వాడేవరు?"
"అతడు నేనంటే యిష్టపడ్డాడు. కలిసినప్పుడల్లా వంద రూపాయ లిస్తాడు. సినిమాలకు తీసుకుని వెడతాడు. హోటల్స్ కు తీసుకుని వెడతాడు ...."
'అయితే ?"
"అతడు నీకూ తెలుసు..."
"నాకు తెలిసునని నీకెలా తెలుసు ?"
"అతడిని నిన్నూ కూడా ఓసారి బజార్లో కలిసి తిరుగుతుండగా చూశాను. రాం కుమార్ తో తిరిగేవాళ్ళు నా వంటి వాళ్ళు తప్ప వేరే ఎవరుంటారు?" అని నవ్వింది గీత.
అప్పుడు జ్యోతి తన వానిటీబ్యాగులోంచి ఒక కవరు తీసింది. అందులో పన్నెండు కలర్ ఫోటోలున్నాయి.
"వీటిలో రాం కుమార్ ఉన్నాడేమో చూసి చెప్పు !" అందామె.
కొందరు యువకులు, యువతులు కలిసి తీయించుకున్న ఫోతోలవి. అందులో ఒక ఫోటోలో రాం కుమార్ ని గుర్తు పట్టింది గీత.
జ్యోతి ముఖం మాడిపోయింది. విసురుగా లేచిందామే.
"వెళ్ళిపోతున్నావా ?" అంది గీత.
"నేను నీకు సాయపడలేను కానీ ఋణపడి ఉన్నాను" అని వెళ్ళిపోయింది జ్యోతి.
"పూర్ రాం కుమార్! వాటే డ్రామా?" అనుకుంది గీత.
3
జ్యోతి వెళ్ళిపోయాక గీత అక్కడే కాసేపు కూర్చుంది. లేద్దమా అనుకుంటుండగా హడావుడిగా ఓ యువకుడక్కడికి వచ్చాడు.
గీత అతడి వంక ప్రశ్నార్ధకంగా చూసింది.
"మేడమ్ !నా పేరు ప్రసాద్ ...." అన్నాడతడు.
"నాపేరు గీత ....' అందామె.
"ఈ సమయంలో పార్కులో మీరిక్కడుండడం నా అదృష్టం " అన్నాడతడు.
'అంటే ?"
"మీరు గమనించలేదా - పార్కిప్పుడు నిర్మానుష్యంగా వుంది."
"వాడ్డూ యూమీన్ !" అంది గీత.
'అయాం సారీ - నేను చెప్పదలచు కున్నది వేరు. ఇంకో అరగంటలో ఇక్కడికి నా ప్రియురాలు వస్తుంది. ఆమెను నేనే యిక్కడికి రమ్మన్నాను. కానీ ఆమె వచ్చేవరకూ ఆగే వ్యవధి లేదు. అనుకోకుండా అర్జంటు పని తగిలింది."
"ఆమె యింటికి ఫోన్ చేయలేక పోయారా?"
"వాళ్ళింటికి ఫొన్ లేదు."
"ఇంటి కేవరి చేతనైనా కబురు పంపలేక పోయారా?"
"మా పరిచయం ఇంట్లో తెలియదు. చాలా గొడవవు తుంది ."
"అయితే నేనిప్పుడెం చేయాలి?"
"ఒక్క అరగంట మీరిక్కడే వుండి నా ప్రియురాలికి నా సందేహం అందజేయాలి. మీ మేలు జన్మజన్మలకి మర్చి పోలేను."
"ఏం చెప్పాలామెకు ?"
"సాయంత్రం సంగీతా పార్కులో ఆరుగంటలకు కలుసుకుందామని చెప్పండి ."అన్నాడు ప్రసాద్.
"ఏమిటీ -- సంగీతా పార్కులోనా?"
"అవును ."
ఓ అరగంట ఆగి "ఆ విషయం మీరే ఆమెకు చెప్పొచ్చుగా."
'అరగంట ఆగడానికి లేదు."
"ఎందుకని ?"
"కారణం మీకు చెప్పలేను ."
"కలుసుకుందుకు రమ్మని చెప్పి రానప్పుడు -- అందుకు సరైన కారణం చెప్పలేక పొతే ప్రియురాలూ క్షమించదు. మీకున్న పళంగా వచ్చిన అర్జంటు పనేమిటో చెప్పండి --' అంది గీత.
అతడు క్షణం తటపటాయించి -- "నేను పెళ్ళి చూపులకు వెడుతున్నాను. తనను ప్రేమించాక పెళ్ళి చూపుల క్కూడా ఎక్కడకూ వెళ్ళనని ఆమెకు మాటిచ్చాను. కానీ యిప్పుడు తప్పలేదు. పేరుకు మాత్రమే పెళ్ళి చూపులు. మా నాన్నగారు కీ సంబంధం బాగా వచ్చింది ముహూర్తం టైముకి నేను రెడీ గా లేకపోతె ఇంట్లోంచి పొమ్మంటారు. నా కుద్యోగం లేదు. ఎమైపోతాను చెప్పండి " అన్నాడు.
"ఉద్యోగం లేదు కాబట్టి మీ నాన్నగారు బలావంత పెడితే -- ఆ పెళ్ళి కూడా చేసేసుకుంటారా ?" అంది గీత.
"పెళ్ళి చూపు లాపలేను గానీ పెళ్ళి ఆపడానికి నా దగ్గర లక్ష మార్గాలున్నాయి. వాటిలో కొన్ని ఈరోజో ప్రయోగిస్తాను " అన్నాడు ప్రసాద్.
