Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 25

 

    "నేను లోపల్నుంచీ చూసినది విన్నారంటే మీకు నవ్వాగదు. సినిమాల్లోలాగ అతను నాకు సదానందుడి పటం చూపించి ముందుకు రాకు భస్మమైపోతావ్ అంటూ బెదిరించాడు. నాకు నవ్వాపుకోవడం చాలా కష్టమైంది" అన్నాడు సూర్యం.
    "పిల్లికి చెలగాటం, ఎలాక్క ప్రాణ సంకటం అంటూనే నవ్వాడు సుబ్బారావు.

                                     9

    "కుంకంలో నిజంగా మహాత్యముంది. పడుకునే ముందు జాగ్రత్తగా చూసుకుంటున్నాను. అదుండగా భూత ప్రేత పిశాచాలు రాలేవనుకుంటాను. ఎటొచ్చీ నా మీద దయుంచి మీలో ఎవ్వరూ కూడా ఆ కుంకాన్ని అపహరించడానికి ప్రయత్నించకండి" అన్నాడు ప్రతాప్. నాలుగు రోజులుగా దెయ్యం రాకపోవడం వల్లనెమో అతడి ముఖంలోకి కొత్త కాంతి వస్తోంది.
    లక్ష్మీనారాయణ దిగులుగా ముఖం పెట్టి "నీకు చెప్పడం మరిచాను. ఆ కుంకం ప్రభావం ఎల్లకాలం ఉండదుట. ఓ వారం రోజులకు క్రమంగా దాని శక్తి క్షీణిస్తుందుట. దాన్ని శక్తి మంతం చేయడానికి మళ్ళీ పార్వతీదేవి పటం ముందుంచి యేవో మంత్రాలు చదవాలిట" అన్నాడు.
    'ఆ మంత్రాలు నీకు తెలుసా?' ఆత్రుతగా అడిగాడు ప్రతాప్.
    'ఈ కుంకం ప్రాముఖ్యత నా కిప్పుడే బాగా తెలిసింది. అది అపహరించగానే నీ గదిలోకి దెయ్యం రావడంతో వెంటనే అమ్మకుత్తరం రాశాను. ఒకటి రెండు రోజుల్లో జవాబు రావచ్చు. మరికాస్త కుంకం పంపమని కూడా రాశాను" అన్నాడు లక్ష్మీనారాయణ.
    ప్రతాప్ ముఖం పాలిపోయింది. కుంకం తయారై వారం రోజులెం ఖర్మ! పోస్టులో ప్రయాణం వగైరాలన్నీ లెక్కపెడితే అప్పుడే పది రోజులు దాటి పోయింది.
    ఆ రాత్రి ప్రతాప్ గది కిటికీ దగ్గరకు మళ్ళీ దెయ్యం వచ్చింది, శబ్దం వింటూనే ప్రతాప్ ఉలిక్కిపడి లేచి దెయ్యాన్ని చూసి ఓ గావుకేక పెట్టి గదిలోంచి బయట పడి స్పృహ తప్పి పడిపోయాడు. అతడి కేక విని భవనం లోని చాలామంది జనం పరుగెత్తుకుని వచ్చారు. అతడి పరిస్థితి చూసి కంగారుపడి ఒకడు వెళ్ళి డాక్టర్ని కూడా పిల్చుకువచ్చాడు.
    డాక్టర్ ప్రతాప్ ని పరీక్షించి "ఏదో పెద్ద షాక్ తిన్నాడు. గుండె కూడా బలహీనంగా కొట్టుకుంటోంది" అన్నాడు.
    "బాగా ప్రమాదమంటారా?" అనడిగాడు ముకుందరావు.
    "ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేదు. కానీ యితడికి షాక్ లు తట్టుకునే శక్తి ఉన్నట్లు లేదు. అనుకోని సంఘటన ఏదైనా హటాత్తుగా జరిగితే ఇతడు గుండె ఆగి మరణించినా ఆశ్చర్యం లేదు" అన్నాడు డాక్టర్.
    ప్రతాప్ కధ తెలిసిన వారంతా ఎంతగానో భయపడ్డారు. అందరి కంటే ఎక్కువగా కలవరబడ్డవాడు సూర్యం. వేడుకకు ప్రారంభించిన అట మనిషి చావుకి దారితీయడం అతడి కిష్టం లేదు. అయినా ప్రతాప్ మరీ యింత బలహీన మనస్కుడని అతడానుకోలేదు. ఇప్పుడు వ్యవహారం చాలా దూరం వచ్చింది. ఏదో ఉపాయం చూసి ఇందులోంచి గట్టెక్కాలి.
     డాక్టరు వెళ్ళిపోయాక సూర్యం తన మిత్ర బృందాన్ని సమావేశపరిచి "పరిస్థితి ప్రమాదకరంగా వుంది. ఇంక లాభం లేదు. మీరు నిజం చెప్పేయండి అన్నాడు.
    'అంటే - నువ్వు యివన్నీ చేస్తున్నావని చెప్పేయమంటావా?" అందువల్ల నీ కేదురయ్యే ఇబ్బందులు గురించి ఆలోచించావా?" అన్నాడు ముకుందరావు.
    "నా కారణంగా ఒక మనిషి ప్రాణాలు కోల్పోబోయే పరిస్థితికి వచ్చాడు. అతడి ప్రాణాలు రక్షించడం కోసం నాకు చెడ్డ పేరు వచ్చినా బాధపడను నేను" అన్నాడు సూర్యం.
    ప్రతాప్ ఆ రాత్రి డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ తో సుఖంగా నిద్రపోయాడు. మర్నాడతను నిద్ర లేవగానే సుబ్బారావతన్ని పలకరించి "రాత్రి చాలా హడావుడి చేశావు. బ్రతుకుతావనుకాలేదు" అన్నాడు.
    "చచ్చిపోయినా బాగుండేది -- దెయ్యం నన్ను రోజురోజుకి కాస్త కాస్త చంపుతోంది. అది చాలా నరక యాతన గా వుంది నాకు" అన్నాడు ప్రతాప్.
    'అయితే అది దెయ్యమని ఇప్పటికీ నమ్ముతున్నావా?"
    "ముమ్మాటికీ.....అందుకు ఎన్నో రుజువులున్నాయి. అందులో కొన్నిట్లో నువ్వు కూడా సాక్షివి."
    సుబ్బారావు నవ్వి "నీకీ పరిస్థితి ఎడురౌవుతుందని తెలియక మేము చేసినదానికి నువ్వు మమ్మల్నం'దర్నీ క్షమించాలి. ఇదంతా మేమంతా కలిసి ఆడుతున్న నాటకం. నువ్వు దెయ్యమని భ్రమిస్తున్నది దెయ్యం కాదు. మనిషే అన్నాడు.
    ప్రతాప్ నమ్మలేనట్లు ముఖం పెట్టి "ఎవరా మనిషి" అన్నాడు.
    "సూర్యం!" అన్నాడు సుబ్బారావు.
    "ఇంపాజిబుల్, నేను నమ్మను" అన్నాడు ప్రతాప్ - దెయ్యం కనబడ్డ కొన్ని క్షణాల్లో సూర్యాన్ని చూడడం ఎన్నోసార్లు జరిగింది నాకు. అంత తక్కువ వ్యవధిలో అతడలా నాటక మాడగలగడం సాధ్యం కాదు. అదీ గాక నేను విన్న దెయ్యపు కేకలు మనుష్యసంబంధమైనవి కాదు."
    "నువ్విలా అంటే నేనేం చెప్పగలను. నేను నిజమే చెబుతున్నాను" అన్నాడు సుబ్బారావు.
    సుబ్బారావు ఎంత చెప్పినా నమ్మలేదు ప్రతాప్. ఆ తర్వాత ముకుందరావు, లక్ష్మీనారాయణ .....ఒక్కక్కరే అతడికి ఎన్నో వివరాలిచ్చి నమ్మించడానికి ప్రయత్నించారు. ఒక్కక్కరే చెబుతుంటే అతడికి క్రమంగా కొంత నమ్మకం కలిగింది.
    "ఇంతమంది చెబుతుంటే నమ్మక ఏం చేయను? కానీ ఇలా జరిగే అవకాశమున్నదా అనిపిస్తోంది నాకు. అందులోనూ సూర్యం అంటే నాకెంతో గౌరవముంది. నన్నతడిలా అట పట్టిస్తాడనుకోలేదు" అన్నాడు ప్రతాప్.
    "నువ్వు సదానందుడి గురించి ప్రచారం చేస్తున్నావని అతడికి చిరాకు. నీ సదానందుడు నిన్నెంతవరకూ రక్షిస్తాడో చూద్దామనే అతడీ పని చేశాడు. కొంతవరకూ అతడికి మేమూ సహకరించం. కుంకంతో సహా అన్నీ మేమాడిన నాటకాలే!" అన్నాడు లక్ష్మీనారాయణ.
    "నువ్వూ సదానందుడి భక్తుడివే కదా!" అన్నాడు ప్రతాప్.
    "ఈ సంఘటనతో నా కళ్ళు తెరుచుకున్నాయి. నేనింక భజనలకు రావడం మానేస్తాను" అన్నాడు లక్ష్మీనారాయణ.    
    "నాకొక్కటే అనుమానంగా వుంది. నామీద జాలిపడి మీరంతా నేరాన్ని సూర్యం మీద నేట్టేస్తున్నారా లేక అతడు నిజంగానే దెయ్యంగా నటిస్తున్నాడా?" అన్నాడు ప్రతాప్.
    'అందుకు నీకొక్కటే రుజువు. ఈ రాత్రి కూడా సూర్యం నిన్ను బెదిరించడానికి వస్తాడు. అప్పుడు ధైర్యం చేసి కిటికీ తలుపులు తెరిచిచూడు. అతడి బండారం బయట పడుతుంది " అన్నాడు సుబ్బారావు.
    "అలాగే చేస్తాను !" అన్నాడు ప్రతాప్.

                                    10
    
    రాత్రి పన్నెండు గంటలయింది.
    ప్రతాప్ నరాల్లో సంచలనం ప్రారంభమైంది.వళ్ళంతా వణుకుతోంది. గదిలో లైటు వెలుగుతోంది. అతడు క్షణం కిటికీ వంక చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంటున్నాడు. కిటికీ వంక కూడా తిన్నగా చూడలేకపోతున్నాడు. ఎటొచ్చీ చూస్తూ -- క్రమంగా దొంగలా తన చూపులు కిటికీ వైపుమార్చి అటు చూసిన వెంటనే కళ్ళు మూసు కుంటున్నాడు.
    సరిగ్గా పన్నెండు గంటల అయిదు నిమిషాలకు అతడు కిటికీ వంక చూసి కళ్ళు మూసుకునేలోగా అక్కడ అతనికి దెయ్యం కనబడింది.
    తలుపులు బాదిన చప్పుడు ఒక వికట్టాహాసం విచిత్రమైన అరుపు , భయంకరంగా చేతులు కదలిక ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిపోయాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS