Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 25


    అప్సర ఎడమచేతికి ఒక లావుపాటి వెండిగాజు వున్నది. తల్లిమాట వింటూనే ఆమె గాజుతీసి తల్లి కిచ్చేసి-"నీ చేత్తో నువ్వే ఇయ్యమ్మా-" అన్నది. మహాలక్ష్మి ఇవ్వగా-"మహా ప్రసాదం-"అని అంది పుచ్చుకుని పురోహితుడక్కన్నించి వెళ్ళిపోయాడు. వెళ్ళి పోయే ముందు త్వరలోనే కళ్యాణం జరగాలని అప్సరను ఆశీర్వదించి మరీ వెళ్ళాడు.
    పురోహితుడు కనుమరుగు కాగానే మహాలక్ష్మికి ఎక్కడలేని ఆకలి పుట్టుకొచ్చింది. భోజనానికి రమ్మంటే అప్సర మాటలు భోంచేస్తున్న సురేంద్రకు ఆకలే లేకుండా పోయింది. అప్సర తనకూ ఆకలి లేదన్నది. ఆ కారణంగా మహాలక్ష్మికి తోడుగా సులోచన కూడా భోజనం చేసేసింది. భోజనాలు పూర్తిగానే సురేంద్రను పిలిచింది సులోచన. ఈసారి సురేంద్రకూ, అప్సరసకూ కూడా ఆకలి వేసింది.
    కొడుక్కి త్వరగా పెళ్ళి చేసేయాలని మనసులో అనుకున్నది సులోచన. లేకపోతే ఆడవాళ్ళంటే ఎంతో మొహమాటపడే సురేంద్ర అప్సర వంక ఆవురావురు మంటూ చూడడమేకాక ఆమెతో ఏకాంతం కోసం తెగతంటాలు పడిపోతున్నాడు. ఇంట్లో తల్లి కూడా వుందన్న విషయమే అతడి దృష్టిలో వుండడంలేదు.
    సురేంద్ర, అప్సర భోజనాలు చేస్తూండగా ఇంట్లో టెలిఫోన్ మ్రోగింది, సులోచన రిసీవర్ ఎత్తింది.
    అవతలనుంచి సుబ్బారావు మాట్లాడుతున్నాడు. అంతా క్షేమంగా వున్నారనీ చెప్పుకోదగ్గ విషయాలేమీ జరుగలేదనీ విని ఆయన సంతృప్తిగా ఫోన్ పెట్టేశాడు.

                                       11


    సుబ్బారావు అసహనంగా వాచీ చూసుకున్నాడు. పనులన్నీ చూసుకుంటూనే వున్నా ఆయన మనసు మనసులో లేదు. రంగనాధ్ యెప్పుడు వస్తాడూ, యెలా వస్తాడూ-వచ్చి ఏం చేస్తాడూ అన్న ఆలోచనలనుంచి ఆయన తప్పించుకోలేక పోతున్నాడు.
    ఈ విషయం ఆయనింతవరకూ పోలీసులకు చెప్పలేదు. తన భార్యాబిడ్డలకేదైనా అపకారం జరుగుతుందేమోనన్న భయం ఆయనలో ఓ మూల వుంది. పరిస్థితులనుబట్టి తనే అన్యాయాన్నెదుర్కోగలనన్న నమ్మకం కాస్త వుంది.
    ఏది ఏమైనప్పటికీ ఆరోజు మాత్రం అయన కాస్త టెన్ షన్ లో వున్నాడు. మధ్య మధ్యలో ఇంటికి ఓసారి ఫోన్ చేస్తున్నాడు. సుబ్బన కంఠం విన్నప్పుడల్లా ఆయనకు ధైర్యం కలిగి తను-అనవసరంగా కంగారు పడుతున్నానేమోనని అనుకోసాగాడు.
    టైము ఒంటిగంట పవయింది.
    "హలో-సుబ్బారావుగారూ-కులాసానా-" అన్నారెవరో.
    సుబ్బారావులిక్కిపడి చూశాడు. అతను..కాదు కాదు ఆయన....తనకు బాగా తెలుసును.....అయన పేరు రంగనాథ్! ఆయనకు తన బ్యాంకులో అకౌంట్సున్నాయి. టర్నోవర్ లక్షల్లో వుంటుంది.
    సుబ్బారావు బుర్ర పనిచేయడం మానేసింది. నాగు చెప్పిన ప్రకారం ఈ రోజు బ్యాంకుకు రంగనాథ్ అనే అతను రావాలి. ఆ రంగనాథ్ ఆరితేరిన గజదొంగ అని తను భావిస్తున్నాడు. ఇప్పుడు రంగనాథ్ నిజంగానే వచ్చాడు. అయితే ఈ రంగనాథ్ తనకు బాగా తెలుసు. నగరంలో పేరుమోసిన వ్యాపారస్థుడీయన.
    "రండి-కూర్చోండి-"ఏమిటలా చూస్తున్నారు?" అన్నాడు.
    "ఏమీలేదు-మీకు నాగు తెలుసా?" అడిగాడు సుబ్బారావు.
    "నాగా-అంటే ఎవరు?" అన్నాడు రంగనాథ్ పశ్నార్ధకంగా.
    "అతడి పూర్తి పేరు నాగరాజారావు. యెరిగున్న వాళ్ళంతా అతన్ని నాగు-అని పిలుస్తారట-"
    రంగనాథ్ కు గుర్తువచ్చినట్లుంది-గలగలా నవ్వి- "అతనా-నాకు బాగా తెలుసు. చాలా ఫన్నీ ఫెలో-టీ కప్పుల్లో తుఫాను సృష్టించడం అతని హాబీ-" అన్నాడు.
    "అంటే?" అన్నాడు సుబ్బారావు.
    "ఎవరో ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు. వాళ్ళింట్లో జరగబోయే కొన్ని సంఘటనలు ముందుగానే తెలుసుకుని వాటికి విపరీతార్ధంతోఛే పరిస్థితులు కల్పిస్తాడు. ఆ మనిషి సందిగ్ధంలో తల మునకలవుతుంటే తను ఆనందిస్తాడు. ఒకసారేమయిందంటే...." క్షణం ఆగాడు రంగనాథ్.
    "చెప్పండి-" అన్నాడు సుబ్బారావు.
    "అతను నాకు ఫోన్ చేసి-ఈ రోజు రాత్రి నీ ఇల్లు దోస్తాను. ఆ దోపిడీ ఆపడం నీ తరం కాదు. నువ్వూ హించలేని రూపంలో వస్తున్నాను-" అన్నాడు. ఫోన్ చేసిందెవరో నాకు తెలియదు. ఆ తర్వాత నేనింటికి ఫోన్ చేసి కనుక్కుంటే యెవరో అపరిచితుడు పెళ్ళి సంబంధం గురించి వివరాలకోసం వచ్చినట్లు మా ఇంటికి వచ్చాడని తెలిసింది. అతన్ని వెయ్యి కళ్ళతో కనిపెట్టవలసిందనీ, చాలా జాగ్రత్తగా వుండమనీ ఫోన్ చేశాను.
    ఆ రోజు సాయంత్రం మా యింటికి నాగు కూడా వచ్చాడు. మేమూ-అపరిచితుడితో మా ప్రవర్తన చూసి అతడు చాలా వినోదించాడు. రాత్రి మా ఇంట్లోనే పడుకుని - మరి రెండు అనుమానాస్పద సంఘటనలు కూడా సృష్టించి-మమ్మల్ని మరికాస్త కలవరపరిచాడు. మర్నాటికే విశేషమూ జరక్క పోయేసరికి నా అనుమానం నాగుమీదకు మళ్ళీ క్రమంగా బలపడింది. నిలదీస్తే ఒప్పేకున్నాడు నాగు...."
    సుబ్బారావు క్షణం ఆలోచించి-"మీరు బ్యాంకుకు వస్తున్నట్లు నాగుకు తెలుసా?" అన్నాడు.
    "తెలియకేం - రెండ్రోజుల క్రితమే తెలుసును. అతడికి సంబంధించిన పనిమీదనే నేనీరోజు బ్యాంకుకు వచ్చాను. ఓ యాభైవేలు విత్ డ్రా చేయాలి-" అన్నాడు రంగనాథ్.
    సుబ్బారావు విచిత్రావస్థలో వున్నాడు. రంగనాథ్ తనకు బాగా తెలుసు. ఆయనిప్పుడేదో తమాషాచేస్తాడని ఆయననుకోవడంలేదు. కానీ నాగు మాటలు కేవలం నాటకమంటే ఆయన నమ్మలేకపోతున్నాడు. నిజంగా అవి నాటకమే అయితే-నాగు కృతకృత్యుడయ్యాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటి రెండ్రోజులపాటు తను పడ్డ మానసికావస్థ సామాన్యమైనది కాదు.

                                      12

    "అమ్మా-బిచ్చం తల్లీ!" ముష్టివాడా ఇంటిముందు నిలబడి గట్టిగా కేకపెట్టాడు.
    చెయ్యూరుకోలేదనబోయింది సులోచన. మహాలక్ష్మి ఆమెను వారించి-"తెచ్చుకున్నవాటిలో కాసిని బియ్యం మిగిలిపోయాయి. అవి వాడికిచ్చేస్తే సరిపోతుంది-" అని లేచి వీధిలోకి వెళ్ళి-"ఏరా-డబ్బాతోషా కాసిని బియ్యమున్నాయి-పట్టుకెడతావా?" అంది.
    "ఏం డబ్బా అమ్మా-ఇంట్లో బియ్యముంచుకునే పెద్ద డబ్బానా-లేక పిల్లల పాలపొడుండే-గ్లాక్సో డబ్బానా?" అన్నాడు బిచ్చగాడు.
    "ఏదైతే నీకెందుకు? ఇచ్చింది తీసికెళ్ళు-" అంటూ వాడికో అరకేజీ గ్లాక్సో డబ్బా దానంచేసింది మహలక్ష్మి డబ్బా పెద్దదే కానీ బియ్యం మాత్రం అందులో నాలుగో వంతుకూడా లేవు.
    బిచ్చగాడికి దానం చెయ్యడమయ్యేక-మళ్ళీ సులోచన, మహాలక్ష్మి కబుర్లలో పడ్డారు. సులోచనకు కాస్త విసుగ్గా వుంది. ఈవిడ వాటంచూస్తే ఇప్పట్లో కదిలేటట్లు లేదు. అప్పుడే ఒంటిగంట దాటింది.
    సులోచనకైతే కాసేపు మేను వాల్చాలనుంది. అది సూచిస్తూ ఆమె అవలించింది. మహలక్ష్మి ఆమెవంక పరిశీలనగా చూసి-"మధ్యాహ్నం మీకూ నాకులాగే కాసేపు మేనువాల్చడం అలవాటనుకుంటాను. కాసేపు పడుకునే వెడతాన్లెండి-ఇప్పుడింటికి వెళ్ళి మాత్రం చేసేదేముంది కనుక-ఎలాగూ భోజనాలైపోయాయి-" అంది.
    సులోచన సురేంద్రను కేకపెట్టి పిలిచింది. అతను వచ్చి ఇద్దరికీ చెరో మడత మంచం  వేశాడు. ఈలోగా అప్సర కాబోయే అత్తగారికీ, తల్లికీ మంచినీళ్ళిచ్చింది. "మరి నాకో?"-అన్నట్లు చూశాడు సురేంద్ర. అతడికీ ఓ గ్లాసు మంచినీళ్ళిచ్చిందామె.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS