Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 25

 

    "నాకు తెలిసిన విలువైన మనిషి స్వాతి మాత్రమే !"
    "స్వాతి కాదు-- నీ ప్రాణం --"
    "నా ప్రాణం గురించి మాట్లాడ్డానికి నికేన్ని గుండెలు? జాగ్రత్త -- నీ ముఖంలో మృత్యు కళ కనిపించగలదు"
    "నా దగ్గర సుమారు పదిమంది ఉద్దండ పిండాలున్నారు. నీ ప్రాణం తీయడానికి వాళ్ళలో ఎందరి ముఖాల్లో మృత్యు కళ వచ్చినా ఫరవాలేదు నువ్వు పొతే చాలు."
    రాము ఆలోచనలో పడ్డాడు. వెంకట్రావు తనను బెదిరిస్తున్నాడు. అతను చెప్పిన పనికి ఒప్పుకోకపోతే వెతికి వెతికి వేటాడి తనను చంపటానికి ప్రయత్నిస్తాడు. అన్నంత పని చేయగల శక్తి వెంకట్రావు కు లేకపోలేదు. కానీ అతను ఓ పట్టాన తన ప్రాణాల జోలికి రాదు. దాని విలువ అతనికి తెలుసు.
    "మిస్టర్ వెంకట్రావ్ ? నా సంగతి నీకు తెలుసు. నాలాంటి వాళ్ళ వల్ల నాకంటే  నీకే ఎక్కువ ప్రయోజనం. మృత్యుకళ ను చదవగల విద్యతో పాటు నువ్వు కోరిన వ్యక్తీ ముఖంలో మృత్యు కళ చూడగల అదృష్టం కూడా వున్న మనిషిని నేను. నా ప్రాణాల మీద దృష్టి పడడం వల్ల నీకే నష్టం. అసలు నీ ఇబ్బంది ఏమిటి? స్వాతి ప్రాణాల జోలికి నువ్వెందుకు వెళ్ళాల్సి వచ్చింది?" అనడిగాడు రాము.
    వెంకట్రావు ముఖం విషాదంగా అయిపొయింది. "స్వాతి బంగారు బొమ్మ. అటువంటి అమ్మాయిని చంపాలని ఏ మగాడూ అనుకోడు. కానీ నేను స్వతంత్రుడిని కాను. ఒక వ్యక్తీ ఆదేశాలకు లోబడి నడుచుకుంటున్నవాణ్ని."
    "నీ అంతటి సమర్ధుడు కొంతమందికి లోబడి పోవడం నాకు నచ్చలేదు."
    "కొంతమంది కాదు, నేను భయపడేది ఒకే వ్యక్తికీ ."
    "ఎవరతను ?"
    "అయన పేరు గోవిందరావు ."
    "గోవిందరావు లేకపోతె ."
    "నేను సర్వ స్వతంత్రుడిని "అన్నాడు వెంకట్రావు.
    "సరే -- నేను గోవిందరావు ముఖంలో మృత్యు కళ వున్నదేమో చూడ్డానికి ప్రయత్నిస్తాను. నా అదృష్టం మీద నాకు నమ్మకముంది. నా కళ్ళు అయన ముఖం మీద పడ్డ మరుక్షణం లోనే మృత్యు కళ అయన ముఖంలోకి రాక తప్పదు. అయితే స్వాతి ప్రాణాల విషయంలో నువ్వు నాకు హామీ యివ్వాలి " అన్నాడు రాము.
    "గోవిందరావు ను ఈ లోకం నుంచి తప్పించగలిగితే నీకు ఆజన్మాంతం ఋణపడి వుంటాను."
    "సరే- వస్తాను. అయితే బేరం పదిలక్షలకు. అయిదు లక్షలు అడ్వాన్సు గా యివ్వాలి." అన్నాడు రాము.
    వెంకట్రావు కాసేపు అలోచించి లోపలకు వెళ్ళి ఓ బ్రీఫ్ కేసు తెచ్చి రాముకు ఇచ్చాడు. రాము పెట్టి తెరిచి లోపల ఏమున్నాయో చూశాడు. నోట్ల కట్టలు తప్ప ఇంకేమీ లేవు. ఓసారి డబ్బు లెక్కించి చూసుకుని -- "ఒకే" అన్నాడు.
    "నువ్వు నమ్మకస్తుడవని తెలుసు కాబట్టి -- మోసానికి ప్రతిఫలం ఏమిటో హెచ్చరించడం లేదు ..." అన్నాడు వెంకట్రావు.
    " ఆ అవసారం లేదు. ఇక ముందు కూడా రాదు" అన్నాడు రాము. అతను బ్రీఫ్ కేసు చేత్తో పట్టుకుని బయటకు నడిచి వెళ్ళాడు. అతను కొంతదూరం వెళ్ళే మరో వ్యక్తీ అతన్ని వెంటాడసాగాడు.
    రామునూ, ఆ వెంటాడుతున్న వ్యక్తినీ చూసి తృప్తి గా తలాడించేడు వెంకట్రావు. మరో విషయంలో నే లోపల్నుంచి గోవిందరావు వచ్చాడు.
    "శభాష్ వెంకట్రావ్ ! కుర్రాణ్ణి బాగా బోల్తా కొట్టించావు. వాడి రహస్యమేమిటో తెలుసుకోగలమంటావా?" అన్నాడు గోవిందరావు.'
    "తెలుసు కోగలం కానీ మరీ విషయం లో రిస్కు తీసుకుంటున్నారేమో ననీ, కోరి మృత్యువు నాహ్వానిస్తూన్నారనీ నాకు భయంగా వుంది" అన్నాడు వెంకట్రావు.
    "అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు. వాడు ఏదో పధకం వెయ్యాలి. ఏదో విధంగా నన్ను కలుసుకోవాలి. అయితే నీకు తెలుసు గదా - నేను అన్ని పదకాలకూ అతీతుడనని." అంటూ నవ్వాడు గోవిందరావు.
    మరి కాసేపటికి అక్కడికి ఓ మనిషి వచ్చాడు.
    "ఏమిట్రా విశేషాలు ?' అన్నాడు ఆత్రుతగా వెంకట్రావు.
    'ఆయన ముందు ఓ బ్యాంకు లోకి వెళ్ళాడండి. తర్వాత అక్కణ్ణించి బయటకు వచ్చి దేవుడి గుడి లోకి వెళ్ళారండి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళారండి. ఇంటి ముందు మనవాడు ఒకడు కాపలా వున్నాడండి. ఇప్పటి కింతే విశేషాలు."
    "నా ముఖంలో మృత్యుకళ రప్పించడానికి దైవ ప్రార్ధన చేసి వుంటాడు. వాడికి తెలియదేమో - నన్ను దేవుడు కూడా ఏమీ చేయలేడని " అంటూ మళ్ళీ నవ్వాడు గోవిందరావు.
    "పూజారి గారు ప్రసాదం తెచ్చి యిచ్చారండీ --" అంది గోవిందరావు భార్య సుభద్రమ్మ.
    "కొబ్బరి కాయ ముక్కేగా " అని నవ్వాడు గోవిందరావు.
    ప్రతి సోమవారమూ శివాలయంలో గోవిందరావు పేరిట అర్చన జరుగుతుంది. పూజారి పూజానంతరం ప్రసాదం తీసుకు వెళ్ళి స్వయంగా గోవిందరావు గారింట్లో ఇచ్చి దక్షిణ వసూలు చేసుకుపోతాడు. ఇది చాలా ఏళ్ళుగా జరుగుతోంది.
    గోవిందరావు ప్రసాదం అందుకుని నోట్లో వేసుకున్నాడు - "నువ్వు తిన్నావా?' అనడిగాడు భార్యను.
    "మీరు తినకుండానా?" అంది సుభద్రమ్మ.
    "అయితే ఇంకా వుందా ?"
    "లేదండీ -- ఈసారి ప్రసాదం కాస్తే తెచ్చాడు పూజారి గారు."
    "మరి ,ముందుగా చెప్పలేదేం."
    "ఇన్నేళ్ళుగా ప్రసాదం తింటుంటే నాకు మిగిలిందేమిటి? కన్నీళ్ళేగా "అంటూ కళ్ళు వత్తుకుంది సుభద్రమ్మ.
    గోవిందరావు కళ్ళు కూడా చెమర్చాయి --"ఏడవకే -- ఏడిస్తే మాత్రం పోయినవాడు బ్రతికి వస్తాడా?' మన అబ్బాయి చావుకు కారణమైన వాడి మీద పగ తీర్చుకునే దాకా నిద్రపోను."
    "ఏవళ్ళనో అనుకోవడమెందుకండీ - మన పాపాలే ఆయన్ని కొట్టాయి. దేవుడికి పూజలు చేసి ఆ ప్రసాదాలు తింటే మన పాపాలు పోవు. అనుభవించాల్సిందే !" అంది సుభద్రమ్మ.
    'అంటే నీ ఉద్దేశ్యం !"
    "నేనింక దేవుడి పూజలు మానేస్తాను. భక్తీ వదిలి పెట్టేస్తాను. కొండ మీంచి క్రిందికి దూకుతూ ఇంకాకూడా ఆహార పదార్దాలుంచుకున్నట్లు -- పాపాలపుట్ట గా బ్రతుకుగడుపుతూ మధ్యలో దేవుడి పూజలు కూడా ఎందుకండీ అంది సుభద్రమ్మ.
    గోవిందరావు మాట్లాడలేదు. కొడుకు చనిపోకముందు భార్య ఇలాంటి మాటలంటే అయన ఏమాత్రమూ సహించేవాడు కాదు. కానీ ఇప్పుడాయన పూర్తిగా లొంగిపోయాడు. కొడుకు శోకంలో ఆవేశంలో వున్నాఆ మాతృమూర్తి కి తానివ్వగలిగిందేమీ లేదు. కనీసం ఆమె మాటలు భరిస్తే చాలు!
    "నీ ఉద్దేశ్యం నాకు తెలుసింది లేవే-- నేను పాపాల పుట్టనే గదా నీ అభిప్రాయం. ఎవరి కోసం చేస్తున్నా నంటావ్ ఇవన్నీ" అన్నాడాయన.
    "మీరే చెప్పండి, ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నారు?'
    గోవిందరావుకు నోటమాట రాలేదు. ఒక్క గానొక్క కొడుకు ప్రభాకర్ చచ్చిపోయాడు. ఇంకా ఎవరి కోసం తనివన్నీ చేస్తున్నట్లు?

                                  11
    "మిస్టర్ వెంకట్రావ్ - గోవిందరావు ,ముఖంలో మృత్యుకళ తాండవిస్తోంది. ఈ రాత్రి గడుస్తుందని నాకు తోచదు. ఒకోసారి యమభటులు ఓ ప్రాణిని తీసుకునేందుకు వెళ్ళి అక్కడింకా ఎవరైనా వుంటే వాళ్ళను కూడా తీసుకుపోతారు. అనవసరంగా ఎక్కువ ప్రాణాలు పోవడం నేను సహించలేను. సుభద్రమ్మ గారి ప్రాణాలు కాపాడాలి. ఆవిణ్ణి ఈరోజుకు సాయంత్రం అర్నించి తొమ్మిది వరకూ ఇంట్లో లేకుండా చెయ్యి."
    అవతల క్లిక్ మంది. వెంకట్రావు తనూ ఫోన్ క్రెడిల్ మీద వుంచి వెంటనే గోవిందరావు కు ఫోన్ చేసితనకు ఫోన్ చేసిన వివరాలు చేపప్డు.
    'అలాగా - వాడి సంగతి నేను చూసుకుంటాను. మీ అమ్మను పంపిస్తే - ఆడవాళ్ళిద్దరూ ఫస్టుషో సినిమాకు వెడతారు" అన్నాడు గోవిందరావు.
    "సార్ -- మీరు చాలా పెద్ద రిస్కు...." అన్నాడు వెంకట్రావు.
    "ఇందులో రిస్కే మీ లేదు. నా కొడుకు చావులోని మిస్టరీ విడిపోవాలి. అంతవరకూ నాకు నిద్రపట్టదు. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా ఫరవాలేదు" అన్నాడు గోవిందరావు.
    వెంకట్రావు మరీమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు. గోవిందరావు ఏం చేయబోతున్నాడో అతనికి తెలియడం లేదు. కానీ అయన చెప్పినట్లే చేశాడతను.
    సాయంత్రం ఆరుగంటలకు  సుభద్రమ్మ, వెంకట్రావు తల్లి సినిమాకు వెళ్ళి పోయారు. గోవిందరావు పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేశాడు.
    "హలో ఇన్ స్పెక్టర్ రామనాధం గారేనా -- వోసారి అర్జంటుగా మా ఇంటికి రావాలి సార్-- చాలా ముఖ్యమైన వార్త ఒకటి చెప్పాలి మీకు" అన్నాడు.
    "ఏమిటది?"
    "ఈరోజు ఇంకోరెండు మూడు గంటల్లో నా ప్రాణం పోవచ్చు."
    "వ్వాట్ -- ఏమిటి మీరనేది?"   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS