"రండి లోపలకు అంతా వున్నారు" అన్నాడు రవి.
సుధాకర్ ని చూస్తూనే "ఏమయిందండీ అలా వున్నారు?" అంటూ ప్రశ్నించాడు మధు.
సుధాకర్ అతనివంక చూడకుండా "సుజాత గారూ, రాధిక కేదో ప్రమాదం జరిగుంటుందని మీరెలా అనుకున్నారు? వెంటనే చెప్పండి. ప్లీజ్" అన్నాడు.
"ఏం?" అంది సుజాత.
"మీరు వెళ్ళగానే వాళ్ళ పుట్టింటికి ట్రంక్-కాల్ చేశాను. అసలు రాధిక అక్కడికి రానేలేదన్నారువాళ్ళు. తల్లీ తండ్రీ వెంటనే యిక్కడకు బయల్దేరి వస్తామన్నారు" అన్నాడు సుధాకర్.
"రాధిక ఇంటికి ఎప్పుడు బయల్దేరి వెళ్ళింది?"
"నిన్న సాయంత్రం" అన్నాడు సుధాకర్.
నిన్నటిదినం రాత్రి పుట్టింట్లో తనకు కలవచ్చింది. ఈ రోజు ఉదయం బయల్దేరి మధ్యాహ్నానికి తనీ ఊరు చేరుకుంది. సాయంత్రం అంతా కలిసి సుధాకర్ యింటికి వెళ్ళారు. అప్పటికి సుధాకర్ కి ఏమీ తెలియదు. అత్తారింటికి ట్రంక్ కాల్ చేశాడు. వాళ్ళామె గురించి తెలియదన్నారు. అంటే రాధిక నిన్నరాత్రి తనకు కలవచ్చిన సమయంలోనే హత్యకావించబడిందా?
"నిన్న రాత్రే రాధికకు ప్రమాదం జరిగిందని నా అనుమానం" అని ఒక్కక్షణం ఆగి "శాంతికి సంభవించిన విధంగానే రాధికకూ ప్రమాదం సంభవించినదని అనుకుంటున్నాను."
"మీ ఊహ ఏమిటో చెప్పండి!" అన్నాడు సుధాకర్ ఆత్రుతగా.
"అది ఒకగది. ఆ గదిలో గోడ. గోడ మధ్యగా రెండూ, క్రిందగా రెండూ హుక్స్ ఉన్నాయి. శాంతి కాళ్ళూ, చేతులూ ఆ హుక్స్ కు తాళ్ళతో బంధించబడ్డాయి. ఆమె మాట్లాడకుండా నోటికి టేపు వేయబడి వుంది. తరువాత హంతకుడు చేతిలోనికి కత్తి తీసుకొని ఆమెను సమీపించాడు. ఆమె గుండెలపై ఒకసున్నా చుట్టి కత్తితో సరిగ్గా ఆ సున్నాలోకి పొడిచాడు. శాంతి చచ్చిపోయింది. రాధికకూడా అదేవిధంగా హత్యచేయబడిందని నా అనుమానం."
"నో - నా రాధ చావదు" అన్నాడు సుధాకర్.
"మీరు అరచినంత మాత్రాన ఆమె బ్రతుకదు. ఆమెను చంపిన హంతకుడు మీకు బాగా కావలసినవాడు అని నా అనుమానం. మాటల్లోనూ, అలవాట్లలోనూ మీ ఇద్దరికీ చాలా పోలికలున్నాయి" అంది సుజాత అతనివైపు తీవ్రంగా చూస్తూ. మిగతా ఇద్దరూకూడా అతని ముఖ కవళికలను గమనిస్తున్నారు. అవి క్షణాని కొకలా మారిపోతున్నాయి.
"అంతా చూసినట్లు మాట్లాడుతున్నారు మీరు...." అన్నాడు సుధాకర్.
"తాను చాలా తెలివిగా, రహస్యంగా హత్యలు చేస్తాననుకుంటున్నాడు హంతకుడు. కానీ ఆ రెండు హత్యలూ నేను చూశాను" అంది సుజాత.
ఎందుకో సుధాకర్ ఆపాదమస్తకం వణికిపోతూ-"ఆ హంతకుణ్ణి కూడా మీరు చూశారా?" అన్నాడు.
"చూశాను కళ్ళారా చూశాను" అంది సుజాత.
"కలగని వుంటారు" అన్నాడు హేళన ధ్వనించే స్వరంతో సుధాకర్.
"అవును కలలోనే చూశాను. కానీ ఆ కలలోని హంతకున్ని బయటకూడా చూశాను" అంది సుజాత.
"ఎక్కడ? ఎప్పుడు?" అన్నాడు సుధాకర్ ఆత్రుతగా.
"బహుశా రెండుమూడు రోజులయుంటుందేమో-మా నాన్న గారూల్లో మాధురి అనే ఆమె యింట్లో చూశాను" అంది సుజాత.
సుధాకర్ కొద్దిగా షాక్ తిన్నాడు.
"సుజాతగారు నిజమే చెబుతున్నారని నాకు అనుమానంగా వుంది. నా రాధిక నాకిక లేదేమోనని భయంగా వుంది. నాకు మతిపోతోంది. నేను వెళ్ళిపోతాను...." అంటూ అతను గిరుక్కున వెనక్కు తిరిగాడు.
మధు ఏదో చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు సుధాకర్.
"అతని మనసు బాగా దెబ్బతిన్నట్లుంది!" అన్నాడు మధు.
"మనం ఓ పర్యాయం పోలీసుల్ని కలుసుకుని ఫిర్యాదు చేయడం మంచిదేమో. నాకు సుధాకర్ మీద అనుమానంగా వుంది. రాధిక, శాంతి ఇద్దరూ అతని యింటినించే మాయమయ్యారు" అన్నాడు రవి సాలోచనగా.
"నో నో ఇట్స్ ఇంపాసిబుల్. అతడికి పెళ్ళామంటే ప్రాణం" అన్నాడు మధు.
12
రవి, మధు కలిసి బయటకు వెళ్ళాక సుజాతకు ఫోన్ వచ్చింది.
"హలో-సుజాతగారా?" అంది అవతలి కంఠం.
"అవును నేనే ఎవరూ మాట్లాడుతూంట?" అంది సుజాత.
"నేను సుధాకర్ ని మాట్లాడుతున్నాను. మధుగారు లేరా?"
"ఆయన ఆఫీసుకు వెళ్ళారు. అన్నయ్య శాంతిగురించి పోలీస్ కంప్లయింట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషనుకు వెళ్ళాడు" అంది సుజాత.
అవతల పక్కనుంచి నవ్వు వినిపించింది.
"ఎందుకో నవ్వుతున్నారు?" అంది సుజాత.
"మీకు, మీ అన్నయ్యకు, నాకు మనందరికీ ఒక శుభవార్త, శాంతి, రాధిక ఇద్దరూ క్షేమంగా ఇప్పుడు నా యింట్లోనే వున్నారు." అన్నాడు సుధాకర్.
సుజాతకు ఆశ్చర్యంతో నోటమాట రాలేదు.
"హల్లో" అంది అవతలి కంఠం.
"ఆఁ" అంది సుజాత తేరుకొని.
"ఏమిటండీ మాట్లాడ్డం మానేశారు, హఠాత్తుగా" అన్నాడు సుధాకర్.
"ఆశ్చర్యంతో నాకు నోట మాటరావటం లేదు-" అంది సుజాత.
"శాంతి ఇప్పుడు తన మనసు మార్చుకుంది. మీ అన్నయ్యను పెళ్ళి చేసుకొంటుందట. వీలయినంత త్వరగా ఇక్కడకు రమ్మంది" అన్నాడు సుధాకర్.
"అన్నయ్య ఇంటికి ఎన్నింటికి వస్తాడో తెలియదు. ఈ లోగా నేను మీ యింటికి రావచ్చా?" అంది సుజాత.
"ష్యూర్ రాధిక మీ గురించి చక్కని విందు ఇవ్వాలనుకుంటోంది."
"అసలు వీళ్ళిద్దరూ ఏమయ్యారుట? ఒక్కసారే ఎలా బయటపడ్డారుట?"
"అవన్నీ ఇక్కడకు వచ్చాక తెలుసుకుందాం. మీ ఊహాగానంతో నన్నుచాలా కలవర పెట్టేశారు. నేను ఎలాగో తట్టుకున్నాను కానీ ఇంకెప్పుడూ ఎవరిపైనా ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేయకండి" అన్నాడు సుధాకర్.
సుజాత ఏమీ మాట్లాడలేదు. అంతా ఏదో విచిత్రంగా అనిపించ సాగిందామెకు.
"ఏం మాట్లాడటంలేదు మీరు?" అన్నాడు సుధాకర్.
"పదినిమిషాల్లో బయల్దేరి వస్తున్నాను" అంది సుజాత. తన కళ తప్పు అయినందుకూ, తన అన్న ప్రియురాలు బ్రతికి వున్నందుకూ ఆమెకు చాలా సంతోషం కలిగింది.
13
రవి విసుగ్గా ఇంటికి వున్న తాళంవంకచూసి "సుజాత ఏమైపోయిందబ్బా?" అనుకున్నాడు. అంతలోనే ఎదురింటి కుర్రవాడువచ్చి అతనిచేతికి ఓ ఉత్తరమూ, తాళం చెవీ ఇచ్చి "సుజాత అంటీ మీరువస్తే మీ కిమ్మని చెప్పారివి" అన్నాడు.
రవి ముఖం ఆనందంతో వికసించింది ఆ ఉత్తరం చదువుతుంటే. ఇప్పుడే తను పోలీస్ స్టేషన్లో రిపోర్టిచ్చి వచ్చాడు శాంతిగురించి. ఇన్ స్పెక్టర్ తన కథనాన్ని విని "ఇది చాలా విచిత్రమైన కేసు. నేను ఎక్కడో పుస్తకాల్లో చదివాను. మనిషి మెదడు ఒకోసారి రేడియో ట్రాన్స్ మీటర్ లా పనిచేస్తుందిట. ఆ విధంగా కొన్ని జరిగిన దృశ్యాలు కలల్లో చూడడం జరుగుతుందిట. మీ చెల్లెలి మెదడుకూ అ హంతకుడి దుశ్చర్యలకూ యేదో ట్యూనింగ్ కుదిరింది, అందువల్ల ఆమె హత్యలను చూడ్డం జరిగింది. ఇలా అనుకోని పరిశోధన ప్రారంభిస్తే మేము సుధాకర్ చుట్టూ తిరగాల్సి వుంటుంది. ఈ కేసునింకా రికార్డ్స్ లోకి తీసుకువెళ్ళను. ఎందుకంటే ఒక కల ఆధారంగా తయారవుతున్న కేసు ఇది. ఏదో సరయిన ఆధారాలు దొరికేవరకూ అంతా అనఫీషియల్ గానే వుంటుంది. మనమింతా శ్రమపడితే చివరకు ఏమీ ఉండకపోవచ్చు. ఒక వారంరోజుల తర్వాత మీరు మళ్ళీ నాకు కనిపించండి" అన్నాడు. తను తలాడించి ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం వేసివుంది.
