అసలు విషయమేమిటంటే సుభాష్ ప్రిన్సిపాల్ కూతురు సుశీల ను ప్రేమించాడు. ఆమెతో మాట్లాడి ఆమె కూడా తనంటే యిష్టపడేలా చూసుకున్నాడు. ఇద్దరికీ పెళ్ళి చేయడం మోహనమూర్తి కి యిష్టమే!"
"వీళ్ళ పెళ్ళి జరగాలంటే -- సుభాష్ ఆ యింటర్వ్యూ కి రాకూడదు. కావాలని నేనతడిని సెలక్ట్ చేయకపోయినా ప్రమాదవశాత్తు అతడు సెలక్టు కావచ్చు. అప్పుడీ పెళ్ళి జరగదు. ప్రేమ కావాలో, ఉద్యోగం కావాలో అతడు తేల్చుకోవాలి...."
"నేనేం చేయాలో చెప్పండి సార్!" అన్నాడు ఆనందరావు.
"నువ్వు సుభాష్ కు నా ఆశయాల గురించీ, ప్రస్తుత పరిస్థితి గురించీ చెప్పాలి" అన్నాడు మోహనమూర్తి.
ఆనందరావు సరేనన్నాడు. కానీ ఇంకా సుభాష్ ని కలవలేదు. ప్రిన్సిపాల్ గారికి మాత్రం తానతడ్ని కలిశానని చెప్పాడు.
"ఇంతకీ దీని ఫలితమేమవుతుందంటావు?' అన్నాడు సుదర్శనం.
"వ్యవహారం చాలా తిరకాసుగా వుంది. చూసోతో చూస్తూ ఏ ఆడపిల్ల తండ్రీ కూడా కాబోయే అల్లుడి కుద్యోగం రాకుండా అపడు. మోహనమూర్తి గారు చాలా స్ట్రిక్టు అని నాకు తెలుసు. ఆయనకు కాలేజీలో చాలా మంచి పేరుంది. అయన తన పేరు కాపాడుకుందుకు ప్రయత్నిస్తున్నాడు. అంతవరకూ చెప్పగలను...."
'అయితే ఆ సుభాష్ కుద్యోగం రాకపోవచ్చు...."
"రాకపోవచ్చు, రావచ్చు. నువ్వోసారి వెళ్ళి ఆ సుభాష్ ని కలుసుకోకూడదు?' అన్నాడు ఆనందరావు.
"ఎందుకు?"
"నేను చెప్పాల్సిన మాటలు నువ్వతడికి చెప్పు....అటు నా బాధ్యత తీర్తుంది. నీకు పనీ జరుగుతుంది...."
సరిగ్గా అప్పుడే ఊతప్పాలు వచ్చాయి.
5
పువ్వుల లుంగీ మీద అడ్డచారల బనియన్ వేసుకున్నాడు గోపీ. మనిషిని చూడగానే గూండాలా అనిపించడానికి అతడి మీసాలు కారణం కావచ్చు. అతడికి వయసాట్టే వుండదు కానీ బాగా పెద్దవాడిలా కనపడతాడు.
గోపీ చేతిలో ఏదో సెక్సు పుస్తకం వుంది. ఒక కాలు స్టూలు మీద పెట్టి, రెండో కాలు నేల మీద ఉంచి -- నిలబడే అతడా పుస్తకం చదువుతున్నాడు. అలాంటి పుస్తకాలు చదవడం అతడికి బాగా అలవాటయుండాలి. అతడి ముఖం చూస్తుంటే ఏ అవేశమూ కనబడదు. అప్పుడతడి ముఖం పిల్లల కధలు చదువుతున్న పెద్దవాడి ముఖంలా వుంది.
అప్పుడెవరో తలుపు తట్టారు.
గోపీ చదువుతున్న పుస్తకాన్ని మానేసి ఎదురుగా వున్న డ్రాయరు సొరుగులో పెట్టి - వెళ్లి తలుపు తీసి - "అరె-- నువ్వా-- సుదర్శనం!"అన్నాడు.
సుదర్శనం గోపీ బియ్యేలో క్లాస్ మేట్స్ . గోపీ బియే ఫెయిలయ్యాడు. ప్యాసు కావడానికి ప్రయత్నం చేయలేదు.
గోపీని ,సుదర్శనాన్ని పక్కపక్కన చూస్తె ఇద్దరూ క్లాస్ మేట్సనిపించదు.
"నీతో పనుండి వచ్చాను...." అన్నాడు సుదర్శనం.
"నాతొ నీకు పనా?" అన్నాడు గోపీ నమ్మలేనట్లు.
కాలేజీ రోజుల్లో క్లాసులో గోపీ అల్లరి బాగా చేసేవాడు. సుదర్శనం అతడి పక్కనే కూర్చునేవాడు. క్లాసు పరీక్షల్లో తన పేపర్లోంచి గోపీని కాపీకోట్టుకొనిచ్చేవాడు సుదర్శనం. ఇద్దరివీ భిన్న ధృవాలే అయినా ఇద్దరి మధ్యా ఆకర్షణకు అదే కారణమయిందేమో! ఇద్దరిదీ మంచి స్నేహం.
సుదర్శనం బియ్యే సెకండ్ క్లాసులో ప్యాసై తర్వాత ఎమ్మే చదివి అందులో ఫస్టు క్లాసు తెచ్చుకున్నాడు. గోపీ గూండాగా జీవితంలో సెటిలయ్యాడు. అతడు తన చదువు, సంస్కారం , తెలివితేటలు ఉపయోగించి- సమాజంలో ప్రజా శేయస్సు పేరు చెప్పి దేశ ద్రోహ చర్యలు చేసే కొందరు గొప్పవాళ్ళ కుపయోగపడుతున్నాడు. అందువల్ల అతడికి అటు డబ్బుకూ లోటుండడం లేదు. తన వృత్తిలోని ప్రమాదమతడ్ని బాధించడం లేదు.
'అవును నీతోనే!" అంటూ సుదర్శనం అతడికి తన ఉద్యోగం కధ మొత్తం చెప్పాడు.
'చాలా బాగుంది . ఇప్పుడు నేనేం చేయాలి?' అన్నాడు గోపీ.
"నువ్వా సుభాష్ ని కలుసుకుని ఇంటర్య్వూ కి వెళ్ళవద్దని బెదిరించాలి. అయితే నేను పంపినట్లు చెప్పకూడదు. ప్రిన్సిపాల్ మోహనమూర్తి గారు పంపినట్లే అతడు భావించాలి....' అన్నాడు సుదర్శనం.
"ఉద్యోగం గురించి ఇలా దిగజారిపోయావా?" అన్నాడు గోపీ.
"ఇందులో దిగజారి పోవడమేముంది? సుభాష్ సుశీలను ప్రేమించాడు. సుశీల సుభాష్ ను ప్రేమించింది. వాళ్ళిద్దరికీ పెళ్ళి జరగాలని సుశీల తండ్రి కూడా అనుకుంటున్నాడు. సుభాష్ ఇంటర్వ్యూ కు వెళ్ళకపోవడం వల్ల ముగ్గురి కోరికలు తీరతాయి. వాటితో పాటు కలిసి నాలుగో కోరిక నాది -- " అన్నాడు సుదర్శనం.
"సమర్ధించుకోవడం చేతనైన వాళ్ళు మర్యాదస్తులు. చేతకాని వాళ్ళు గూండాలు. ఈ తేడా ఒక్కటి తీసేస్తే ప్రపంచంలో అందరూ నేరస్తులే!" అని - "ఏమైతే నేం - నేనీపని తప్పక చేస్తాను. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి నువ్వంటే నాకిష్టం. రెండు - ఈ పని చాలా సులభమైనది, చదువుకున్న కుర్రాళ్ళ ను బెదిరించడమంత సుఖమైన పని మరొకటుండదు--" అన్నాడు గోపీ.
'చాలా థాంక్స్ గోపీ!' అన్నాడు సుదర్శనం.
"థాంక్స్ సంగతలాగుంచు. ఆ సుభాష్ ని బెదిరిస్తే చాలా - నా నుంచి ఇంకేమైనా సాయం కావాలా?' అన్నాడు గోపీ.
'అంటే?"
"కావాలంటే ఆ ప్రిన్సిపాలు నే బెదిరించి నీకుఉద్యోగం వచ్చేలా చేయగలను....' అన్నాడు గోపీ.
"అంత దూరం వద్దులే ... ఈమాత్రం సాయం చాలు" అన్నాడు సుదర్శనం. ప్రిన్సిపాలు ని బెదిరించడం వరకే గోపీ చేయగలడు కానీ ఆ విధంగా తనకుద్యోగం రాదని సుదర్శనానికి బాగా తెలుసు.
6
పార్కులో ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు సుశీల, సుభాష్ . సుభాష్ తీవ్రాలోచనలో వున్నాడు.
"మీ నాన్న దీనికింత హడావుడి చేయడం నాకిష్టం లేదు---" అన్నాడు సుభాష్ కాసేపాగి.
'చెప్పానుగా -- అయన చాలా స్ట్రిక్టు...."
"అంతగా స్ట్రిక్టయితే -- ఉద్యోగం నాకివ్వోద్దను. కానీ ఇంటర్వ్యూ కి రావోద్దంటాడేమిటి ఈయన...." అన్నాడు సుభాష్.
"నీ క్వాలిఫికేషన్సు బాగున్నాయి. అందువల్ల ఇంటర్వ్యూ లో సెలక్టయ్యే అవకాశాలు బాగా వున్నాయి. ఏ కారణం వల్ల నువ్వు సెలక్టయినా-- కాబోయే అల్లుడని నీకుద్యోగమిచ్చారని -- ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. అదాయన భరించలేరు. అందుకోసం నిన్నల్లుడిగా చేసుకోరు. అది నీకిష్టమేనా?"
"అయితే నన్నేం చేయమంటావ్?"
"నీకు నేను కావాలో-- ఉద్యోగం కావాలో నిర్ణయించుకో..."
"రెండూ వచ్చే అవకాశమున్నప్పుడు -- ఒకటేందుకు వదులుకోవాలి?"
"రెండూ వచ్చే అవకాశం లేదు నీకు...."
"ఎందుకని?"
"నీకు మా కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం వస్తే -- మా నాన్నగారు మన పెళ్ళికొప్పుకోరు...."
"నీ పెళ్ళి మనిష్ట ప్రకారం జరుగుతుందా--మీ నాన్న ఇష్ట ప్రకారం జరుగుతుందా?' గంబీరంగా అడిగాడు సుభాష్.
'అంటే?"
"నాకుద్యోగం వచ్చిందనుకో. మీ నాన్న మన పెళ్ళి కొప్పుకొలేదనుకో . అప్పుడు నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా -- లేదా?'
"మా నాన్నగారిష్టం లేకుండానా?"
"నీకు మైనారిటీ తీరింది. నాకుద్యోగముంటుంది. అయినా నా పెద్దలు, ఇటు నీ పెద్దలూ ఒప్పుకోకపోతే నేం -- నీకు నేనూ, నాకు నువ్వుగా హాయిగా బ్రతకలేమా?"
సుశీల కళ్ళు మెరిశాయి -- "ఇలా నేనెప్పుడూ ఆలోచించలేదు సుభాష్! ఇదేదో బాగానే వుందని పిస్తోంది."
"అందుకే -- నేను ఇంటర్వ్యూ కి వెళ్ళి తీరతాను. నాకుద్యోగం వస్తే -- మీ నాన్నకిష్టం లేకపోయినా మన పెళ్ళి ఆగదు...." అన్నాడు సుభాష్.
"జస్టే మినిట్ -- మిస్టర్ సుభాష్!" అన్న మాటలు వినిపించి ఆ ప్రేమికుల జంట ఉలిక్కిపడి తలెత్తి చూసింది.
వారికి గోపీ కనిపించాడు.
అతడినీ, అతడి వేషాన్ని చూసి ఇద్దరూ నివ్వెరపోయారు.
"కంగారు పడకండి. నన్ను మీక్కావలసిన వాళ్ళే పంపించారు....' అంటూ గోపీ వాళ్ళ కెదురుగా కూర్చున్నాడు.
"ఎవరు నువ్వు?' అన్నాడు సుభాష్.
"నా పేరు గోపీ. ఈ ఊళ్ళో గూండాగా నాకు మంచి పేరుంది. అందులోనూ నేను చదువుకున్న గూండాని...."
"నీకు నేనెలా తెలుసు?"
"తెలియని వాళ్ళను తెలుసుకోవడం , తెలియని వాళ్ళకు తెలియజెప్పడం నా ప్రత్యేకత....' అంటూ గోపీ ఓసారి మీసం దువ్వుకున్నాడు.
