అక్కడ్నుండి ఇద్దరూ ఒకో గదికే వెళ్ళనారంభించారు. రెండవ గదిలో అంతులేని సంపదలున్నవి . విలువ కట్టలేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు రాసులుగా పోసి వున్నాయక్కడ. "ఈ సంపదతో ప్రపంచాన్నే కొనేయవచ్చు " అన్నాడు వీరచంద్రుడు. సుహాసిని ఏమీ మాట్లాడకుండా అన్నీ అబ్బురంగా చూస్తున్నది. "
మూడవ గదిలో వివిధ దేశాల రాజకుమార్తెల చిత్ర పటాలున్నవి. బహుశా త్రిలోక యాగం పూర్తీ చేశాక జటాజూటుడు వారందర్నీ పెళ్ళాడాలనుకుని వుంటాడు.
నాల్గవ గదిలో ఓ పంజరం వ్రేలాడుతున్నాది. అందులో రామచిలుక వున్నది.
"బ్రహ్మరాక్షసి కోరిన రామచిలుక ఇదే! దీన్ని దానికి అప్ప జెపుదాం " అన్నాడు వీరచంద్రుడు ఉత్సాహంగా.
రామచిలుక వారి మాటలు వింది . అది కంగారుగా పంజరంలో ఎగురుతూ - "రాజకుమారా! నన్ను బ్రహ్మరాక్షసి కివ్వకు. అది నన్నూ, మిమ్మల్ని కూడా చంపేస్తుంది. నన్ను త్రిరూపదేశపు యువరాణి స్వరూపరాణికి అందజేయండి. మీకు మేలు జరుగుతుంది " అంది.
వీరచంద్రుడు ఆలోచనలో పడ్డాడు. చిలక మాత్రం మళ్ళీ - "నేనొక మహామంత్ర వేత్తను , శాపవశాన ఇలా అయ్యాను. నన్ను బ్రహ్మారాక్షసి వద్ద్దకు తీసుకు వెళ్ళావంటే మనందరికీ కాలం మూడుతుంది. బ్రహ్మరాక్షసి కి నా పైన కోపం, అది తాండవ వనం దాటి వెళ్ళలేకుండా బంధించినది నేనే! అందుకని దానికి నా పైన కోపం. నువ్వు నన్ను దానికి అప్ప జెప్పావంటే అది నన్ను వధించి, ఈ ఆరణ్యం దాటి వచ్చి ప్రపంచానికే ప్రమాదంగా తయారవుతుంది. నామాట నమ్మి నన్ను స్వరూపరాణి వద్దకు తీసుకెళ్ళు , ఆమె నన్ను తాకితే నాకు శాపవిమోచన మవుతుంది" అంది .
'సరే! అలాగే చేద్దాం" అన్నాడు వీరచంద్రుడు. పంజరాన్ని సుహాసిని తీసుకున్నది. ఇద్దరు మాంత్రికుడి వద్దకు వెళ్ళారు. వీరచంద్రుడు వాడి దగ్గరున్న మంత్రదండం తీసుకోబోయాడు. ఐతే మాంత్రికుడి వద్ద వుండగా దాన్ని తీసుకోవడం సాధ్యపడదు. అందువల్ల దండం అతణ్ణి విసిరికొట్టింది. అప్పుడు వీరచంద్రుడు మంత్ర గ్రంధం తెరచి అందులోని మంత్రమొకటి పఠించాడు. మంత్ర పఠానం పూర్తీ కాగానే మంత్రదండం గాలిలోకి లేచి, దానంతటదే ఎగురుకుంటూ వచ్చి అతడి చేతుల్లో వాలింది.
"సుహాసినీ ! జటాజూటుడు జీవితమంతా కష్టపడి ధారపోసిన మంత్రశక్తుల్ని మనం లోక కళ్యాణార్ధం ఉపయోగించవచ్చును. పద - ముందు- అరణ్యంలో మృగాల రూపంలో తిరుగుతున్న రాజకుమారులందరకూ శాప విమోచనం కానిద్దాం" అన్నాడు వీరచంద్రుడుత్సాహంగా.
బయల్దేరేముందు వీరచంద్రుడు మంత్ర గ్రంధం లోంచి కొన్ని అవసరమైన మంత్రాలు కంఠస్థ ము చేశాడు.
ఇద్దరూ గుహలోంచి బయటకు వచ్చాడు. అప్పుడు వీరచంద్రుడు మంత్రదండం ప్రభావంతో ఓ పెద్ద బండరాతిని సృష్టించి గుహ ద్వారం మూసి వేసాడు. తర్వాత వీరచంద్రుడు ఓ మంత్రాన్ని పఠించడంతో ఇద్దరూ అక్కడి నుండి మాయమై అరణ్య మధ్యంలో వున్నారు.
అక్కడ వారికి ఒక సింహం కనబడింది. వీరచంద్రుడు మంత్రదండ మహిమతో దానికి స్పృహ తప్పించి సమీపానికి వెళ్ళి చూసాడు. దాని పంజాకు స్వరూపరాణి ఇచ్చిన పంజరమున్నది. దానిపై నలభై నాలుగు అన్న సమాఖ్య వున్నది. ఆ సింహం ఏ దేశపు యువరాజోనని విచారిస్తూ వీరచంద్రుడు మంత్రదండంతో సింహాన్ని తాకాడు. కానీ దానికి యధారూపం రాలేదు.
వీరచంద్రుడు హడావుడిగా మంత్ర గ్రంధమంతా తిరగేసాడు. రాకుమారులకు యధా రూపాలు రప్పించే విధానం అందులో లేదు. అతడి ముఖం బాధగా అయిపొయింది.
అప్పుడు సుహాసిని - "వీరచంద్రా! బెంగపడకు. నిన్ను ఖడ్గ మృగ రూపం నుండి నేనెలా రక్షించాను ! ఈ మృగాల పేర్లు మనం తెలుసుకున్న రోజున ఒక్క పిలుపుతో వాటికి అసలు రూపాలు తెప్పించగలం " అన్నది.
"అయితే ఆ వివరాలన్నీ స్వరూపరాణి వద్ద వున్నవి. ప్రతి ఉంగరానికి అంకె వున్నది. ఏ అంకె ఏ రాజకుమారునికి చెందుకుందో స్వరూపరాణి వ్రాసుకొని ఉంచుకొంది. అది మనకిప్పుడు ఉపయోగపడుతుంది " అన్నాడు వీరచంద్రుడు.
ఈలోగా సుహాసిని చేతిలోని పంజరంలోని రామచిలుక - "రాజకుమారా! రాజకుమారా! బ్రహ్మరాక్షసి మనల్ని చూసింది. అందుకోవడానికి చేతులు చాపుతోంది. త్వరగా ఇక్కడి నుండి తప్పించుకు పోవాలి !" అంటూ హెచ్చరించింది.
వెంటనే వీరచంద్రుడు సుహాసినిని దగ్గరగా తీసికొని ఏదో మంత్రం చదివాడు. బ్రహ్మరాక్షసి చేతులు వాళ్ళను ఒడిసిపట్టేలోగా ఇద్దరూ అక్కడి నుండి మాయమై పోయారు.
అరణ్యమంతా దద్దరిల్లే విధంగా బ్రహ్మరాక్షసి పెడబొబ్బలు పెట్టసాగింది.
10
వీరచంద్రుడు సిరిమల్లె లో పూటకూళ్ళవ్వ ఇంటి ముందు వాలాడు. అయితే ఊరంతా అల్లకల్లోలంగా వుంది. బ్రహ్మరాక్షసి పెట్టిన పెడబోబ్బలన్నీ వింటూ ఊళ్ళో పిల్లలు జడుసుకొంటున్నారు. ఆడవాళ్ళు హడలి పోతున్నారు. మగవాళ్ళు కూడా భయపడుతున్నారు.
'అవ్వా!" అని పిలిచాడు వీరచంద్రుడు. అవ్వ వణికిపోతూ , ఇంట్లోంచి బయటకు వచ్చి, వీరచంద్రుడ్ని చూసి, ఆశ్చర్యపడి "నువ్వు తాండవ వనం లోకి వెళ్ళే వచ్చావా ?" అనడిగింది.
"వెళ్ళాను . ఆ అమ్మాయిని సాధించుకు వచ్చాను. మా దగ్గరున్న రామచిలుక ఆ రాక్షసికి చిక్కితే అది ఊళ్ళ మీద పడి నాశనం చేస్తుంది. ఈ చిలకను దాని కివ్వలేదనే అది పెడబొబ్బలు పెడుతోంది. మీరేమీ భయపడకండి . అది తాండవవనం వదిలి రాదు " అన్నాడు వీరచంద్రుడు.
అవ్వ వీరచంద్రుడి సాహసాన్ని మెచ్చుకొని , "బ్రహ్మరాక్షసి దృష్టి ఎవరికీ మంచిది కాదు నాయనా! నువ్వు నాతొ లోపలకు రా !" అని సుహాసినిని బయటే వదలి, అతణ్ణి లోపలకు తీసుకెళ్ళి - "ఈ మధ్య ఒక ముని హిమాలయాలకు పోతూ ఈ ఊరొచ్చి బ్రహ్మరాక్షసులను తిప్పికొట్టే తాయెత్తులు ఊరందరికీ కట్టి వెళ్ళాడు. నేను ముసలిదాన్ని, నాకేం భయం, ఈ తాయెత్తు నీకు కడతాను. దీని గురించి ఎవ్వరికీ చెప్పకు. కట్టేవాళ్ళకీ కట్టించుకున్న వాళ్ళకీ తప్ప మూడో వాళ్ళకి దీని గురించి తెలియకూడదు. ఆఖరికి నీకూడా వున్న ఆ పిల్ల క్కూడా ఈ విషయం చెప్పకు " అంటూ అతడికి తాయెత్తు కట్టింది. తర్వాత అవ్వ సుహాసినిని కూడా లోపలికి పిలిచి ఇద్దరకూ మంచి భోజనం పెట్టింది.
"గుర్రాల వ్యాపారం జోరుగా సాగుతుందా అవ్వా! నా గుర్రం నీకు బహుమతిగా వదలి వెడుతున్నాను." అన్నాడు వీరచంద్రుడు.
"మరి మిగతా గుర్రాల సంగతి ?" అంది అవ్వ.
"ఆ రాజకుమారులు క్షేమంగానే ఉన్నారు. వాళ్ళ గుర్రాలు కూడా నీకు ఇప్పిస్తానుగా ?" అన్నాడు వీరచంద్రుడు.
వీరచంద్రుడు సుహాసినితో కలిసి అక్కడి నుండి మునిపల్లె కూడా వెళ్ళాడు. అక్కడి ప్రజలు వాళ్ళిద్దర్నీ ఎంతో ఆదరంగా చూసారు. వారి గ్రామానికిప్పుడే ప్రమాదమూ లేదట. వాళ్ళు వీరచంద్రుడిని ఎంతగానో పొగిడారు.
అక్కడ వీరచంద్రుడు కావించిన సహస కార్యం విని సుహాసిని అబ్బుర పడింది.
"నాదేముంది ? సర్వ శక్తిమంతుడైన మాంత్రికుడి ముందు నా పరాక్రమం ఎందుకూ కొరగాలేదు. నీ వల్లనే కదా వాడు వచ్చాడు" అన్నాడు వీరచంద్రుడు.
"పరాక్రమానికీ మంత్ర శక్తులకూ పోలిక లేదు. మాంత్రికుణ్ణి కూడా నువ్వు లేకపోతె చంపగలిగేనాన్నా - ఎన్నాళ్ళ నుంచి వాడి దగ్గర బందీగా పడిలేను ?" అంది సుహాసిని.
"అవును - ఇప్పడు నేను నిన్నేం చేయాలి ? స్వరూపరాణి ప్రశ్నకు బదులిచ్చాక ఆమెను వివాహం చేసుకుంటాను. మరి నీ సంగతేమిటి ?" అన్నాడు వీరచంద్రుడు.
"స్వరూపరాణి ఇంకా ప్రశ్నకు జవాబు కోసం ఎదురు చూస్తోంది. కానీ నా మనసు ఎప్పుడో మీదై పోయింది. మీరు నన్ను పట్టమహిషి ని చేయనవసరం లేదు. పెళ్ళి చేసుకుంటే చాలు" అంది సుహాసిని.
"ఏదో ఆ మాట నీ మాట వినాలనుకున్నాను తప్పితే నిన్ను వదిలి నేను బ్రతగ్గలనా?" అన్నాడు వీరచంద్రుడు.
ఇద్దరూ మునిపల్లె నుంచి త్రిరూపదేశం వెళ్ళి తిన్నగా రాజభవనం చేరకుండా ఓ పూటకూళ్ళ ఇంట్లో బస చేశాక సుహాసినిని, రామచిలుకనూ అక్కడ వదిలి వీరచంద్రుడు ఒక్కడూ రాజభవనానికి బయల్దేరాడు.
భవనం వద్ద కాపలాదారుడితో అతడు - నీ రాజకుమారితో నూరవ రాజకుమారుడు వీరచంద్రుడు తను వేసిన ప్రశ్నకు జవాబుతో తిరిగి వచ్చాడని చెప్పు" అన్నాడు.
భటుడు లోపలకు వెళ్ళి , తిరిగి వచ్చి - మీరిక్కడే ఉండండి. రాజకుమార్తె మిమ్మల్ని స్వయంగా వచ్చి ఆహ్వానిస్తారుట " అన్నాడు.
వీరచంద్రుడు అక్కడే నిలబడి ఉండగా స్వరూపరాణి పూలమాలతో అక్కడి వచ్చి - "నీ సమాధానం వినిపించు , విన్నాక నేను పూలమాల వేస్తాను. నీ సమాధానం నిజమైతే మాల పూలమాల గానే నీ మెడలో ఉంటుంది. లేదా అది విష సర్పమై నిన్ను కాటేస్తుంది " అన్నది.
వీరచంద్రుడు నవ్వి - "తాండవ వనంలోని విధ్వంసకపర్వత గుహలో ఒక మాంత్రికుడు దేవీ ఉపాసన చేస్తున్నాడు. వాడు చేసే నిత్యహోమం కారణంగానే అక్కణ్ణించి ఆగకుండా పొగ బయటకు వస్తుంది. ఆ మాంత్రికుడి పేరు జటాజుటుడు ." అని - "ఇప్పుడు పూలమాల వేయి రాజకుమారీ !" అన్నాడు.
స్వరూపరాణి అతణ్ణి ఆరాధనా పూర్వకంగా చూసి - "శభాష్ వీరచంద్రా ! ఆ మాంత్రికుణ్ణి నువ్వు చూశావా - ఇప్పుడా మాంత్రికుడెం చేస్తున్నాడో చెప్పగలవా ?" అన్నది.
