Previous Page Next Page 
బొమ్మరిల్లు కధలు -31 పేజి 25


    వీరచంద్రుడు జరిగిందామేకు చెప్పి - "ఈరోజుకు అదృశ్యరూపం ధరించే అవకాశం నాకు లేదు. కాబట్టి నేను గుహ లోపలకు రాను; నువ్వు మాత్రం మందిరం లోకి వెళ్ళి ఏమీ జరుగ్నట్లే ప్రవర్తించు. నువ్వు బయటకు వెళ్ళి వచ్చినట్లు మంత్రికుడికి  తెలియకూడదు. తెల్లవారు ఝామున నేను అదృశ్య రూపం ధరించి మళ్ళీ వస్తాను" అన్నాడు . మాంత్రికుణ్ణి చంపడానికి తనకు తోచిన ఉపాయం కూడా అతడామెకు చెప్పాడు.
    "నువ్వు మాంత్రికుడి మీద ప్రేమను నటించు. వాణ్ణి పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకో. వాడి కోరిక తీర్చడానికి అంగీకరించు. నీ అందంతో వాణ్ణి పిచ్చివాణ్ణి చేయి. మాయమాటలతో వాణ్ణి భ్రమలో పెట్టు. అప్పుడు నెమ్మదిగా వాడి వద్ద మంత్ర దండాన్ని కాజేయి. ఈ పర్యాయం మంత్రదండం పోయిందంటే వాడేందుకూ పనికిరానివాడై పోతాడు " అన్నాడు వీరచంద్రుడు.
    ఈ ఉపాయం అమలు జరుపడానికి ముందు భయపడ్డా తర్వాత అంగీకరించింది సుహాసిని.

                                      8

    సుహాసిని వెళ్ళేసరికి మాంత్రికుడింకా తన గదిలోంచి బయటకు రాలేదు. ఆమె తృప్తిగా నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళింది. ఆమె అక్కడకు చేరిన కాసేపటికి మాంత్రికుడామే గదిలోకి వచ్చాడు. వాడి చేతిలో మంత్రదండమూ , ముఖంలో విజయ గర్వమూ ఉన్నది.
    సుహాసిని వాడి వంక చూసి, "జటాజూట మహా మాంత్రికుల త్రిలోక యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని నేనూ ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను" అంది.
    మాంత్రికుడాశ్చర్యపడి, "నువ్వేనా ఈ మాట లంటున్నది ?" అన్నాడు.
    "నేన్నెన్నో ఆశలు పెట్టుకున్న వీరచంద్రుడిని కూడా చిత్తు చేసిన నీ శక్తి అద్భుతం . త్రిలోకయాగానికి ముందే నీ పట్ట మహిషిని కావడం మంచిదని నా తెలివి నన్ను హెచ్చరిస్తోంది " అంది సుహాసిని.
    మాంత్రికుడి ముఖంలో ఆనందం వెల్లి విరిసింది. "రేపే యాగం - నేడే మన వివాహం " అన్నాడు వాడు. సుహాసిని వాణ్ణి సమీపించి, "నన్ను కౌగలించుకో " అన్నది. మాంత్రికుడామెను దగ్గరగా తీసుకున్నాడు.
    "మంత్ర దండం గుచ్చుకుంటుంది. దాన్ని అవతల పెట్టరాదూ !" అంది సుహాసిని.
    జటాజూటుడు ఆమె వంక అనుమానంగా చూసి "ఏ పరిస్థితుల్లోనూ నేను మంత్రదండాన్ని వదలను. ఇక మీదట త్రిలోక యాగం ముగిసే వరకూ నా బ్రతుకంతా దీని పైనే అధారాపడి ఉంది. ఇది నా శరీరంలో ఒక భాగంగా ఉంటుంది" అంటూ దాన్ని తన అంగీలో భద్రపరిచాడు.
    సుహాసిని వాణ్ణి మృదువుగా వదిలించుకుంది. కానీ ప్రేమ నటించటం మానలేదు. ఆమె ఎన్ని టక్కులు వేసినా, జిత్తులు చేసినా వాడు మంత్రదండాన్ని మాత్రం వదిలి పెట్టడం లేదు. కానీ క్షణ క్షణానికి వాడికి ఆమెపై కోరిక పెరుగుతోంది. సీత రావణాసురుడు వేడుకున్న విధంగా వాడామేను రకరకాలుగా బ్రతిమాలుకోసాగాడు. ఆమె వాడిని తూలనాడకుండా , వాడు చెప్పే మాటలన్నీ వింటూ అందీ అందకుండా వాణ్ణి వేధిస్తున్నది చూస్తుండగా రాత్రయింది.
    సుహాసినికి ఏం చేయాలో పాలు పోలేదు. తెల్లవారడానికి ఇంకా చాలా వ్యవధి ఉన్నది. వీరచంద్రు డేప్పటికి వచ్చెను ? తనను రక్షించెను? అయినా వీడు మంత్రదండాన్ని వదిలి పెట్టడం లేదు. వాడి దగ్గర్నుంచి దాన్ని ఇతరులెవ్వరికీ తీయడం సాధ్యం కాదు.
    చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి సుహాసిని విసిగి పోయింది. ఆమె కింక మాంత్రికుడి ప్రేమ కబుర్లు వినాలనిపించడం లేదు. అందుచేత ఆమె వాడికి ప్రేమను నటిస్తూ సురను అందివ్వసాగింది. సుహాసిని అందించగా సురాపానం చేస్తూ జటాజూటుడు అదుపు తప్పాడు. వాడికి బాగా మత్తెక్కి పోయింది. అయినా వాడు మంత్ర దండాన్ని మాత్రం వదిలి పెట్టలేదు.
    "సుహాసిని ! కబుర్లు చెప్పి నన్నూరిస్తున్నావు తప్పితే నువ్వు నా దానివి కావడం లేదు. ఇంక నిన్ను బలవంతంగానయినా వివాహం చేసుకుంటాను" అన్నాడు జటాజూటుడు .
    సుహాసినికి భయం వేసింది. జటాజూటుడామే అందించిన సుర త్రాగడం మానేశాడు. మంత్ర దండాన్ని వదలడం లేదు. వాడి ముఖం ఇప్పుడు భయంకరంగా ఉన్నది.
    మంత్రదండం సాయంతో వాడు అప్పటి కప్పుడు వివాహ మంటపమొకటి అక్కడ సృష్ట్టించి సుహాసినిని బలవంతాన అక్కడకు లాక్కొని వెళ్ళాడు.
    "వద్దు , నాకీ పెళ్ళి వద్దు !" అంటూ అరిచింది సుహాసిని. ఇప్పుడామె వాడి చేతుల్లోంచి విదిపించుకోడానికి పెనుగులాడుతోంది. కాని వాడికి ఆమెను వదిలే ఉద్దేశ్యం లేదు. మంత్రదండం సాయంతో పెళ్ళికి కావలసిన సరంజామాలన్నీ ఒక్కొక్కటే సమకూరుస్తున్నాడు వాడు.
    అక్కడ హోమం వెలిగింది . పురోహితుడు వెలిశాడు. తలంబ్రాలు, అక్షింతలు , పళ్ళ గెలలు ఒక్కొక్కటే వెలుస్తున్నాయి.
    ఈ ఏర్పటులన్నీ చూస్తూ  సుహాసిని భయ పడింది. ఆమె మెదడు చురుగ్గా కూడా పనిచేసింది.
    "నేను నిన్ను పెళ్ళి చేసుకునేందుకు ఒప్పుకుంటాను. కానీ ఇలాంటి పెళ్ళి వద్దు. మనం గాంధార్వ వివాహం చేసుకుందాం" అంది సుహాసిని.
    గాంధర్వ వివాహమంటే వధూవరు లొకరంటే ఒకరు ఇష్టపడడమే అదే పెళ్ళి.
    తనకు శాస్త్ర యుక్తంగా మాంత్రికుడితో పెళ్ళి జరిగిపోతుండేమోనని భయపడి సుహాసిని వాడినలా కోరింది. అందుకు జటాజూటుడు సంతోషించి అక్కడున్నవన్నీ మాయం చేసి ఆమెను దగ్గరగా తీసుకుని, "ఎన్నాళ్ళకు నాదానివయ్యావు?" అన్నాడు.
    "ఇప్పుడు నన్ను బలవంతం చేయకు. రేపు త్రిలోకయాగం జయప్రదంగా పూర్తీ చేశాక నేనే స్వయంగా నీ దాన్నవుతాను " అంది సుహాసిని.
    అయితే తాగుడు మైకంలో వున్న జటాజూటుడి కామె మాటలు రుచించడం లేదు. వాడామే మీదకు వచ్చాడు. ఆమె తప్పించుకోవాలని ప్రయత్నించింది. కానీ వాడి నుంచి తప్పించుకోవడం ఆమెకు చాలా కష్టంగా వుంది. ఆఖరికి వాడి నామె ఎదిరించి ఒళ్ళంతా గీరింది. పారిపోవాలని ప్రయత్నించింది.
    అప్పుడు వాడు ఆమెను బలంగా పట్టుకొని పారిపోకుండా చేసాడు.
    "భగవంతుడా! ఈ దుర్మార్గుడు నన్ను బలవంతం చేస్తున్నాడు. ఇప్పుడు నాకేది దిక్కు?" అంటూ గట్టిగా ఏడ్చింది సుహాసిని.
    అంతే! దిక్కులు పిక్కటమయ్యేలా పెద్ద శబ్దమైంది. మాంత్రికుడు చావుకేక పెట్టి పడిపోయాడు. సునందుడి శాపం ఫలించి వాడి బుర్ర రెండు చెక్కలైంది. త్రిలోక యాగం ఆయెటంతవరకూ ఆగివుంటే వాడినీ శాపం బాధించి ఉండేది కాదు. తాగుడు మైకంలో వాడు అన్నీ మర్చిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు.
    తాగుడు ఎంతో మంది పతనానికి దారి తీసింది. ఈనాడు జటాజూటుడి పతనానికి దారి తీసింది . సుహాసిని ఉపాయం ఫలించింది.
    
                                      9
    జటాజూట మాంత్రికుడు అంత సులభంగా తన కారణంగా మరణిస్తాడని సుహాసిని ఊహించలేదు. భయంకరంగా పడి వున్న వాడి శరీరం వంకనే చూస్తూ ఆమె కొంతసేపు నిశ్చేష్టురాలై వుండి పోయింది. తర్వాత నెమ్మదిగా కదిలి వాణ్ణి సమీపించింది.
    తెల్లవారడానికి అప్పటి కింకా చాలా సమయటున్నది. అంటే వీరచంద్రుడిప్పుడప్పుడే గుహ లోకి రాడు. తను అతడి సాయం లేకుండా గుహ దాటి బయటకు వెళ్ళడం శ్రేయస్కరం కాదు. ఈలోగా మందిరం లోని వింతలూ తెలుసుకోవాలి.
    జతాజూటుడి మొలలో ఒక తాళం చెవుల గుత్తి వున్నది. సుహాసిని ఆ గుత్తి తీసుకుని ఒక్కొక్క గదికే వెళ్ళాలనుకుందామే. తాళాలు వేసివున్న గదులు ఆ మందిరంలో నాలుగు వున్నవి. సుహాసిని తాళపు చెవులనుపయోగించి మొదటి గది తలుపులు తెరచి లోపల కెళ్ళి అక్కడ దృశ్యం చూసి కెవ్వు మని అరిచింది.
    అక్కడ గదిలో ఒక ఆసనం పై జటాజూట మాంత్రికుడు కూర్చుని ఉన్నాడు. అతడు తనవేపు గ్రుడ్లురిమి చూస్తున్నట్లు అనిపించిందామె. తానను కొన్నదోక్కటి జరిగింది మరొక్కటి కావడంతో ఆమెకు అంతులేని భయం కలిగి అక్కడే స్పృహ తప్పిపడి పోయింది.

                                *    *    *
    మళ్ళీ వీరచంద్రుడు వచ్చి స్పృహ తెప్పించే వరకూ సుహాసిని అలా పడుకొనే వున్నది. స్పృహ వచ్చేక వీరచంద్రుడామెను చూసి - "భలే సుహాసినీ! అంత గొప్ప మాంత్రికుడినెలా చంపగాలిగావు ?" అనడిగాడు.
    సుహాసిని కళ్ళు మూసుకొని భయంగా చుట్టూ చూసింది. ఎదురుగా జటాజూటుడుండనే వున్నాడు. ఆమె మళ్ళీ భయంతో కెవ్వుమని కేకవేసి ఆ దృశ్యం వీరచంద్రుడికి చూపించింది.
    వేరచంద్రుడు నవ్వి - "కలవరపడకు సుహాసినీ! అది జూటాజూటుడి విగ్రహం మాత్రమే! నేను లోపలకు వచ్చి బుర్ర పగిలి పడివున్న జాటాజూట మాంత్రికుడిని వెతుక్కుంటూ వచ్చి నిన్ను చూశాను. ముందు నేనూ ఈ బొమ్మను జటాజూటుడిగానే భ్రమించాను. దగ్గరకు వెళ్ళి తాకితే తప్ప ఇది బొమ్మ అని నాకు తెలియలేదు. ఇంకా విచిత్రం చూదువు గాని పద!" అంటూ వెళ్ళి, ఆ బొమ్మను ఎత్తి పక్కన పెట్టాడు. అక్కడ నుంచి భూగృహం లోకి మెట్లున్నవి. సుహాసిని, వీరచంద్రుడు అందులోకి నడిచారు.
    అక్కడ ఓకే చిన్న గది వున్నది. ఆ గది మధ్యన ఒక దేవీ విగ్రహమున్నది. విగ్రహం చేతిలో ఒక పుస్తక మున్నది. వీరచంద్రుడా పుస్తకం చూసి పొందిన ఆనందం వర్ణనాతీతం. అది జటాజూటుడి మంత్రాలకు సంబంధించిన పుస్తకం, అతడి మంత్ర దండాన్ని ఎలా ఉపయోగించాలో సవివరంగా వ్రాసి వుంది. వీరచంద్రుడా గ్రంధం తీసుకున్నాక ఇద్దరూ భూగృహంలోంచి బయటకు వచ్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS