"నేనీ సమాధానం తెలుసుకు వచ్చాక కూడా వాడింకా బ్రతికి వుంటాడా ?" అన్నాడు వీరచంద్రుడు.
స్వరూపరాణి ముఖంలో వెలుగు కనబడింది. ఆమె ఉత్సాహంగా అతణ్ణి సమీపించి- 'జటాజుటుడిని చంపగలిగావంటే నువ్వు నా వరమాలకు అర్హుడివే !" అంటూ అతడి మెడలో మాల వేయబోయి కంగారుగా రెండడుగులు వెనక్కు వేసింది.
"ఏమయింది రాజకుమారీ!" అంటూ వీరచంద్రుడు ఆమెను సమీపించి తాకబోయాడు.
ఆమె కంగారుగా - "నా తల తిరుగుతోంది. మనం మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటికీ నువ్వు వెళ్ళిపో " అంటూ అరిచింది.
వీరచంద్రుడు ఆశ్చర్యంగా - "ఏమైంది రాజకుమారీ !" అన్నాడు మళ్ళీ ఆమెను పట్టుకోబోతూ.
"నన్ను తాకవద్దు" అంటూ అరిచింది స్వరూపరాణి - "మనం రాత్రికి కలుసుకుందాం ."
వీరచంద్రుడికి అసలు విషయం అర్ధం కాక అక్కణ్ణించి వెళ్ళి తన బస చేరుకున్నాడు. అక్కడ సుహాసిని కి తాను పొందిన అనుభవం చెప్పి, హటాత్తుగా ఏం జరిగిందో తెలియడం లేదన్నాడు. ఇది విని సుహాసిని కూడా ఆశ్చర్య పడింది. రామచిలుక మాత్రం కంగారుగా పంజరంలో ఎగురుతూ - "నన్ను స్వరూపరాణి దగ్గిరకు తీసుకు వెళ్ళు . నీకు మేలు జరుగుతుంది " అంది.
"స్వరూపరాణి నీ గురించి నన్నడగలేదు. నేనెందుకు తీసుకు వెళ్ళాలి ?" అన్నాడు వీరచంద్రుడు.
'అడక్క పోయినప్పటికీ ఆమె ఎంతో సంతోషిస్తుంది. త్వరగా నన్ను తీసుకు వెళ్ళు " అంది రామచిలుక.
వీరచంద్రుడి కి రామచిలుకను వెంటనే స్వరూపరాణి కొవ్వాలని లేదు. దాని గురించి ఆమె నడిగి తెలుసుకుని అప్పుడు వివరణ చెప్పి ఆమెనాశ్చర్యపరచాలని అతడికి ఉంది.
మధ్యాహ్నం వీరచంద్రుడి దగ్గరకు కొందరు భటులు వచ్చి సకల మర్యాదలతో " అతడిని రాజభవనానికి తీసుకు వెళ్ళారు. అక్కడ వారు అభ్యంగన స్నానం చేయించారతనికి . ఆ సమయంలో అతడి చేతికి తాయెత్తు చూసి - "ఇదేమిటి ?" అనడిగాడు ఒకడు.
"దాని సంగతి నీకు అనవసరం !" అన్నాడు వీరచంద్రుడు , స్నానం పూర్తయింది.
వీరచంద్రుడు శుభ్రమైన బట్టలు ధరించి తన మంత్రదండాన్ని మళ్ళీ వాటిలోకి మార్చాడు. తర్వాత అతడు రాజకుమార్తె ను చూడబోయాడు.
"గుహలో విశేషాలు గురించి నువ్వు పూర్తిగా అడగనే లేదు" అన్నాడు వీరచంద్రుడు.
'అప్పుడారోగ్యం బాగాలేదు. ఇప్పుడు చెప్పు !" అంది స్వరూపరాణి.
"గుహలో ఓ పంజరం ఉంది. అందులో ఓ రామ చిలుక ఉంది. అది నన్ను స్వరూపరాణి దగ్గరకు తీసుకెళ్ళు తీసుకెళ్ళు అంటూ కాల్చేసింది ......"
"తీసుకొచ్చావా ?" అంది స్వరూపరాణి ఆతృతగా.
"దానికీ నీకూ ఏమిటి సంబంధం ?" అన్నాడు వీరచంద్రుడు.
'అది నాక్కావాలి. అదిప్పుడు ఎక్కడుంది ?" అంది స్వరూపరాణి .
"పంజరంలో పక్షుల్ని బంధించడం నాకు నచ్చదు. అందుకని గాలిలోకి వదిలేశాను ...." అన్నాడు ...వీరచంద్రుడు నిర్లక్ష్యంగా .
స్వరూపరాణికి కోపం వచ్చింది -- "దుర్మార్గుడా ! ఎంత పని చేశావ్ ?' అంటూ అతణ్ణి సమీపించి తాకబోయి , కెవ్వుమని అరిచి, వెనక్కు వెళ్ళి, మళ్ళీ తన ఆసనంలో కూర్చుని - "నువ్వు ఏదో తాయెత్తు కట్టుకున్నావు. అది విప్పి అవతల పారేయి. నాకు తాయెత్తులు కట్టుకునేవాళ్ళంటే అసహ్యం !" అంది.
"నేను తాయెత్తు కట్టుకున్నట్టు నీకెలా తెలుసు ?" అన్నాడు వీరచంద్రుడు ఆశ్చర్యంగా.
"నీకు తలంటు పోసిన భటులు చెప్పారు !' అంది స్వరూపరాణి.
"తాయెత్తు తీసేస్తాను. కానీ ముందు నాకు నీ దగ్గరున్న రాజకుమారుల జాబితా కావాలి "= అన్నాడు వీరచంద్రుడు.
స్వరూపరాణి జాబితా తీసుకువచ్చి అతడి వడిలోనికి విసిరి -- "తాయెత్తు కట్టుకున్న వాళ్ళను తాకాలన్నా నాకు అసహ్యమే !" అంది.
స్వరూపరాణి మాటలు వీరచంరుడికి అనుమానం కలిగించాయి. అతను చటుక్కున లేచి బలవంతంగా ఆమె చేయి పట్టుకోబోయాడు. ఆమె ఒక్క ఉదుటున గదిలోంచి పారిపోయింది.
అప్పటికేం చేయాలో తోచక వీరచంద్రుడు మాయమై సుహాసిని వద్ద వాలి జరిగింది చెప్పాడు. తర్వాత అతడామెతో - "నేను తాండవ వనానికి వెళ్ళి రాజకుమారులందరికీ యధారూపాలు రప్పించి వస్తాను. అంతవరకూ నువ్విక్కడే ఉండు " అన్నాడు.
"నేనిక్కడ ఉండలేను. నేనూ నీతో వస్తాను " అంది సుహాసిని.
తానెంత చెప్పినా వినకపోవడంతో సుహాసినిని కూడా తీసుకుని తిరిగి తాండవ వనంలోకి ప్రత్యక్షమయ్యాడు వీరచంద్రుడు. అతడు తన జాబితా లోంచి ఒక్కొక్కరి పేరే ఎలుగెత్తి అరవసాగాడు. అ పేర్లూ వింటూనే దుట్టుపక్కల ఉన్న కొన్ని జంతువులు రాజ కుమారులుగా మారి అతణ్ణి సమీపించారు.
అతడు వారికీ తన కధని వివరించగానే వారంతా కృతజ్ఞత తో అతడి కాళ్ళ మీద పడ్డారు. వీరచంద్రుడు వారిని వారించి -- "అప్పుడే మీ పని పూర్తీ కాలేదు. ఈ జాబితా అందుకుని మీరీ అడవి అంతా తిరిగి అందరికీ నిజరూపాలు తెప్పించండి. మొత్తం తొంబై తొమ్మిది మంది రాజకుమారులు రావలసి ఉన్నది " అన్నాడు.
రాజకుమరులందరూ ఆ జాబితా అందుకుని ఒక గుంపుగా బయల్దేరారు.
ఈలోగా వీరచంద్రుడు సుహాసినితో సహా బ్రహ్మరాక్షసి ముందు వాలాడు. అది ఆ సమయంలో అరణ్యానికి అడ్డంగా పడుకుని గుర్రు పెట్టి నిద్రపోతోంది.
తనవద్ద నున్న మంత్రదండం తనకు వెయ్యి ఏనుగుల బలాన్నివ్వగా వీరచంద్రుడు తన చేతికి ఉన్న తాయెత్తు సుహాసినికి కట్టాడు. ఆమె చేతిలో చిలక ఉన్న పంజరం ఉన్నది.
అప్పుడు వీరచంద్రుడు బ్రహ్మరాక్షసి శిరసును సమీపించి "బ్రహ్మరాక్షసీ .......బ్రహ్మరాక్షసీ ! నీ కోసం చిలకను తెచ్చాను " అన్నాడు.
అతడలా కాసేపు ఘోష పెట్టగా బ్రహ్మరాక్షసి నిద్రలేచి వీరచంద్రుడిని చూసింది. చటుక్కున అతణ్ణి అందుకుని ముఖానికి దగ్గరగా లాక్కుని ---- "ఏం కావాలి ? మళ్ళీ వచ్చావు ?" అంది.
"నీకోసం రామచిలుకను తెచ్చాను. అదిగో అక్కడ నా ప్రియురాలు సుహాసిని చేతిలో ఉన్నది" అన్నాడు వీరచంద్రుడు.
బ్రహ్మ రాక్షసి వెంటనే చేయి జాచి సుహాసినిని అందుకోబోయి- చేయి వెనక్కు లాగేసుకుంది.
వీరచంద్రుడు నవ్వి ." ఆ చిలుకను నేనిస్తే తప్ప తీసుకోవడం నీ వల్ల కాదు. ఈ అరణ్యం వదిలి వెళ్ళిపోతాననీ ఇంకెప్పుడూ మనుషుల జోలికి రాననీ బేతాళుడి పైన అన చేసి చెప్పావంటే నీకా చిలకనిస్తాను " అన్నాడు.
బ్రహ్మరాక్షసి వెంటనే అందుకు ఒప్పుకుంది.
పంజరంలో రామచిలుక గట్టిగా ఎగురుతూ "నన్ను బ్రహ్మరాక్షసి కివ్వద్దు. అది నన్ను చంపేస్తుంది ' అంటూ పెద్దగా అరవసాగింది.
సుహాసినికా చిలకను చూస్తె జాలి వేసింది. బ్రహ్మరాక్షసి తన పక్కన ఉంచిన వీరంచంద్రుడితో ఆమె , "పాపం ! ఈ చిలకను చూస్తె జాలి వేస్తోంది. దీన్నీ బ్రహ్మరాక్షసి కీయవద్దు " అంది.
"నేను బ్రహ్మరాక్షసికి మాట ఇచ్చాను. అది నాకిచ్చిన మాట నిలబెట్టుంది. నేను దానికిచ్చిన మాట నిలబెట్టుకోకపొతే నా వంశానికే మచ్చ తెచ్చిన వాడినౌతాను " అంటూ ఆమె వద్ద నుంచి ఆ పంజరం తీసుకుని బ్రహ్మారాక్షసికి అందించాడు. బ్రహ్మరాక్షసి వెంటనే పంజరం లోని చిలకను బైటకు తీసి వ్రేళ్ళ మధ్య నలిపి వేసింది.
ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా పెద్ద మెరుపు మెరిసినట్లయింది.
తర్వాత చూస్తె అక్కడ బ్రహ్మరాక్షసి లేదు. దాని స్థానంలో ఒక సౌందర్య వతి నిలబడి ఉంది. ఆమె త్రిరూపదేశపు రాజకుమారి స్వరూపరాణి.
"ఏమిటీ విచిత్రం !" అన్నాడు వీరచంద్రుడు ఆశ్చర్యంగా.
"వీరాధివీరా ! నేను త్రిరూపదేశపు యువరాణిని. నా పేరు స్వరూపరాణి . ఒక బ్రహ్మరాక్షసి ప్రాణాలు రామచిలుక లో ఉంటె దాన్ని జటాజూటుడనే రాక్షసుడు చేజిక్కుంచుకుని, ఆ బ్రహ్మరాక్షసిని తన సేవకురాల్ని చేసుకున్నాడు. వాడు నూర్గురు రాజకుమారులను బలిచేసే త్రిలోక యాగం ఆరంభించి, అందుకు నన్ను కోరిన విధంగా స్వయంవరం ప్రకటీంచమన్నాడు. నేను అంగీకరించలేదు. దాంతో వాడు నా రూపాన్ని బ్రహ్మరాక్షసికీ, బ్రహ్మరాక్షసి రూపం నాకూ ఇచ్చి నకిలీ స్వరూపరాణి ద్వారా తన పధకం అమలు జరిపాడు. నా కధ ఎవ్వరికీ చెప్పుకో లేకుండా శాపమిచ్చాడు. బ్రహ్మరాక్షసి తనంతట తను కోరుకున్నా లేక అది మరణించినా నా అసలు రూపం నాకు తిరిగి వస్తుందని చెప్పాడు. అందుకే నేనా రామచిలుక కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాను. ఇన్నాళ్ళ కు నీ కారణంగా నా కోరిక నెరవేరింది. నన్ను వివాహమాడి నీ దానిని చేసుకో " అంది స్వరూపరాణి.
ఆమె కధ పూర్తయ్యేసరికి అక్కడికి తొంబై తొమ్మిది మంది రాజకుమారులు చేరుకున్నారు. వీరచంద్రుడు సంతోషంతో - " ఇప్పుడు నాకెంతో సంతోషంగా వున్నది" అన్నాడు రాజకుమారు లందరూ అతడ్ని కొనియాడి వారి వారి రాజ్యాలకు తిరుగు ముఖం పట్టారు.
సుహాసిని, స్వరూపరాణులతో కలిసి వీరచంద్రుడు త్రిరూప దేశం చేరేసరికి అక్కడ చచ్చి పడి వున్న బ్రహంరాక్షసిని చూసి అందరూ కలవర పడుతున్నారు. వీరచంద్రుడు అక్కడ వారందరికీ జరిగిన కధ చెప్పి ఆశ్చర్య చకితుల్ని చేశాడు.
త్రిరూప దేశపు రాజు, రాణి తన కూతుర్ని కౌగలించుకుని ఏడ్చేశారు.
అందరూ వీరచంద్రుడి ధైర్య సాహసాలను కొనియాడుతుంటే అతడు నవ్వి - "నిజానికి నేను చేసిందేమీ లేదు. ఘనత నా ప్రియురాళ్ళదే! సుహాసిని జటాజూటుడిని , స్వరూపరాణి బ్రహ్మరాక్షసినీ వధించారు. నేను వారికీ సాయపడ్డాను. అంతే !" అన్నాడు.
వీరచంద్రుడి వివాహం గురించి అతని తండ్రి యైన విరూపదేశపు రాజుకు కబురు వెళ్ళింది. అయన అక్కడికి బంధుమిత్ర సపరివార సమేతుడై తరలి వచ్చి తనయుని వివాహం తిలకించాడు.
వివాహానికి సుహాసిని తండ్రి సునంధుడు కూడా వచ్చి వధూవరులను ఆశీర్వదించి - "ఇంక నా బాధ్యత తీరిపోయింది. ఇకమీదట నేను శాశ్వతంగా హిమాలయాలకు పోయి తపస్సు చేసుకోవచ్చు " అన్నాడు.
ఇద్దరు భార్యలతో వీరచంద్రుడు త్రిరూప , విరూప దేశాలకు ప్రభువై ప్రజా రంజకంగా ఎన్నో యేళ్ళు పరిపాలన చేసి చరిత్రలో శాశ్వతంగా పేరు నిలుపుకున్నాడు.
----- అయిపోయింది --------
