Previous Page Next Page 
వసుంధర కధలు-5 పేజి 25

 

    "అలా అయితే మాబోటి వాళ్ళగతేమిటి? మీలాంటి వాళ్ళకుత్తినే ఇల్లద్దెకివ్వాలా ?" అన్నాడు ఇంటాయన.
    "లేదు సార్ ! కానీ మీరే న్యాయం చెప్పండి. మేం మీకు మూడు నెల్ల అద్దె బకాయి . అయినా మీక్కలిగిన నష్టమేమిట? పైగా మాకు భోజనం కూడా తెచ్చిపెట్టారు...." అన్నాడు శర్మ.
    "మీ సమాధానం నాకు నచ్చింది. నా మనసు ఎంత మాత్రమూ కష్టపడలేదు--" అన్నాడు ఇంటాయన.
    'చాలా థాంక్స్ సార్...." అన్నాడు శాస్త్రి.
    "మరి నేను వచ్చిన పని చెబుతాను. మీరూ కాదనకూడదు...." అన్నాడు ఇంటాయన.
    శాస్త్రి, శర్మ ముఖముఖాలు చూసుకున్నారు. ఇంటాయన ఔదార్యం వెనుక ఏదో కధే వుండాలని ఇద్దరూ అనుకుంటూనే వున్నారు-" చెప్పండి!" అన్నాడు శాస్త్రి.
    "విశాఖపట్నం లో అప్పారావు తెలుసా?" అనడిగాడు ఇంటాయన.
    "విశాఖపట్నం ఎల్లమ్మతోట సెంటర్లో నిలబడి ఓసారి అప్పారావ్ అని కేక పెట్టారు. అంతే ఒక్కసారిగా ఎన్నో కార్లకు , బస్సులకు , స్కూటర్ల కు బ్రేకులు పడ్డాయి. ఎందరో మనుషులు ఆగిపోయారు. ట్రాఫిక్ స్థంభించిపోయింది. ఏమిటీ వింత పరిణామం అని నేను వెర్రి మొహం వేసుకుని చూస్తుండగా ట్రాఫిక్ పోలీసు నాదగ్గరకు పరుగున వచ్చాడు. అతగాడి కేం సమాధానం చెప్పాలా అని నేను హడలి చస్తుండగా అతను వినయంగా - "సార్ - మీరు పిలిచింది నన్నేనా?" అన్నాడు. అలాంటి విశాఖపట్నం లో ఓ అప్పారావు గురించి అడిగితె నేనేం చెప్పరు?' అన్నాడు శాస్త్రి.
    శర్మ నవ్వాడు కానీ ఇంటాయన నవ్వలేదు. అయన అదోలా శాస్త్రి వంక చూసి -- "ఇదిప్పటి జోకుకాడు. మీ పెద్దాల్లెవరో చెబితే విని నువ్వు నాకు చెబుతున్నావు. విశాఖపట్నం అప్పటికీ ఇప్పటికీ ,మారింది. నువ్వు చెప్పే ఎల్లమ్మ తోట సెంటర్ అంత పాప్యులర్ కాదు. ఇప్పుడు అక్కడికి కాస్త దగ్గర్లో నే వున్న జగదాంబ సెంటర్ పాప్యులర్! జగదాంబా సెంటర్ దగ్గర నువ్వు అప్పారావ్ అని కేకపెడితే -- ఆ కేక నాకే వినపడనంత గొడవగా వుంటుందక్కడ. కాబట్టి అలాంటి బెంగలేమీ పెట్టుకోకు. నేను చెప్పే అప్పారావు గురించి కాస్త విను...." అన్నాడు.
    "ఈరోజు మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు సార్! మాకు భోజనం పెట్టారు. ఆ ఫలితం ఊరికే పోలేదు గదా...." అన్నాడు శాస్త్రి. అప్పటికీ ఇంటాయన కోపగించుకోకుండా మనస్పూర్తిగా నవ్వాడు.
    "మరీ అంతలా నవ్వేయకండి సార్. నాకు భయం వేస్తోంది. కాస్త కోపంగా చూడండి --" అన్నాడు శర్మ.
    'అప్పారావు హిందీ సినిమాలో "శెట్టి' లాగుంటాడు. చాలామందికి అతడంటే భయం. నాక్కూడా భయమే!' అని ఆగాడు ఇంటాయన.
    "మీరేమీ అనుకోనంటే ఒక్క ప్రశ్న సార్! ఈ ప్రపంచంలో మీరు భయపడని మనిషి ఎవరైనా ఉన్నారండీ?' అని ఆగి -- "మీరు ఆ అప్పారావు లాంటి వాళ్ళతో గొడవ పెట్టుకోకండి సార్!" అన్నాడు శాస్త్రి.
    "మధ్యలో నన్ను డిస్టర్బ్ చెయ్యవద్దు" అన్నాడు ఇంటాయన - అప్పారావు నా దగ్గర పాతిక వేలు అప్పు తీసుకున్నాడు. ఇప్పటికీ రెండేళ్ళ యింది. తిరిగి ఇమ్మంటే యివ్వాదం లేదు. అప్పు తిరిగివ్వడం వాళ్ళింటా వంటా లేదన్నాడు."
    "పాపం నిజమేనెమో - ఇంటా వంటా లేని పని చేయడాని కెవరు మాత్రం ఇష్టపడతారు" అన్నాడు శాస్త్రి.
    ఇంటాయన అతడి వంక కోపంగా చూస్ -- "మీరు నాకు మూడు నెల్ల అద్దె బాకీ వున్నారు. ఇప్పుడు నా భోజనం తిన్నారు. ఇంకా నా సహ్త్రువు నే సమర్ధిస్తున్నారు. నన్ను వేళాకోళం చేస్తున్నారు. ఇది మర్యాదగా వుందా?" అన్నాడు.
    "ఏం చేస్తే మర్యాదగా వుంటుందో మీరే చెప్పండి" అన్నాడు శర్మ.
    'అప్పారావు దగ్గర బాకీ వసూలు చేసి తీసుకురండి. అందులో అయిదు వేలు మీకిస్తాను...."
    'శాస్త్రి , శర్మ లేచి నిలబడ్డారు-- "ఒకే-- ముందుగా అడ్వాన్సిస్తారా?"
    "నాకు దొరికేవన్నీ మీలాంటి బెరాలే అయితే -- అడ్వాన్సివ్వడానికి డబ్బు లెక్క లేడుస్తాయి? ఆప్పుడు మీకు పెట్టిన భోజనమే అడ్వాన్సనుకోండి. మీరు ఘటనాఘటన సమర్ధులని తెలిసింది. అందుకే ఈ పని నాకు అప్పగిస్తున్నాను. డబ్బు తీసుకు రాగానే మీకు వెంటనే అన్న మొత్తం ఇచ్చేస్తాను...."
    "పోనీ ప్రయాణం ఖర్చులు...."
    "టికెట్ లేకుండా ప్రయాణం చేయగలరని మీ గురించి నాకు తెలుసు...." అన్నాడు ఇంటాయన.
    "గురూ -- ఈయన దగ్గర్నుంచి మనకింకేమీ గిట్టదు. అయిదు వేలంటే మాటలు కాదు. అప్పులన్నీ తీరిపోగా ఇంకా రెండు వేలకు పైగా మిగుల్తుంది--" అన్నాడు శర్మ.

                                    2

    "నమస్కారమండీ -- నా పేరు శాస్త్రి!" అన్నాడు శాస్త్రి.
    "నా పేరు శర్మ!" అన్నాడు శర్మ.
    "మా యింట్లో ప్రస్తుతం శుభాకర్యాలూ, అశుభకార్యాలూ కూడాలేవు ...." అన్నాడతను.
    "మీ పేరు అప్పారావు గారే కదండీ--"అన్నాడు శర్మ.
    "మా అమ్మా నాన్నలకూ నాకంటే పెద్దలకూ నా పేరు అప్పారావు . నా కాలికింది తోత్తులకూ , నా మోచేతి నీక్కు తాగేవాళ్ళకూ నా పేరు అప్పారావు గారు--" అన్నాడతను.
    'అయితే నేను నిన్ను అప్పారావు అనే పిలుస్తాను" అన్నాడు శాస్త్రి.
    అప్పారావు కోపంగా శాస్త్రి వంక చూసి నెమ్మదిగా చొక్కా విప్పాడు. కుర్చీ మీద వేశాడు. ఓసారి కుర్చీ లోంచి లేచి నిలబడి కండలు పొంగించి -- "మరోసారి నన్ను అప్పారావు అను....' అన్నాడు.
        శాస్త్రి నవ్వి "నువ్వు కాబరే డ్యాన్సు లకి బాగా పనికొస్తావు. నువ్వు చొక్కా విప్పిన పద్దతీ, నీ కండలు కూడా చాలా బాగున్నాయి. దురదృష్టమేమిటంటే ఇది ఇండియా అయిపొయింది . ఇక్కడ మగ డ్యాన్సర్ల కంత డిమాండ్ లేదు--" అన్నాడు.
    అప్పారావు ఆవేశంగా కండలు కదిలించి -- "ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా?" అన్నాడు.
    "నీ గురించి చెప్పుకోవడమే కానీ నువ్వు మా గురించి అడగవెం?" అన్నాడు శర్మ.
    'అడ్డమైన వాళ్ళ గురించీ వాకబు చెయ్యడం నాకసహ్యం -- " అన్నాడు అప్పారావు.
    'అలాంటి పని మాకూ అసహ్యమే. అయినా మీ గురించి వాకబు చెయ్యక తప్పలేదు. నువ్వు ఎవరెవరికి ఎంతెంత బాకీలు వున్నావో తెలుసుకుని వాళ్ళందరి బాకీలు తీర్పించాలని వచ్చాం--" అన్నాడు శాస్త్రి.
    "నాచేత బాకీలు తీర్పుస్తారా? నేనసలు ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా అప్పు చేస్తేకదా!"
    "నువ్వు అప్పు చెయ్యలేదూ?" అన్నాడు శాస్త్రి.
    "అప్పు చేయాల్సిన అవసరం నాకేమిటి? నన్ను చూడండి. నా ఇల్లు చూడండి, నా వైభవం చూడండి...."
    "నిన్ను తప్ప మిగతావి చూడ్డానికి మాకేం అభ్యంతరం లేదు కానీ నువ్వు అప్పు చెయ్యలేదనడానికి సాక్ష్య మేమిటి?"
    "ముందు అప్పు చేశాననటానికి సాక్ష్య మేమిటి?" అన్నాడు అప్పారావు.
    శాస్త్రి , శర్మ ముఖ ముఖాలు చూసుకున్నారు. అవును-- ఇంటాయన తమకు నోటు లాంటిదేమీ ఇవ్వలేదు. ఏ నోటూ లేలుండా బాకీ ఎలా ఇస్తాడు  అయన మాత్రం? అయన నిజంగా అప్పారావుకు అప్పిచ్చాడా? ఒస్తే నోటేందుకు ఇవ్వలేదు? అయినా బాకీ వసూలు చేసుకోస్తామని బయల్దేరిన తాము మాత్రం నోటు అడగలేదేమిటి? తామే మర్చిపోయినపుడు ఇంటాయన మర్చిపోవడం లో ఆశ్చర్య మేముంది? ఇప్పుడెం చేయాలి? వెళ్ళి నోటు తీసుకుని మళ్ళీ రావాలా? లేక....
    "మిస్టర్ అప్పారావ్! చంద్రుడు వెన్నెల కాశాడనడానికి సాక్ష్యం అక్కర్లేదు. అలాగే మేము బాకీ వసూలుకు వస్తే -- నువ్వు అప్పు చేశావనడానికీ సాక్ష్యం అవసరం లేదు" అన్నాడు శాస్త్రి.
    "శుక్ల పక్ష చంద్రుడి లా ఎగిరెగిరి పడుతున్నావు. కృష్ణ పక్షం లోకి పంపెయగలను. కాస్త జాగ్రత్తగా వుండు --" అంటూ అప్పారావు భుజాలు కదిపి కండలు పొంగించాడు.
    'అసలు నీ పేరే అప్పారావు. అప్పారావు అప్పులు చేస్తాడని ముళ్ళపూడి వెంకటరమణ అన్నాడు. ఆ సంగతీ నీకు తెలుసా?' అన్నాడు శాస్త్రి మళ్ళీ.
    "పోనీ -- ఆ రమణగరింకా ఏమన్నాడో చెప్పండి. అప్పారావు అప్పులు తీరుస్తాడుటా?"
    అప్పారావు మాటలకు శాస్త్రి , శర్మ ఇద్దరూ కూడా ఆశ్చర్యపోయారు. శాస్త్రి నెమ్మదిగా -- "నువ్వు పహిల్వాన్ లా కనబడుతున్నావ్? నీకిన్ని తెలివితేటలేమిటి-- ఇది భాగోలేదు--" అన్నాడు.
    "నాకు తెలివి తేటలేలా వచ్చాయో తెలుసుకోవాలను కుంటే చెబుతాను. కానీ అందుకు పాతిక వేలు ఖర్చవుతుంది. ఒప్పుకుంటారా?' అనడిగాడు అప్పారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS