'సరే నువ్వేమంటావు?' అన్నట్లు చూశారు శివరామయ్య గారు కొడుకు వంక.
నిజం చెప్పాలంటే మురళీ కి కూడా టీచర్ గా వెళ్ళటం ఇష్టం లేదు. 'స్కూల్లో ఉన్నంత సేపూ గొంతు చించుకుని పాఠాలు చెప్పాలి. ఇంట్లో ఉన్నంత సేపూ కళ్ళు పీక్కుపోయేలా కాంపోజిషన్ పుస్తకాలు దిద్దాలి.' అనుకుంటుండేవాడు అతనెప్పుడు.
అయినా ఏదో తన మట్టుక్కు తను చదివి మంచి మార్కులతో ప్యాసవగలడే కాని తనకి తెలిసింది ఇంకొకరికి అర్ధం అయేలా చెప్పటం అతనికి చేతకాదు. ఎప్పుడైనా చిన్న చెల్లి కుసుమా, తమ్ముడు శేషూ ఏవైనా చెప్పమని అడిగితె మొదటి సారి శాంతంగానే గబగబా చెప్పేసేవాడు. అది అర్ధం కాక వాళ్ళు బిక్క మొహం వేస్తె రెండోసారి కాస్త చిరాగ్గా మళ్లీ అదే విధంగా చెప్పేసేవాడు. అతని ధోరణి వాళ్ళకి అర్ధం అయేది కాదు. ఇంక దాంతో వళ్లు తెలియని కోపం, చిరాకు వచ్చి, 'ఛ, మడ్డి మొహాలు, మీ బుర్ర కేదీ ఓ పట్టాన ఎక్కదు -- మీకు చెప్పటం నా తరం కాదు-- నాన్నగారి దగ్గరికి పొండి ,' అంటూ వాళ్ళ మీద పడి చావగొట్టి నంత హంగామా చేసేవాడు.
అలాంటిది తను మేష్టరయి నలభై మంది పిల్లలున్న క్లాసులో నిలబడి అందరికీ అర్ధం అయేలా చదువు చెప్పటమే! 'అమ్మ బాబోయ్ నా వల్ల కాదు' అనుకుని,
'బి.ఎల్, ' కే వెళ్తాను అన్నాడు తండ్రితో, ఎమ్మే లో సీటు ఎలాగూ దొరకదని పించి.
'సరే' అన్నారాయన.
ఆ చదువూ పూర్తయింది-- వో దిట్టమైన ప్లీదర్నీ చూసుకుని అతని దగ్గర జూనియరు గా చేరదామని అతను అనుకుంటుండగానే పేపరు లో వో కంపెనీ తాలుకూ ప్రకటన పడింది-- మురళీ ఆ ఉద్యోగానికి అప్లయి చేశాడు. రెండు వారాలు గడిచే సరికి ఇంటర్వ్యూ కి కార్డు వచ్చింది. మురళీ హైదరాబాదు వెళ్లి వచ్చాడు. అంతే, మళ్లీ రెండు వారాలు తిరిగే సరికి అప్పాయింట్ మెంటు ఆర్డరు చేతికి వచ్చింది. అతని వుద్యోగం హైదరాబాద్ బ్రాంచి లోనే....అదీ అతని తల్లి అస్తమానూ తలుచుకునే సందర్భం. అదంతా వోసారి గుర్తు చేసుకుని మళ్లీ వుత్తరంలోకి చూపులు మళ్లించాడు కణతలు ఒత్తుకుంటూ.....
'కాని, అన్నయ్యా-- ఉద్యోగాల కోసం ఎంతమంది ఎంతెంత దూరాలకి వెళ్లి పోవటం లేదు? అందరూ అలాగే చేస్తున్నారా? అయినా తన కళ్ళ ముందు వుంటే తన కోడుకి తనకి కాకుండా పోయేవాడు కాదని అమ్మ బాధపడుతుంది.....నిన్ను కని పాతికేళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రుల కన్న నిన్న మొన్న పరిచయం అయిన ఆ కళ్యాణి ఎక్కువయి పోయిందా? వాడికి తన ముందు మేమెవరం కనిపించకుండానే పోయామా అనుకుంటూ అమ్మ ఒక్కటే ఇదయి పోతోంది-- సరే నాన్న గారి సంగతి నీకు తెలిసిందే కదా. అవసరం మేరకు ఒకటి రెండు మాటలు మాట్లాడట మే కాని తీరుబడిగా ఇంట్లో వాళ్లతో ఖబుర్లేసు కు కూర్చోటం అయన కెప్పుడూ అలవాటు లేదు. అసలే మితభాషి అయిన అయన ఇప్పుడు పూర్తిగా మాటా పలుకు త్యజించిన వారిలా మౌనంగా కాలం గడిపేస్తుంటే అసలు ఆయన్ని పలకరించటానికి కూడా మాకెవరికీ ధైర్యం చాలటం లేదు--
అన్నట్లు అన్నయ్యా, నీకు తెలియదు కదూ? నీకు మేనల్లుడు పుట్టాడు. మూడేళ్ళ క్రితం పాప పుట్టినప్పుడు నువ్వు ఎన్ని బహుమతులు పంపించావో ఎంత హడావిడి చేశావో నాకిప్పటికీ గుర్తు వుంది. కాని ఇప్పుడు బాబు పుట్టే వేల్టికి మనం ఎవరికి ఎవరు అన్నట్లు అయిపోయాం....నాకు మొగ పిల్లవాడు పుడితే ఎంతగానో వేడుకలు చెయ్యాలని ఇటు అమ్మా వాళ్ళూ అటు మా అత్తగారు వాళ్ళూ తెగ మురిసి పోయారు-- కాని తీరా వాడు పుట్టే వేల్టికి మాత్రం మనస్సులో వుత్సాహం సరదా అనేది లేకుండా పోయింది. సరే, విధి లేక అన్నట్లు మొన్ననే మూడో నెల రాగానే బాలసారె జరిపించారు. అప్పుడు వచ్చిన మీ బావా మా అత్తగారు మామగారు అమ్మా వాళ్ళని ఎన్నెన్ని సూటీపోటీ మాటలన్నారో వాళ్ళకి నీ మీదెంత దురభిప్రాయం వుందో నువ్వు ఊహించలేవు-- అదంతా ఇప్పుడెందుకులే-- వారం రోజుల్లో నేనూ పిల్లలూ మా వూరు వెళ్లి పోతున్నాం.
'నువ్వు వుంటే కాస్త సందడిగా వుంది. ఇంక ఇల్లు మరీ బావురుమంటూ వుంటుంది.' అని కుసుమా శేషూ ఒకటే దిగులుపడి పోతున్నారు. అయితే మాత్రం నేను ఎన్నాళ్ళు వుండగలను. ఉండి చేయగలిగేది మాత్రం ఏముంది? ఎప్పటికయినా అమ్మా నాన్నగారూ మళ్లీ మామూలు మనుష్యులవుతారా ఈ ఇల్లు మునుపటి లా కలకల లాడుతూ వుంటుందా అనిపిస్తుంది. నాకు....ఈ వయస్సు లో అమ్మా వాళ్ళు మనశ్శాంతి కి దూరం అయి , నలుగురి నోళ్ళల్లో నూ పడేలా నువ్వెందుకు చేశావు అని తలుచు కుంటున్నప్పుడుల్లా మా మనస్సులో ఏమిటో గిలగిల్లాడి పోతాయి....నువ్వు మా అందరిలోకి పెద్దవాడివి, నువ్వు చేసిన పని లోని తప్పు ఒప్పుని గురించి ఇంతకన్న విమర్శించేటంత శక్తి నాకు లేదు....ఏమిటో, మనస్సు వుండబట్టక ఈ వుత్తరం వ్రాశాను--
వైదేహీ.'
కాఫీ కలిపి పట్టుకు వచ్చిన కళ్యాణి, చేతిలో కాగితాలు పట్టుకుని ఎటో చూస్తూ కూర్చున్న మురళీ ని చూసి తెల్లబోయింది.
అడగకూడదను కుంటూనే , 'ఎక్కడ్నించి వుత్తరం ?' అంది.
మాట్లాడకుండా కాగితాలు ఆమె చేతిలో పెట్టాడు. అదంతా గబగబా చదువుకుని, ;నిజమే మరి -- వాళ్ళు బాధపడటం లోనూ, కోపగించు కోటం లోనూ వింత ఏమీ లేదు....నాకు ఒకటి అనిపిస్తోంది.' అంటూ ఆగిపోయింది చెప్పనా మాననా అని సంశాయిస్తున్నట్లు .
'ఏమిటది ?'
'వాళ్ళు పెద్దవాళ్ళు-- కోపంలో రెండు మాటలన్నా మనం ఏమీ బాధపడకూడదు-- ఒక్కసారి వెళ్లి వాళ్ళ కంటికి కనిపించి వస్తే బాగుంటుంది-- ఇద్దరం కాకపొతే మీరు ఒక్కరైనా వెళ్లి రండి ...' అంది నచ్చచేప్తున్న ధోరణిలో.
'లాభం లేదు కళ్యాణి -- మా నాన్నగారి సంగతి నీకు తెలియదు -- ఆయనకి సాధారణంగా కోపం రానే రాదు, ఆ వచ్చినప్పుడు మాత్రం వజ్రం కంటే కఠినంగా మారిపోతుంది అయన మనస్సు-- అయన కోపం చల్లారేదాకా నేను వెళ్ళినా ఏమీ ప్రయోజనం వుండదు. అసలు ఆ కోపం తగ్గటం వాళ్ళు నన్ను మళ్లీ ఆదరించటం అనేది ఈ జన్మలో జరుగుతుందో లేదో నాకు అనుమానమే,' కళ్ళ మీద చెయ్యి ఆనించుకుని కూర్చుని తనలో తను అనుకుంటున్నట్లు గానూ కళ్యాణి కి చెప్తున్నట్లు గానూ అతను అంటూ వుంటే అపరాధి లా తల వాల్చుకుని ఒక్క క్షణం నిలబడి ఆ తరువాత లోపలికి వెళ్ళిపోయింది.
రాత్రి భోజనం వేళ కూడా ఎలాగో వున్న భర్తతో మరోసారి ఏదో చెప్పబోయింది. కాని ఆమె చెప్పే బోయేది వూహించిన మురళీ ఏ ముందుగా అన్నాడు.
'నేను చేసిన పనిలో తప్పు ఏమీ లేదు అని నేను మనస్పూర్తిగా నమ్మినప్పుడు ఇంకొకరి ముందు , వాళ్ళు ఎంత దగ్గిర వారయినా, సరే, తల వంచాల్సిన అవసరం బ్రతిమాలు కోవలసిన అక్కర నాకేం లేదు...పెద్దవాళ్ళు వాళ్ళకే అంత పట్టుదల వున్నప్పుడు నాకు మాత్రం పౌరుషం వుండదా?'
కళ్యాణి మరి మాట్లాడలేక పోయింది.
ఆ రాత్రి ఎలాగో గడిచి తెల్లవారింది.
మురళీ బింకం, నిశ్చయం సడలి పోయింది. ఈ ఒక ఆవకాశం చూస్తాను అనుకుని కార్డు కలం తీసుకున్నాడు. వైదేహి వుత్తరం అందినట్లు వ్రాస్తే అది మళ్లీ అక్కడ ఏ రాద్దాంతాలకి దారి ఇస్తుందో అని తనంత తనే వ్రాస్తున్నట్లు నాలుగు వాక్యాలు వ్రాసి పోస్టు చేశాడు.
* * * *
కాస్త తీరిక దొరికి, సందర్భం వచ్చి నప్పుడల్లా తన చిన్ననాటి ఖబుర్లు చెప్పటం మురళీ కి ఒక సరదా. అందులోనే అతనికి ఏదో తృప్తీ ఆనందం లభిస్తుండేది-- ఎంతో ఆసక్తిగా వింటుంది కళ్యాణి ఆ ఖబుర్లన్నింటి నీ-- మురళీ చెప్తుంటే విని, అర్ధం చేసుకుని, ఆ కుటుంబంలోని వ్యక్తులు ఒకరి పట్ల ఒకరు చూపించుకునే ఆదరణా ఆత్మీయతా తలుచుకుంటుంటే కళ్యాణి కళ్ళు ఆనందాతి రేకంతో చెమ్మగిల్లు తాయి. మొన్న మొన్నటి దాకా మురళీ వాళ్ళందరి అభిమానాన్ని పంచుకుని వాళ్ళల్లో ఒకడుగా బ్రతికాడు. కాని ఇవాళ వాళ్ళంతా అతన్ని ఎవరో పరాయివాడు గా తమతో ఏమీ సంబంధం లేని వాడుగా చూస్తున్నారు.అయినా మురళీ అదేం లెక్క చెయ్యటం లేదు-- తన ఒక్కదాని కోసం వాళ్ళందరి నీ వదులు కున్నాడు. అదే భావంతో ఆమె మనసూ ఎలాగో అయిపోయేది. మళ్లీ అంతలోనే అనిపించేది 'వాళ్ళు అందరూ పంచి ఇవ్వగలిగే ప్రేమని వారు నా ఒక్కదాని వల్ల పొంది, ఆ లోటు ని మరిచిపోవాలి. అందుకే నేను ప్రయత్నిస్తాను-- కాని నా ధ్యేయం కోరిక ఒక్కటే-- వాళ్ళు మామ్మల్ని ఆదరించి దగ్గర జేర్చుకోవాలి . నన్ను ఆ యింటి కోడలిగా అభిమానించాలి-- ఎంతకాలం గడిచినా సరే నేను నిరాశ చెందకుండా ఆరోజు కోసం నిరీక్షిస్తుంటాను.' అనుకునేది.
వో రాత్రి భోజనాల సమయంలో మురళీ తన చిన్ననాటి స్నేహితుడు మోహన్ జ్ఞాపకం వచ్చాడు. 'మా మోహన్' అంటూ ఏదో చెప్పబోయి మళ్లీ గొంతు ఎవరో నోక్కేసినట్లే ఆగిపోయాడు--
సాంబారు లో వుల్లిపాయ లు గరిటతో వెతికి తీసి భర్తకి వడ్డించే పనిలో మునిగిపోయి వున్న కళ్యాణి అది గమనించలేదు కాని కాస్సేపటి తరువాత అతని మొహం వంక చూస్తూ 'అలావున్నారేం' అని అడిగింది.
'మంచి ప్రశ్నే వేశావు?' అని నవ్వేసి భోజనం ముగించి చెయ్యి కడుక్కుని వేల్లిపోయాడే కాని అతని ఆలోచనల చుట్టూ మోహన్ తిరుగుతూనే వున్నాడు.
మోహన్ తండ్రి లక్ష్మీ పతి నిజంగా కూడా లక్ష్మీ పతే, తాత తండ్రుల నాటి ఆస్తికి ఏకైక వారసుడతను. కొంతమంది డబ్బు గల వాళ్ళ పిల్లల్లాగే అతని క్కూడా అంతగా చదువు అంటలేదు-- భుక్తి కోసం రెక్కలు అమ్ముకోవలసిన వాళ్ళ కయితే చదువులు, డిగ్రీలు, అర్హతలు ఎలా వున్నా ఏదో వో వుద్యోగం కోసం తాపత్రయ పడేవారు. కానీ లక్ష్మీపతి కి ఆ అవసరం కూడా లేదు-- స్నేహితులూ, సినీమాలు, షికార్లూ , సిగరెట్లూ ఈ కాలక్షేపం తోనే అతని చిన్నతనం అంతా గడిచిపోయింది-- పెళ్ళయి భార్య కాపురానికి వచ్చాక యినా అతని అలవాట్ల లోనూ, సరదాల లోనూ యేమీ మార్పు రాలేదు.
'నాకు తెలుసమ్మా-- అబ్బాయి ప్రవర్తన నీకు బాధగానే వుంటుంది. అయినా కొన్నాళ్ళ పాటు ఇదంతా సహించాలి నువ్వు. నీ మంచితనం తోనూ, వొర్పు తోనూ క్రమంగా వాడిలో మార్పును నువ్వే తీసుకురావాలి.' అంటూ అత్తగారు తాయారు దగ్గర కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటుంటే,'
