"అదృష్టవంతుడివి బావా-మొత్తంమీద నన్ను సాధించుకున్నావు!" అని అంటున్నప్పుడు కుసుమ వంక అదోలా చూసి-"ఈ శవాన్నేం చేయాలి?" అన్నాడు గణపతి.
"ఇలాగే వదిలేసి వెళ్ళిపోదాం" అంది కుసుమ నిశ్చింతగా. తెలిసి నిశ్చింతగా వున్న అతను నిజం తెలియక కూడా నిశ్చింతగా వుండగలిగిన కుసుమను తలచుకుని భయపడ్డాడు.
4
"పెళ్ళికి అప్పుడే ఏం తొందరొచ్చింది మామయ్యా-కుసుమ ఇంకా చిన్నపిల్లగదా!" అన్నాడు గణపతి.
"ఇంకా చిన్నపిల్ల ఏమిట్రా-ఇంతకాలమూ అది వాయిదా వేస్తూంటే ఏమీ అనలేక వూరుకున్నాం. ఇప్పుడు నీ వాయిదా లేమిట్రా" అంది గణపతి అత్తయ్య.
తన మనసులోని బాధనీ, భయాన్నీ పైకి చెప్పుకుండా మౌనంగా వూరుకున్నాడు గణపతి. అంతకుమించి అతనెక్కువగా ఏమీ చెప్పదల్చుకోలేదని గ్రహించి అతని అత్తయ్యా, మామయ్యా నిరుత్సాహంగా వూరుకున్నారు.
కుసుమకు చాలా ఆశ్చర్యంగా వుంది బావ ప్రవర్తన. ఇదివరలో పెళ్ళి అంటే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే బావ, తను ఒప్పుకున్నానని తెలిస్తే ఎగిరి గంతేయవలసిన బావ ఇలా నిర్లిప్తంగా వుండడం ఆమెకు బాధనూ, ఆశ్చర్యాన్నీ కలిగిస్తోంది. అతని గదిలోకి వెళ్ళి-"అమ్మానాన్నా అడిగిందానికలా చెప్పావేమిటి?" అనడిగింది.
"కారణం నీకు తెల్సుకోవాలనుందా?" అన్నాడు సీరియస్ గా గణపతి.
"ఊఁ."
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి" అన్నాడు గణపతి.
"ప్రేమించినవాళ్ళు పెళ్ళి కోసం తహతహలాడుతారు కానీ.... ....."
"అదే ఇప్పుడు చెబుతున్నాను. నీమీద ప్రేమతో నేనో హత్య చేశాను. ఒక నిండు ప్రాణాన్ని ఈ చేతుల్తో బలిగొన్నాను. ఈ నేరం, ఈ పాపం ఎప్పుడయినా బయటపడితే నన్ను కట్టుకున్న నీ గతి ఏమవుతుంది? ఒక హంతకుడి భార్యగా సమాజంలో నీ స్థానం ఏమైపోతుంది?" అన్నాడు గణపతి. అతని మాటల్లో తడి వుంది.
"అదేం భయం బావా నీకు-ఇది జైర్గి అప్పుడే నెల రోజులైంది. ఎక్కడా హత్య గురించిన అలజడి లేదు" అంది కుసుమ.
"నువ్వలా ధైర్యంగా మాట్లాడడమే నా బెంగను పెంచుతోంది. నిన్ను నేను భరించలేను...." అనుకున్నాడు మనసులో గణపతి. పైకిమాత్రం "నీతో ఇంకా ప్రయివేటుగా చాలా మాట్లాడాలి. కాలేజీనుంచి ఆఫీసుకు ఫోన్ చేస్తాను. వీలయితే బయల్దేరి వచ్చెయ్-సెలవు పెట్టేసి..." అన్నాడు.
కుసుమ ఆఫీసుకు వెళ్ళేక తనకు వచ్చే ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తోంది.
పదకొండు గంటల ప్రాంతంలో ఆమెకు గణపతినించి ఫోన్ కాల్ వచ్చింది. ఫలానా చోటికి రావలసిందిగా గణపతి ఆమెకు చెప్పాడు.
ఆమె వెంటనే సెలవు చీటీ ఇచ్చేసి బావ చెప్పిన చోటుకు వెళ్ళింది. అక్కడ అతను ఆమె కోసం ఎదురుచూస్తూ నిలబడి వున్నాడు. కుసుమ రాగానే "వచ్చేవా? ఇప్పుడు మనం టాక్సీలో గంభీరగెడ్డ వెడుతున్నాం....." అన్నాడు.
కుసుమకు ఎందుకో అర్ధం కాకపోయినా మాట్లాడకుండా విని వూరుకుంది.
5
గణపతి టాక్సీ మాట్లాడేక ఇద్దరూ అందులోఎక్కారు. టాక్సీ రివ్వున దూసుకుపోయింది. గంభీరగెడ్డకు వెళ్ళే వరకూ ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. కుసుమ గణపతిని మాట్లాడించడానికి అయిదారుసార్లు ప్రయత్నంచేసి, అతను తీవ్రాలోచనలో వున్నాడని గమనించి వూరుకుంది.
టాక్సీని పంపించేశాక ఇద్దరూ నడిచివెళ్ళి పూర్వం కూర్చున్నచోటనే కూర్చున్నారు.
గణపతి మాట్లాడేవరకూ తనూ మాట్లాడకూడదని నిశ్చయించుకున్న కుసుమ అలా మౌనంగా అక్కడి ప్రకృతిని గమనిస్తూ కూర్చుంది. చివరకు గణపతి మాట్లాడేడు-"నేను నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా?"
"తెలియదు."
"నీ కోరికపై నేనిక్కడ విఠల్ తో ద్వంద్వయుద్ధం చేశాను. అతన్ని చంపేశాను. అందుకే ఇది ప్రేమ పరీక్షకు అనువైన చోటు. మనకు అచ్చివచ్చిన చోటు" ఆగాడు గణపతి.
"అయితే ఇక్కడకు వచ్చి ఏం చేస్తాం?"
"ఏమీలేదు. నేను హంతకుణ్ణయ్యాను. ఇది జీవితాంతం నీక్కూడా బాధగా వుంటుంది. మచ్చలేని జీవితం నీది. భార్యా భర్తల మధ్య అనుకూల దాంపత్యానికీ తేడా బాగా అడ్డు వస్తుంది. ఆ తేడా ఈరోజు తొలగిపోతుంది."
"అంటే?"
"నువ్వు కూడా ఓ హత్య చేయాలి?"
"చాలా బాగుంది. ఎవరిని చంపాలి? నిన్నా!" అని నవ్వింది కుసుమ.
"నన్ను చంపడం నీవల్ల కాదు. మనమిద్దరం తలపడితే క్షణాల మీద నిన్ను నేను చంపేయగలను. ఆ విషయం ఆలోచించవద్దు. నీకు నేను చెప్పదల్చుకున్న విషయం వేరు. నన్నో అమ్మాయి ప్రేమిస్తోంది...." అన్నాడు గణపతి.
"ఇంకెవరు? నేనే అయుంటాను...." అంది కుసుమ నవ్వి.
"నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో తెలియదు. ఎందుకంటే అలా అని నువ్వు నాకెన్నడూ చెప్పలేదు. నేను చెప్పే అమ్మాయి వేరు. నన్ను ప్రేమిస్తున్నావని తనే స్వయంగా నా దగ్గరకు వచ్చి స్పష్టమైన, స్వచ్చమైన తెలుగు భాషలో నాకు చెప్పింది."
"ఎవరామె?" అంది కుసుమ అనుమానంగా.
"ఆమె పేరు లలిత. నీకంటే అందంగా వుంటుంది."
"పోలికలెందుకులే - ఆమెకు నువ్వేం చెప్పావో చెప్పు...."
"నా మరదల్ని నేను ప్రేమిస్తున్నాననీ అందు గురించి ఒక మనిషితో ద్వంద్వయుద్ధం చేసి చంపేశాననీ కూడా చెప్పాను."
"చెబితే...."
