"రేపు మాతోపాటు నువ్వూ వస్తున్నావు ' అన్నాడు కులభూషణ్.
"ష్యూర్ మావారు ఉళ్ళో లేరుగా అంది జలజ.
"మీవారికి నువ్వక్కర్లేదా?" ఎప్పుడూ ఉళ్ళో ఉండరు...."
'అలా అనకు భూషణ్! వారూళ్లో ఉండేది నా కోసమే! ఉరెళ్ళేది నాకోసమే!" అంది జలజ నవ్వుతూ.
వేదాంతం వారితో ఎక్కువ మాట్లాడలేదు. అక్కణ్ణించి సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళే ముందు నిద్రమాత్రలు కొన్నాడు.
ఇంటికి వెళ్ళాక ఎవరూ చూడకుండా వాటిని మంచి నీళ్ళలో కలిపాడు.
రాత్రి భోజనాల దగ్గర వేదాంతం ఆ మంచి నీళ్ళు తాగకుండా జాగ్రత్త పడ్డాడు. తనకు జలుబుగా ఉందని అతడు అప్పటికపుడు కుళాయి నీరు పట్టి తెచ్చుకున్నాడు.
భోజనాలు కాగానే అందరికీ నిద్ర వస్తుంటే అందరితో పాటు వేదాంతం కూడా నోరావలించాడు'.
కాసేపటి కంతా నిద్ర పోయారు. ఒక్క విశ్వనాద్ తప్ప!
వేదాంతం ఫ్రిజ్ లో మిగిలిన నీళ్ళను పారబోసి ఫ్రెష్ గా పట్టి మళ్ళీ పెట్టాడు. తను నిద్ర మాత్రలు నీటిలో కలిపినట్లు రుజువు మిగలకూడదని అతడి తాపత్రయం.
"విస్సీ -- నీతో మాట్లాడాలి " అన్నాడు వేదాంతం.
"ఉదయ కూడా నాతొ మాట్లాడాలంది" అన్నాడు విశ్వనాద్.
"ఉదయ నిద్రపోయింది. తెల్లారేదాకా లేవదు...."
"ఎలా తెలుసు నీకు ?"
"అందరికీ నిద్ర మాత్రలు ఇచ్చాను...."
"ఎలా ఇచ్చావు.?"
"నీళ్ళలో కలిపాను. ఆ నీళ్ళు అంతా తాగారు. నేను తాగలేదు...."
"మరి నేను తాగాను కదా !"
"నీ సంగతి వేరు ...."
"సరే నాతొ ఏం మాట్లాడాలో చెప్పు ...."
"రేపు మనం అలౌకికానందస్వామీ బండారం బయట పెడుతున్నాం అందులో ప్రముఖ పాత్ర నీదే "
'అంటే?"
"మన భారతదేశం అగ్రరాజ్యాల సరసన సమాన గౌరవంతో మసిలే రోజు కోసం నువ్వూ నేను ప్రారంభిస్తున్న కృషికి రేపు నాంది పలుకుతాం"
"ఎలా?"
వేదాంతం వివరిస్తుంటే విశ్వనాద్ వినసాగాడు.
అలారం గణగణ మ్రోగగానే ఉలిక్కిపడి లేచి కూర్చుంది సీతమ్మ. పక్కనే ఉన్న ఉదయను తట్టి లేపి లే టైము అయిదయింది ' అంది.
ఇంటిల్లిపాదినీ సీతమ్మే నిద్ర లేపింది.
ఆరున్నరకల్లా అంతా రెడీ అయ్యారు.
ఎవ్వరూ టిఫిన్ తినలేదు. కాఫీలు మాత్రం తాగారు.
స్వామి దర్శనం అయ్యేదాకా ఉపవాస దీక్ష పాటించాలని సీతమ్మ అందర్నీ ఆదేశించింది.
కాఫీ ఉపవాస దీక్ష కడ్డు రాదు. సీతమ్మ అభిప్రాయంలో. అంతా టాక్సీలో ఊరు చివరకు వెళ్ళారు.
ఆరోజక్కడ ఏంతో కోలాహలం.
జనం తీర్ధ ప్రజలా ఉన్నారు.
"ఇంత మంది జనాన్నెప్పుడూ చూడలేదు నేను' అంది సీతమ్మ.
"కారణమడిగి తెలుసుకుంటే సరి" అన్నాడు వేదాంతం నవ్వుతూ.
కులభూషణ్ అడిగాడో వ్యక్తిని.
"ఈరోజు ఆశ్రమంలో ఏదో సంచలనం కలుగుతుందట....' అన్నాడతడు .
"ఎలా తెలుసు !"
అతడు తన చేతిలోని పేపరు చూపించాడు. అందులో మొదటి పేజీలో ఉంది .
కులభూషణ్ తను చదివి తల్లికీ ఇతరులకూ చూపించాడా వార్తా.
సీతమ్మ ఆశ్చర్యంగా వేదాంతం వంక చూసి "పేపర్లో పడకముందే నీకీ సంగతెలా తెలుసురా?" అనడిగింది.
"నేనే వేయించానిది పేపర్లో " అన్నాడు వేదాంతం.
"గట్టిగా అనకు. ఎవరైనా నిజమనుకుంటారు !" అంది సీతమ్మ.
అంతా జనప్రవాహంలో కలిశారు.
"ఈరోజు నిజంగానే ఆశ్రమంలో ఏదో జరుగుతుంది" అనుకుంటూ గొణుక్కుంది సీతమ్మ. జన ప్రవాహంలో తను ప్రమేయం కూడా లేకుండానే ఎవరికి వారు ముందుకు వెళ్ళిపోతున్నారు.
మార్గం మలుపు తిరిగింది. ప్రవేశ ద్వారాన్ని చేరుకుంది.
జనప్రవాహం మైదానంలో ప్రవేశించింది.
సీతమ్మ తన వాళ్ళందరూ ఉన్నారో లేదో చూసుకుంటూ "ఒరేయ్ విస్సీగాదేడిరా ?" అంది కంగారు పడి.
"కాస్త ముందుగా వెళ్ళాడు. వస్తాడమ్మా కంగారుపడకు. అన్నాడు వేదాంతం. అయినా ఇంకా సీతమ్మ కంగారు పడుతుంటే "నువ్వు కంగారు పడాల్సింది ఉదయ గురించి విస్సీ గురించి కాదు" అన్నాడతను.
సీతమ్మ అతడి వంక గ్రుడ్లురిమి చూసింది.
"వేదా! ఇక్కడ అమ్మను విసిగించకు" అన్నాడు భూషణ్.
'అమెరికా వెళ్ళొచ్చక వేదాంతం బాగా మారిపోయాడు " అంది ఉదయ.
జలజ వారితో మాట్లాడడం లేదు. ఆమె కక్కడ ఆశ్రమ కుటీరంలో ఏం జరుగుతుందో నని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆత్రుతగా ఉంది.
"ఈ మార్పులు నా దగ్గర సాగవు" అంది సీతమ్మ.
"కాసేపట్లో నువ్వే మారిపోతావమ్మా"అన్నాడు వేదాంతం.
ఆరోజు మైదానం జనంతో క్రిక్కిరిసి ఉంది.
అందరూ స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు.
"జలజా! నువ్వు మాకంటే ముందు స్వామి దర్శనానికి వెళ్ళాలి" అన్నాడు వేదాంతం జలజతో నెమ్మదిగా.
సాధారనంగా స్వామి దర్శనం కుటీరంలో ఉంటుంది. వందల సంఖ్యలో వచ్చే భక్తులకు స్వామి దర్శనం సులభంగానే లభ్యమయ్యేది.
ఆరోజు జనం బాగా ఎక్కువ రావడం వల్ల స్వామి అనుచరులు మైదానం మధ్యలో అప్పటికప్పుడో వేదిక ఏర్పాటు చేశారు. వేదికకు చుట్టూ తెరలున్నాయి. నాటకం స్టేజికి లాగా వేదిక మధ్యలో కూడా తెరలున్నాయి.
వేదికపై స్వామి వచ్చి అందరికీ ఒక్కసారే దర్శన మిస్తారని స్వామి అనుచరులు అప్పటికప్పుడో ప్రకటన చేశారు.
ఎవరైనా ప్రత్యెకంగా స్వామితో చెప్పుకోవాలంటే అందుకు టికెట్స్ తీసుకోవాలి. టికెట్ ఖరీదు వంద రూపాయాలు.
జలజకు వేదాంతం టికెట్ తీసుకున్నాడు.
వంద రూపాయల టికెట్స్ తీసుకున్న వారందరూ వేదికకు దగ్గరలో నిలబడ్డారు. ఒకరి తర్వాత ఒకరికి పిలుపు వస్తుంది. వారు వేదిక ఎక్కగానే తెరలు మూసుకుంటాయి. స్వామి వారి సమస్యను పరిష్కరించగానే తెరలు విడిపోతాయి. వేదిక ఎక్కిన వ్యక్తులు అక్కడుండరు. వేదిక వెనుక నుంచి వారికి వేరే మార్గముంటుంది. వేదిక పై స్వామి ఒక్కడే ఉంటాడు. అయన అనుచరులు వేదిక చుట్టూ ఉంటారు. వారందరూ ఆయనకు అంగరక్షకులు.
సంవత్సరంలో ప్రత్యెక పర్వదినాల్లో అప్పుడప్పుడు జనమక్కడికి ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాంటప్పుడి వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
వేదికపై స్వామి హటాత్తుగా ప్రత్యక్షమావుతుంటాడు. ఒకోసారి ఒకో విధంగా ప్రత్యక్షం కావడం అయన ప్రత్యేకత.
స్వామి ఆరోజెలా ప్రత్యక్ష మవుతాడో చూడాలని జనమంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఒకసారాయన సామాన్య వేషంలో జనంలోంచి వేదిక ఎక్కదు. అంతా అయన స్వామి అనుచరుడు కాబోలు అనుకున్నారు. వేదిక పై తెరలు మూసుకుని తెరుచుకునే సరికి ఆ వ్యక్తీ స్వామి దుస్తుల్లో ఉన్నాడు.
మరోసారి అయన అనుచరులు వేదిక నెక్కి చుట్టూ వలయంగా ఏర్పడి ప్రార్ధనలు చేశారు. వారి వలయం విడిపోయే సరికి మధ్యలో స్వామి ఉన్నాడు.
సీతమ్మ స్వామి కోసం ఎదురు చూస్తూనే కొడుకు గురించి వెతుక్కుంటుంది. అతడెక్కడా కనబడక ఆమె కంగారు పడుతోంది.
వేదాంతం ఆమెకు దైర్యం చెబుతున్నాడు.
ఉదయ కూడా బావ గురించి కంగారు పడుతోంది.
కులభూషణ్ ఆమెకు దైర్యం చెబుతున్నాడు.
ఉన్నట్లుండి మైదానంలో కలకలం.
అప్పుడు సమయం పదిన్నర.
ఎండగా ఉన్నా అదేవర్నీ బాధించడం లేదు. చల్లటి గాలి వీస్తోంది. ఎవరికీ చెమటలు కూడా పట్టడం లేదు.
"స్వామి ప్రకృతిని కూడా శాసించగలడు " అనుకుంటున్నారు భక్తులు.
వేదికపై తెరలో సారి మూసుకుని తెరచుకున్నాయి.
అప్పుడు......
వేదిక మధ్యలో స్థలం కొద్దిగా విచ్చుకుంది. ఆ మధ్య లోంచి ఓ పద్మం లేచి పైకి వచ్చింది.
