Previous Page Next Page 
మూడుముళ్ళూ పేజి 26


    'నిజంగా ఎల్లా వప్పుకున్నావు నళినీ పెళ్ళికి!' అన్నాడు గవర్రాజు. నళిని గంభీరంగా నవ్వింది.
    'గవర్రాజూ! నేను పిరికి పందను కాను! ఇల్లువదిలి పారిపోవటానికి సుభాద్రలా గతిమాలినదాన్ని కాను! భర్తని నాకు చూసి పెట్టే హక్కు, మా వాళ్ళకుంది. వాళ్ళ మాటని నేనెందుకు కాదనాలి? వాళ్ళ పరువు ప్రతిష్టలని ఎందుకు మంట గలపాలి?' అంది.

                                      
    'ఇప్పుడు నీకు పరువు ప్రతిష్ఠ వుందను కుంటున్నావా? హోటలు వినోదాలో నిన్నూ నన్నూ చూసిన వారెందరో వున్నారు! అంతకన్న ప్రతిష్ఠ నీ కడుపులోనే పెరుగు తోంది! ఇంకా ఎందుకీ దాగుడు మూతలు! నీకు చదువుకున్న డిగ్రీ ఒకటి వుందనుకో మిగిలిన విషయాలు దేనిలోనూ నేను మీకు తీసిపోను! అనవసరంగా మనకు కలగబోయే సంతానాన్ని అనాధని చేయకు!' అన్నాడు!
    'నన్ను బెదిరించ నక్కర్లేదు! నీ సంతానాన్ని అనాధని చేయటంలేదు! జీవితాన్ని నీకంటే అధికంగా తీర్చ దిద్దగల వారినే ఎన్నుకున్నాను! నీవేం చెప్పినా ఎవరూ నమ్మరు! అనవసరంగా గొడవలు పెంచక హాయిగా నువ్వు కూడా ఎవర్నో వకర్ని పెళ్ళిచేసుకో!' అని నవ్వింది. గవర్రాజుకి ఆశ్చర్యం వేసింది. సుభద్ర నెల తప్పినది మొదలు ఎంతో గాభరా పడుతూ తననే సర్వస్వంగా భావించుతూ తనని ప్రార్దించుతూ వుండేది. తను నళిని వ్యామోహంలోపడి గొప్పింటి అల్లుడుగా తను సంఘంలో నూతన జీవితం ప్రారంభించ దలచి సుభద్ర మాటలని పెడచెవిని పెట్టి క్రమంగా ఆమెకి దూరం అయి పోయేడు! తనకి దూరం అయిన సుభద్ర అవమానం భరించలేక ఇల్లూ వాకిలీ వదలి, నిర్వాసురాలయిపోయింది! నళినికూడా సుభద్రలానే తనతో వివాహం తప్ప మరో గత్యంతరం లేదని తనని ప్రాధేయ పడుతుందని భావించాడు! కాని నళినికి ఆనందించే తత్వమేకాని, విచారించే తత్వంకాదని ఇప్పుడు తెలిసింది.
    'నళినీ మరోమాటు ఆలోచించు. నీకు నాతో జీవితమే ఎక్కువ సౌఖ్యవంత మవుతుంది. ఎప్పటికయినా నీ భర్తకి మన విషయం తెలిస్తే నీ జీవితం కంటక ప్రాయమవుతుంది! నీమీద నాకున్న ప్రేమ డబ్బు కోసం తాళికట్టేవాడికెల్లా వుంటుంది నళినీ!' అన్నాడు గవర్రాజు.
    'పదిమంది పెద్దల ఎదుటా తాళిగట్టే వానికే నేను ఏది చెప్తే అదె వినాల్సిన గత్యంతరం పట్తుండి! నన్ను వంచించ టానికి ప్రయత్నించకు గవర్రాజూ!' అంది నళిని. నళినికేసి విభ్రమంగా చూడటం తప్ప మరేం అనలేక పోయేడు గవర్రాజు!
    వారం పదిరోజులు గడిచాక నళిని పెళ్ళి నరసింహ మూర్తితో మహా వైభవంగా జరిగిపోయింది. గవర్రాజూ మాధవ కూడా వచ్చేరు. పెళ్ళి విందులో చాలా ఆనందంగా పాల్గొన్నాడు మాధవ! రామనాధం కూడా భార్యతో సహా వచ్చేడు! బంధువు లందరూ ఒక నెలరోజులు వరకూ తిష్ఠవేసారు కేశవ ఇంట్లో కన్యధార వసుంధరా భర్తా, చేసారు. కేశవ, కామేశ్వరీ చేయలేదు. నందమ్మ పెళ్ళిలో ఎలాంటి తగువులూ లేకుండా సంతోషంగా తిరిగింది. పెళ్ళి జరిగిన నాలుగుగయిదు రోజులనాడు, ఒకరోజు గవర్రాజు వంటిగా డాబామీద నించున్నాడు. క్రింద కారు ఆగిన చప్పుడుకి క్రిందకు చూసాడు. కామేశ్వరి ఆరునెల్ల చంటి పిల్లవాణ్ణి ఎత్తుకుని మెట్లెక్కటం కన్పించింది. గబ గబా, క్రిందకు వెళ్ళాడు గవర్రాజు.
    'చాలా కాలానికి మా ఇంటికి వచ్చేవు కామేశ్వరీ!' అంటూ పలకరించేడు. హాలులో వున్న సోఫాలో కూర్చుంది కామేశ్వరి.
    'ఇల్లు బాగుంది గవర్రాజూ!' అంది కామేశ్వరి.
    'అష్ట ఐశ్వర్యాలూ, సాధించాను! కామేశ్వరీ, కాని, నేను పొందాలనుకున్నది మాత్రం, పొందలేక పోయేను!' అన్నాడు గవర్రాజు.    
    'పొందలేక పోతున్నానన్న తమకంలోనే పొంది తీరాలన్న కాంక్ష వృద్ది చెందుతుంది గవర్రాజూ! వంటిగా ఎందుకుండి పోతావు? చక్కని పిల్లని చూస్తాను! పెళ్ళిచేసుకో కూడదూ!' అంది కామేశ్వరి.
    'ఈ జన్మకి' అదొక్కటే తక్కువ నాకు! నిర్లిప్తంగా అన్నాడు.
    'అంత వేదాంతం ఎందుకు గవర్రాజూ. ధనం సంపాదించేవు. సంఘంలో పలుకుబడి సంపాదించేవు ఒక ఆడపిల్ల నిన్ను తిరస్కరించినంత మాత్రాన నీ విలువ నీకు లేకుండగా పోతుందా. గతం విస్మరించు! భవిష్యత్తు కేసి ఆశతో ప్రయాణం చేయి!' అంది కామేశ్వరి.
    కామేశ్వరి ప్రశాంత వదనం చూసేసరికి గవర్రాజుకి గతమంతా తలపుకి వచ్చింది. కామేశ్వరిని తను పెళ్ళాడక తప్పదన్న నిశ్చయంతో వుండేవాడు. ఆ అంచనా తారుమారయింది! ఆ బాధలో సుభద్రని లొంగదీసుకుని కొంత తృప్తి ననుభవించి, నళిని వ్యామోహంలో పడ్డాడు! నళిని తనని అనుభవించి కూడా తిరస్కరించగలిగింది!
    అకస్మాత్తుగా కామేశ్వరి చేతుల్లో ఆడుకుంటూన్న పసివాడిమీద దృష్టిపడింది గవర్రాజుకి.
    'ఈ కుర్రవాడు ఎవరు కామేశ్వరీ ముద్దుగా వున్నాడు?' అన్నాడు.
    'బాగున్నాడా! కావలిస్తే తీసుకో!' అంది కామేశ్వరి!    
    'ఎవరి పిల్లవాడు కామేశ్వరీ, నీకు వాణ్ని దానం చేయటానికి హక్కువుందా?' అన్నాడు గవర్రాజు.
    'దాన విక్రయాది సర్వాధికారాలతో వీడు నా పాలబడ్డాడు గవర్రాజు. నేను వీణ్ణి ఏమి చేసినా, అడిగేవాళ్ళెవరూ లేరు' అంది కామేశ్వరి.
    గవర్రాజుకి జాలివేసింది ఆ పసివాడి మీద. ఈ లోకంలోకి వచ్చీ రాగానే, అతను అనాదుడైపోయేడు. తనకి తల్లితండ్రులు పోగానే, తను తన అన్నతమ్ములచేత ఎంతగా అవమానితుడైనాడో, పొట్ట చేత పట్టుకుని ఎన్నెన్ని వూళ్ళు నిర్వ్యాసారంగా తిరిగాడో గుర్తుకు వచ్చింది గవర్రాజుకి. తనకింత డబ్బువుంది. ఇల్లాంటి అనాధ బాల బాలికలను చేర్చి పెంచి, విద్యాబుద్ధులు నేర్పించి, లోకంలో వాళ్ళ బ్రతుకును వాళ్ళు బ్రతక గలిగేట్లు చేస్తే తన డబ్బు సార్ధక మౌతుంది-అనుకున్నాడు గవర్రాజు.
    'అయితే నాకిచ్చెయ్యండి బాబుని. నేను పెంచుకుంటాను. ఇంకా ఇల్లాంటి బాల బాలికలు కనపడితే నాకియ్యండి. నేను ఒక అనాధశరణాలయం స్థాపించదల్చుకున్నాను!' అన్నాడు గవర్రాజు.
    'అల్లాగే! నీవు శరణాలయం స్థాపించటం చాలా సంతోషం! నీలాంటి సహృదయులు నలుగురు కూడితే ఈ లోకంలోని అనాధ పిల్లలు అందరూ అదృష్టవంతు లౌతారు గవర్రాజూ. కాని ఆ పిల్ల లందర్ని చేరదీసి ఆడించి, పాడించి పెంచటానికి ఆయాలు కావద్దూ. నాకు వీడి అమ్మని తెలుసును. పాపం ఆ పిల్ల జీవనభ్రుతికోసం తంటాలుపడుతూంది. నీ శరణాలయంలో ఉద్యోగం ఇచ్చేనంటే ఆనందపడుతుంది! ఏం గవర్రాజూ, ఆమెని రేపు పంపించమంటావా?' అంది కామేశ్వరి.
    'తప్పకుండాపంపించు!' అంటూ కామేశ్వరిచేతుల్లోని బాబుని ఎత్తుకుని ముద్దులాడేడు గవర్రాజు. వాడిని ఎత్తుకో గానే, అతని శరీరం, నూతన అనుభూతితో పులకించిపోయింది. తను ఇన్నాళ్ళ నించీ ఎదురుచూస్తున్న ప్రేమ లభించినట్లయింది గవర్రాజుకి.
    కామేశ్వరి ఇల్లంతా తిరిగిచూసింది. చాలా విశాలంగా అందంగా కట్టబడివుంది గవర్రాజు మేడ.
    'మా మేడకన్న, మీ మేడ చాలా పెద్దది గవర్రాజూ' అంది కామేశ్వరి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS