సీతమ్మ పాలల్లో నానవేసిన అటుకులూ, పంచదారా కలిసివున్న గిన్నె, నాలుగు కొమ్మ అరటిపళ్ళూ ఆ మూల నున్నవి చూపెట్టి 'తీసుకో! కాస్సేపు నడుం వాలుస్తాను!' అంటూ చెంగు పరుచుకుని వత్తిగిలి పడుకుంది. రెండు అరటిపళ్ళూ కాసిని అటుకులూ తీసుక వచ్చి సుభద్ర కిచ్చింది కామేశ్వరి!
'ఇదేమిటి అక్కా!' అంది సుభద్ర.
'మా తీర్ధ యాత్రల్లో ఇవే భోజనం మాకు!' అంది కామేశ్వరి.
'ధన్యురాలివి అక్కా! అందర్నీ మెప్పించుతున్నావు! నీ మీద ఇప్పుడు అందరికీ మంచి అనురాగం కుదిరివుంటుంది!' అంది సుభద్ర.
'ఆఁ! అందరికీ అనురాగం వుంది! వక్క నళినికి తప్ప! ఆ పిల్లకి నేను మాతృ స్థానం వహించటం ఏమీ నచ్చలేదు! అస్తమానూ ఏదో సూటిమాటలు అంటూ వుంటుంది!' అంది కామేశ్వరి. నళిని పేరెత్తగానే సుభద్రకి వళ్ళుజలదరించింది!
'అక్కా! నళినీ కుమారే నా జీవితంలో నిప్పులు కురిపించటానికి సిద్ధమయింది! ఆ పిల్ల కూడా గవర్రాజు వెంట తిరుగుతూందిట కాదూ!' అంది సుభద్ర. 'తిరుగు తూనే వుంటుంది! కానీ నళినికి గొప్ప సంబంధం చూస్తున్నారు! దాదాపు కుదిరి పోతుంది! యాభయ్ వేల రూపాయలు కట్నం ఇచ్చి చేస్తారు దాని పెళ్ళి! పెళ్ళి అవగానే ఇద్దరూ విదేశాలకు వెళ్ళి పోతారుట! అందుకనే ఆ పిల్లని యం.ఎ. కోర్సులో జేరిపించలేదు!' అంది కామేశ్వరి.
'నళిని నన్ను ప్రేమించింది! కాని నీకోసం ఆమెని తిరస్కరించాను అని గవర్రాజు నాతో అనేవాడు మొదటి రోజుల్లో! ఇప్పుడేం చేస్తాడో మరి!' అంది సుభద్ర.
పిల్లవాడు లేచి ఏడవటం మొదలెట్టాడు! సుభద్రలానే పచ్చని పసిమి రంగూ, ఒత్తయిన ఉంగరాల జుట్టూ వచ్చాయి వాడికి!
'భద్రా! నీ నీ దాసీపనికి స్వస్తి చెప్పు! ముందు!' అంది పిల్లవాడిని ఒడిలోనికి తీసుకుని జోకొట్టుతూ కామేశ్వరి!
'పిచ్చి అక్కా! నాలో రక్తమాంసాలు లేవు కనుక ఈ దాసీ పని అయినా నాకాశ్రయ మిస్తూంది! మునుపటి కళాకాంతులు నాలో వుంటే ఈ గృహస్థులు నాకు ఆశ్రయం ఇస్తారా? అప్పుడు ఇంతకంటే ఘోరాతి ఘోరమయిన వృత్తి అవలంబించాల్సిన అవస్థ వచ్చును నాకు! పురుటి సమయంలో తీవ్రంగా జబ్బు పడ్డాను! రెండు నెలలు పురుడు వెళ్ళే దాకా హాస్పిటల్ లోనే వున్నాను! ఉచితంగా పిల్ల వాడికి పాలూ అవీ హాస్పిటల్ వాళ్ళే చూసారు! ఏదో ఈ నాలుగు నెలలు బట్టీ ఎల్లానో అల్లా కాలం నెట్టుకొస్తున్నాను?" ఎవరిచేతా తాళి కట్టించుకోకుండానే నేను గృహిణి నయ్యాను! ఎవరి ఆమోద ప్రమోషన్ నోచుకోకుండానే నేను తల్లి నయ్యాను! ఎవరి వినోద విలాసాలనూ తలుచుకోనక్కర్లేకుండానే ఇప్పుడు దీనురాలైన విధవను అయ్యాను! తల్లీ తండ్రీ అన్నతమ్ములూ, సౌభాగ్యసౌశీల్యాలు గల సోదరీ వున్న నేను ఈరోజు బంధుహీనను ఎందుకయ్యాను అక్కా! క్షణిక దౌర్భల్యానికి ఆవేశానికి అహంభావంతో వశురాగినైనాను కనుక ఈ హీనస్థితికి వచ్చాను! చరిత్ర హీననైనాను!
అందలమెక్కించ దలిచానని, అధపాతాళానికి కృంగదోసే ఈ గవర్రాజు మాటలు ఆనాడు నన్నెంత మోహపరిచాయో! క్షణాలు స్వర్గతుల్యంగా కనపడేవి అక్కా!' ;సుభద్ర కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయేయి! ఏడ్చినా ఆమెకి కన్నీరు రావటం లేదు! ఆమె కన్నుల్లోని నీరు ఏనాడో ఎండిపోయింది!
'అరే! మీరా! ఇల్లా క్రింద చతికిల బడినారేమిటి ఎండగా లేదూ!' అన్న పలకరింపుకి ఉలిక్కిపడింది కామేశ్వరి! ఎదురుగ్గా రామనాధం! వరండాలో బాగా ఎండగా వుంది. ఆ ఎండలోనే చతికిలపడి కబుర్లు చెప్పుకుంటున్నారు, అక్క చెల్లెళ్ళు ఇద్దరూనూ!
మీ రెప్పుడు వచ్చారు!' అతనికి తను చేసిన ఉపకారం ఏమీలేక పోయినా, చనువుగా పలకరించటానికి వెనుకాడని స్నేహభావానికి విచలిత అయ్యింది. కామేశ్వరి!
'ఉదయం వచ్చాను ఇక్కడికి! మీ రెందుకు వచ్చారు? కేశవ, వచ్చారా!' అన్నాడు రామనాధం.
'వారు రాలేదు! నేనూ మా అత్త గారూ వచ్చాము అంది కామేశ్వరి.
'రాత్రికి వుంటారుగా! తప్పకరండి!' అన్నాడు రామనాధం. కామేశ్వరికి సిగ్గు వేసింది! అతని అప్రస్తుత ధోరణికి! మాట్లాడలేదు. కామేశ్వరి!
'వస్తారుగా! తప్పక! క్రింద కోవెలలోనే ఉంటాము, ముహూర్తం అక్కడ్నే!' అన్నాడు రామనాధం. కామేశ్వరి కొంచెం తేరుకుంది!
'అమ్మయ్య! మీ వివాహమా ఈ రోజు! అయితే తప్పక ఉంటాను. అన్నట్లు మాధవ వచ్చారా?' అంది కామేశ్వరి!
'వొచ్చాడు! ఏవో పూలకనీ, పళ్ళకనీ బెజవాడ వెళ్ళాడు! సాయింకాలానికి వొస్తాడు! అన్నట్లు ఈ అమ్మాయి ఎవరు?' అన్నాడు రామనాధం!
'మా చెల్లి!' అంది ముక్తసరిగా కామేశ్వరి!
'వోహ్! ఆ రెండు జడల చలాకీపిల్లా! ఎంతలా మారిపోయింది? అయినా, ఇటు వెంపు ఎండలు ఎక్కువ!' అంటూ రాత్రితన పెళ్ళికి రావాలని మరోసారి హెచ్చరిస్తూ వెళ్ళిపోయేడు రామనాధం! సుభద్రవద్దనున్న పిల్లవాడిని చూడనేలేదు రామనాధం!
'ఎవరక్కా ఈతను?' అంటూ ఆడిగింది. సుభద్ర! కామేశ్వరి, రామనాధం తనని పెళ్ళిచూపులకు చూసుకుందుకు రావటందగ్గర్నించీ, మళ్ళీ తనని ప్రేమించానని చెప్పటం వరకూ, అంతా పొల్లు పోకుండా చెప్పింది!
జితేంద్రియురాలివి అక్కా నీవు! రామనాధంలాంటి యువకుడు, నిన్ను అర్ధించినా, నీవు ధర్మాన్ని కాలద్రోయ లేక పోయేవు! నాలాంటిదయితే ఏమి చేసునో! నేను ఆవేశాన్ని అణచుకోలేను! నా అందమే నాకా ఆవేశాన్ని ఇచ్చింది! ఆ ఆవేశమే నన్ను అణగద్రొక్కింది! అంది సుభద్ర.
'నిన్ను నీవు చిన్నబుచ్చుకోకు భద్రా! కాలం మారింది!
'మునపట్లా నీతి అంటూ నేటి యువతులు మడికట్టుకు కూర్చోవటం లేదు! విద్యార్జన పేర విలాసాల్లో మునిగితేలుతున్నారు! నీవు తెలిసీ తెలియని తనంలో చేసిన పొరపాటుకి జీవితం అంతా అజ్ఞాతంలో మణిగి పోవాల్సిన అవసరం లేదు! నాతో మా వూరు వచ్చెయ్యి, నీకు సహాయం చేస్తాను! ఏ టైపూ షార్టు హేండు పరీక్షలు పాసైనా నీ వొక వుద్యోగినురాల వవుతావు! నీ పొట్ట నీవు పోషించుకోగలుగుతావు! నీ కొడుకు భవిష్యత్తుకి బంగారు బాట వేయగలుగుతావు!' అంది కామేశ్వరి!
'అంత అదృష్టమా అక్కా! నేను మళ్ళీ మామూలు మనిషిని అవగలనా!' అంది సుభద్ర.
తప్పులు మామూలు మనుష్యులే చేస్తారు భద్రీ! మామూలు మనష్యులు చేస్తేనే అవి తప్పులవుతాయికూడా! ఉన్నత ధనిక వర్గంవారు, అందమైన ధనవంతమైన మేలి ముసుగుతో ఎన్ని తప్పులు చేసినా అవి ప్రజలదృష్టిలో పడనే పడవు! గొప్పింటి అమ్మాయి, బాయ్ ఫ్రెండ్స్ తో కార్లలో ఊరేగినా, ఎవరూ పట్టించుకోరు! పేదింటి అమ్మాయి పెదవి కదిపిందంటే పృథివి దాటిందన్న మాటే! మన ఆర్ధిక అంతస్థుల లానే మన తప్పుల అంతరాలు కూడా వున్నాయి! నువ్వు తప్పు చెయ్యి ఒప్పు చెయ్యి! నీవు ధైర్యంగా నీ మనః సాక్షి ముందు నిలబడ గలగాలి! నీ వ్యక్తిత్వాన్ని నీవే తీర్చి దిద్దుకొ గలగాలి!' అంది కామేశ్వరి!
లోపల సీతమ్మ లేచిన చప్పుడు అయ్యింది.
'నేను వెళ్తాను! నీవు ధైర్యంగా వుండు!' అంటూ ఒక పచ్చనోటుని చెల్లికిచ్చింది కామేశ్వరి. ఆశ్చర్యపోయింది సుభద్ర!
'అక్కా! నాకు నోటు వద్దు! ఇంత దీనస్థితిలో నేను నోటు మార్చాలంటే నేను ఆ నోటుని ఎక్కడ్నో దొంగిలించాననుకొంటారు! ఆనక చిల్లర మార్చి ఇద్దువు గానీలే!' అంటూ ఆ నోటుని కామేశ్వరినే ఇచ్చేసింది సుభద్ర!
* * *

12
'ముఫ్ఫయ్ వేలు రూపాయలు కట్నం, కారూతో వప్పుకున్నారు చివరికి' అన్నాడు కేశవ!
ఈరోజు, వసుంధరా, నళినీ, కేశవ, ఏక పంక్తిన కూర్చున్నారు భోజనాలకి! కామేశ్వరీ, సీతమ్మ వడ్డిస్తున్నారు. నళినికి వప్పుకోవటం ఏమిటో ఎందుకో తెలుసును. అయినా మాట్లాడలేదు.
'విదేశాలకు వెళ్ళేవాడికి కారు ఇప్పట్నించీ ఎందుకుటా!' అంది వసుంధర.
'రెండేళ్ళు బెంగుళూరులో ఏదో కంపెనీలో వర్క్ చేస్తాడట! అందుకని కారుకావాలట! అబ్బ! ఆనందమ్మ ఏం పేచీకోరు మనిషో బాబూ! ఆమె ప్రశ్నలకు జవాబులు చెప్పలేక నా ప్రాణం పోయిందనుకో వసూ!' అన్నాడు కేశవ.
'ఏం ప్రశ్నలేసిందావిడ?' కుతూహలంగా అంది వసుంధర.
'ఇంతకాలానికి మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? మీ కూతురుమీద మీకు అంత ఇష్టంలేదా ఏమిటి?' అన్నది ఆవిడ! అడగవలసిన ప్రశ్న అడిగారు అనుకుంది నళిని.
'నువ్వేం చెప్పావు?' అంది వసుంధర. కామేశ్వరి చెవులు నించున్నాయి.
'మతిలేక చేసుకున్నాను! మా అమ్మాయి మీద ఆపేక్ష లేక కాదు! నా ఆస్తి అంతా నా తర్వాత మా అమ్మాయిదే! ఆ బెంగ మీరు పెట్టుకోనక్కరలేదు! అన్నాను' అన్నాడు కేశవ. వసుంధర నవ్వింది. కామేశ్వరికి ఆమాటలు అర్ధం అవలేదు! సీతమ్మకీ అర్ధం అవలేదు.
'ఏదో అడుగుతారు! దానికేం! ఇంతకీ మనపిల్ల, డబ్బు నచ్చాయి! ఈ వేసంగుల్లో ముహూర్తం పెట్టించేస్తే అది ఒక ఇంటిదయిపోతే, నాకే బెంగా వుండదు' అంది సీతమ్మ. నళినికి తన పెళ్ళి ఇంత తొందరలో కుదురుతుందని కానీ, నరసింహ మూర్తికి తను నచ్చుతానని కానీ, నమ్మకం వుండేది కాదు! నరసింహమూర్తి, నళినికి నచ్చలేదు. కానీ ఇప్పుడంతా కుదిరి పోయింది. నళినికి పెళ్ళి చేసుకోవాలనివుంది. కాని నరసింహమూర్తిని చేసుకోవాలని లేదు. నరసింహమూర్తి కళ్ళల్లో ప్రేమానురాగాలు లేవు! అదొక విధమైన విచిత్రమైన చూపులు చూస్తాడు! ఎదుటివారిని నఖశిఖ పర్యంతం నిశితంగా పరిశీలిస్తాడు! ఆ చూపులు గుండుసూదుల్లా గుచ్చుకుంటాయి! నళిని యొక్క శరీరం, ఆ చూపు లతో తూట్లు తూట్లు పడిపోతుంది. నళిని ముభావంగా ఆలోచించింది. నళినికి ఇప్పుడు పెళ్ళి అత్యంతావసరము అయి కూర్చుంది! ఆమెలో గవర్రాజు అంశ పెరుగుతూ పెరుగుతూ, ప్రాణంపోసుకునే స్థితికి వచ్చేసింది! అతన్నే పెళ్ళిచేసుకుందుకు నళినికి ఇష్టంలేదు. ఏదో ఈనాడు నాలుగుడబ్బులు వెనకవేసుకుని పెద్ద మనిషిగా చెలామణి అయినా, ఓ అంటే, న అనలేని గవర్రాజుకి, ఆమె ఎక్కువ స్టేటస్, భర్తగా ఇయ్యలేక పోయింది! కిళ్ళీకొట్టు వ్యాపారంతో పైకి వచ్చిన గవర్రాజు, ఆమెకి శరీరావసరాన్ని తీర్చటానికే పనికి వచ్చేడు. డబ్బుకోసం, నరసింహమూర్తి తనని పెళ్ళి చేసుకుందుకు వప్పుకున్నాడు కనుక, ఆ తర్వాత కూడా, ఆ డబ్బుకోసమే తనని చచ్చినట్లు, మర్యాదగా చూస్తారు! అనుకుని తనని తనే వూరడించుకుందినళిని.
నళిని పెళ్ళివార్త విన్న గవర్రాజు ఆశ్చర్యపోయేడు! జరగకూడని అవాంతరం ఏదో జరిగిపోతున్నట్లు బాధపడ్డాడు! సుభద్ర గర్భం ధరించిందని వినగానే, ఆమెని సంయమన శక్తిలేని దానిగా భావించి ఈసడించుకున్నాడు! నళినికీ ఆ పరిస్థితి కలుగుతూందని తెలియగానే కొండెక్కినంత సంబరపడినాడు! వారానికి రెండురోజులయినా, ఏదో వంకతో కేశవ ఇంటికి వచ్చిపోతూ వుండేవాడు!
నళిని కాస్సేపుకూర్చుని ఏదో పని వున్నట్లు లోపలికి వెళ్ళిపోయేది! వంటిగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చేదికాదు నళిని. బయటికి ఎక్కడికీ పోయేదికాదు. పెళ్ళి నిశ్చయమయింది కనుక సిగ్గుపడుతోంది ఎక్కడికన్నా వెళ్ళటానికి! అనుకునేది సీతమ్మ. తీర్ధయాత్రలకి వెళ్ళక మునుపు, కామేశ్వరి, గవర్రాజు వస్తే, కాఫీ అదీ ఇస్తూ మర్యాదగా పలకరించేది! సుభద్రని కలిసినది మొదలు గవర్రాజుని చూస్తే లోపలికి తప్పుకుపోయేది! గవర్రాజు కూడా సుభద్ర ఇల్లు వదిలి పారిపోయిందని విన్నది మొదలు కామేశ్వరి అంటే మాట్లాడ టానికి కొంచెం జంకుతున్నాడు! ఈమధ్య గవర్రాజు, మున్సిపల్ కవున్సిలర్ కూడా అవటంతో తనకీ బయటవ్యవహారాలు ఎక్కువయిపోయాయి! ఆరోజు నళినితో మాట్లాడటానికి అవకాశం వచ్చింది గవర్రాజుకి.
