'మీ అక్క మేడపెద్దదో, మన మేడ పెద్దదో చూద్దువుగాని' అని తను సుభద్రతో అన్నమాట జ్ఞాపకం వచ్చింది గవర్రాజుకి.
'పాపం సుభద్ర!' అనుకున్నాడు గవర్రాజు.
'ఇంక వెళ్ళి వస్తాను. బజారుకు పోతూ ఇల్లా వచ్చేను. మా అల్లుడికీ, అమ్మాయికీ బట్టలు తీయాలన్నారు ఆయన!' అంటూ పిల్లవాడికోసం చేయిచాపింది కామేశ్వరి.
'ఇక్కడ ఉంచుతానన్నావుగా' అన్నాడు గవర్రాజు.
'ఆయా లేకుండా నీవేం సముదాయిస్తావు వాడిని? రేపు ఆయాతో పంపుతాలే!' అంటూ కామేశ్వరి వాడిని తీసుకోని వెళ్ళిపోయింది. ఇల్లంతా మళ్ళీ శూన్యత ఆవరించింది. 'కామేశ్వరి ఇంట్లో వున్నంతసేపు ఎంత కలకల లాడిపోయింది ఇల్లు? ఇల్లాలూ పిల్లలూ లేని జీవితం ఏం జీవితం? ఈ డబ్బూ పలుకుబడి ప్రతిష్ఠ ఎవరికోసం? ఎవరు ఆనందించనూ?' అనుకొని ఖేద పడ్డాడు గవర్రాజు.
'అనవసరంగా లేనిపోని ఆశకు పోయి నేను తప్ప గతిలేదని మొత్తుకున్న సుభద్రని తరిమివేసాను! ఈ నళిని దెయ్యం నా సర్వస్వాన్ని దోచింది. నన్ను నిర్జీవుడ్ని చేసి తను పెద్ద ఉత్తమ ఇల్లాలుగా కులుకుతోంది!' అనుకుని ఉద్రేకపడ్డాడు గవర్రాజు.
నళిని బెంగుళూరు వెళ్ళిపోయింది. చుట్టాలు అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేరు. వసుంధర కూడాతన అత్తవారింటికి వెళ్ళబోతూ,
'కామేశ్వరీ మళ్ళీ నీ కొడుకు బాలసారెకు వస్తాను! జ్ఞాపకం వుంచుకుని పిలుస్తావు కదూ!' అంటూ పరిహాసం చేసింది.
'నా కొడుకు బాలసారెకన్న ముందు మేనకోడలి కొడుకు బాలసారెకు రావాలి మీరంతా!' అంది కామేశ్వరి. వసుంధర నవ్వింది. వసుంధరకి మేనకోడలి సంగతేమీ తెలియదు. అందుకని కామేశ్వరి పరిహాసాన్ని ఆశీస్సుగా భావించింది.
ఆ రాత్రి కేశవ, కామేశ్వరితో అన్నాడు.
'నళిని బరువుతీరి పోయింది కామేశ్వరీ! ఇంక మనరోజు లెల్లా గడిచినా ఇబ్బంది లేదు!'
కామేశ్వరి ఏమీ అనలేదు. ఆమె మవునం చూసి అన్నాడు కేశవ!'
ఏమలా వున్నావు? కామేశ్వరీ! వంట్లో కులాసాగా లేదా!' ఆతృతగా అడిగాడు కేశవ.
'కాదు! ఒకటి అడగాలనుకుంటున్నాను!' అంది కామేశ్వరి.
'ఒకటేమిటి కామేశ్వరీ! లక్ష అడుగు! నీకా హక్కు వుంది!' అన్నాడు హార్దికంగా కేశవ.
'అత్తగారు నన్ను తీర్ధయాత్రలు చేయించారు. ఎందుకో మీకు తెలుసా?' అంది అతనికేసి చూడలేక తల దించుకుంది.
'నాకు తెలీదు! పెద్దావిడ ఒక్కరూ ప్రయాణం చేయలేక నిన్ను సాయం తీసుక వెళ్ళిందనుకున్నాను. ఇంతకీ అసలు సంగతేమిటి?' అన్నాడు కేశవ.
'మనకి పిల్లలు కలగటం లేదని!' అంటూ ఇంకా తల దించుకుంది కామేశ్వరి. కాస్సేపు నిశ్శబ్దంగా వుండిపోయేడు కేశవ. అతను ఎంతకూ మాట్లాడకపోవటం చూసి తల పైకెత్తించింది కామేశ్వరి కేశవ కన్నుల్లో అస్పష్ట భయాందోళనలని గుర్తించ కలిగింది కామేశ్వరి. అతని కన్ను కొలకుల్లో నీరు క్రమ క్రమంగా కూడుకొని చెంపల మీదకి ముత్యాలు ముత్యాలుగా జారబోతూంది.
'నీకు పిల్లలంటే ఇష్టమా కామేశ్వరీ!' గద్గదికంగా అడిగాడు. కామేశ్వరి లజ్జా సంకోచాలతోటి,
'తల్లినై పిల్లలని లాలించి పోషించి పెంచుకోవాలనే కోరిక ఆడవాళ్ళకి సహజమైనది. ప్రకృతిమాత వరం కదా! మీ రెందుకు అల్లా అడిగారు!' అంది.
'ప్రతి స్త్రీకి తన పిల్లలమీద స్వార్ధ ప్రేమ మిక్కుటంగా వుంటుంది కామేశ్వరీ. నళినిమీద నాకన్న మా రాజీకే ఎక్కువ ప్రేమ వుండేది కాబోల్ను. మరణశయ్య మీద రాజీ ఒక కోరిక కోరింది. 'మీ ఆనందానికి అడ్డు చెప్పను. మీరు లక్షణంగా మరోపెళ్ళి చేసుకోండి. కొత్త భార్యతో సుఖవంతంగా కాలం గడపండి. కాని నా నళినిని మాత్రం దుఃఖపడేలా చేయకండి. ఆ పిల్లని జాగ్రత్తగా పెంచండి. నా రక్తం పంచుకున్న బిడ్డ అనే స్మృతి మీరు ఏ క్షణంలోనూ మరువకండి. అది చాలు నా ఆత్మశాంతికి.' అంది ఆమె చేతిలో చేయి వేసాను. అందుకని, అందుకనే అమ్మతోనూ, వసుతోనూ ఆఖరికి ప్రాణస్నేహితులకి కూడా తెలీకుండా ఆపని చేసాను. నన్ను క్షమించు కామేశ్వరీ! నీకు తీరని ద్రోహం చేసాను. నీకు చెప్పాలను కుంటూనే చెప్పలేకపోయేను. అందుకనే నీకు మరోపెళ్ళి చేయటానికి అంగీకరించాను. నీ లేతముఖంలోని కోరిక నాకు తెలుసు కామేశ్వరీ! కాని నీ జీవితాన్ని నీవే కాలదన్నుకున్నావు!' అన్నాడు కేశవ.
'అంటే! నా కర్ధం అవలేదు! దయ యుంచి వివరంగా చెప్పండి!' అంది కామేశ్వరి. ఆమెకి అంతా అయోమయంగా వుంది. అతను చెప్పినదేమీ ఆమె కర్ధం కాలేదు.
'అప్పట్లో మళ్ళీ పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేకపోయినా రాజీ చనిపోయిన నాలుగు నెలలకే నేను పిల్లలు పుట్ట కుండా ఆపరేషన్ చేయించుకున్నాను!' అన్నాడు కేశవ.
కామేశ్వరి మాట్లాడలేదు. మాట్లాడ టాని కామెకేమీ మాటలు దొరకలేదు. ఆమె జీవితం సంపూర్ణమైంది. కాని అసంపూర్ణంగానే మిగిలింది! కేశవ తనని పూర్తిగా అన్యాయం చేయలేదు. అవకాశం ఇచ్చాడు! కారణం తెలీని తను ఆ అవకాశం వదులుకుని, పెద్ద పతివ్రతగా నిలబడింది. ఇప్పుడేం చేస్తే బాగుంటుంది?ఏం చేయక్కర్లేదు! ఈ మూడుముళ్ళతో ఏనాడో తనని తను బంధించుకొంది! స్వయం బద్దురాలు తను!
ఏడ్చి పెద్ద గొడవ చేస్తుందేమో అనుకొన్న కామేశ్వరి నిస్తబ్దురాలుగా వుంటం చూసి, కేశవ ఆందోళన చెందాడు. ఆ మౌనంలోని అగ్నిజ్వాల తెలుసుకో లేనంత మూర్కుడు కాడు కేశవ! ఆమె తల నిమురుతూ, గాఢంగా తన హృదయానికి హత్తుకున్నాడు కామేశ్వరిని కేశవ!
* * *
'కామేశ్వరీ! నీవు దేవతవి! నేను పిచ్చి వ్యామోహంలో కాల తనుకున్న సుఖ శాంతుల్ని, నీవు తిరిగి ప్రసాదించేవు! సుభద్ర, బాబులతో నా ఇల్లు నూతన కాంతితో వెలిగి పోతోంది కామేశ్వరీ! సుభద్రముందు నేను సిగ్గుపడ్డాను! ఆమె శాంత సౌజన్యాలలో నీ చెల్లెలే! నా తప్పు లన్ని క్షమించి నన్ను స్వీకరించింది! నీకు వీలున్నప్పుడు, నీ చెల్లెలింటికి వచ్చిమా ఆనంద జీవితం చూసి సంతోషించాలని అభ్యర్ధిస్తున్నాను! మీ అమ్మగారికి నాన్నగారికీ, కూడా ఈ శుభవార్త వ్రాసేను.
నీరాకకు ఎదురు చూస్తుంది నీచెల్లెలు. ఇట్లు - గవర్రాజు.
'వాళ్ళకి మూడుముళ్ళ బంధం లేక పోయినా భావ బంధం వల్లనే సంసార్లు అయినారు!' అనుకొంది కామేశ్వరి. సీతమ్మ మటుకు కామేశ్వరి చేత వ్రతాలు చేయించటం మానలేదు! కామేశ్వరి అత్తగారిమాట కేనాడూ ఎదురు చెప్పలేదు!
'ఇంకా భగవంతుడి దయ రాలేదు! మా కోడలు పిల్లమీద. దానికడుపున ఒక కాయకాస్తే చూసిపోవాలని వుంది!' అంటూ సీతమ్మ వచ్చిన ప్రతీ బంధువుతోనూ చెబ్తూంటే, కామేశ్వరి, గాజుకళ్ళతో వినేది ఆ అవస్థలో ఆమె అచేతనురాలయ్యేది పాపం కామేశ్వరి!
---:అయిపోయింది:---
