జీవితంలో ఏ పనికి ఎలాటి ఫలితం లభిస్తుందో ఎవరయినా చెప్ప గలిగితే ఎంత బాగుండును? అనుకున్నాడు జగన్నాధం.
స్వామి విజయను చూశానని, నూజీవీడు పంపించారనీ విన్న తరువాత, వెంటనే బయలుదేరి అతనూ వచ్చాడు. కధంతా విన్నాక అతనికి పై ప్రశ్న ప్రారంభమైంది.
ఒకవిధంగా జయప్రదరావు చిట్టీ సుఖపడుతున్నారనే అనాలి. ఈ మధ్య చిట్టి తల్లి తండ్రులు కూడా ఒకసారి వచ్చి వెళ్ళారు. మనుమడు పుట్ట బోతున్నాడని విన్న తరువాత వారి ఆనందం మరీ ఎక్కువయింది. మురళీ వాసంతీ కూడా వచ్చి చూసి వెళ్లారట. ఇప్పుడు మురళీ ని చూస్తుంటే ఎవరో దగ్గర బంధువును చూసినట్లుగా తప్ప మరే అనుభూతీ కలగ లేదన్నది చిట్టి. శుభం. ఆ ఫలితం కోసమే తను ఎదురు చూస్తున్నాడు. జయప్రదరావు కూడా దాదాపు విజయను మరిచి పోయినాడనే అనాలి. ఎప్పుడైనా, ఎందుకైనా జ్ఞాపకం వస్తే ఒకటంటే ఒక కన్నీటి బిందువు లీలగా అతని కను కొలికి లో తళుక్కుమని తిరిగి కంట్లోనే ఇంకి పోయేది.
జగన్నాధం ఉద్యోగం మాని వేశాడు. ఇప్పుడు ఎవరినీ పోషించాల్సిన బాధ్యత అతనికి లేదు.
కొండలు-- నదీ నదాలు-- మనుషులు వీటన్నిటి ముందూ నిలబడి జీవితం కోసం అన్వేషిస్తూ ఉంటాడతను. ఎప్పటి కయినా అదేమిటో తెలుసుకోగలుగు తాననే ఆశ, నమ్మకం అతనికి ఉన్నాయి.
పాపానికీ, పున్యానికీ, శిక్షనూ బహుమానాన్నీ ఇచ్చేనాక నరకాల్లో నమ్మకం అనేది పూర్తిగా పోయినా, జీవితంలో సత్యం అనేది ఎండమావి లాటిదని ఏనాడో అర్ధమయినా -- ఈ అసత్యాలలో నుంచీ, పై పై పవిత్రత లో నుంచీ స్వార్ధ పూరితమైన ధర్మ నినాదాలలో నుంచీ, తప్త హృదయానికి ఏదో శాంతి నీ, ఏమిటో అర్ధం కాని చిత్రాను భూతిని అతను పొందుతూనే ఉన్నాడు. నీచులు, పతితలు అని పిలవబడే మానవులలో ఉన్న ఔన్నత్యం పవిత్రులనబడే మనుషుల్లో కనిపించే నీచత్వం , మంచికి శిక్ష, చెడుగుకు బహుకృతి , పాపానికి పాలూ అన్నం, పుణ్యానికి గంజి నీళ్ళు, ఇవన్నీ అతన్ని ఆశ్చర్య పరుస్తూనే ఉన్నాయి. హృదయాన్ని కాలుస్తూనే ఉన్నాయి.
కాని సమాధానం కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు.
నానా.........ఆ సోఫాలో అలాగే పడుకుని బ్రతుకును గురించి వెతుక్కుంటూనే ఉంది. బాలచంద్ర ను చూడకుండానూ ఉండలేదు-- అతన్ని పొందనూ లేదు.
ఎప్పుడో, ఏనాడో , ఏచిత్ర లోకంలోనో ఆత్మ సాక్షాత్కారం అంటూ లభిస్తే, మానవుల నేత్రాలను వికసింప జేస్తుంది ఈ విశ్వ ప్రేమ. స్వామి ఇచ్చిన సందేశం అనుసరిస్తూ ఫలితం కోసం ఎదురు చూస్తున్నది నానా-- ఫ్రెంచి యువతి అయిన భారతీయురాలు నానా -- భారత యువకుని ప్రేమించి భగవంతుని కోసం తనలోకి తనే తొంగి చూచుకొంటున్న నానా.
కాని బాలచంద్ర పద్దతి అది కాదు. అతనికి అన్నీ కావాలి. భగవంతుడి సంగతి ఎవరయినా ఎత్తితే ఏభయి రానీ ఆలోచిద్దాం అని చిరునవ్వు నవ్వుతాడు అతను.
అతనికి ధనం కావాలి, స్త్రీ కావాలి. హోదా కావాలి. వీటన్నింటి లోనూ వైవిధ్యం కావాలి. వీటన్నింటిని మించి నానా కావాలి. మళ్ళీ నానాలో ఏకాగ్రత లేదు. అందమైన మరో స్త్స్త్రీ కనిపిస్తే ఆమె కూడా కావాలి. అయినా వీటన్నిటి నీ గురించి ఆలోచించే తీరికా అతనికి లేదు.
విజయ కధ నానాను కదిలించి నట్లు బాలచంద్ర ను కదిలించలేదు. సినిమాకు పనికి వచ్చే కధ అనుకున్నాడు. అంతే. ఆ తరవాత విజయ విషయమే అతనికి జ్ఞాపకం లేదు.
కాని నాగేశ్వర్రావు అలా కాదు. అతను వృద్దుడయి పోయినాడు. అతని అంతర్యంలో అనుక్షణమూ ఒకటే ప్రశ్న మెదులుతూ ఉంటుంది. వదిన ఏమయింది? ఆమె ఈ దౌర్భాగ్యంలో తన భాగం ఎంత? తన నేరానికి భగవంతుడంటూ ఉంటె ఏలాటి శిక్ష తనకు లభిస్తుంది?
త్యాగం కాని, భయం కాని, అసూయ కాని శాస్త్ర రీత్యా పరిశీలించి చూస్తె అన్నీ అబద్దాలనీ అర్ధరహితమైన సెంటిమెంట్లనీ, వాస్తవికత అనేది అందులో ఎంతమాత్రం లేదనీ తెలుసు కుంటే -- బ్రతుకు ఎండు గడ్డిలా సారవిహీనం అవుతుంది. వాటిని నమ్మితేనే బ్రతుకు సౌఖ్యాన్ని స్తుంది.
ప్రపంచమంతా అర్ధ రహితమని కొన్ని సమయాల్లో తప్పకుండా అనిపిస్తుంది. అప్పుడు కూడా అనుభవం మాత్రం అసత్యం అనిపించదు. అదే చిత్రం జీవితంలో.
ఈ నాగేశ్వర్రావు -- "ఈ లోకం నాకోసం కల్పించబడింది. ఈ భూమి మీద ఆనందం నాకోసం సృజించబడింది" అని ఆనాడు డాక్టరు తో గర్వంగా అన్న నాగేశ్వర్రావు కాడు.
ఈ నాగేశ్వరరావు కు జీవితం ఒక పెద్ద శిక్ష. తప్పు చేయకుండా అనుభవించాల్సి వచ్చే చిత్రమైన శిక్ష. ఆ శిక్ష అతను అనుభవిస్తూనే ఉన్నాడు.
అతనే కాదు. డాక్టరు కూడా అనుభవిస్తున్నాడు. ఆనాడు ఆమెను విజయవాడ తీసుకు వెళ్ళమని తను సలహా చెప్పకుండా ఉంటె ఇంత జరిగేది కాదు. మానవుడి శరీరం వరకే తన జ్ఞానం పరిమితం. మానవుడి అంతర్యం గురించి తనకు తెలిసింది చాలా తక్కువ. అనుక్షణం ఈ విషయాన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాడు డాక్టర్.

16
"అమ్మా."
"ఏం స్వామీ?"
"దుఃఖిస్తున్నావా?"
"లేదు స్వామీ. ఆనందిస్తున్నాను. ఆనందంగా, సుఖంగా సాగిపోతున్న అయన జీవితంలో తిరిగి ప్రవెశించా లనిపించటం లేదు. ప్రవేశిస్తే కాదనీ అనరు. కానీ కాలక్రమేణా అనేక దుష్పలితాలు కలిగే అవకాశం ఉంది."
నిట్టుర్పు విడిచి తిరిగి విజయ --
"పధవిహీనమైన నాకు కర్తవ్యపధం ఏదో సెలవీయండి స్వామీ. తెలిసి ఏ తప్పు చేయలేదు నేను. కాని శిక్ష అనుభవించాను. కనుక ఇక ముందు తప్పు చేసినా గాని శిక్ష మాత్రం ఉండదనుకుంటాను. ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత ఆ తప్పు కూడా చెయ్యాలని పిస్తున్నది" అన్నది.
స్వామి కళ్ళు మూసుకుని----
"చరధ భిక్ష వేచారికం -- బహు జనహితాయ
బహుజన సుఖాయ -- లోకనుకమ్రాయ --
అత్దాయ -- హితాయ -- సుఖాయ -- దేవమను
స్సానం " అని పైకే పఠించారు.
అది భగవానుడు తధాగతుడు లోకానికి ఇచ్చిన సందేశం. మానవుడి అంతర్యంలో ఏముందో, ఎవరికి తెలుసు? ఎవరు అర్ధం చేసుకో గలిగారు? ఏ కృష్ణుడో, ఏ బుద్దుడో , తప్ప. ఆ హృదయంలో జరిగే ప్రయత్నాలు ఎవరికి బోధ పడుతాయి?
నిత్య జీవితానికి అతీతంగా లోపల మరో చైతన్య ప్రవాహం ప్రవహిస్తూ ఉంటుంది. దానిలోని విచిత్ర తరంగాలు క్షణ క్షణం కొత్త తనం వైపు ఉరకలు వేస్తూంటాయి. పైకి మాత్రం వాటి చిహ్నాలేమీ బహిర్గతం కావు. ఏమన్నా తెలిస్తే సర్వేశ్వరుడి కే తెలియాలి.
"ఏమిటి స్వామీ, ఆలోచిస్తున్నారు?"
"తల్లీ, నీవా వాంచను జయించాలి."
"తెలుసుకోకుండా జయించటం సాధ్యం కాదేమో? "సందేహం వెలిబుచ్చింది విజయ .
"అలా కాదు. నీవు బౌద్ద భిక్షుకిని కావాలి."
"ఎలా?"
"బౌద్ద ధర్మం ద్వారా."
"నాబోటి అపండితురాలికీ అశోపహతు రాలికీ అదెలా సాధ్యం స్వామీ?"
"తప్పకుండా సాధ్యం అవుతుంది. భగవానుడు తధాగతుడు లాగానే నీవూ నీ సర్వస్వాన్నీ తృణప్రాయంగా వదిలేసుకుని వచ్చావు. నీ యీ త్యాగం సామాన్యమైనది కాదు తల్లీ."'
"స్వామీ నన్ననవసరంగా ఆకాశాని ఎత్తుతున్నారు. పైగా మానవత్వాన్ని తప్ప మతాన్ని అంగీకరించని మీ ప్రకృతి కి ఇది పూర్తీగా విరుద్దం."
"ఎంత మాత్రం కాదు తల్లీ. శాంతి కోసం అలమటించే మానవుడికీ తరతరానికీ ఒక తధాగతుని అవసరం వస్తూ ఉంటుంది. ఈ అనంత తేజోమయ మహా విశ్వంలో ప్రాణ స్పందన ఉన్నది ఈ ధరణీ తలంలో మాత్రమె. ఇందులో ఆవర్తన వివర్తనలు నాశన సంఘర్షణ లు సంభవిస్తూ ఉండటం సహజం."
"జీవితమంటే ఏమిటో ఇంకా నాకు అర్ధం కాలేదు స్వామీ"
"పిపాసతో , ప్రేమతో మొహంతో దహించుకు పోయి వైరాగ్య జ్ఞానంతో శీతలత్వాన్ని తెచ్చుకోవటమే జీవితం . ఆ తరువాత ప్రాప్తించే మృత్యువు మృత్యువు కానేకాదు. అది శాంతి అనిపించు కుంటుంది."
"మరి అనురాగ విరాగాల సంగతి?"
"అవి విభిన్న మయినవి కానే కావు తల్లీ. విరాగీ కూడా అనురాగి అవుతాడు. కాని అతడి అనురాగం ఏకైక మనే సంకుచిత మనస్తత్వం నుంచి బయటపడి విశాలమైన అనంతం లో లీనమవుతుంది."
"స్వామీ ..ఇక నా కర్తవ్యం?"
"తపస్సు ."
"ఎక్కడ?"
"ఈ లోకంలోనే."
"ఆ లోకం నన్ను పరిహసిస్తే ?"
"దాని దురదృష్టం."
"ఈ తపస్సు నాకు సాధ్యం కాకపొతే?"
"నీ దురదృష్టం."
"నాకు మృత్యువేప్పుడో సెలవియ్యండి . నా కోరిక ఇంకా మిగిలిపోయే ఉంది."
"అది నేరవేర్చే బాధ్యత భగవంతుడిది."
"నన్ను ఆశీర్వదించండి ."
"తధాస్తు!"
విజయ చాలాసేపు ఏడిచింది. ఆమె హృదయ భారం చాలా వరకు తగ్గిందనే చెప్పాలి.
మనిషి అయిన వాడు బ్రతకాలని కోరటమే కాదు. బ్రతికి ఉన్నాననే విషయం గ్రహించడానికి చూస్తాడు. బ్రతుకులో కేంద్రీకృతుడైనంత కాలం ఆ బ్రతుకు సమస్యగానే ఉంటుంది. డానికి దూరం అయినప్పుడే అది అర్ధమవుతుంది. అదే బ్రతుకులో రహస్యం.
* * * *
