
15
ఉదయం అయింది. కాకులు లేచి తమ దీనాక్షుగాధను వెళ్ళబోసుకుంటూ అరిచి అరిచి ఊరుకున్నాయి. నూజీవీడు మామిడ తోటలలో అప్పుడే వేసిన లే చిగుళ్ళ ను ప్రభాకరుడు తన సుకుమార కాంతితో మెల్లిగా స్పృశిస్తున్నాడు. అంతులేని చీకటి అంతం అయిపొయింది.
వెలుగు అంతటా నిండింది. అవును, ఇది ఉదయం. యుగయుగాలుగా వేళ తప్పని ఉదయం. బంధనాల నుంచీ, భయాల నుంచీ తాత్కాలిక విముక్తి కలిగిస్తూన్న ఉదయం.
అలాటి ఉదయాలు ఇక్కడ ఎన్నో గడిచినాయ్ తనకు. కాని ఈ ఉదయం అందకారంగా ఉంది. రైలు దిగిన విజయకు తనను ఎవరైనా గుర్తు పడతారేమో అనే భయం ఎంతమాత్రం లేదు.
దారిలో ఎన్నో దాటింది తను. తాము అమ్మివేసిన, తను కొత్తగా అడుగు పెట్టిన తమ ఇల్లు కనిపించింది. ఈ ఇంట్లోనే పారాణి పాదాలతో నడిచింది. ఈ ఇంట్లోనే తమ జీవితాన్ని వసంత యామిని చేసుకున్నది. ఈ ఇంట్లోనే తల్లి ఆయీ కాకుండానే పుత్ర శోకం అనుభవించింది. ఇప్పుడీ ఇల్లు తనది కాదు.
ఇప్పుడిక తనదంటూ మిగిలింది చాలా తక్కువ.
అయినా నడుస్తూనే ఉంది విజయ. గమ్యం చేరటానికి చాలాసేపు పట్టింది.
వాకిట్లో కూర్చుని బియ్యం లో రాళ్లేరుతున్న చిట్టి -- విజయ వాకిట్లో నిలబడటం చూచి గుప్పెడు బియ్యం తెచ్చింది. విజయ మాట్లాడకుండా కొంగు పట్టింది. బిచ్చం వేసిన తర్వాత కూడా అక్కడే నిలబడిన భిక్షుకి ని చూస్తె ఆశ్చర్యం అయినా కలుగుతుంది విసుగయినా పుట్టుతుంది.
"ఇంకా ఏం కావాలి?' విసుగ్గానే అడిగింది చిట్టి.
"ఇప్పుడీ ఇంట్లో ఎవరుంటున్నారు?' స్పష్టమయినా ఉచ్చారణతో అడిగింది విజయ. అది చూచి చిట్టి కి అనుమానం కలిగింది. జగన్నాధం , జయప్రదరావు అన్వేషిస్తున్న విజయ కాదు కదా ఈమె? కాని ఇది సినిమా కాదు. జీవితం . మహా సౌందర్యవతి విజయ ఈమె ఎప్పుడూ అయి ఉండదు. ఒకవేళ అయినా బిచ్చం ఎందుఎత్తుకుంటుంది?
"నీవెవరు?" అదుర్ద్గాగా ప్రశ్నించింది చిట్టి.
"భిక్షుకిని" తాపీగా సమాధాన మిచ్చింది విజయ. కొంచెం సేపు ఇద్దరూ అలా నిలబడి పోయినారు.
ఈ యువతి బహుశా తన సవతి అయి ఉంటుంది. విజయ కన్నీటి ని అతి కష్టం మీద ఆపుకో గలిగింది. ఎగదన్నుతున్న దుఃఖ వీచికల వలన మాట రావటం లేదు ఆమెకు. ఒకప్పుడు ఇదంతా తనదే.
తను అవినీతిని క్షమించేది కాదు. ఇప్పుడు పవిత్రురాలయిన తన సవతి తనను లేచిపోయినది అనవచ్చును. బహుశా తనను క్షమించక పోవచ్చును. అన్ని విధాల తనను అవహేళన చెయ్య వచ్చును.
క్షమ యొక్క విలువ పూర్తిగా అర్ధమయింది ఆమెకు. స్త్రీ లోకం అమూల్యమని భావిస్తున్న పవిత్రత ఇక తనకు లేదు. దానికోసమే తన సవతి ఇంటి ముంగిట నిలబడి భిక్షుకిగా తను యాచిస్తున్నది.
ఇప్పుడు తనకు కావాల్సింది క్షమా భిక్ష కాదు. అది కోరే అర్హత తనకు లేనూ లేదు. తను కోరుతున్నది ఒక్కటే. అది జయప్రదరావు దర్శనం. ప్రాణప్రదుడైన తన పధా పునదర్శనం.
"ఏమండీ, ఈ ఇల్లు జయప్రదరావు గారిదేనా?' దుఃఖాన్ని దిగమింగి స్వరాన్ని అదుపులో పెట్టుకుంటూ అడిగింది విజయ.
చిట్టి అనుమానం కొంచెం చిక్కనయింది గాని నమ్మకం కలగలేదు. సంస్కారవంతురాలైన ఈ భిక్షుకి , విజయ అనాధ శరణాలయం లోని మనిషయి ఉంటుంది.
"అవును" అన్నది చిట్టి.
"మీరు వారి......"
"అవును" చిట్టి తల వంచుకుని సమాధానం ఇచ్చింది. ఒకవేళ ఈమె విజయ్ కనుక అయితే తను పలికిన ఆ మూడు అక్షరాలూ చాలు ఆమె ప్రాణాలు తీయటానికి.
విజయే కనుక ఈమె అయితే ఆమె ముందు తను ఎంత అపరాధిని అవుతుందో తలచుకొని గడగడా వణికి పోయింది చిట్టి. విజయ ఇన్నాళ్ళూ ఎక్కడ ఎలా బ్రతికిందో తనకు తెలియదు. క్షమించటం ఆమె స్వభావం కాదు. గనుక తనకు ఇక్కడ స్థానం లేదు. కాని ఈమె విజయ అయి ఉండదు.
కన్నూ కాలూ లేని ఈ కురూపి విజయ ఎలా అవుతుంది? అసంభవం. నిట్టూర్చింది చిట్టి. ఆమె తలఎత్తి చూసేసరికి భిక్షుకి వెళ్ళిపోతున్నది. చిట్టి గాభరా పడి ఆమెను పిలవాలను కుంది. కాని కంఠం లోంచి ఏ శబ్దమూ రాలేదు.
"చిట్టీ?" జయప్రదరావు పిలిచేదాకా ఈ లోకంలోకి రాలేదు చిట్టి.
"ఏం బావగారూ?"
"ఉత్తదానివి కాదు. భోజనం పెందరాళే చెయ్యటం మంచిది. వంట ఇంత ఆలస్యం అయితే ఎలా?"
జయప్రదరావు అనునయంగా అన్న మాటలకు చిట్టి సిగ్గు పడింది. ఆ సిగ్గు లేత యిల్లాలి తోలి చూలు ప్రశంస చేసిన భర్త వాక్యాలకు పడిన సిగ్గు ఎంతమాత్రం కాదు. అది చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నప్పటి సిగ్గు. అన్యాయంగా మరో ఇల్లాలికి చేసిన ద్రోహానికి కలిగిన వ్యధా భరితమైన లజ్జ.
తానిప్పుడు తల్లి కాబోతున్నది. కాని తనకా అర్హత లేదు. అర్హత ఉన్నవారు జీవించి ఉన్నదీ లేనిదీ తెలియదు. అయినా తను చేసినది నేరం కాక తప్పదు.
జయప్రదరావు ను తను విచిత్ర పరిస్థితిలో వివాహం చేసుకుంది. ఆ వివాహం జగన్నాధం మాట మీద ఉండే గౌరవం ఫలానా , జయప్రదరావు జీవితం మీద ఉండే జాలి వలనా, తనంటే తనకున్న అసహ్యం వలనా చేసుకుంది. "విజయ నన్ను వదిలి వేసింది. నువ్వు కూడా నన్ను వదిలి వేస్తానేమో అని భయంగా ఉంది" అన్న జయప్రదరావు కు "వదలను" అని వివాహం ద్వారా హామీ ఇవ్వాలనిపించింది.
ఈ పెళ్లి జగన్నాధం చేశాడు. విజయ చనిపోయి ఉంటుందన్న గట్టి నమ్మకంతో ఈ పెళ్లి చేశాడు. తను కాదన లేకపోయింది. తన యీ మంచి పనికి ఫలితమా అన్నట్లు కొద్ది రోజుల్లోనే తల్లి అవుతున్నది.
కడుపు శిశువు కదిలింది.
"నీవు బావగారి బిడ్డవు. న్యాయంగా నీ తల్లి కావాల్సిన విజయ ఎక్కడ ఉన్నదో ఏమయిందో తెలియదు. నువ్వేమిటి నా కడుపున పడ్డావు? లోకంలో మరెవరూ ఆడవాళ్ళు లేనట్లు" అనుకుంది ఆమె.
"ఏమిటి ఆలోచిస్తున్నావు?"
"ఏమీ లేదు. ఇందాక ఎవరో వచ్చి ఆమెను గురించి మిమ్మల్ని గురించీ అడిగారు."
'అడవాళ్ళా మగవాళ్ళా?"
"ఆడవాళ్లే."
"విజయ కాదు కద?' ఆదుర్దాగా అడిగాడు జయప్రదరావు.
విజయ మీద ఇంకా అతనికి ఆశ ఉన్నది -- ఎప్పటికయినా కనిపిస్తుందని.
చిట్టి నిట్టూర్చి --" కాదు. ఈమెకు కన్ను కాలు కూడా లేవు" అన్నది.
"ఎటు వెళ్ళింది?....ఒకవేళ విజయేనెమో?"
"ఎలా?"
"చూడు చిట్టీ. విజయ ఇన్నాళ్ళూ ఎక్కడుందో , ఎలా బ్రతికిందో మనకెవరికీ తెలియదు. కన్నూ కాలూ లేకపోతె పోవచ్చు. ఆమె విజయే నెమో" అన్నాడు జయప్రదరావు సాలోచనగా.
చిట్టికి ఈ ఆలోచన రాలేదు. అడగడుక్కూ ఆమె విజయేనని అనుమానం కలిగినా, ఆ కన్నూ కాలూ లేకపోవడం వలన కాదను కుంది . ఇప్పుడిహ ఆమె విజయే అనిపిస్తున్నది.
"బావగారూ , పొరపాటయింది. ఆమె విజయే అయి ఉండవచ్చును" అన్నది.
"ఏ మడిగింది?"
"బావగారూ ఆమె బిచ్చమెత్తుకుంటున్నది."రెండు చేతులతో మొగం దాచుకుని చెప్పలేక చెప్పలేక చెప్పింది చిట్టి.
జయప్రదరావు ఆ మాట వినేసరికి దుఃఖాన్ని పట్టలేక నుదురు గోడకేసి అయిదారుసార్లు కొట్టుకున్నాడు. అతి గారాబంగా గోరు ముద్దలు తినిపించిన విజయ -- పాలలో మీగడ తరకను అసహ్యించుకునే విజయ -- ప్రాణ ప్రదురాలైన తన విజయ -- బిచ్చమెత్తుకుంటున్నది.
"భగవంతుడా. నీ చేతులు ఇంత హృదయ రహితాలా?' అనుకున్నాడు తను. ఎంత అపుకుందా మన్నా గాని దుఃఖం ఆగటం లేదు.
"చిట్టీ , ఆమె ఎటు వెళ్ళింది?"
"అలాగే వెళ్ళింది. ఎటు వెళ్లిందో మరి."
జయప్రదరావు హడావిడిగా బయటకు వెళ్ళాడు.
చిట్టి స్తంభాన్నానుకుని చాలాసేపు అలాగే నిలబడి పోయింది.
విజయ ఎక్కడికీ వెళ్ళలేదు. ఆ పక్కనే ఉన్న కిళ్ళీ కొట్టు దగ్గర నిలబడి జయప్రదరావు రావటం వెళ్ళటం చూస్తూనే ఉంది.
అతను తన భర్త. ఈ ప్రపంచంలో అతని కంటే దగ్గర వాళ్ళెవరూ తనకు లేరు. కాని ఏ కారణం చేత తనిప్పుడు దగ్గరగా వెళ్ళలేక పోతున్నదో అర్ధం కావడం లేదు. ఏ కారణం చేత తామిద్దరూ ఇంత దూరం అయినారో అదీ తెలియటం లేదు.
విడిపోకూడదని భగవంతుని ఎన్ని తడవలు ప్రార్ధించింది తను. అంత ప్రార్ధనకూ ఫలితమా ఈ శిక్ష?
విజయ రెండు చేతులతో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది.
"ఏయ్ ఎవరు నువ్వు?' ఒక గేదె క్రాఫింగు రౌడీ సాధికారంగా ప్రశ్నించాడు.
విజయ తలఎత్తి చూచింది. ఆ చూపుకే బలం ఉంటె -- ఆ చూపుకె శక్తి ఉంటె -----!
'ఫో ఇక్కడి నుంచి" అని విజయను కసిరి, కొట్టు మీద కూర్చున్న ఆడదానితో సరసాలాడటం ప్రారంభించాడు వాడు. ఇంకా గాలి వీస్తూనే ఉంది. ఇంకా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు.
ఏమీ జరగనట్లు గానే ప్రపంచం తన దారిన తను సాగి పోతున్నది.
విజయ లేచి నడవటం ప్రారంభించింది.
ఈ మహావిభూతి హద్దు లేనిది. దానితో పోలిస్తే భూమి చిన్న నలుసు లాంటిది. ఈ సముద్రాలు చిన్న నీటి జల్లులు. ఈ సూర్యకాంతి--చిన్న మిణుగురు పురుగు -- వాయుమండలం-- వ్యధాకులమైన నిట్టుర్పూ-- ఆకాశం అతి సూక్ష్మ రంధ్రం.
విజయ నడుస్తూనే ఉంది.
* * * *
