Previous Page
పధ విహీన పేజి 27


    ఈ అనంత కాలవాహిని లో కొన్ని బిందువులు గడిచి పోయినాయ్.
    కాలకడలి తరంగాల సుడి గుందాలలో అనంత మయిన మార్పులెన్నో జరిగినాయ్.
    జయప్రదరావు ఇప్పుడు నూజివీడు లో లేడు. వాళ్ళ షావుకారు కొడుకు తిరుపతి లో వ్యాపారం పెట్టి అక్కడికి పంపించాడు అతన్ని. అంతా పది రోజులు అయింది వచ్చి. చిట్టి కి మొదట మొగపిల్ల వాడు, మళ్ళీ ఆడపిల్ల. వచ్చేపోయే యాత్రికుల రద్దీతో మంచి బేరమే ఉన్నది. ఇందులో జయప్రదరావు కు చిన్న వాటా కూడా వుంది. అతని జీవితం ఒడుదుడుకులు లేకుండా సాఫీగా జరిగి పోతున్నది.
    లెక్కలలో తేడా రావటం వలన చిరాగ్గా ఇంటి కొచ్చాడు అతను.
    చిట్టి ఇచ్చిన కాఫీ మెదలకుండా తాగేసి, పిల్లను ఎత్తుకుని వాకిట్లో పచార్లు చేస్తున్నాడు అతను.
    తీర్చంలో తప్పిపోయిన దిక్కులేని పిల్లలా అతని అంతర్యం అలమటించటం ప్రారంభించింది. అంతులేని మార్పు లేని జీవన విధానం లో గాడాంధకారం లాంటి నిరాశ అతన్ని ఆవహించింది. ఎందుకనో అతడు ఒంటరి వాడయి పోయినాడు.
    గేటులో ఎవరో పడిన చప్పుడయింది. పిల్లను దించి అతను గబగబా వాకిట్లో కి వెళ్ళే సరికి ఒక స్త్రీ లేవాలని ప్రయత్నించి విఫలురాలవుతున్నది. అతను కంగారు పడి ఆమెను లేవదీయాలని వెళ్ళాడు. ఆ స్పర్శ --
    ఒళ్ళు జల్లు మన్నది జయప్రదరావు కు. ఆ స్పర్శ తనకు సుపరిచితమైన స్పర్శ.
    ఆమెను గట్టిగా గుండెలకు అదుముకుని---
    "విజయా" అన్నాడు తను.
    "పధా."
    ఆమె నోటి వెంట సరిగా మాట రావటం లేదు.
    "ఇన్నాళ్ళూ ఏమయినావు? నన్నెందు కింత అన్యాయం చేశావు విజ్జీ?' ఆమెను పసిపిల్లలా రెండు చేతులతో నూ ఎత్తుకొని ప్రశ్నించాడు జయప్రదరావు.
    "నేను సౌందర్యవతిని కాను. నన్ను వెలుగు లోకి తీసుకు వెళ్ళవద్దు. ఈ చీకటి లోనే ఉండనివ్వండి. ఒట్టే" అంది విజయ అతని ప్రయత్నాన్ని గ్రహించి.
    దూరాన "ఏడు కొండల వాడా వెంకట రమణా' అనే కేకలు వినిపిస్తున్నాయ్. ఇంకా చంద్రో దయం కాలేదు. చీకట్లు రక్త వర్ణాన్ని అలంకరించుకోవాలని చూస్తున్న ఆ సమయంలో విజయ జయప్రదరావు ఒడిలో పడుకొని నిశ్చింతగా ఉంది.
    "విజయా, అయాస పడుతున్నావు? నన్ను సరిగ్గా చూడనీ" అన్నాడు అతను-- ఎండిపోయిన ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు.
    "గుర్తు ఉందా? అప్పుడెప్పుడో ఒకసారి విరాజ్ ను క్షమించలేనని అన్నాను?....కాని ఇప్పుడు అర్ధం చేసుకున్నాను. విరాజ్ అలా చేయటం లో తప్పేమీ లేదు. ఇప్పుడు క్షమించటం చేతనయింది నాకు." ఆమె ఆయాసం మరింత ఎక్కువయింది.
    "విజయా, మాట్లాడకు" అన్నాడతను. ఆమె పరిస్థితి అతనికి అర్ధమయింది. తన కోరిక నేరవేర్చుకోవటం కోసం వచ్చింది ఆమె .
    ఈక్షణం లో ఇన్నాళ్ళ వియోగం వారికి లేనట్లే అనిపించింది. ఇది యుగ యుగాల అనుబంధం.
    "జీవించమని మనకు కొంతకాలం నిర్ణయించ బడుతుంది. ఆ తరువాత ఎటో వెళ్ళిపోక తప్పదు. ఎందుకు ఏడుస్తారు? ఒక విధంగా నేను చాలా అదృష్ట వంతురాల్ని. నేను వెంకటేశ్వర స్వామిని ప్రార్ధించే వరాన్ని అయన నాకు ప్రసాదించాడు" విజయ ఆలయం కేసి రెండు చేతులూ జోడించి నమస్కరించింది.
    జయప్రదరావు నిద్రహించుకోలేక అవురుమన్నాడు. విజయ మళ్ళీ ప్రారంభించింది.
    "ఒక తడవ నాయనమ్మ పక్షవాతం ప్రశంస తెస్తే మీరు విసుక్కున్నారు. ఈ సౌందర్యం శాశ్వతంగా ఇలాగే ఉండి పోతుందనుకున్నారు. కాని ఈ లోకం లోనూ జీవితం లోనూ ఏదీ శాశ్వతం కాదు. నేను నా జీవితమంతా ఒక వెలుగు కోసం వెతుకుతున్నాను. ఆ వెలుగు ఇంకా నాకు లభించలేదు."
    ఆమె ఆయాసం మరీ ఎక్కువయింది.
    భర్త ఎంతసేపటికీ ఇంట్లోకి రాకపోవడం చూసి చిట్టీ బయటికి వచ్చింది. ఆమెకు సర్వమూ అర్ధమయింది. ఇద్దరు పిల్లలనూ చెరో చేత్తో నూ పట్టుకుని నిశ్శబ్దంగా నిలబడిన చిట్టి ని దగ్గరికి రమ్మని సంజ్ఞ చేసింది విజయ.
    చిట్టి వచ్చి ఆమె పక్కనే కూర్చుంది.
    విజయను అమెఇదె మొదటి సారి చూడటం. అనిర్వచనీయమైన కాంతి రేఖ ఏదో ఆమె కన్నులలో నుంచి వెలికి రావటం స్పష్టంగా చూసింది చిట్టి.
    ఇద్దరు పిల్లల తలల మీద చెయ్యి వేసింది విజయ. అందులో మగపిల్ల వాడు కాస్త తెలివి గలవాడు.
    "అమ్మా, ఇదెవరు ?' అన్నాడు.
    చిట్టి అప్రయత్నంగా సమాధానం చెప్పింది.
    'అమ్మ."
    విజయ ఆనందం స్పష్టంగా కనిపించింది ఆమె కన్నులలో.
    "బ్రతుకులో ఉన్న ఒక లోటూ నేడు తీరింది" అని గొణిగింది ఆమె. చిట్టి ఆమె రెండు కాళ్ళ కూ హృదయ పూర్వకంగా నమస్కరించింది.
    "జీవితంలో నేను చేసిన తప్పులకు మీ దగ్గర క్షమార్పణ తీసుకోవాలని జగన్నాధం అంటూ ఉండేవాడు. నన్ను క్షమించగలరా మీరు? నా కధ మీకు తెలిసే ఉంటుంది" అన్నది కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ.
    విజయ నవ్వి --- "జీవితం అంటే ఏమిటో అర్ధం తెలియని రోజుల్లో ఏవో కొన్ని ఊహ లుండేవి. ఇప్పుడెం లేవు. చెల్లీ, నా క్షమ అంత విలువ అయిందీ కాదు. కాదు కూడదని నీవంటే నా క్షమ నీకేనాడో లభించింది. ఇక నా సంగతి. పదవిహీనంగా చాలా రోజులు బతికాను. మృత్యుసమయంలో నా పధాన్ని నేను చేరుకో గలిగాను. అంతే చాలు నాకు. ఈ లోకానికి చెప్పాల్సింది కాని, ఈ లోకం నుంచి వినాల్సింది కాని ఇంకేమీ లేదు' అన్నది.
    విజయ దేవాలయం కేసి రెండు చేతులూ జోడించింది.
    దూరాన ఏదో గీతం వినిపిస్తున్నది.
    వెన్నెల లేదురా -----బ్రతుకే వేసవి ఎండరా ----ఈ
    ఎడారి లో తెన్నులు లేవురా -----ఇసుక తిన్నెల తుపాను
    వీచెరా-----కన్నుల నివ్వరా ----వెలుగు వెన్నెలవు దొరా
    వెంకటేశ్వరా---
    అప్పుడే చంద్రోదయ మయింది.

                               (సమాప్తం )

             


 Previous Page

WRITERS
PUBLICATIONS