"అలనాటి కలలన్నీ నిజమవుతాయా కృష్ణా" అని మాధవ్ అడిగినదానికి నేనలా ఎందుకు చెప్పానో గానీ- "కలలే నాడైనా నిజమయ్యాయా మాధవ్?" అన్నానని మాధవ్ చాల బాధ పడ్డాడు. నిష్టూరంగా మాట్లాడాడు. అశుభంగా ఎందుకు మాట్లాడానా అని మధన పడ్డాను.
"కలలు వాటికవి ఎప్పుడూ నిజంకావు. నిజం చేసుకోవటం కలులు కనే వాళ్లలోనే వుంటుంది మాధవ్! కాదంటావా?"అని తోచిన విధంగా సమర్ధించుకున్నాను.
"ఈ జీవితానికే నాటికైనా సుఖమిస్తావా?" మాధవ్ నమ్మకాల్లో ఏదో జంకువంటి భావం తారట్లాడుతున్న దేమోననిపించింది. "దురదృష్టవంతుడు మాధవ్ ని సుఖ పెట్టాలి," అనే తలంపే మాధవ్ స్నేహానికి పునాది. అదే పునాదిమీద నిర్మితమవుతున్న భవనం ఆకాశవీధుల్లో అందంగా సుఖపెట్టటమే నేను సుఖపడటం. నాకు నేను అన్యాయం ఎప్పుడూ చేసుకోను మాధవ్!" నా మనసుని నేనే పటిష్ఠం చేసుకుని మాధవ్ కి ధైర్యం చెప్పాను.
మాధవ్ సందేహాలు మరికొన్ని చిలిపి చిలిపిగా మధుర మధురంగా వుండేవి.
"చూడు రాజీ! నిన్ను ధ్యానిస్తూన్న ప్రతి క్షణం ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తుంది. అవి నువ్వు తీర్చాల్సిందేగానీ నాకై నేను సర్ది చెప్పుకోవాల్సినవి కావు.
పాలసముద్రంలాంటి పండు వెన్నెల్లో-ఉల్లిపొరలాంటి తెల్లచీరకట్టికొని-పగడాలవంటి మల్లెపూలు ముడుచుకుని ఒంటరిగా నిద్రపోతూ వుంటావటా!- ఐనా నీకానిద్ర ఎలా పడుతుందో మరి!-మత్తుగా నిద్రపోతూనే వుంటావు మరి. నీ వూహలు మెదిలే ప్రతీరాత్రీ నాకు శివరాత్రేకదా? మన మధ్య దూర భారాలేమైపోతాయో గానీ ఆదమరిచి నిద్రపోతున్నా నీ సన్నిధిలోనే నేను కూర్చున్నట్టు వూహించుకుంటాను. నీ ప్రశాంత తకు భంగం కల్గించరాదనుకొంటూనే నిశ్శబ్దంగా వుండలేక పోతాను. తెల్లని చంద్రకిరణాలు పడి మెరిసిపోతున్న నున్నని నీ చెక్కిలి ముద్దాడిన మధుర క్షణం సజీవమై ననాడు నీకెలా వుంటుంది వేణూ? అర్దరాత్రి అనుకోకుండా మెలకువ వచ్చి నపుడు మీదికి వంగి నీముంగురులు సవరిస్తూన్న నన్ను చూసి 'మాధవ్" అనుకుంటావా? ఆక్షణం నీకెలా వుంటుందో -ఏం చేస్తావో చెప్తావు కదూ?
"ఛ! ఎంతసిగ్గులేనివాడు! అనుకొంటూనే మాధవ్ చిత్రించిన దృశ్యాలని అలా కన్నులముందు పరుచుకొంటూ వాటినిచూసి సిగ్గుపడుతూ గడిపే దాన్ని. నిజానికి అలా జరిగిన క్షణం నాకెలా వుంటుంది? ఏం చేస్తాను? మాధవ్ మీద కోపం తెచ్చుకొని దూరంగా తోసివేస్తానా? అమ్మో! అందుకేనా ఈ తపస్సంతా? మరి ఆ క్షణం...................
"ఆ బంగారు క్షణాన నిన్ను నిండుగా గుండె లకి హత్తుకుంటాను మాధవ్! ఆక్షణాలు అనుభవించకపోయినా అందలమెక్కి చందమామని అందుకున్నట్టూ-స్వర్గసీమలో ప్రేమరాజ్యం ఏలినట్టూ వుంటుందని వూహిస్తున్నాను. అంతే కదూ? నీ సిగ్గు నువ్వు మర్చిపోవటం కాకుండా నన్నూ సిగ్గులేనిదానిగా చేస్తున్నావు. నీకింత సాహసం పనికిరాదు సుమా!"
కానీ ఆడది మందలించిందీ అంటే ప్రోత్సహించినట్టే భావించాలట. అదెక్కడి శాస్త్రమో గానీ అలా అనుకొంటూ ఆసందేహాల తోరణాలు అలా కట్టుకోవటమే మాధవ్ కీ సరదాట.
"గ్రుచ్చి కవుగలించి నీ అధరామృతం గ్రోల నిస్తావా?"
"అంత తేలికా? ఆశపెట్టి ఆహ్వానించి చటుక్కున దోసిట్లో మొహం దాచుకొంటాను. అడ్డులేదు కదా అని ఇష్టమొచ్చినట్టూ వూహించకు మరి. భంగపడతావు."
"అలాగా? అయితే చూస్తాను. త్వరలోనే నిన్ను చూడటానికి వస్తున్నాను". అని రాశాడు. నా గుండె ఆగిపోయింది. దూరాన వున్నాడని ఎన్నో కబుర్లు చెప్పానుగానీ ఇప్పుడుగాని మాధవ్ తటస్థ పడితే కన్నెత్తి చూడగలనా? పన్నెత్తి పల్కరించగలవా?
"నిన్ను చూడాలని వుంది కృష్ణవేణీ! ఇదే ధ్యాసతో బొత్తిగా పరాకుగా వుండిపోతున్నాను. కడుపునిండా తిండిలేదు. కంటినిండా నిద్రా రాదు. అది నీ మహత్యం మరి. ఒక్కసారి నిన్ను చూసివస్తే కొంత వూరటగా వుంటుంది. తర్వాత కొద్ది కాలం ఎలాగో గడిచి పోతుంది. అక్కడ మూడు రోజులుంటాను. హోటల్ దిల్ కుష్ లో ఆ మూడు సాయంత్రాలూ నీతో గడుపుతాను రాణి. పార్కులో ఏనాడో ఎంతో కోరికతో కొనివుంచిన చీర నీకు పంపుతున్నాను. మొదటిరోజు ఈ చీరలో ముస్తాబై రావాలి. అతి త్వరలో నిన్ను చూస్తాననే సంతోషం తప్ప మరేభావమూ లేదు నాలో".
మాధవ్ ని చూడాలని నీకూ వుంది. కనీ అదేమిటో మాధవ్ ని తల్చుకొంటేనే ఎక్కడలేని సిగ్గూ, జంకూ ఆవహిస్తున్నాయి. పార్కుకెళ్ళి మాధవ్ నెలా చూస్తానో-ఎలా మాట్లాడుతానో అయోమయం-మాధవ్ పంపిన చీర నాకెంతోనచ్చింది. లేతరంగులు అందులోను నీలివర్ణం నాకు ఇష్టమే.పాము కుబుసంలా మెత్తగా వున్న ఆ చీరే అరుణకినచ్చలేదట. ఆవిడా, ఆవిడ బట్టలూ ఇంకెంత సున్నితమో మరి. మాధవ్ కోరిక ఈ విధంగా తీరాలని దైవనిర్ణయం కాబోలు.
మాధవ్ వస్తున్నట్టు రేణుకి చెప్పలేదు నేను. కాని మాధవ్ కి వుత్తరాలు రాస్తున్నానని దానికి తెలుసు. దాని ద్వారా శాంతకీ తెలుసు-మాధవ్ రాకకి మరి రెండు రోజులు గడువుంది. ఆరెండు రాత్రులూ, జాగరాలు చేశానంటే అతశయోక్తి కాదు. మాధవ్ వస్తాడనుకొంటే భయం-రాడనుకొంటే బాధ. ఉత్తరాలలోనే మనసు నిలవనివ్వని మాధవ్ సాక్షాత్తూ ఎదుట ప్రత్యక్ష మైననాడు దగ్గిరకు తీసుకోకుండా వూరు కుంటాడూ? ఏమో బాబూ! తలపు కొస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది ఏది ఏమైనా మాధవ్ రసికుడే కావాలి. అలా కానినాడు నేను తప్పక అసంతృప్తితో బాధపడతాను-
"రసికత" అనేమాట అనుకున్నప్పుడల్లా ఎప్పుడో చదివిన ఓ కథ గుర్తువచ్చి నవ్వొస్తుంది. ఏ విషయం లోనూ ఆ ప్రయోజకుడైన పురుషుణ్ణి ఆడది గౌరవించి ప్రేమించలేదు.
* * *
సయం సమయం మాధవ్ ని కలుసుకో బోయేది మరికొద్ది ఘడియలలోనే మాధవ్ కి నచ్చేవిధంగా అలంకరించుకొని దడదడలాడే హృదయంతో పార్క్ కేసి దారి తీశాను. ఆలోచన లన్నీ అంతరించి మనసు మైధనంలా వుండి పోయింది.
గేటు దాటగానే రెండు కళ్ళూ వేయి కళ్ళుగా పార్క్ లో అంగుళం మేరా అన్వేషణ కుపక్రమించాయి. మాధవ్ వచ్చే వుంటాడు. ఏచెట్టు క్రిందో చటుక్కున కంటబడతాడు. ఏపొద ప్రక్కనో అకస్మాత్తుగా అవతరిస్తాడు. అనుకోకుండా ఎక్కడో....... ఓ! అది......! అది మాధవ్ కదూ? ఆ క్రోటన్స్ దగ్గిర..... ఇటే నడిచి వస్తున్నది మాధవ్ కదూ? మాధవే! అప్పుడే చూడనూ చూశాడూ. నవ్వనూ నవ్వాడు. ఠీవిగా తెల్లని బట్టలలో మాధవ్ నీరెండలో పాల విగ్రహంలా మెరిసిపోతున్నాడు. దగ్గిరికి వస్తున్న కొద్దీ మరికాలు కదపలేక ఎటో చూస్తూ నించుండిపోయాను. మాధవ్ దగ్గిరికొచ్చి నా చేతిని తీసుకొని నడక సాగించాడు- "ఛ! ఎంతైనా పబ్లిక్ పార్క్ కదా? నన్ను తెలిసిన వాళ్ళు ఎవరైనా వుండి వుంటారే" అన్న తలంపు తో చేయితీసుకొని పక్కగా నడిచాను.
ముందు దారులన్నీ నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళి, పోతున్నాయి. చాలా దూరం మవునంగా నడక్ సాగించాడు-నైట్ క్వీన్ చెట్లలో ఆగి నిల బడ్డాడు. నేను అల్లంత దూరంలోనే ఫౌంటెన్ చూస్తూ వుండిపోయాను. ఎవ్వరూ ఆ చుట్టు పట్ల మసలుతున్నట్టు లేదు. దూరంగా స్పీకర్ నుంచి వినవస్తూన్న సంగీతధ్వని తప్ప వేరే అలజడేమీ లేదు. బంగారు రంగువంటి నీరెండ ఎర్రబారి పోతూంది. మాధవ్ ప్రక్కనే వున్నాడు అనుకొంటే ......ఆ ప్రక్కనున్న మాధవ్ దగ్గిరకి వచ్చాడు. మరీ దగ్గిర కొచ్చాడు. నిండుగా చేతుల్లోకి తీసుకున్నాడు. గాఢంగా గుండెలకి హత్తుకున్నాడు. ఆత్రంగా ముద్దులు పెట్టుకున్నాడు. నిద్రావస్థవంటి ఆ స్థితిలో నైనా మాధవ్ అలా సర్వస్వతంత్రంగా ప్రవర్తించినందుకు కొంచెంకష్టమనిపించింది. కాని అంతా మరిచి మాధవ్ చేతుల్లోంచి జారి పాదాలదగ్గిర పచ్చగడ్డిలో కూర్చుండి పోయాను. మాధవ్ కూడా దగ్గిర కూర్చున్నాడు. నేను ఎటో చూడబోతే గడ్డం పట్టుకొని మొహం తనవైపు తిప్పుకొని-"కృష్ణవేణీ!" అంటూ కన్నుల్లోకి చూడబోయాడు. సిగ్గుతో కళ్ళు దించుకున్నాను.
