Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 25


    "ఏమిటి ....యువరాజావారు బుంగమూతి పెట్టుకుని వెం చేశారు? మామయ్యగారు ఓబులేసు కూతురు పెళ్ళికి డబ్బు లివ్వనన్నారా?"
    "ఎందుకిస్తారు? ఇప్పుడివ్వరు! ఆ టైం వచ్చినప్పుడు ముక్కు పిండి వసూలు చేస్తారు చూడు!"
    "అమ్మ బాబో! ఏదో రివోల్యూషన్ లేవదీసేవాడిలా ఉన్నావే?"
    "మరి మహానుభావులందరూ కలిసి, పాస్ చేసే రివల్యూషన్స్ వల్ల మా కడుపులు నిండనప్పుడు మరేం చేస్తామను కున్నావు?"

 

                          
    "రఘూ, నేనొక మాట అంటాను. నీవేమీ కోప్పడవు కదా?"
    "అను. నువ్వనేది కూడా అనిపించుకుంటే ఈ పూటకు నా కోటా పూర్తీ అవుతుంది."
    అరుణ నవ్వింది. కానీ వెంటనే అతి తీవ్రంగా "రఘూ , నీకు ఏది పట్టినా పిచ్చి వంటిదే పడుతుంది. చదువుకునే రోజుల్లో నీకు రేసుల పిచ్చి ఎలా పట్టిందో, ఇప్పుడీ వర్కర్స్ వెల్ ఫేర్ పిచ్చి అలా పట్టింది!"
    "థాంక్స్! ఇప్పటి ఈ పిచ్చి లోనే నాకెంతో ఆనంద ముంది!" అని రుసరుస లాడుతూ వెళ్ళిపోయాడు రఘు.
    కానీ ఎలాగయినా రెండు రోజులో ఒక వెయ్యి రూపాయలు ఓబులేసుకు ఇచ్చి తీరాలి! కానీ ఎలా/ ఆలోచించగా ఆలోచించగా అతని కోక మార్గం గోచరించింది. తన వాచీ ఉంది. తనకు రెండు ట్రాన్సిస్టర్ రేడియో లున్నాయి. అన్నిటినీ అమ్మితే?
    ఆ ఊహ కలగడమేమిటి.......దాన్ని ఆచరణలో పెట్టడమేమిటి.... అంతా అరగంట లో జరిగిపోయింది. ఏడు వందల ఇరవై రూపాయలు వచ్చాయి. తీసుకుని ఓబులేసు ఇంటికి వెళ్ళాడు రఘు.
    అక్కడ అందరూ దీనాతి దీనంగా ఉన్నారు. కారణం, ఓబులేసు కూతుర్ని మొదట చేసుకుంటామన్న వాళ్ళు, ఇప్పుడు చేసుకో మనడం!
    "ఆళ్ళ తప్పిదమేమీ లేదండీ చిన్నయ్య గారూ. తప్పంతా నాదే. పిల్లకు నిజంగా ఇరవై తొమ్మిదేళ్లుండాయి! కప్పి పుచ్చి, ఇరవై రెండన్నాం. తెలీకుండా ఎట్టా ఉంటుంది? ఆళ్లు చేసిందీ నాయమే!" అన్నాడు ఓబులేసు.
    పిచ్చి పట్టిన వాడిలా కారు వేసుకుని రఘు అనాడంతా తిరిగాడు, ఊరంతా , ఊరు చుట్టూ పక్కలంతా! కారు ఇంజనూ వేడెక్కింది! అంతకు ముందే వేడెక్కి ఉన్న అతని బుర్ర ఇంకా వేడెక్కి పోయింది. ఏదో ఆరాటం! ఏదో తపన! ఎవరికీ ఎరుక పరుచు కోడానికి వీలులేని బాధ!
    ఆ మరుసటి రోజు ఆ డబ్బు నంతటి నీ తీసుకెళ్ళి వెల్ ఫేర్ ఫండ్ లో పడేశాడు! అప్పుడాగింది అతని గుండె దడ!

                                   35
    తీరిక సమయాల్లో అప్పుడప్పుడు సేతుపతి గారి ఆలోచన పరంపరలు రఘుపతి వైపు మళ్లేవి. అవి అటు వైపు మొగ్గగానే అయన కెందుకో భయం వేసేది. ఆ అబ్బాయిని అసలు ఏమిటి చెయ్యడం అన్నది ఒక తీరని సమస్య గానే ఉండిపోతుంది ఎప్పటి కప్పుడు. ఇప్పటి కప్పుడే కొందరు డైరెక్టర్లు, పరిహాసాని కే అన్నా -- "ఏమండీ, సేతుపతి గారూ! మీరు కాపిట లిస్టులూ, మీ అబ్బాయి కార్మిక నాయకుడూ అయ్యేట్టు న్నారే?" అనేశారు.
    రఘును గురించి ఇటువంటి ఊహలు వచ్చినప్పుడు , సేతుపతి , వాటి నన్నింటి నీ మోసుకు వెళ్లి అరుణ వద్ద కుమ్మరించే వాడు.
    "మామయ్య గారూ , నన్నోమాట చెప్పమన్నారా? రఘు మనసు మంచిదే. పాపం, ఆ వయసే చెడ్డది! ఆ వయస్సు లో ఎవరికైనా ఆవేశం ఎక్కువ. ఆ ఎక్కువ, మన రఘులో ,మరి కాస్త ఎక్కువ! రఘు తెలివి తక్కువ వాడెం కాడు. ఒక్క ముక్కలో తేల్చి చెప్పాలంటే.....నాకు సరి అయిన తెలుగు పదం దొరకడం లేదు.....ఇంగ్లీషు లో 'సర్వర్టేడ్ జీనియస్' అంటారే, మన రఘు ఆ బిరుదు సంపాదించు కోడానికి ఇప్పుడు అతి సమీపంలో ఉన్నారు!"
    'అందుకేనమ్మా మరింత భయంగా ఉంది!"
    "రఘు, ఏమంత కాని పనులు చేస్తూన్నాడని మీరింతగా సతమతం కావాలి మామయ్యగారూ? ఒక దృక్పధం లో చూస్తె, ఈ వయస్సు లోనే ఆమాత్రం పరోపకార బుద్ది ఉన్నందుకు రఘుకు కనీసం పద్మభుషణ ఇవ్వచ్చు! నన్నడిగితే.....రఘును ఏ పరిపాలన పద్దతి లోనో పడెయ్యడం మంచిది. కంపెనీ -- అదెలా నడుస్తున్నది, దాని లాభాలూ, నష్టాలూ , అది ఎంత సంపాదిస్తున్నది, అందులో ఎంత శాతం ప్రభుత్వం పర మవుతుంది........ఇటువంటి విషయాలన్నీ క్రమక్రమంగా తెలిసి వస్తాయి! అప్పుడు రఘు , మీకంటే కన్సర్వేటివ్ గా తయారవుతాడు!"
    ఒక చిరునవ్వు నవ్వి, ఊరుకునేవారు సేతుపతి. అరుణ టీ తెప్పించేది . ఇద్దరూ కలిసి తాగేవారు.
    "రఘు సంగతి అలా వదిలెయ్యి, అరుణా! నీ సంగతేమిటి? భవిష్యత్తు ను గురించి ఏమాలోచించావు?"
    "బి.కాం అయిపొయింది. ఎందుకు బి.కాం చదివానో ఇప్పుడర్ధం కావడం లేదు మామయ్య గారూ. మీరు సలహా ఇచ్చారు, నేను పాటించాను. కానీ, ఇప్పుడు నాకు మాత్రం ట్రెయినింగ్ కాలేజీ లో చేరి, బి.టి. గానీ, ఎల్. టి . గానీ పుచ్చుకోవాలనుంది.
    "ఆలోచిద్దాం, ఆలోచిద్దాం....." అని, పైపు వెలిగించుకుని, వెళ్లి పోయేవాడాయన.
    సేతుపతి గారికి మాత్రం, అరుణ లా చదివితే బాగుంటుందేమోనని ఉండేది. బి.కాం . బి,ఎల్ అయిందనుకోండి. రఘును మేనేజింగ్ డైరెక్టర్ని చేసి, అరుణను అతని సెక్రెటరీ గా వేస్తె అన్ని సమస్యలూ తీరిపోతాయి . "ఉరక లేత్తుతున్న ఆ పొగరు మోతు గుర్రం వంటి రఘుకు అరుణ దిట్టమైన కళ్ళెం లా ఉండడమే గాక రౌతు కూడా అవుతుంది!' అని అనుకునేవారు సేతుపతి తనలో తాను.
    కానీ అది తన స్వార్ధం. ఆ బంగారు తల్లి బి.టి చదవాలంటుంది మరి.

                                    36
    మళ్ళీ కాలేజీ లు తెరవగానే , అరుణ ట్రెయినింగ్ కాలేజీ లో చేరింది! కానీ, రఘు మాత్రం ఎక్కడున్నవాడు అక్కడే ఉండిపోయాడు. ఉండి పోవలసి వచ్చింది!
    రఘును వెల్ ఫేర్ ఆఫీసర్ పదవి నుండి , మేనేజింగ్ డైరెక్టర్ గారి పర్సనల్ అసిస్టెంట్ గా ప్రమోట్ చేశారన్న సంగతి రఘు కంటే ముందు వర్కర్ల కే తెలిసింది. "సిట్ డౌన్ స్ట్రైక్" అన్నారు; పని మానేశారు. అది తెలిసి , రఘు పరుగు పరుగున వచ్చి, అందరినీ కలుసుకున్నాడు.
    "రామయ్యా, శంకరన్ , వదివేలూ , తంగప్ప , కేళ ప్పా , గోవిందసామీ, ఏమిటిది?' అన్నాడు రఘు , అందరినీ ఉద్దేశించి!
    "మీరు మమ్మల్ని వదిలి పోడానికి వీల్లేదు! మిమ్మల్ని వెల్ ఫేర్ ఆఫీసర్ పదవి నుండి మార్చడానికి వీల్లేదు!"
    "మార్చడ మేమిటి?"
    "మిమ్మల్ని ఆఫీసులో మరో ఉద్యోగానికి మారుస్తున్నారట!"
    "ఎవరన్నారయ్యా! మారిస్తే మాత్రం నేను వెళతానా? నాకీ ఉద్యోగమే చాలు! ఒకవేళ మరీ బలవంతం చేస్తే , దానికి కూడా రాజీనామా ఇస్తాను! నేను మీ అందరికీ ఎంతో....మీరందరూ నాకూ అంతేగా?"
    "రఘుపతి గారికీ"
    "జై!"
    "రఘుపతీ"
    "జిందాబాద్!"
    "శ్ శ్ , ఇదేం ఫ్యాక్టరీ అనుకున్నారా? మెరీనా బీచ్ అనుకున్నారా? పనులు మొదలెట్టండి !" అన్నాడు రఘు తప్పు చేసిన తమ్ముళ్ళ ను పెద్దన్నయ్య మందలించి నట్టు. అందరూ మంత్రముగ్దుల్లా ఎవరెవరి పనులు వారు చూడ్డం మొదలు పెట్టారు.
    పదకొండు న్నర, పన్నెండు ఆ ప్రాంతాల్లో సేతుపతి గారు రఘుకు ఫోన్ చేశారు.
    "యస్ సర్?"
    "ఒకసారి ఇలా ఆఫీసు  వరకూ వచ్చి వెళ్ళండి."
    "అల్ రైట్ సర్!"
    సేతు పతి గారి ఆఫీసులో , సేతుపతి గారూ, అయ్యంగారూ, సుబ్బారావు కాక ఆ కంపెనీ డైరక్టర్లు , మరో ఇద్దరున్నారు.
    "అందరికీ నమస్కారం సర్!" అన్నాడు రఘు చేతులు జోడించి.
    "కూర్చోండి!" అన్నాడు సేతుపతి.
    "థాంక్ యూ సర్!" అంటూ, ఓ కుర్చీ తీసుకున్నాడు రఘు. వర్కర్స్ వల్ల విషయం ఇదివరకే తెలుసుకుని ఉండడం మూలాన్ని కుండ బద్దలు కొట్టినట్టు ఈ విషయాన్ని త్వరగా తేల్చుకుని, అక్కణ్ణించి త్వరగా బయట పడడమే మేలనిపించింది రఘుకు.
    "పిలిపించారెందుకు సర్?"
    "నిన్ను అభినందించాలని మిస్టర్ రఘూ!"
    "నేనేమంత ఘనకార్యం చేశానని సర్? అయినా....చాలా థాంక్స్."
    సేతుపతి గారు కాకుండా అక్కడున్న డైరెక్టర్ల లో ఒకాయన ఇప్పుడందుకున్నాడు.
    "మిస్టర్ రఘూ! మన వర్కర్స్ కూ, మేనేజ్ మెంట్ కూ మద్యని నీవెంత సామరస్యాన్ని సాధించావో మాకు తెలుసు! ఇంతకూ ముందు ఈ కంపెనీ చరిత్ర లో ఏనాడూ మామధ్యని ఈ రిలేషన్స్ ఎరగము. అందుకని, ప్రమోషన్ లిస్టు లో మీ పేరు అందరి కంటే పై కెక్కింది. అదృష్ట వ శాత్తూ ....ఇప్పుడొక వేకెన్సీ కూడా ఏర్పడింది. సేతుపతి గారికి ఒక పర్సనల్ అసిస్టెంట్ కావాలి! ఐదు వందల యాభై స్టార్టింగ్ శాలరీ! మీరు ఆ పోస్టు తీసుకోడాని కి అంగీకరిస్తారన్న నమ్మకం మాకుంది."
    "క్షమించండి సర్! నాకంటే సీనియర్స్....డిగ్రీలు న్నవారూ మీ ఆర్గనైజేషన్ లో ఎందరో ఉన్నారు. వారినందరినీ కాదని, అంత పెద్ద పోస్టు నాకిచ్చా రంటే, కేవలం నేను మా తండ్రి కొడుకును కావడం వల్ల అలా చేశారన్న అసంతృప్తి అందరిలోనూ బయలుదేరుతుంది. నా వయస్సెంత? ఇరవై రెండు! ఇప్పటికే వయసుకు మించిన హోదాలో ఉన్నాను. అసలు క్వాలిఫికేషన్ అన్నసమస్తే లేదు కదా, నాకు సంబంధించి నంత వరకూ? ఇప్పుడు నేనున్న పోస్టు అన్ని విధాలా నాకు తగినది. నేను అక్కడే ఉండి పోవడం వల్ల, నాకూ ఆనందముంది , మీ వర్కర్ల కూ ఉపయోగ ముంది!"
    "మిస్టర్ రఘూ, మీరొక విషయం మరిచి పోతున్నారు! మీరు వర్కర్ల తరపున ఇక్కడ పని చెయ్యడం లేదు. కంపెనీ తరపున చేస్తున్నారు " -- అన్నాడు సేతుపతి. ఇక, ఇక్కణ్ణించి తండ్రీ కొడుకుల మధ్యనే జరిగింది సంభాషణ.
    "ఆ మాట ఎవరు కాదంటారు సర్?"
    "అందుకనే ....కంపెనీ కి మీ అవసరం ఏ డిపార్టుమెంటులో ఉందనుకుంటే ఆ డిపార్టుమెంటులో కి మిమ్మల్ని మార్చడానికి మాకదికారం ఉంది!"
    "లేదనను సర్! కానీ , ఈ మార్పు వ్యక్తిగతంగా నాకు నచ్చలేదు. మీరు మరీ పట్టుదల చూపితే , నేను ఈ వేల్ ఫేర్ ఆఫీసర్ పోస్టు కూడా వదులుకో వలసి ఉంటుంది!"
    "అది చాలా దొరుసు మాట రఘూ! ఆవేశం వచ్చినా, అధికారుల ఎదట ఎలా మాట్లాడాలో మీకీ పాటికి తెలిసి ఉండాలి!"
    "క్షమించండి సర్!"
    "అల్ రైట్ , మీరిప్పటికి వెళ్లి పోవచ్చు!"
    "నమస్కారాలండి!" అంటూ , అందరి వద్దా సెలవు తీసుకుని, రఘు మళ్లీ తన అఫీసుకు వెళ్లి కూర్చున్నాడు. అక్కడ, వర్కర్లు ఆనంద భరితులయ్యారు.
    ఇక్కడ మేనేజిమేంట్ వారు తలలు బాదుకున్నారు. ఎంత ఆలోచించినా వారికి మరే మార్గమూ గోచరించ లేదు. ఇప్పుడు రఘును తీసి వెయ్యడమన్న ప్రశ్నే లేదు. పొరపాటున ఆ పని చేశారో....మళ్ళీ సమ్మెలూ, మొదలయిన గొడవలు బయలుదేరతాయి!
    "ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? దేనికీ పనికి రాడేమో అనుకున్న కుర్రాడు ఇంతటి వాడయ్యాడు! వాడి నొసట ఎలా వ్రాసి ఉంటె అలా జరుగుతుంది. ఒక మనిషి, ఇంకొక మనిషి జీవితాన్ని తీర్చి దిద్దగలడనుకొడం శుద్ధ అవివేకం! ఇంగ్లీషు లో సామెత లేదూ? 'గుర్రాన్ని మనం నీళ్ళ తొట్టి వరకూ తీసుకెళ్ల గలం. దాని చేత నీళ్ళు తాగించ లెం!' త్రాగడమూ....త్రాగక పోవడమూ .....దాని ఇష్టా నిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అంతే!" అని, తమలో తామే అనుకుని సేతుపతి గారు పైపు వెలిగించు కున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS