ఆ గొంది మలుపు తిరిగిన తరవాత ఆమె ఆ ఇంట్లోకి వెళ్ళింది.
రవిచంద్ర నెమ్మదిగా కారు అక్కడ ఆపుకొని అటూ ఇటూ చూసి, గభాల్న ఆ ఇంట్లో ప్రవేశించాడు.
ఆ ప్రయత్నంగా ఆమె వెనక్కి తిరిగి చూసింది రవిచంద్ర!
అచేతన అయి క్షణకాలం కదలలేదు . శిలా ప్రతిమలా అలాగే నిలుచుంది.
పేలవంగా నవ్వుతూ, "నేను రవిచంద్రను. నీ కోసం, నిన్ను చూడడం కోసం వచ్చాను, సురేఖా!" అన్నాడు.
ఆమె ఇంకా తేరుకోలేదు.
"మాసిన బట్టలతోటి, చింకి జుట్టుతోటి, పేద చూపుల తోటి, నీవు నన్ను పెద్ద అధికారిగా చూడడం కోసం ఇంతకాలం వేచి ఉన్న రవిచంద్రను."
భయంకర నిశ్శబ్దం.
"నేను ఒంటరిగా , దిగులుతో సురేంద్ర గదిలో కాలం గడుపుతుంటే నీవు వస్తుండే దానివి. నాకు టైఫాయిడ్ జ్వరం వస్తే పదిరోజులు సేవ చేసే భాగ్యం పొందిన అదృష్ట వంతురాలివి. నాతోటి సినిమాలకు, హోటళ్ళ కు తిరిగిన ధన్య జీవివి.....నేను నిన్ను ....నిన్ను గుర్తించాను....నన్ను గుర్తు పట్టలేదా నీవు?...." ఏడుపుతో కూరుకుపోయిన అతని కంఠం.
వెక్కివెక్కి ఏడుస్తున్న ఆమె.
"నన్ను గుర్తు పట్టలేదా?....నిన్ను వచ్చి వ్యభిచారం నేరం కింద పట్టుకొని వస్తే శిక్షించిన మెజిస్ట్రేటు ను నేను....నన్ను గుర్తిం....."
"ఆపండి. నన్ను చిత్రహింస చేయండి.... వెళ్ళండి. ఇక్కణ్ణించి వెళ్ళిపొండి.' బిగ్గరగా ఏడుస్తున్న ఆమె, దీనంగా ఏడుస్తున్న ఆమె, గుండెలు కదిలిపోయే టట్లు ఏడుస్తున్న ఆమె!
'"నేను వెళ్ళను....చాలా రోజులకు కలుసుకున్న తరవాత నా స్నేహితురాలితో మాట్లాడకుండా వెళ్ళలేను....హృదయం విప్పి మాట్లాడుకోకుండా వెళ్ళలేను, సురేఖా." ఆవేశంతో అతను, ఉద్రేకంతో అతను, దుఃఖిస్తున్న అతను!
"ఏం మాట్లాడతారు నాతోటి, పరువులేని స్త్రీ తోటి , పది మందితో సిగ్గు లేకుండా వ్యభిచరించే స్త్రీ తోటి! వద్దు....వద్దు......మీకు హోదా ఉంది, అధికారం ఉంది, డబ్బు ఉంది!....పొండి!"
"ఇవన్నీ ఉండటం చేత నేను నీతో మాట్లాడే అర్హత కోల్పోయానా? ఛీ...ఛీ....నీవింత హీనస్థితికి దిగుతావను కోలేదు. నీకు కావలిసిన ఆ హోదా....ధనం...అధికారం....కారు...మేడ అన్నీ నేనిచ్చి ఉండే వాణ్ణి. కాని నా సురేఖ కేవలం వీటి భ్రమలో పడి మనిషికి కావలసిన శీలం , పరువు మర్యాద కోల్పోతుందనుకోలేదు. నేను మోసపోయాను. జీవితంలో మళ్ళీ మోసపోయాను." అతను చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడవసాగాడు.
ఆమె ఆ మాటలకు ఏడవటం అపు చేసి ఆశ్చర్యంగా అతణ్ణి చూడసాగింది.
'అవును. నేను నిన్ను ప్రేమించాను. మనసారా ప్రేమించాను. నిన్ను నాదాన్ని గా చేసుకుందామానుకునేటంతగా ప్రేమించాను. నేను ట్రెయినింగ్ లో ఉన్నప్పుడు నిన్ను గురించి కలలు కన్నాను. నీతోటి ప్రేమ సామ్రాజ్యంలో విహరించాను. నీతోటి స్వర్గ ధామం లో సంచరించాను. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను. నేను ప్రేమించిన సురేఖవు నీవు కావని, నేను నా హృదయ సామ్రాజ్యంలో ప్రతిష్టించుకున్న సురేఖవు నీవు కావని. నా సురేఖ గౌరవం కలది. వ్యభిచారిణి కాదు. నా సురేఖ నన్నోక్కడ్నే ఆరాధిస్తుంది. ఇలా ప్రతిరోజూ పదిమందిని ఆరాధించదు. నా సురేఖ స్థానం నా హృదయంలో. ఇలా పందులు నివసించే గృహంలో కాదు. దూ." అంటూ అమాంతం ఆ ఇంటి నుంచి బయటికి వచ్చి ఒక్క పరుగులో కారు లోకి వచ్చి కూర్చున్నాడు.
16
"నా చేతిమీది నుంచే పైను వేయవలిసి వస్తుందని, అలా చూడవలిసి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు." రవి చెబుతుంటే రాజగోపాలం ఆశ్చర్యంతో విన్నాడు.
ఇద్దరు చాలాసేపటి వరకు మాట్లాడుకోలేదు.
"ఇందులో నేనేమైనా సహాయం చేసినట్లయితే బాగుండేదంటారా?" రవి అత్రతతో అడిగాడు.
"మీరు చేయవలసింది ఏముంది? మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించారు."
"అలా కాదు. నేను ఏమైనా తప్పు చేశానంటారా?" దీనంగా అడిగాడు రవి.
"చూడండి , రవి చంద్ర గారూ. మీరు ఒక అధికారిగా ఒక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు ఈ తప్పు ఒప్పుల సమస్య ఉండకూడదు. మీరు మీకు తోచింది రూల్సు, తదితర విషయాలు అనుమతించి నంత మేరకు చేయగలుగుతారు. రవిచంద్ర గా మీకు ఆమె మీద సానుభూతి, జాలి, ప్రేమ ఉండచ్చు. కాని అసిస్టెంటు కలెక్టరు గా ఇవి ఉండవలిసిన అవసరం లేదు. ఒకవేళ అవి ఉంటె మీ విధులను మీరు సక్రమంగా నిర్వహించటం లేదన్న మాట. మీరు చాలా మంచి పని చేశారు. మీ అధికారం, హోదాలో మీరు పక్షపాతి గా మారిపోగూడదు. అదే నేను మీ కిచ్చే సలహా."
"థాంక్స్, రాజగోపాలం గారూ. లోకం అంతా ఎదురైనా సరే మీరోక్కరు నా అండన ఉంటె చాలు! అదే నాకు సంతృప్తి."
రవిచంద్ర అన్న మాటలకు రాజగోపాలం చిరునవ్వుతో, "రవిచంద్ర గారూ, మీరు మారారను కున్నాను. మారలేదు. మీరు ఇంకా బాగా మారందే ఈ ఉద్యోగానికి తూగలేరు. బెటర్ లక్" అన్నాడు.
బంట్రోతు కాఫీలు తేవడంతో వారి సంభాషణ కు బ్రేకు పడింది.
* * * *
"మద్రాసులో గొడవలకు నిరసనగా ఇక్కడ హిందీ అనుకూలురు రేపు ఉద్యమం సాగిస్తారని అధికార పూర్వకంగా తెలిసింది. మొత్తం జిల్లాలో తగు కట్టుబాట్లు చేయవలిసిన బాధ్యత మనమీద ఉంది." కలెక్టరు ధర్మరాజ్ చిరునవ్వుతో రవిచంద్ర కు చెప్పాడు."
రవిచంద్ర తల ఊపాడు.
"యూ ఆర్ యంగ్ యండ్ ఎనర్జిటిక్. ఈ విషయాన్ని మీరే డీల్ చేయాలి. ప్రోసేషన్ అన్ని పార్టీలు కలిసి రేపు బయలు దేరదీస్తున్నాయి. ఎమర్జెన్సీ పవర్స్ అన్నీ మీకు డెలిగేట్ చేస్తున్నాను. మీరు ప్రోసేషన్ ను అనుసరించాలి. మీ వెంబడి పోలీసు ఫోర్స్ ఉంటుంది. పరిస్థితి అదుపు తప్పితే అన్నిటికీ సిద్దంగా ఉండండి. వైర్ లెస్ ద్వారా నాకెప్పటి కప్పుడు మెసేజ్ పంపిస్తూండండి. ఫస్ట్ టెస్టింగ్ గ్రౌండ్, బెస్ట్ లక్." ధర్మరాజ్ నిండుగా నవ్వి షేక్ హాండు ఇచ్చాడు.
"థాంక్యూ , సర్!" రవి వినయంగా తల వంచుకున్నాడు.
* * * *
బ్రహ్మాండమైన ఊరేగింపు తీశారు హిందీ అనుకూలురు.
"హిందీ జిందాబాద్!"
"రాష్ట్ర భాష, హిందీ జిందాబాద్!"
"ఇంగ్లీషు డౌన్ డౌన్!
"మద్రాస్ స్టాప్ వాయిలేన్సు...."
నినాదాలతో మొత్తం పట్టణం ప్రతిధ్వనించిపోయింది.
దిక్కులు పిక్కటిల్లె టట్లు అరుపులు, కదిలిన జనసందోహం!
రవిచంద్ర జీప్ లో పోలీసు అధికారులతో ఊరేగింపు వెనకనే రాసాగాడు.
రెండు మూడు వీదుల వరకూ ప్రశాంతంగానే సాగింది ఊరేగింపు.
ఇంతలో ఎవరో రాయి అందుకుని టక్కున ఎలక్ట్రిక్ బల్బు మీద కొట్టారు. పట్టున పగిలింది అది.
ఆప్రయత్నంగా జనంలో ఉద్రేకం కట్టలు తెంచు కున్నట్లయింది. నిర్మలంగా సాగుతున్న ప్రవాహానికి ఒక్కసారి ఒరవడి ఎక్కువయినట్లయింది. ఒక్క ఎలక్ట్రిక్ బల్బు గాదు, టపటపా పది బల్బులు , వంద బల్బులు! కట్టు తప్పిన జనం! నష్టమవుతున్న ఆస్తులు!
ప్రభుత్వ భవనాలకు, ప్రభుత్వ భవనాల్లోని మనుషులకు రక్షణ లేనట్లు అయింది.
"వార్న్ దేమ్ !" రవిచంద్ర పోలీసు ఆఫీసర్ తో చెప్పాడు.
పోలీసు మైకు పని చేయసాగింది.మరాఠీ లో హిందీలో, ఇంగ్లీషు లో, జనం అదుపులోకి రాలేదు. ఆస్తికి నష్టం కలగడం మానలేదు.
"మైల్డ్ లాఠీ చార్జి ." పోలీసు ఆఫీసర్ పురమాయింపు.
టపటప లాఠీలు పనిచెయ సాగాయి.
ఉరుకుతున్న ప్రజ పరిగెడుతున్న జనం, దెబ్బలు తింటున్న జనం.
తిరగబడుతున్న మనుషుల ప్రవాహం! హాహాకారాలు, ఆర్తనాదాలు, టపటప మని విరుగుతున్నట్లుగా గ్లాసు అద్దాలు, కంగారుగా మూసి వేయబడుతున్న దుకాణాలు. నాశనం చేయబడుతున్న ఆస్తులు.
"లాభం లేదు. జనం అదుపు తప్పింది" అన్నాడు పోలీసు ఆఫీసరు.
"యూజ్ టియర్ గాస్. "పక్కకు తిరిగి సిబ్బందికి పురమాయించాడు.
రవిచంద్ర కంగారుగా చూడసాగాడు.
అలుముకున్న పొగ, కదులుతున్న మనుషులు, తిరగబడుతున్న జనం. శక్తి పుంజుకొని ఉత్సాహాన్ని నంజుకొని మాట విననంటున్న ప్రజ.
"లాభం లేదు. ఉయ్ హేవ్ టు రిసార్ట్ టు ఫైరింగ్." పోలీసు ఆఫీసరు కంఠం ఖంగున మోగింది.
"ఫైరింగా?" ఉలిక్కిపడ్డాడు.
వైర్ లెస్ మెసేజ్......"సిట్యూయేషన్ నాట్ అండర్ కంట్రోల్. ఆర్డర్స్ ఎనైటెడ్!"..... జవాబు విని భయపద్దట్టుగా ముఖం పెట్టాడు చూస్తూ చూస్తూ కాల్చ మనటమా?
"ఆర్డర్ ,సర్....' పోలీసు ఆఫీసర్ ఆత్రత.
"నో, నో ఫైరింగ్ , ప్లీజ్. ఐ విల్ కంట్రోల్ ది క్రౌడ్స్." ఆవేశంతో జనం మధ్య ఉరికాడు.
"ఇవన్నీ ప్రజల ఆస్తులు. వీటిని పాడు చేయవద్దు. ప్రశాంతంగా ఊరేగింపు సాగించుకోండి. మీ వాటిని మీరే ద్వంసం చేసుకోకండి. ఇది నా మనవి. సవినయంగా వేడుకుంటున్నాను." ప్రజల మంచితనాన్ని సవినయంగా కోరుతున్న అతను.
"ఎవరితను?' ఎవరిదో కేక.
"ఆఫీసరు!" ఎవరిదో జవాబు.
"మద్రాసీ వాలా!' మైక్రోస్కోప్ లో పరికించి నట్లుగా ఎవరిదో కంఠం.
దండెత్తిన జనం , అతని మీదకు దండెత్తుతున్న జనం, పిచ్చి జనం!
తల మీద గట్టిగా దెబ్బ. 'అబ్బా " అన్నాడు బాధగా రవిచంద్ర.
"ఫైరింగ్!" గావుకేక వేశాడు పోలీసు ఆఫీసర్.
అతన్ని గభాల్న ఎత్తుకొని పోలీసు జీపులో పడవేశారు.
"డాం, డాం!" అని మోగుతున్న తుపాకీలు!
చెల్లాచేరవుతున్న జనం. గుట్టకో పక్షిలా, చెట్టుకో పిట్టలా పడిపోతున్న మనుషులు. వెనక్కి, వెనక్కి ఇంకా వెనక్కి పరిగెడుతున్న ప్రజా ప్రవాహం!
ప్రవాహానికి ఆనకట్ట కడుతున్నట్లుగా తుపాకీ ల్లోంచి దూసుకు వస్తున్న గుళ్ళు.
చివరకు లభించిన ప్రశాంతత. చాలా ఖరీదైన శాంతి.
రవిచంద్ర ను తీసుకొని జీపు భారంగా కదిలింది.
రవిచంద్ర తలకు కట్టుతో పక్కకు తిరిగి చూశాడు. కలెక్టరు ధర్మరాజ్, రాజగోపాలం, సురేంద్ర తనను ఆత్రంగా చూస్తున్నారు.
"హౌ ఆర్ యూ?' కలెక్టర్ ధర్మరాజ్ అడిగాడు.
"ఐ యామ్ అల్ రైట్" మంచిగా కూర్చోటానికి ప్రయత్నించాడు.
"దట్సాల్ రైట్ , హేస్టీ బాయ్!" ఆప్యాయంగా భుజం మీద చేయి వేసి, "విష్ యూ క్విక్ రికవరీ" అన్నాడు. అని టక టక బూట్లు శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వెనకనే మందీ మార్బలం కూడా వెళ్ళిపోయింది.
"ఎలా ఉంది?' రాజగోపాలం అడిగాడు.
"బాగానే ఉన్నాను. కొంచెం బాధ. అంతే" బలహీనంగా నవ్వుతూ అన్నాడు.
సురేంద్ర జాలిగా అతని దగ్గిరే కూర్చుని వీపు మీద చేయి వేసి, "నీవెందుకు గుంపు లోకి వెళ్లావ్?" అన్నాడు.
రవిచంద్ర నవ్వి జవాబివ్వలేదు.
రాజగోపాలం "ఈ సంగతి తెలిసి ప్రియ ఖంగారు పడుతున్నది. వస్తానన్నది కూడా. నాకీ ఉదయమే తెలిసింది. కులసే గదా? ఏమీ శ్రమ తీసుకోకండి. 'ఫస్ట్ రెస్ట్ . నెక్ట్స్ , వర్క్: మరి నేను వస్తాను." అని ధైర్యాన్నిచ్చే చిరునవ్వుతో వెళ్ళటానికి సిద్దపడ్డాడు.
"ఏం ఖంగారు పడద్దని ప్రియంవద గారికి చెప్పండి" అన్నాడు నవ్వుతూ రవి.
రాజగోపాలం వెళ్ళిపోయాడు.
బంట్రోతు బత్తాయి రసం తీసుకువచ్చి రవిచంద్ర కిచ్చాడు.
రవిచంద్ర రసం తాగి దినపత్రికను చేతిలోకి తీసుకొని చదవసాగాడు.
ఆ ప్రయత్నంగా అతని కళ్ళు ఒక న్యూస్ ఐటం మీద నిల్చాయి. "యాంగ్రీ మాల్ యాఫాక్ట్స్క్త్ అసిస్టెంట్ కలెక్టర్" అని ఉంది.
పేలవంగా నవ్వుకుంటూ పేజీ తిప్పాడు.
