Previous Page Next Page 
మారిన విలువలు పేజి 25

 

    సాంబు బుగ్గల ఎరుపంతా ఎక్కడికి పోయింది? షర్టు లోంచి చేతులు మరీ పుల్లల్లా అలా వెళ్ళాడుతున్నాయేమిటి? అనుకొంది. వెలుగులో తను పరీక్షగా చూడలేదు కాని, సాంబు ఒంట్లో ఏదో జబ్బు ప్రవేశించింది. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. రేపు తప్పకుండా గోవిందబాబు కు చూపించాలి- అనుకొంది.
    వీళ్ళు స్టేషను చేరేసరికే మెయిలు వచ్చేసింది. చాలామంది చేతుల్లో పేపర్లున్నాయి. సాంబుతో వచ్చిన పిల్లలు అత్రతంగా గుంపులో  జొరబడ్డారు.
    "రాబోయి , సాంబ శివం!' తెలిసిన వారెవరో ముందు నుండి పిలిచేరు.
    "అతనికేంరా! వెనక నించున్నా , ముందు నించున్నా ఫస్టు డివిజను వచ్చి తీరుతుందన్న ధీమా!" సాంబశివం చెవి పక్కగా ఎవరో అన్నారు.
    సాంబశివం ఒక పేపరు తీసుకొన్నాడు.
    "మూడవ పేజీలో బి.ఎ సి రిజల్డ్స్ .' పేపర్లు అమ్ముతున్న వాళ్ళు ఉత్సాహంగా కేకలు పెడుతున్నారు.
    పేజీ తిప్పి చూసేందుకు సాంబశివం వేళ్ళు వణకసాగేయి.
    "అదేమిటోయి! అతన్ది పోయిందా?"
    "ఎవరిది? సాంబశివానిదా?"
    "టీచర్లంతా ఫస్టు డివిజన్ లో వస్తాడనుకొంటుంటే?"
    "సరిగా చూడరా! తప్పునంబరు చూసేవేమో?"
    "బాగుందిరా . నాకు తెలియదనుకొన్నావా?"
    "పాపం!"
    "ఎంత కష్టపడి చదివేవాడు!"
    "ఒక్కొక్కళ్ళ దురదృష్టం రా!"
    సాంబశివం ధైర్యంగా పేపరు పేజీలు  తిరగవేసేడు. మూడవ పేజీలోని పరీక్షా ఫలితాలను చూసేడు. క్రింద నుంచి, మీద నుంచి జాగ్రత్తగా చూసేడు. అందులో తన నంబరు లేదని రూడీ చేసుకోన్నాక, పేపరు మడిచి చంకలో పెట్టుకొన్నాడు. వెనక్కు చేతులు కట్టుకుని రైలు పట్టాలకు అడ్డంగా నడక ప్రారంభించేడు.
    స్టేషను దాటి వెళ్తే బజారు లోంచి, కాలేజీ ముందర నుంచి తమ ఇంటికి వెళ్ళాలి. తోవలో కనిపించిన వాళ్ళ పలకరింపులకు తట్టుకొనే ధైర్యం తనకు లేదను కొన్నాడు సాంబశివం.
    రైలు కట్టకు అటు వైపు గా ట్రంకు రోడ్డు ఉన్నది. అదారంట కొంతదూరం పొతే ఊరుతో కలిసే రోడ్డు ఒకటి వస్తుంది. అక్కడ నుంచి అన్నీ సందులే. నాలుగు సందులు దాటితే తమ ఇంటి పెరటి వైపుగా రోడ్డు కలుస్తుంది. కాస్త చుట్టూ దారైనా , ఎదురైన ప్రతి వాడి పలకరింపును తప్పించుకోవాలంటే ఆ రోడ్డునే ఇల్లు చేరుకోవాలనుకొన్నాడు సాంబశివం.
    ట్రంక్ రోడ్డు మీద కార్లు, బస్సులు, లారీలు మహా జోరుగా పోతున్నాయి. నిశ్శబ్ద ప్రకృతి "బోయి బోయి" పాం.. పాం' ధ్వనులతో హడిలి పోతున్నది. ఈ రోడ్డు మీద రోజూ ఇలాగే ఉంటుందా? లేక ఈరోజు ఏమైనా విశేషమా? అనుకొన్నాడు సాంబశివం.
    అదివరకు ఒకటి రెండు సార్లు ఆ రోడ్డు మీద తండ్రితో కలిసి వెళ్ళేడు. కాని అప్పుడు కార్లు, బస్సులు ఇంత జోరుగా పోయేదో లేదో అతనికి గుర్తు లేదు.
    రోడ్డు పక్కగా నడుస్తున్నాడు సాంబశివం. వెనుక నుంచి, ముందు నుంచి కార్లు, బస్సులు, లారీలు ఒంటరిగా, జంటలుగా, వరసలుగా రయ్ రయ్ మని దూసుకు పోతున్నాయి.
    అప్పటిదాకా ఎండ బాగా కాస్తున్నది. అంతలో సూర్యుడి తో పంతాలు పడినట్లు పడమర నుంచి ఒక మేఘం పరుగులు తీసుకొంటూ వచ్చింది. పరుగు పరుగున వచ్చిన ఆ మేఘ శకలాన్ని చూసి, సూర్యుడు పరిహాసంగా నవ్వి ఊరుకొన్నాడు.
    "నీ పరిమితెంత నా తెజస్సెంత? నువ్వా నన్ను మరుగు పరిచేదాని" వని నిర్లక్ష్యంగా ముందుకు దూసుకు పోయేడు.
    చిన్న మేఘానికి కోపం వచ్చింది. సహాయం కోసం ఇటు అటు చేతులు చాచుకొని ఆక్రోశించింది. ఆ చిన్నారికి సహాయం కోసం స్వజాతీయులు బిలబిలమంటూ నాలుగు దిక్కుల నుండి , ఆకాశం ఈనినట్లు పరుగులతో ఉరుకులతో ముందుముందుకు తోసుకు వచ్చేరు. తన బలగాన్ని చూసుకొని చిన్న మేఘం గర్జించింది. "ఏయ్, సూర్యుడా , ఇప్పుడేమంటావు?" అన్నది గర్వంగా. బలవంతుడైన సూర్యుడు చిలిపి మేఘాల చేతుల్లో చిక్కుకుపోయేడు. మేఘం విజయాన్ని వేనోళ్ళ చాటేందుకు గాలి బయలుదేరింది. ఉరుములు, మెరుపులు గాలి ననుసరించేయి. ఇంక, ఈరోజుకు సూర్యుడు మేఘాల ఖైదు నుండి బయటపడలేడు-- అనుకోన్నాయి దిక్కులు.
    సాంబశివం తల మీద తడిగా ఏదో పడింది. ఏదో పిట్ట రెట్ట వేసి ఉంటుందనుకొన్నాడు. పరీక్ష పాడు చేసుకొన్న విద్యార్ధి అంటే పిట్టలకు కూడా లోకువే అనుకొన్నాడు. తన ఊహకు తనే నవ్వుకొన్నాడు.
    చెట్ల కింద నడుస్తుంటే పిట్టలు రెట్టలు వేయక ఏం చేస్తాయి? అంతలో మరో రెట్ట ఈ భుజం మీద, ఆ చేతి మీద, తల మీద , నడ్డి మీద....
    ఎందుకీ పక్షులకు తనంటే ఇంత కోపం? తల పైకెత్తి చూసేడు. కారు మేఘం ఆకాశాన్ని కబళించింది. చెట్ల గుంపుల్లోకి చీకటి చేరుకుంది. చెట్ల మీద పిట్టలు చెవులు చిల్లులు పడేలా ఒకటే రొదగా అరుస్తున్నాయి.
    సాంబశివం మీద పడిన నాలుగు చినుకులతో వర్షం ప్రారంభోత్సవం చేసుకొంది. నిర్జనమైన రోడ్డు, ఉరుములు, గాలి, వర్షం, గాలికి, దయ్యం పట్టినట్లు ఊగుతున్న చెట్లు, ఇటు, అటు జోరుగా రోద చేసుకొంటూ పరుగులు పెడుతున్న కార్లు. ఒక్కసారిగా పరిసరాలే మారిపోయినట్లనిపించింది సాంబశివానికి.
    తడిసిపోకుండా ఇంటికి చేరడం అసంభవం. ఈ చెట్ల క్రింద ఏ పిడుగో పడి చావకుండా ఉంటె అంతే చాలు అని సరి పెట్టుకొన్నాడు.
    ఎంత నడిచినా దారి తరగడం లేదు. కాళ్ళు లాక్కుపోతున్నాయి. నోట్లో తడి అరిపోతున్నది. ఒకటి, రెండు సార్లు నాలిక పైకి జాపి, వర్షపు నీళ్ళను చప్పరించేడు. ఒంట్లో శక్తంతా కూడగట్టుకొని అడుగులు ముందుకు వెయ్యసాగెడు. పరాకుగా ఊరును కలిపే దారిని దాటి పోయేనా అని అనుమాన పడ్డాడు. అలా జరిగే అవకాశం లేదు. తను మొదటి నుండి ఈ వైపునే నడుస్తున్నాడు. దారి ఇటునుండే చీలుతుంది. అక్కడో మైలు రాయి ఉన్నట్లు గుర్తు. ఇంకాస్త ముందుకు పొతే రావచ్చు. ఈరోజు తను నడవలేక పోతున్నాడు. తన ఒంట్లో శక్తి లేదు. మనసులో ఉత్సాహం లేదు. అందుకే దారి తరగనట్లు అనిపిస్తున్నది. ఇలా నడుస్తే తనేప్పటికి ఇల్లు చేరుకోగలడు? నడక వేగం కాస్త హెచ్చించాలి అనుకొన్నాడు.
    'ఇల్లు చేరుకోకపోతేనేం? ఏమున్నది ఇంట్లో? నిన్ను చూసి ముచ్చట పడేవారేవరు? నీ అన్న ముందు ముఖమేలా ఎత్తుతావు?' ఎవరో వెనుక నుండి ప్రశ్నించి నట్లనిపించింది అతనికి.
    "నిజమే, ఇంట్లో ఎవ్వరూ నాకోసం స్వాగతిసన్నాహాలతో కనిపెట్టుకొని కూర్చోలేదు. ఈ వార్త తెలిసి నా తెలివి తక్కువకు బాధపడుతుంటారు' అనుకొన్నాడు.
    అయినా అతని కాళ్ళు ఆగిపోలేదు. అడుగులు ముందుకే పడుతున్నాయి. గాలి, వాన జోరు హెచ్చించాయి. ఇళ్ళ మీదుగా కారుతున్న నీటిని చేత్తో తుడుచుకొంటూ పిడుగుల శబ్దానికి చెవులు మూసుకొంటూ నడుస్తున్నాడు. రోడ్డంతా పాదం మునిగే నీళ్ళతో నిండి ఉంది. ఎత్తు పల్లాలు తెలిసి రావడం లేదు. లోతుగా ఉన్నదని జాగ్రత్తగా కాలు వేసిన చోట కాలుకు దిబ్బ తగులుతున్నది. జోరుగా నడుస్తున్నప్పుడు కాలు గుంటలో పడి పక్కకు ఒరుగుతున్నది.
    ఒకటి, రెండు లారీలు సాంబశివానికి తన చెవుల పక్క నుంచి దూసుకు పోయినట్లయింది. నడుస్తూ, నడుస్తూ తను రోడ్డు మధ్యకు వచ్చెనని గ్రహించేడు. పక్కకు తప్పుకొంటుంటే కాలికి ఏదో తగిలింది. ముందుకు బోర్లా పడ్డాడు. ఎదురుగా పదిగజాల దూరంలో పెద్ద ట్రక్కు పరుగుతో వస్తుంది. సాంబశివం మనసు లేచేందుకు హెచ్చరించింది.
    "లేవకు, గట్టిగా కళ్ళు మూసుకో. చెవులు మూసుకో. అలాగే పడుకో. పక్క నుంచి వెళ్ళి పోతుంది ట్రక్కు లేవకు, చచ్చి పోతావు తప్పుకోలేవు" దిగువ భూమి లోంచి అరుపులు వినిపించేయి. సాంబశివం లేచేందుకు శక్తి నంతా కూడగట్టుకొన్నాడు. కాని, ఒక్క ఆడుగైనా కదలలేక పోయాడు.
    లారీ వెళ్ళిపోయింది. సాంబశివం లేవలేదు.

                            *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS