"నేనేమీ పిచ్చిదాన్ని కాదు. రైలు ఆగిన తరువాతనే దిగుతాను" అంది సరిత. ఆ భార్యాభర్తల ముచ్చట చూసి అన్నపూర్ణమ్మ నవ్వుకుంది.
కొద్దిసేపు ఆగి సరిత అడిగింది "మీరు దేనికి అసిరిపల్లె వెళుతున్నారు?"
"మొక్కు తీర్చుకోటానికి అమ్మాయ్!" అంది అన్నపూర్ణమ్మ.
"మొక్కా?" అంది సరిత.
మొక్కంటే కూడా ఏమీ తెలియదు, ఉత్త మట్టిబుర్ర" నవ్వుతూ అన్నాడు సతీష్ షా.
"మొక్కంటే ఆమాత్రం నాకూ తెలుసులే. మొక్కంటే తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోవటమే కదా!"
సతీష్ షా ఆ మాట విని గట్టిగా నవ్వాడు.
సరిత కోపంతో మూతి ముడుచుకుంది.
"మొక్కు అంటే ఫలానా రకం అని వుండదు. ఏ మొక్కు లేకుండానే కొందరు తిరుపతి వెళ్ళి తలనీలాలు సమర్పించుకొస్తారు. కొందరు జుట్టు ఇస్తామని మొక్కుకుంటారు. అబ్బో! మొక్కుల్లో చాలా రకాలు వుంటాయి. మా కోర్కె తీర్చు తండ్రీ అని మొక్కుకుంటారు కొందరు. కోరిన తీరిన తరువాత గుడికి వెళ్ళి మొక్కు తీర్సుకొనేది కొందరయితే కోరిక తీరినా తీరకపోయినా వెంటనే మొక్కు చెల్లించుకునేది మరికొందరు. నేను మొక్కని గుడి అంటూ లేదనుకో" అని చెప్పింది అన్నపూర్ణమ్మ.
"మీరూ మొక్కుకున్నారా?" ఆశ్చర్యంగా అడిగింది సరిత.
"నా మొక్కులన్నీ మా అబ్బాయి కోసమే" ఓ నిట్టూర్పు విడుస్తూ అన్నది అన్నపూర్ణమ్మ.
"అవును నాకోసమే నేను చాలా వూర్లు తిరిగానుగా. అదేదో పెద్ద గుడి. అక్కడయితే మా అమ్మ తప్పిపోయింది. నేనేమో ఏడ్చేసరికి మా అమ్మ మళ్ళీ నాదగ్గరకొచ్చింది. అమ్మే అవును కదే!" అదేదో ఘనకార్యం అయినట్లు శ్రీశైలం చెప్పాడు.
సరిత అడక్కుండా అన్నపూర్ణమ్మ చెప్పటం మొదలుపెట్టింది.
"నాకిద్దరు అమ్మాయిలు. శ్రీశైలం ఒక్కడే అబ్బాయి. ఇద్దరు అమ్మాయిలకి పెళ్ళిళ్ళయి అత్తవారింటికి వెళ్ళారు. అమ్మాయిల తర్వాత ఎనిమిదేళ్ళకి పుట్టాడు శ్రీశైలం. పధ్నాలుగేళ్ళు వరకు చక్కగా వున్నాడు. ఆ తరువాత డబుల్ ఫాయిడుట, అదేదో విషజ్వరం వచ్చింది. నలభైరోజులు మూసిన కన్ను తెరవకుండా జ్వరంతో మంచానికి అతుక్కుపోయాడు. ఆ జ్వరం తగ్గిందో లేదో అమ్మవారు వంటిమీదికి వచ్చింది.
"అమ్మవారు ఒంటిమీదికి రావడమేమిటి?" మధ్యలో సరిత అడ్డు తగిలి అడిగింది.
అన్నపూర్ణమ్మ చెప్పేలోపలే సతీష్ షా చెప్పాడు!
"స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్. ఇలాంటివాటిని పల్లెటూరివాళ్ళు చిన్నమ్మవారు పోసింది, పెద్దమ్మవారు పోసింది అంటారు. బాంబేలో పుట్టి పెరిగిన నీకు ఇలాంటివి తెలియవులే.
"అక్కడికేదో మీరు పల్లెటూరిలో పుట్టిపెరిగినట్టు, మీరు పుట్టిందీ మద్రాసులోనే కదా!"
"బొంబాయి ఎక్కడ? మద్రాసు ఎక్కడ?" అన్నాడు సతీష్ షా.
"నీకెప్పుడూ నన్నెక్కిరించడమేనని," భర్తతో అని అన్నపూర్ణమ్మ వైపు తిరిగి 'ఆ తరువాత ఏం జరిగిందో చెప్పండి అంది సరిత.
"మాయదారి జ్వరాలు ఒకదాని తరువాత ఒకటి వచ్చేసరికి శ్రీశైలం మెదడు బాగా దెబ్బతిన్నది, ఎందరో పెద్ద డాక్టర్లులకి చూపెట్టాము" ఇది జ్వరం వల్ల వచ్చిందీ, తగ్గటం చాలా కష్టం. ఎప్పటికైనా నెమ్మదిగా మార్పు రావాలి" అని చెప్పారు డాక్టర్లు. నాపిచ్చి చాదస్తమో నాకు దైవభక్తి కాస్త ఎక్కువే. అందుకనీ చెట్టునీ, పుట్టనీ కనపడ్డ దేవుడినీ నా కొడుకుని బాగుచెయ్యమని మొక్కుకుంటున్నాను"
"ఇప్పటికే మీరు చాలా గుళ్ళు చూసి వుంటారు అవునా!"
"ఆ....చాలా తీర్ధయాత్రలు చేశాము. ఏ దేముడూ నా మొర ఆలకించలేదు. అసిరిపల్లి అమ్మవారికి చాలా శక్తులు ఉన్నాయని తెలిసి బయలుదేరాను.
"మహత్యం ఉంటే గుడిలో దొంగలు దూరి తొవ్వుతుంటే చూస్తూ ఊరుకుందేమిటి దొంగలంటే పాపం అమ్మవారికి కూడా భయంలాగుంది" ఈ మాటలు సరిత ఇంగ్లీషులో అంది.
వెంటనే సతీష్ షా తనూ ఇంగ్లీషులోనే మాట్లాడాడు. సరితని మృదువుగా కోప్పడుతూ ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఆమెకి ఇంగ్లీషు రాదు కాబట్టి సరిపోయింది. మనం ఎక్కిరించటం మంచిపని కాదు. నేతి అరిశలు కూడా తినమని పెట్టింది."
సరిత కిలకిల నవ్వింది.
అన్నపూర్ణమ్మకి ఇంగ్లీషు రాదు కాబట్టీ, వారి మొహాలు ఒకసారి చూసి ఊరుకుంది.
"అమ్మే! నాకు నిద్ర వస్తున్నది" అన్నాడు శ్రీశైలం.
"నిద్ర వస్తే పడుకో నాన్నా" అంది అన్నపూర్ణమ్మ.
శ్రీశైలం తల్లి వళ్ళో తల పెట్టుకుని ముడుచుకుని పడుకున్నాడు.
"నాకా ఊళ్ళో బోరు కొడితే మాత్రం నాలుగురోజులకన్నా ఉండను" అంది సరిత.
'నువ్వీమాట అడగటం నేను సరేననటం ఇప్పటికి పదిసార్లు జరిగింది" చిరునవ్వుతో అన్నాడు సతీష్ షా.
"పదిసార్లు అయింది కాబట్టి ఇంక అడగను" అంది సరిత.
కొద్దిసేపు అన్నపూర్ణమ్మని వదిలేసి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ గురించి, చూసిన ప్రదేశాల గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు.
వాళ్ళ మాటలూ, వాళ్ళ చిలిపి తగాదాలూ చూసి తన కొడుక్కి కూడా పెళ్ళయి కోడలు వస్తే ఎలా వుంటుందో అని ఊహించుకుంటూ ఉండిపోయింది ఆమె.
శ్రీశైలం నోరు తెరచుకుని గుర్రుపెడుతూ నిద్రపోతున్నాడు.
అన్నపూర్ణమ్మ కూడా సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది.
"ఇంక నేను నవల చదువుకోవాలి కొంచెంసేపు నన్ను డిస్టర్బ్ చేయకు సతీష్" అంది సరిత.
"తప్పుతుందా, నువ్వు ఎలా చెబితే అలా" నవ్వుతూనే సతీష్ తనొక పుస్తకం తీసుకున్నాడు.
మరో పావుగంట తరువాత అసిరిపల్లె వచ్చింది.
ఐదు నిమిషాల తరువాత,
అసిరిపల్లె స్టేషన్ లో భక్తులందరినీ దింపి ట్రైన్ ముందుకు సాగింది.
15
"సార్!" అన్నాడు అహోబిలం,
"ఇష్!" అన్నాడు ఇన్ స్పెక్టరు వర్ధనరావు.
